ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
11 JUL 2026 6:53PM by PIB Hyderabad
నమస్తే!
కియా ఒరా న్యూజిలాండ్!
‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.
మిత్రులారా,
ప్రధానమంత్రిగా న్యూజిలాండ్‌లో ఇది నా మొదటి పర్యటనే కావచ్చు. కానీ ఒక 25 - 30 ఏళ్ల కిందటే, నేను ఏ ప్రభుత్వంలోనూ భాగంగా లేని సమయంలోనే, ప్రభుత్వ వ్యవహారాల్లో నా పేరు అంతగా ఎవరికీ తెలియని సమయంలోనే.. న్యూజిలాండ్‌లో పర్యటించే అవకాశం నాకు కలిగింది. ఆ పర్యటన సమయంలో ఒక వ్యక్తి నాకు మూడు వస్తువులను బహూకరించారు. వాటిని నాతోపాటు భారత్‌కు తీసుకెళ్లాను. ఈ మఫ్లర్, ఒక టోపీ, ఒక జత గ్లౌలు నాకిచ్చారు. ఎందుకంటే అది చలి కాలం.
వాటిలో ఒకటి ఈ రోజుకూ నాతో ఉంది. మీకు కనిపిస్తున్న ఈ మఫ్లర్ 25 - 30 ఏళ్ల కిందట న్యూజిలాండ్‌లో ఓ మిత్రుడు బహూకరించినదే. గత కొన్నేళ్లుగా నేను దీన్ని ఎన్నోసార్లు ఉపయోగించాను. మీ ఆత్మీయతను నేనెంత విలువైనదిగా భావిస్తానో.. అలాగే దీన్ని కూడా ఈ రోజు వరకు జాగ్రత్తగా దాచుకున్నాను.
న్యూజిలాండ్ పర్యటన ఖరారవగానే.. దీన్ని తప్పక నా వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుందని నాతో చెప్పారు.
మిత్రులారా,
ఎన్నో జ్ఞాపకాలు, మైత్రి, విలువలు, సమష్టి నిబద్ధతలు భారత్, న్యూజిలాండ్ సంబంధాలకు ప్రాతిపదికలుగా ఉన్నాయి. న్యూజిలాండ్ సంప్రదాయం ఈ సంబంధాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఒక పదం వందల ఏళ్లుగా ఇక్కడ ప్రజలను ఏకం చేసింది - ‘వాకా’. అదొక పడవ మాత్రమే కాదు.. మన ఉమ్మడి ప్రయాణానికి చిహ్నం. మరి ఈ రోజు ఈ భారత్ - న్యూజిలాండ్ మైత్రీనావ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.
మనముందున్న మహాసముద్రం మనకెన్నో అవకాశాలనిస్తోంది. అనుకూలమైన గాలులు వీస్తున్నాయి. విస్తృతమైన సముద్రపు అలలు మనకు తోడుగా ఉన్నాయి. మన సమష్టి సంకల్పానికి ప్రతీకగా ఆ నీలి ఆకాశం మనకు అండగా ఉంది. సాధించాల్సింది ఇంకెంతో ఉంది. మనం గెలుస్తామని నాకు తెలుసు.
మిత్రులారా,
ఈ ప్రయాణం విజయవంతమవుతుందన్న గట్టి నమ్మకం నాకుంది. ఎందుకో తెలుసా? నరేంద్ర మోదీ కాదు.. మీ అందరి వల్లే అది సాధ్యమవుతుంది. మీరే దీనికి చుక్కాని. అక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రైస్ట్‌చర్చ్ నుంచి క్వీన్స్‌టౌన్ వరకు... న్యూజిలాండ్ నలుమూలలా విస్తరించిన భారతీయ సమాజమంతా ఈ ప్రయాణంలో భాగమైంది.
మిత్రులారా,
ప్రసంగాన్ని కొనసాగించడానికి ముందు.. నా మిత్రుడు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లగ్జాన్‌కూ, ప్రభుత్వంలోని నా సహచరులకూ, ఇక్కడికి విచ్చేసిన లేబర్ పార్టీ సభ్యులకూ నా అభివాదాలను తెలియజేస్తున్నాను.
భారత్ - న్యూజిలాండ్ సంబంధాల్లో బలమైన ద్వైపాక్షిక సహకారానికి వారి హాజరు నిదర్శనం. న్యూజిలాండ్ లోని భారతీయ సమాజం సాధించిన విజయాలనూ, వారి కృషినీ ఇది చాటుతోంది. మీ రాక ఈ కార్యక్రమానికి మరింత శోభను తెచ్చింది.
ఆత్మీయానురాగాలతో, ఎంతో ఉత్సాహంతో మాకు స్వాగతం పలికిన మీ అందరికీ కృతజ్ఞతలు.
గౌరవ మిత్రులారా.. కివీ భారతీయ సమాజంలో అనేక మందికి మీరెంతో అభిమానపాత్రులు కూడా. భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా.. ‘దమా దమ్ మస్త్ కలందర్’ పాటకు మీరు, క్రిస్ హిప్‌కిన్స్ కలిసి చేసిన నృత్యం వైరల్ అయ్యింది. ఆ నృత్యం కివీ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
మిత్రులారా,
న్యూజిలాండ్ నిజంగా అద్భుతమైన దేశం. శాంతికీ, సంపదకూ, ప్రకృతికీ, సంస్కృతికీ నిలయం. అయితే ప్రజలే ఈ దేశానికి గొప్ప బలం. ఒక దేశం అంకితభావంతో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే.. అది ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని న్యూజిలాండ్ ప్రజలు నిరూపించారు.
ఇక్కడి కివీ భారతీయ సమాజాన్ని కూడా న్యూజిలాండ్ ప్రజలు ఆత్మీయానురాగాలతో అక్కున చేర్చుకున్నారు. వారు మిమ్మల్ని తమ టీంలో ఒకరిగా చేసుకున్నారు. మీ ప్రతిభపైనా, మీ దార్శనికతపైనా వారు నమ్మకముంచారు. నేడు న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ అయినా, సమాజమైనా.. ప్రతి రంగానికీ కివీ భారతీయులు వన్నె తెస్తున్నారు.
ఈ దేశంలో ఒక నిఖిల్ రవిశంకర్ ఎయిర్ న్యూజిలాండ్ సీఈవో కాగలరు. ఆనంద్ సత్యానంద్ గవర్నర్ జనరల్ కాగలరు. రచిన్ రవీంద్ర, ఇష్ సోది, అజాజ్ పటేల్ వంటి ప్రతిభావంతులకు జాతీయ క్రికెట్టు జట్టులో అవకాశాలూ లభిస్తాయి.
న్యూజిలాండ్‌లో రోడ్లు కూడా భారతీయ ప్రదేశాలను గుర్తుకు తెస్తాయి. ఖండాలా, బాంబే హిల్స్, కోరమాండల్ వంటి పేర్లు వాటికి ఉన్నాయి.
కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రిసెంట్, అమృత్సర్ స్ట్రీట్ వంటి పేర్లతో చాలా వీధులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంటూ, మీరు నిజంగానే కీవీలుగా మారిపోయారు. నేనొకటి విన్నాను. నిజానికిక్కడ ఏ అంశంతో సంభాషణ మొదలయినా.. కొద్దిసేపటికే, అనివార్యంగా అది వాతావరణ చర్చగా మారిపోతుందట కదా.
మిత్రులారా,
నేను న్యూజిలాండ్ నాయకులను కలిసిన ప్రతిసారీ మీ అందరి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ ప్రశంసలు మీకే అయినా, అవి నాకెంతో గర్వకారణం.
మిత్రులారా,
మీ అందరికీ తెలుసు.. భారత్‌ది వేల ఏళ్ల నాగరికత. నేడు అది ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకుంటూనే, ఆధునికతను అందిపుచ్చుకుంటోంది. ప్రతి యుగంలోనూ, ప్రతి చారిత్రక దశలోనూ.. భారత్ తనను తాను మలచుకుంటూ నిలిచింది. జ్ఞాన తృష్ణే దీనికి కారణం.
భారతీయులు అందరి దగ్గర్నుంచీ నేర్చుకుంటారు. వేరే దేశం జనసంఖ్య కాదు.. ప్రజా సంక్షేమానికి అది ఏ మేరకు కట్టుబడి ఉందన్నదే మనకు ముఖ్యం. అందుకే మనం న్యూజిలాండ్ నుంచి నేర్చుకున్నాం. నేర్చుకుంటూనే ఉన్నాం.
ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటుహక్కును కల్పించిన దేశం న్యూజిలాండ్. న్యూజిలాండ్ సమాజానికి మహిళలు ఎంత గొప్పగా సేవలందిస్తున్నారో నేడు మనం చూస్తున్నాం. ‘మహిళల నేతృత్వంలోని అభివృద్ధి’ అన్న దృక్పథంతో.. భారత్ కూడా మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది.
మిత్రులారా,
బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ తలరాతను ఎలా మార్చగలదో న్యూజిలాండ్ నిరూపించింది. వ్యవసాయ రంగం చుట్టూ ఒక సమర్థమైన వ్యవస్థను నిర్మించుకోవడమే ఈ దేశానికి గొప్ప బలం. పంట ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడం (ట్రేసబిలిటీ), ఆహార భద్రత, నిబంధనల అమలు... ఈ వ్యవస్థలన్నీ మనకెంతగానో స్ఫూర్తినిస్తాయి. కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులున్న భారత్ లాంటి ఒక పెద్ద వ్యావసాయిక దేశానికి ఇవి ముఖ్యమైన పాఠాలు.
చిన్న రైతులు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్లను నిర్మించవచ్చని జెస్ప్రీ నమూనాతో న్యూజిలాండ్ చూపించింది. అలాగే వాతావరణ మార్పులను తట్టుకుంటూ సాగే అక్కడి సునిశిత వ్యవసాయ సాంకేతికతల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
మిత్రులారా,
ఇక్కడ మనుకా తేనెను ‘ద్రవ బంగారం’ అని పిలుస్తారు. న్యూజిలాండ్‌లో తేనెకు చాలా ప్రాధాన్యముంది. సంప్రదాయమూ, రుచీ మాత్రమే కాదు.. ఆరోర్య రక్షణలో తేనెది ముఖ్య పాత్ర. భారత ఆయుర్వేద సంప్రదాయంలోనూ తేనెకు అలాంటి ప్రాధాన్యమే ఉంది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి భారత్ కూడా ఒక జాతీయ మిషన్‌ను అమలు చేస్తుండడం మీకు సంతోషాన్నిచ్చే విషయం. దీంతో దేశంలో తేనె ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
ఈ రోజుల్లో హిమాలయ ఉన్నత శిఖరాల నుంచి లభించే తేనె.. బంగారం మాత్రమే కాదు. అది అంతకుమించి! అది వజ్రంతో సమానం. తేనె ఉత్పత్తిని మరింత పెంచడం కోసం.. న్యూజిలాండ్ అనుసరిస్తున్న విధానాల నుంచి మనమెంతో నేర్చుకోవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను.
మిత్రులారా,
భారత్ - న్యూజిలాండ్ క్రీడా సంబంధాలకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయి. వందేళ్ల కిందట మన హాకీ జట్టు మ్యాచ్‌లు ఆడటానికి న్యూజిలాండ్ వచ్చింది. నాటి పర్యటనలో మేజర్ ధ్యాన్ చంద్ అద్భుత ఆటతీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆయన హాకీ నైపుణ్యాలతో న్యూజిలాండ్ ప్రజల హృదయాలను సైతం గెలిచారు.
మిత్రులారా,
కంటెంట్ సృజనకారుల భాషలో చెప్పాలంటే.. ఇది కొలాబరేషన్ల కాలం. క్రీడల్లో కూడా భారత్, న్యూజిలాండ్ అద్భుతమైన కొలాబరేషన్లను ఏర్పరచుకోగలవు. రగ్బీ దానికి మంచి ఉదాహరణ.
కొద్దిసేపటి కిందట జరిగిన రగ్బీ మ్యాచ్‌లో ఆల్ బ్లాక్స్ (న్యూజిలాండ్) అద్భుత విజయం సాధించిందని నాకిప్పుడే తెలిసింది. రగ్బీలో న్యూజిలాండ్ నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. భారత్‌లో రగ్బీ అభివృద్ధి చెందాలంటే మనకు కోచ్‌లు, నిపుణులు అవసరం. ఈ విషయంలో న్యూజిలాండ్ విలువైన సహకారాన్ని అందించగలదు. న్యూజిలాండ్ రగ్బీ - రగ్బీ ఇండియా మధ్య ఇటీవల భువనేశ్వర్‌లో నిర్వహించిన కోచింగ్ కార్యక్రమం ఈ దిశగా ఒక మంచి ఆరంభం.
మిత్రులారా,
ఈ రోజు నేనిక్కడికి రావడానికి ముందు.. న్యూజిలాండ్‌లో ఒక స్పోర్ట్స్ స్టార్టప్ కార్యక్రమానికి హాజరయ్యాను. క్రీడా సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడా సాంకేతికత రంగంలో మనం కలిసికట్టుగా ఎన్నో అద్భుతాలు సాధించగలమన్న నమ్మకం నాకుంది.
భారత్, న్యూజిలాండ్ దేశాల భవితవ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. అంతరిక్ష రంగంలో మన సహకారం దీనికి ఒక చక్కని ఉదాహరణ. భారత ‘చంద్రయాన్’ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన వేళ.. ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని న్యూజిలాండ్ ప్రజలంతా వేడుకలా జరుపుకొన్నారు. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం.
మరో విషయాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మహత్తర విజయంలో న్యూజిలాండ్ సాంకేతికత ఉపయోగపడింది. మీ అందరికీ గర్వకారణమైన మరో అంశం. న్యూజిలాండ్‌కు చెందిన అంతరిక్ష సంస్థలు గతంలో పలు సందర్భాల్లో మనతో కలిసి పనిచేశాయి. భవిష్యత్తులో ఈ అంతరిక్ష సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మనం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
భారత్, న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఎంతటి అపారమైన అవకాశాలను ఇచ్చిపుచ్చుకోగలవో నిరూపించడానికి అంతరిక్ష రంగం ఒక్కటి సరిపోతుంది. మన వాణిజ్య ఒప్పందం వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి కూడా ఇదే. ఈ వాణిజ్య ఒప్పందం వికసిత భారత్ దిశగా మన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. అదే సమయంలో భారత్, న్యూజిలాండ్ రెండు దేశాల్లోనూ వ్యాపార రంగానికి సరికొత్త అవకాశాలను అందిస్తుంది.
మిత్రులారా,
భారత్, న్యూజిలాండ్ మధ్య మరో ముఖ్యమైన పోలిక ఉంది. మన మూల సంస్కృతులను గౌరవించుకోవడంలో, దేశీయ వారసత్వాన్ని పరిరక్షించుకుని, దానిని ఘనంగా చాటడంలో ఇరుదేశాలూ ఒకేలా ఆలోచిస్తాయి. ‘మావోరీ’ సమాజానికి ఈ వేదికపై నుంచి నా ప్రత్యేక అభివాదాలు తెలియజేస్తున్నాను.
వారి ‘హాకా’ను కేవలం ఒక ప్రదర్శనగా నేను చూడలేదు. ఆ హాకాలో ఆ సమాజపు ఆత్మ నాకు కనిపించింది. వారి ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, పూర్వీకుల పట్ల పూజ్యభావాన్ని, యావత్ సమాజపు సమష్టి శక్తిని అది అద్భుతంగా ఆవిష్కరించింది.
మిత్రులారా,
మావోరీ సంస్కృతిలో ఒక అందమైన పదముంది.. ‘మనాకితంగ’. ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, ఆత్మీయతను పంచడం, మనస్ఫూర్తిగా వారిని ఆదరించడం... ఇదీ దాని అర్థం. భారత్‌లో మనం కూడా అతిథి దేవో భవ అంటాం. అంటే అతిథి దేవుడితో సమానమని.
ఇక్కడ పదాలు వేరు కావచ్చు.. సందర్భాలు వేరు కావచ్చు.. వేషధారణలు వేరు కావచ్చు.. భాషలు కూడా వేరు కావచ్చు... కానీ ఆత్మీయత నిండిన ఆ భావన మాత్రం ఒక్కటే.
అదేవిధంగా మావోరీ సంస్కృతిలో కుటుంబానికి ఒక చక్కని పదం ఉంది.. ‘ఫా నౌ’.. అంటే కుటుంబమని అర్థం. తరతరాల బంధాలు, బంధుత్వాలు, యావత్ సమాజమూ ఈ కుటుంబంలో భాగమవుతాయి. భారత్‌లో కూడా మనం కుటుంబాన్ని కేవలం ఒక సామాజిక ఏర్పాటుగా కాకుండా.. ఒక గొప్ప వ్యవస్థగా చూస్తాం.
మిత్రులారా,
మావోరీ సంప్రదాయంలో ‘కైటియాకిటాంగా’ అనే మరో అందమైన భావన ఉంది. ప్రకృతికి మనం యజమానులం కాదనీ, దాని సంరక్షకులమనీ ఇది మనకు బోధిస్తుంది. భారత్ కూడా అనాదిగా ఇదే తాత్వికతను అవలంబిస్తోంది: - ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’’. అంటే, ‘‘ఈ భూమి మన తల్లి. నేను ఆమె పుత్రుడిని’’. ఈ స్ఫూర్తితో ఏక్ పేడ్ మా కే నామ్, సేంద్రియ వ్యవసాయ మిషన్ వంటి అనేక కార్యక్రమాలను భారత్ చేపట్టింది.
మిత్రులారా,
మీరు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నప్పటికీ.. మీ హృదయాల్లో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని నాకు తెలుసు. మీ రోజువారీ జీవితంలో ఏదో ఒక రూపంలో భారత్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అవునా కాదా? మీరు ఇక్కడ ఉండొచ్చు.. కానీ, మీ మనసంతా ఎక్కడుంది…? అందుకే భారత్ సాధించే ప్రతి విజయాన్ని మీరెంతో నిశితంగా గమనిస్తుంటారు.
మీరు స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కొన్ని చిన్న విషయాలను గమనించలేకపోవచ్చు. కానీ అదే మ్యాచ్‌ను ఇంట్లో టీవీలో చూస్తే.. ప్రతి చిన్న అంశాన్నీ స్పష్టంగా చూడగలుగుతాం. అలాగే భారత్‌లోని ప్రతి పరిణామంపై మీకు అవగాహన ఉంటుంది. అదే మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా నిలుపుతుంది.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తాము నివసిస్తున్న దేశాల ప్రగతికి తోడ్పడుతూనే... మాతృభూమి అభివృద్ధిలోనూ అంతే బలమైన పాత్రను పోషిస్తారు.
మిత్రులారా,
మన జన్మభూమిని.. అంటే మాతృభూమిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం. అలాగే మనం పని చేస్తూ జీవితాలను నిర్మించుకునే కర్మభూమి పట్ల కూడా అదే అంకితభావంతో ఉంటాం.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్త సవాళ్ల నడుమ.. భారత్ నేడు సాధిస్తున్న పురోగతి వేగం నిజంగా అపూర్వమైనది. భారత్ సామర్థ్యాలను ప్రతిబింబించేలా.. దేశం సాధించిన విజయాల సమాహారాన్ని మీకు వివరించేందుకు ప్రయత్నిస్తాను. ఈ విజయ హారాన్ని ప్రత్యేకంగా మీకోసమే తీసుకొచ్చాను. ఈ పుష్పగుచ్ఛంలో కనీసం ఒక్క పువ్వయినా మీకు తప్పక నచ్చుతుందనీ, అది మిమ్మల్ని గర్వపడేలా చేస్తుందనీ నాకు పూర్తి నమ్మకముంది.
సిద్ధంగా ఉన్నారా? ఆ పుష్పగుచ్ఛాన్ని మీ ముందుంచమంటారా? నాలాగే మీరు కూడా మీకు బాగా నచ్చిన పువ్వు కోసం వెతకవచ్చు. లేదా ఈ గుచ్ఛంలోని ప్రతి పుష్పమూ మీదే కావచ్చు.
మిత్రులారా,
నేడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ల ఉత్పత్తిదారు భారత్. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన దేశం భారత్. ఈ రోజు ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా, రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా భారత్ నిలిచింది. గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో, పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే చేపల ఉత్పత్తిలోనూ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.
మిత్రులారా,
అది మాత్రమే కాదు.. నేడు భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెటుగా ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగానూ అవతరించింది. అతిత్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుగా భారత్ నిలవబోతోంది. సౌరశక్తి సామర్థ్యం పరంగానూ ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.
మిత్రులారా,
నేడు సరికొత్త అభివృద్ధి నమూనాలను ప్రపంచానికి భారత్ పరిచయం చేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వేదికను భారత్ విజయవంతంగా నిర్వహిస్తోంది. నేడు భారత్‌లో యూపీఐ ద్వారా ప్రతి నెలా వందల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పదుల కొద్దీ దేశాలు భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. డ్రోన్ సాంకేతికత, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థల్లోనూ భారత్ సరికొత్త శిఖరాలను చేరుతోంది.
మిత్రులారా,
ఇది నవభారత ముఖచిత్రం. న్యూజిలాండ్‌లాగే పర్యావరణానికీ, ఆర్థిక వ్యవస్థకూ నడుమ సమతౌల్యంతో వ్యవహరిస్తోంది.
మిత్రులారా,
భారత్ వృద్ధిలో మరో కోణమూ ఉంది. ఇది మన వారసత్వం. ఆర్థిక వ్యవస్థకూ, పర్యావరణానికీ ప్రాధాన్యమిస్తూనే.. వారసత్వ పరిరక్షణపైనా ఇది ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.
మిత్రులారా,
గురుగ్రంథ సాహిబ్ పవిత్ర స్వరూపాలను మనం కాపాడుకున్న విధానమే.. అవశ్యమైన సమయాల్లో భారత్ ఎలా స్పందిస్తుందో చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ. అఫ్గానిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తిన సమయంలో.. అక్కడి గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర స్వరూపాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవప్రపత్తులతో మనం సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాం.
మిత్రులారా,
సేవ, ధైర్యం, సమానత్వం, కరుణ అన్న సందేశాలను సమస్త మానవాళికీ మన సిక్కు గురువులు అందించారు. ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలు నిస్వార్థ సేవలందిస్తున్నాయి. ఆకలితో వచ్చే వారికి అక్కడ భోజనం దొరుకుతుంది. కష్టాల్లో ఉన్నవారికి అండ లభిస్తుంది.
శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో జరిగే సేవలకు ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల వల్ల ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులను సిక్కు సమాజ పెద్దలు మా దృష్టికి తీసుకురాగా.. అదే స్ఫూర్తితో సమస్య పరిష్కారానికి మేం తక్షణ చర్యలు తీసుకున్నాం.
మిత్రులారా,
హేమకుండ్ సాహిబ్ జీ గురించి మీకందరికీ బాగా తెలుసు. సంవత్సరంలో ఎక్కువ భాగం దట్టమైన మంచుతో కప్పి ఉండే పర్వత శ్రేణుల నడుమ.. ఉన్నత హిమాలయ శిఖరాలపై ఈ పవిత్ర క్షేత్రం కొలువైంది. ఈ యాత్రామార్గం కఠినమైనది, సవాళ్లతో కూడుకున్నది. చాలా పరిమిత సంఖ్యలోనే భక్తులు ఈ యాత్రను చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ క్షేత్రాన్ని సందర్శించే మన సిక్కు సోదరీ సోదరులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ హేమకుండ్ సాహిబ్ యాత్రను మరింత సులభతరం చేయడానికి, ముఖ్యంగా వృద్ధ భక్తులు, మన సిక్కు సోదరీ సోదరుల సౌకర్యార్థం.. ప్రభుత్వం ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రానికి ఒక ఆధునిక రోప్‌వేను నిర్మిస్తోంది.
మిత్రులారా,
సాహిబ్‌జాదాల ధైర్యసాహసాలు, త్యాగాలను చిరస్మరణీయం చేయడం లక్ష్యంగా.. ఏటా డిసెంబర్ 26న వీరబాల దివస్‌ను నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. నేడు ఈ కార్యక్రమం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తోంది. కేరళ నుంచి అస్సాం వరకు.. దేశంలోని నలుమూలలా ఉన్న పిల్లలు ఈ రోజు ఆ సాహిబ్జాదాలు, మాతా గుజ్రీల త్యాగాలను తెలుసుకుంటున్నారు.
వీరబాల దివస్ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది బాలలు, యువకుల గుండెల్లో అచంచలమైన స్ఫూర్తిని నింపుతోంది.
మిత్రులారా,
పవిత్ర జోరే సాహిబ్ గురించి కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. నా ప్రభుత్వ సహచరులలో ఒకరైన శ్రీ హర్దీప్ పూరి కుటుంబ పూర్వీకులు.. గురు గోవింద్ సింగ్‌కు స్వయంగా సేవలందించారు. గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్‌లకు చెందిన పవిత్ర జోరే సాహిబ్‌ను తమ కుటుంబం 300 ఏళ్లకు పైగా కాపాడుకుంటూ వస్తోందని శ్రీ హర్దీప్ పూరి నాతో చెప్పారు.
దేశ విభజన సమయంలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లోనూ.. శ్రీ పూరి పూర్వీకులు ఈ పవిత్ర అవశేషాలను సురక్షితంగా ఢిల్లీకి తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆ పవిత్ర జోరే సాహిబ్‌ను దర్శించుకుని, భక్తిశ్రద్ధలు చాటుకునే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో.. ఆ పవిత్ర జోరే సాహిబ్‌ను సిక్కు సంగత్‌కు అప్పగించాలని ఆ కుటుంబం భావించింది.
తర్వాత మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి, సిక్కు సంప్రదాయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నిపుణుల సలహాలను తీసుకున్నాం. వారి సూచనల ఆధారంగా.. గురు గోవింద్ సింగ్ ఈ పవిత్ర భూమిపై మొదట అడుగుపెట్టిన చోటు, ఆయన జన్మస్థలమైన పూజనీయ పాట్నా సాహిబ్‌కు ఆ పవిత్ర జోరే సాహిబ్‌ను తీసుకెళ్లాలని నిర్ణయించాం.
ఆ పవిత్ర జోరే సాహిబ్ నేడు పవిత్ర పాట్నా సాహిబ్ మందిరానికి చేరడం సంతోషదాయకం. ఆ పవిత్ర ఘట్టానికి సాక్షిగా నిలవడం, ఆ కార్యక్రమంలో భాగస్వామినవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరెప్పుడు భారత్‌కు వచ్చినా.. తప్పక పాట్నా సాహిబ్‌ను దర్శించుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను.
మిత్రులారా,
ఈ రోజు నేను అపారమైన విశ్వాసంతో, మీరందించిన అమితమైన ఆప్యాయతతో, మరెన్నో మధుర జ్ఞాపకాలతో ఇక్కడి నుంచి తిరిగి పయనమవుతున్నాను. అలాగే మీ అందరితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.. ఈ సారి ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడానికి 40 ఏళ్లు పట్టింది. కానీ, ఇకపై మీరు మరోసారి ఇంతకాలం వేచి చూడాల్సిన అవసరం రాదు. మరో 40 ఏళ్లు అస్సలు పట్టదు. ఇది మోదీ గ్యారెంటీ. మోదీ గ్యారెంటీ అంటే.. తప్పక నెరవేరుతుందన్న భరోసా.
మిత్రులారా,
మీ అందరికీ ఒక మనవి. కొంతకాలం కిందట మన భారతీయ సంతతి పిల్లల కోసం ఒక సరికొత్త కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మన పిల్లలు భారత్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, దేశ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటడానికీ ‘భారత్ కో జానియే క్విజ్’ను మేం మొదలుపెట్టాం. దీనికి సంబంధించి ఇప్పటివరకు సన్నాహక కార్యక్రమం మాత్రమే జరిగింది. కానీ మన పిల్లల ఉత్సాహం నన్నెంతగానో ఆకట్టుకుంది.
ఇప్పుడు మరింతగా సాంకేతికతను జోడించి ఈ కార్యక్రమ ఆరో ఎడిషన్‌ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సారి చాలా పోటీలు యాప్ ద్వారానే జరుగుతాయి. ఇక్కడున్న యువత అంతా ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని కోరుతున్నాను. భారత్‌ను మరింత లోతుగా తెలుసుకోండి.. సుసంపన్నమైన భారతీయ వారసత్వంతో న్యూజిలాండ్ ప్రజలను అనుసంధానించే వారధులుగా నిలవండి!
మిత్రులారా,
వికసిత భారత్ - సుసంపన్న న్యూజిలాండ్ సంకల్పంతో దేదీప్యమైన ఉజ్వల భవిత నాకు కనిపిస్తోంది. ఇదే విశ్వాసంతో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్‌కూ, ఆయన బృందానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యూజిలాండ్ ప్రజలకు నా కృతజ్ఞతలు.
మరోసారి నాతో కలిసి నినదించండి.. భారత్ మాతా కీ జై!
వందేమాతరం!
ధన్యవాదాలు!
కియా ఒరా!
గమనిక - ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.
***
(रिलीज़ आईडी: 2284743)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam