ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశంలోని అనేక వన్యప్రాణి అక్రమ రవాణా ముఠాల గుట్టు రట్టు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)
వివిధ దాడులలో 440కి పైగా అంతరిస్తున్న-రక్షిత వన్యప్రాణులు సహా 15 కిలోల ఏనుగు దంతాలు-వస్తువుల స్వాధీనం... 33 మంది అరెస్టు
प्रविष्टि तिथि:
13 JUL 2026 7:22PM by PIB Hyderabad
దేశంలో వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు పటిష్ట నిఘాతో దేశమంతటా నిర్వహించిన అనేక వరుస దాడులలో 440కిపైగా అంతరిస్తున్న-రక్షిత వన్యప్రాణులు సహా 15 కిలోల మేర ఏనుగు దంతాలు, దంత వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల సందర్భంగా 33 మంది వన్యప్రాణుల అక్రమ రవాణాదారులను అరెస్టు చేసింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్ సమీపాన 10.07.26 నాడు ఏనుగు దంతాల అక్రమ వ్యాపారం చేసే కొందరు వ్యక్తులను పటిష్ఠ నిఘాతో అధికారులు దిగ్బంధించారు. వారి నుంచి సుమారు 11 కిలోల ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమ రవాణాదారులను, ఏనుగు దంతాలను అటవీ శాఖకు అప్పగించారు. వీరిపై వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 కింద అటవీ శాఖ కేసులు నమోదు చేసి చర్యలు చేపడుతుంది. భారతీయ ఏనుగులు (ఎలిఫాస్ మాక్సిమస్), వాటి దంతాలు ఇతర భాగాలతో వ్యాపారం ఈ చట్టంలోని షెడ్యూల్-I కింద నిషేధం. దీంతోపాటు “అంతరించిపోతున్న వన్యప్రాణులు- వృక్షజాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందం” (సీఐటీఈఎస్) భాగస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్‌లోనూ ఏనుగు దంతాల వ్యాపారంతోపాటు విదేశీ వాణిజ్య విధానం కింద ఏనుగు దంతాల ఎగుమతి-దిగుమతులపైనా నిషేధం ఉంది.
అంతకుముందు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రవాణా చేసినట్లు భావిస్తున్న రెండు దంతపు దేవతా విగ్రహాలను పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, కర్ణాటకలోని మైసూరులో దాడుల సందర్భంగా 4 కిలోల ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకోవడం సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖకు అప్పగించారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 7-8 తేదీలలో నిర్వహించిన దాడులలో ఒక అంతర్రాష్ట్ర వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా గుట్టును డీఆర్‌ఐ అధికారులు రట్టు చేశారు. ఈ మేరకు ముంబైలోని డీఆర్ఐ, సీబీఐ, ఎకనామిక్ అఫెన్సెస్ విభాగం (ఈఓబీ) వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) సహకారంతో తొలిసారి సంయుక్తంగా భారీ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం-1972లోని షెడ్యూల్-I కింద వన్యప్రాణుల జాబితాలోగల “15 స్లో లోరిస్‌లు, 2 బింటురాంగ్‌లు, 28 నక్షత్ర తాబేళ్లు, 6 ఈజిప్షియన్ రాబందులు, 2 షిక్రా పక్షుల”ను స్వాధీనం చేసుకున్నారు. ఈ జంతువుల అక్రమ రవాణాపై డీఆర్‌ఐ సమాచారం సేకరించి, దాడులు నిర్వహించారు. ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టి, ఆరుగురు నిందితులను తొలుత అదుపులోకి తీసుకుని, ప్రాథమిక ఆధారాలతో వారిని అరెస్టు చేసింది.
బ్యాంకాక్, కౌలాలంపూర్, కొలంబో నుంచి లోగడ కొందరు ప్రయాణికులు అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా సంరక్షిత వన్యప్రాణులను భారత్‌లోకి తరలించేందుకు చేసిన అనేక ప్రయత్నాలను డీఆర్ఐ భగ్నం చేసింది. ఆయా సందర్భాల్లో “ఆల్బినో ఎర్ర చెవుల తాబేలు, హైపో జీరో బియర్డెడ్ డ్రాగన్, ఆఫ్రికన్ స్పర్డ్ తాబేలు, బోర్నియో కొండచిలువ, ఆకుపచ్చ ఇగ్వానా, మడ అడవి బల్లి, అర్జెంటీనా నలుపు-తెలుపు టెగు, గోల్డీ మార్మోసెట్, యెల్లో చీక్ గిబ్బన్, ఇండోనేషియన్ బ్లూటంగ్ స్కింక్, సియామాంగ్ గిబ్బన్, వూలీ మంకీ, సిల్వరీ లుటంగ్, యెల్లో బెల్లీ బాల్ పైథాన్, పాస్టెల్ బాల్ పైథాన్” తదితర జంజాతులను రక్షించారు.
అదేవిధంగా బెంగళూరు, వరంగల్, పుణె, సూరత్, చెన్నై, కోల్‌కతా, తిరుచ్చి, మదురై, శ్రీకాకుళం, హోజై (అస్సాం) సహా రాజస్థాన్, మైసూరు, హౌరాలలో డీఆర్ఐ ఇతర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో నిఘా-దాడులు చేపట్టింది. ఆయా సందర్భాల్లో “పంగోలిన్ పొలుసులు, చిరుతపులి చర్మం, సముద్ర గుర్రం ఆధారిత వన్యప్రాణి వస్తువులు, ఎర్రచందనం, రక్షిత జాతులైన గిబ్బన్లు, బల్లులు, తాబేళ్లు, పక్షులు, ఉడుతలు, పాములు, రెడ్ సాండ్ బోవా” వంటి అనేక వన్యప్రాణులు-ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది.
ఈ కార్యకలాపాలలో అధికశాతం సీబీఐ, డబ్ల్యూసీసీబీ సహా బెంగళూరు, కోల్‌కతా, తిరుచ్చి, మదురైలలోని కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్లు, రాష్ట్ర అటవీ శాఖలు, స్థానిక పోలీసు అధికారులు తదితర చట్టబద్ధ సంస్థలతో సమన్వయం ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహించింది.
వ్యవస్థీకృత వన్యప్రాణి వ్యతిరేక నేరాల నిరోధం, అంతరించిపోతున్న జంతు-వృక్ష జాతుల అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపడంలో డీఆర్ఐ నిబద్ధతను ఈ నిరంతర నిఘా ఆధారిత కార్యకలాపాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ‘సీఐటీఈఎస్’ కింద భారత్ బాధ్యతల కింద సహకరించడంతోపాటు దేశంలో సుసంపన్న జీవవైవిధ్య పరిరక్షణలోనూ డీఆర్‌ఐ తనవంతు పాత్ర పోషిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2284312)
आगंतुक पटल : 11