రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో రక్షణ మంత్రి సమక్షంలో అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’ని ప్రారంభించిన భారత నౌకాదళం

75 శాతం స్వదేశీ పరిజ్ఞానం, ఆధునాతన ఆయుధ వ్యవస్థలతో తయారై గగన, ఉపరితల, జలాంతర్గామి ముప్పులను తిప్పికొట్టే ఆరో ప్రాజెక్టు 17ఏ యుద్ధ నౌక

ఈ అత్యాధునిక యుద్ధ నౌక సాంకేతిక నైపుణ్యం, పోరాట పటిమ గల నౌకాదళాన్ని నిర్మించాలనే దేశ సంకల్పానికి, ఆత్మనిర్భర్ భారత్‌కు మరో నిదర్శనం: శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత్‌ బ్లూ వాటర్‌ సామర్థ్య విస్తరణను, హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ ఉనికిని మరింత బలోపేతం చేయనున్న ఐఎన్ఎస్ మహేంద్రగిరి

దేశ నౌకాదళం సకాలంలో, సమర్థవంతంగా స్పందిస్తూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తొలి ఆదరణ కలిగిన భద్రతా భాగస్వామిగా గుర్తింపు

సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను పటిష్ఠం చేస్తూనే.. తదుపరి తరం సరికొత్త సాంకేతికతపై పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: రక్షణ మంత్రి

प्रविष्टि तिथि: 11 JUL 2026 12:56PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 2026 జూలై 11న రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఒక ప్రత్యేక వేడుకలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’ని భారత నౌకాదళం తన తూర్పు నావికాదళ శ్రేణిలోకి అధికారికంగా చేర్చుకుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్రంట్‌లైన్ యుద్ధనౌక నౌకా నిర్మాణ రంగంలో భారత్‌ సాధిస్తున్న స్వయంసమృద్ధికి నిదర్శనమని కొనియాడారు. అసాధారణమైన రూపకల్పన సామర్థ్యాలు, అద్భుతమైన ఉత్పాదకత, నావికా-పారిశ్రామిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, అత్యాధునిక రక్షణ వేదికలను నిర్ణీత గడువులోగా అందించగల దేశ ప్రతిభకు ఇది అద్దం పడుతోందని ఆయన స్పష్టం చేశారు. 

కేవలం ఒకటిన్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే భారత నౌకాదళంలో చేరిన ఆరో ప్రాజెక్టు 17ఏ స్వదేశీ యుద్ధ నౌకగా ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’ రికార్డు సృష్టించింది. ఈ శ్రేణిలో మొదటి యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ నీలగిరి’ 2025 జనవరిలో రక్షణ విధుల్లోకి చేరగా.. ఆ తర్వాత వరుసగా ‘ఐఎన్‌ఎస్ ఉదయగిరి’, ‘ఐఎన్‌ఎస్ హిమగిరి’ నౌకలు అదే ఏడాది ఆగస్టులో చేరాయి. ఈ సంవత్సరం (2026) ఏప్రిల్‌లో ‘ఐఎన్‌ఎస్ తారగిరి’, గత నెలలో ‘ఐఎన్‌ఎస్ దునగిరి’ నౌకాదళంలో భాగమయ్యాయి. భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన ఈ సరికొత్త యుద్ధనౌకను ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్‌) నిర్మించింది. సంపూర్ణ నావికాదళ కార్యకలాపాలను నిర్వహించగల అద్భుత సామర్థ్యం దీని సొంతం. నౌకాదళ వైమానిక రక్షణ, ఉపరితల రక్షణ పోరాటాలు), జలాంతర్గామి నిరోధక చర్యలు, సముద్రయాన నిషేధాజ్ఞల అమలు , నిరంతర నిఘా వంటి కీలక బాధ్యతలను ఇది సమర్థవంతంగా నిర్వహించగలదు. వీటితో పాటు మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ నౌక కీలకపాత్ర పోషించనుంది. 

 

75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధనౌక సుమారు 6,670 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉండి.. గరిష్టంగా 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది శబ్దవేగాన్ని మించిన సూపర్‌సోనిక్ ఉపరితల-ఉపరితల క్షిపణులు, మధ్యస్థ శ్రేణి ఉపరితల-గగనతల క్షిపణులు, జలాంతర్గామి నిరోధక పోరాట వ్యవస్థలతో పాటు బహుళ ప్రయోజన హెలికాప్టర్‌ను మోసుకెళ్లే వసతిని కలిగి ఉంది. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, ఆధునిక సెన్సార్లు, వ్యవస్థ-కేంద్రిత పోరాట వ్యవస్థలు, అత్యుత్తమ ఆయుధ సంపత్తి దీని సొంతం. 

 

‘‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తిమంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటైన బ్రహ్మోస్.. ఉపరితల-ఉపరితల క్షిపణిని ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిలో అమర్చవచ్చని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. సుదూర ప్రాంతాలలోని వైమానిక ముప్పులను గుర్తించి, వాటిని ముందే అడ్డుకునేందుకు వీలుగా బహుళ ప్రయోజన రాడార్, ఉపరితల-గగనతల క్షిపణుల ఉమ్మడి వ్యవస్థ ఇందులో ఉందని చెప్పారు. దీని ఆయుధాగారంలో స్వదేశీ రాకెట్ లాంచర్, టార్పెడో లాంచర్లు, సమీకృత జలాంతర్గామి నిరోధక రక్షణ వ్యవస్థ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్ వంటి రక్షణ వలయాలు ఉన్నాయి. ఈ అద్భుత సామర్థ్యాలన్నీ ఈ యుద్ధనౌకను అత్యంత శక్తిమంతమైనదిగా, తిరుగులేనిదిగా మార్చాయని రక్షణ మంత్రి కొనియాడారు. ఈ ‘బ్లూ-వాటర్ షిప్’ కేవలం తీరప్రాంతాల్లోనే కాకుండా.. సుదూరంగా ఉండే లోతైన మహాసముద్రాలలో సైతం భారతదేశ సముద్ర ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

 డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ వార్‌ఫేర్, అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలు, హైపర్‌సోనిక్ ఆయుధాలు, మానవరహిత వ్యవస్థల వంటి సరికొత్త సాంకేతికతలు యుద్ధ స్వరూపాన్ని గణనీయంగా మార్చివేసినప్పటికీ,సమర్థవంతమైన రక్షణకు సంప్రదాయ సైనిక సామర్థ్యాలే ఇప్పటికీ మూలస్తంభాలని రక్షణ మంత్రి చెప్పారు. ‘‘భవిష్యత్తు యుద్ధాలు బహుశా కృత్రిమ మేధతో జరగవచ్చు. కానీ విజయం మాత్రం జాతీయ సంకల్పం, శిక్షణ పొందిన సైనికులు, విశ్వసనీయమైన సైనిక శక్తి ద్వారానే సాధ్యమవుతుంది’’ అని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతలు, సంప్రదాయ వేదికలు ఒకదానికొకటి పోటీదారులు కావని, పరస్పర పూరకాలుగా పనిచేస్తాయని వివరించారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తదుపరి తరం సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతూనే, సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే సమతుల్య విధానానికి కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. జాతీయ భద్రతను కాపాడటంలో సంప్రదాయ, ఆధునిక సామర్థ్యాల సమర్థవంతమైన ఏకీకరణకు ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన ఉదాహరణ అని గుర్తుచేశారు. సాంకేతికంగా అత్యంత పురోగతి సాధించిన, పోరాటానికి సిద్ధంగా ఉన్న నౌకాదళ నిర్మాణానికి ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి దేశ సంకల్ప ప్రతీక అని పేర్కొన్నారు. 

సముద్ర భద్రత, ఆర్థిక భద్రత అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని రక్షణ మంత్రి వెల్లడించారు. జాతీయ భద్రతకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి సముద్ర మార్గాలు ఎంతో కీలకమని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను వివరిస్తూ.. ఈ ప్రాంతంలోని అందరి భద్రత, వృద్ధిని కాంక్షించే ‘సాగర్’ దార్శనికతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 

‘‘భారత్‌ ఒక నికర భద్రతా ప్రదాత. ప్రాంతీయ భద్రత, అభివృద్ధిని నిర్ధారించడానికి కట్టుబడిన ఒక నమ్మకమైన భాగస్వామి’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు (హెచ్‌ఏడీఆర్‌), సముద్రపు దొంగల నిరోధక మిషన్లు, సంక్షోభ ప్రాంతాల నుంచి భారతీయ, విదేశీ పౌరులను సురక్షితంగా తరలించడంలో నావికాదళం ఈ నిబద్ధతను నిరంతరం నిరూపిస్తోందని ప్రశంసించారు. సమయానుకూలమైన, సమర్థవంతమైన కార్యాచరణ ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత నౌకాదళం ‘తొలి స్పందనదారు’, ‘అత్యంత ఆదరణ కలిగిన భద్రతా భాగస్వామి’గా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. 

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో భారత నౌకాదళం పోషించిన పాత్రను రక్షణ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపరేషన్ ఊర్జా సురక్ష కింద సుమారు రూ. 9,000 కోట్లకు పైగా విలువైన అత్యవసర సరుకుతో వెళ్తున్న 18 వాణిజ్య నౌకలకు నావికాదళం సురక్షిత రక్షణ కల్పించిందని వెల్లడించారు. ఈ ప్రయత్నాలు నౌకాదళాన్ని కేవలం ఒక పోరాట శక్తిగానే కాకుండా.. దేశ ఆర్థిక ప్రయోజనాల రక్షకురాలిగా నిలబెట్టాయని చెప్పారు. ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి చేరికతో దేశ సముద్ర రక్షణ వ్యూహం మరింత బలోపేతం అవుతుందని, ఇది తూర్పు తీర రక్షణ సామర్థ్యాన్ని పెంచుతూ, సుదూర తీర సముద్ర (బ్లూ-వాటర్) పరిధిని విస్తరిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ ఉనికిని మరింత సుస్థిరం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం కేవలం పోరాట వేదికలను రూపొందించడానికే పరిమితం కాలేదని, దేశీయ రూపకల్పన సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యం, నిపుణులైన మానవ వనరులు, సముద్రయాన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నౌకా నిర్మాణం అనేది ఉక్కు, ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, ప్రొపల్షన్ వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ వంటి బహుళ రంగాలలో వృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. ఈ ప్రక్రియ పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టిస్తూ, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. 

దేశాన్ని నౌకా నిర్మాణం, సముద్ర రక్షణ ఆవిష్కరణల్లో ఒక ప్రపంచ కేంద్రంగా నిలపాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఓడరేవుల ఆధునీకరణ, అంతర్గత జలమార్గాల విస్తరణ, లాజిస్టిక్స్ వ్యవస్థల బలోపేతం, ప్రపంచ స్థాయి సముద్ర పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ‘మారిటైమ్ ఇండియా విజన్ 2030’ వంటి కార్యక్రమాల ద్వారా దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి, స్వయంసమృద్ధిని బలోపేతం చేయడానికి, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించిన మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్, షిప్‌బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, షిప్‌బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీం వంటి కీలక ప్రభుత్వ చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

భవిష్యత్తు యుద్ధాల గమనాన్ని మార్చే సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా భారత్‌ను స్వయంసమృద్ధ దేశంగా మార్చే వ్యవస్థలను రూపొందించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. 

భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ.. ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత్‌కు పెరుగుతున్న సముద్ర సామర్థ్యానికి, సాంకేతిక స్వయంసమృద్ధికి ప్రతీక అని కొనియాడారు. ఆరో ప్రాజెక్టు 17ఏ యుద్ధ నౌక జలప్రవేశం స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో మరొ మైలురాయి అని, ఇది భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని స్పష్టం చేశారు. భారత నావికాదళం ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న, విశ్వసనీయమైన, సమన్వయంతో కూడిన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన శక్తిమంతమైన బలగంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 

 

75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని సాధించడంతో పాటు, ఈ ప్రాజెక్టులో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, నౌకాదళం కలిసి పలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయని నావికాదళ అధిపతి వెల్లడించారు. నౌకను నీటిలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి రక్షణ విధుల్లోకి అప్పగించే కాలపరిమితిని సుమారు 50 శాతం తగ్గించినట్లు చెప్పారు. గతంలో దీనికి 63 నెలల సమయం పట్టగా.. ఇప్పుడు దానిని 31 నెలలకు తగ్గించగలిగారని వివరించారు. మొత్తం నిర్మాణ సమయం కూడా దాదాపు 20 శాతం తగ్గి.. 95 నెలల నుంచి 75 నెలలకు పరిమితమైందన్నారు. సాధారణంగా అయిదు నుంచి ఏడు సార్లు నిర్వహించే సముద్ర పరీక్షల స్థానంలో, కేవలం ఒకే ఒక్క సముద్ర పరీక్షలోనే సాంకేతిక విశ్లేషణలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విజయాలు ఎండీఎల్, భారతీయ తయారీదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, యుద్ధనౌక పర్యవేక్షణ బృందం, ట్రయల్ సంస్థలు, నౌకా సిబ్బంది ఉమ్మడి కృషికి నిదర్శనమన్నారు. 

ఈ వేడుకలో సాంప్రదాయబద్ధంగా కమిషనింగ్ పెన్నాంట్‌ను ఆవిష్కరించి, నౌకపై మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికా దళ కమాండ్‌ ఫ్లాగ్ అధికారి కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఎండీఎల్ సీఎండీ కెప్టెన్ జగ్‌మోహన్ (పదవీ విరమణ), సీనియర్ నావికాదళ అధికారులు, మాజీ సైనికులు, నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రతినిధులు, ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు. 

ఐఎన్ఎస్ మహేంద్రగిరి గురించి.. 

తూర్పు కనుమలలోని మహేంద్రగిరి పర్వత శ్రేణుల మీదుగా ఈ యుద్ధనౌకకు ఈ పేరు పెట్టారు. ఇది బలానికి, స్థిరత్వానికి, అజేయమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ నౌక  బలమైనది, గంభీరమైనది, సాటిలేనిది’ అనే నినాదాన్ని కలిగి ఉంది. అనేక ఎంఎస్‌ఎంఈలతో కూడిన 200 కి పైగా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో తయారైన ఈ నౌక.. దేశ ఎదుగుతున్న రక్షణ ఉత్పాదక సామర్థ్యాన్ని చాటిచెబుతోంది. ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్, సమీకృత వేదిక నిర్వహణ వ్యవస్థ, అధునాతన స్వదేశీ యుద్ధ వ్యవస్థలు ఉన్నాయి. 

భారత నౌకాదళానికి చెందిన సన్‌రైజ్ ఫ్లీట్ అయిన తూర్పు నావికాదళ శ్రేణిలో చేరడం ద్వారా ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి.. దేశ సముద్ర పోరాట సామర్థ్యాన్ని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్యాచరణ పరిధిని గణనీయంగా పెంచుతుంది. ఇది ‘మహాసాగర్’ దార్శనికత కింద భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన నౌకాదళ నిర్మాణానికి భారత్‌ కనబరుస్తున్న నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. 

 

***


(रिलीज़ आईडी: 2283675) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu_Vw , Malayalam