ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
11 JUL 2026 7:59AM by PIB Hyderabad
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.
పర్యటనలో భాగంగా గవర్నమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి మోదీకి అధికారికంగా స్వాగతం లభించింది. ఆయన, ప్రధాని లక్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. న్యూజిలాండ్‌లోని వ్యాపారవేత్తలను, ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ క్రీడారంగంలో వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనను తిలకించారు.
2025 మార్చిలో ప్రధాని లక్సన్ భారతదేశంలో పర్యటించిన విషయాన్ని ప్రధానమంత్రులు గుర్తుచేసుకున్నారు. ఆ పర్యటనలో భారత్, న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించాయి. రక్షణ, విద్య, సుంకాలు, ఉద్యాన, అటవీ, క్రీడలు లాంటి ముఖ్యమైన రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
భారత్, న్యూజిలాండ్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, బలమైన ప్రజా సంబంధాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించి... ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రాబోయే నాలుగేళ్లపాటు ఉమ్మడి కార్యాచరణకు మార్గదర్శకంగా ఉండే ‘భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: 2030 ప్రణాళిక’ను వారు ఆమోదించారు.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన దీర్ఘకాలిక దార్శనికతపై ప్రధానులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడం, ఇప్పటికే కొనసాగుతున్న సహకార యంత్రాంగాలను బలోపేతం చేయడం, ద్వైపాక్షికంగా, బహుపాక్షికంగా సహకారాన్ని పెంపొందించే నూతన మార్గాలను అన్వేషించడమే ఈ దార్శనికత లక్ష్యం.
రాజకీయ, దౌత్యపరమైన భాగస్వామ్యం
ఉన్నత స్థాయి రాజకీయ సంప్రదింపుల్లో పెరుగుతున్న వేగాన్ని ప్రధానులు స్వాగతించారు. ప్రాంతీయ, బహుపాక్షిక కార్యక్రమాల్లో భాగంగా జరిగే సమావేశాలతో పాటు ఇరు దేశాల ప్రధానమంత్రులు, మంత్రులు క్రమం తప్పకుండా పర్యటనలు చేపట్టడానికి, సమావేశాలు నిర్వహించడానికి వారు అంగీకరించారు.
ఈ సంబంధానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడానికి, 2030 ప్రణాళిక పరిధిలో సాధించిన పురోగతిని సమీక్షించడానికి రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య క్రమం తప్పకుండా చర్చలు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రులు అంగీకరించారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూజిలాండ్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారుల మధ్య వార్షిక సమావేశాల నిర్వహణ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
పరస్పర అవగాహనను పెంపొందించడంలో, భారత్-న్యూజిలాండ్ సంబంధాల ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో పార్లమెంటరీ సంప్రదింపులు పోషిస్తున్న కీలకపాత్రను ప్రధానులు గుర్తించారు. భారత పార్లమెంటులో ఇటీవల ఏర్పాటు చేసిన న్యూజిలాండ్ పార్లమెంటరీ స్నేహ బృందం ద్వారా, పార్లమెంటు సభ్యుల పర్యటనల ద్వారా రెండు దేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని వారు ప్రోత్సహించారు.
రక్షణ, భద్రతా సహకారం
రక్షణ సహకారంపై 2025 భారత్-న్యూజిలాండ్ అవగాహన ఒప్పందం అమలుతో సహా రక్షణ, భద్రతా సహకారంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రులు స్వాగతించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక స్థాయుల్లో క్రమబద్ధమైన, నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించడానికి ప్రధానమంత్రులు అంగీకరించారు. మధ్యప్రాచ్యం, పశ్చిమ హిందూ మహాసముద్రంలో మాదకద్రవ్యాల అక్రమరవాణా, ఉగ్రవాదం, అక్రమ సముద్ర కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలకు మద్దతుగా న్యూజిలాండ్ కమాండర్‌గా, భారతదేశం డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరిస్తున్న 2025 నాటి కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 150 (సీటీఎఫ్-150) పరిధిలో కొనసాగుతున్న సహకారాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సముద్రతీర దేశాలుగా భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛాయుతమైన, సమ్మిళితమైన, శాంతియుతమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌లో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రులు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఇటీవలే కుదిరిన నౌకావాణిజ్య సహకార ఏర్పాటు (ఎంసీఏ), హైడ్రోగ్రఫీ, నాటికల్ కార్టోగ్రఫీ సహకారానికి సంబంధించిన అమలు విధానాన్ని బలోపేతం చేయడానికి వారు అంగీకరించారు. అలాగే నౌకారవాణా రంగంపై దృష్టి సారించి పరస్పర వస్తు రవాణా సహకార వ్యవస్థతో సహా నౌకావాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా వారు అంగీకరించారు. ఎంసీఏలో భాగంగా ద్వైపాక్షిక నావికా విన్యాసాలతో సహా నౌకా దళ కార్యకలాపాలను కూడా వారు స్వాగతించారు.
ఇండో-పసిఫిక్ మహా సముద్రాల కార్యక్రమ పరిధిలో సముద్ర భద్రతను తమ ప్రాధాన్యాంశంగా న్యూజిలాండ్ ప్రతిపాదించడాన్ని భారత్ స్వాగతించింది. ఈ అంశం కింద నిర్దిష్ట సహకార కార్యకలాపాలను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సహకారం, సమన్వయం, సమాచార వినిమయాన్ని బలోపేతం చేయడానికి వార్షిక సముద్ర భద్రతా సంప్రదింపులను ఏర్పాటు చేయడానికి కూడా వారు అంగీకరించారు.
ఉగ్రవాదాన్ని నిరోధించడం, సైబర్ భద్రత, సంబంధిత భద్రతా సవాళ్లపై సహకారాన్ని బలోపేతం చేయడంలో తమ ఉమ్మడి నిబద్ధతను ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ శాంతి, భద్రత, స్థిరత్వానికి మద్దతు ఇచ్చేలా సంబంధిత ప్రాంతీయ, బహుపాక్షిక వేదికల్లో చర్చలు, సహకారంతో సహా సన్నిహిత సంబంధాల కోసం అవకాశాలను అన్వేషించడానికి వారు అంగీకరించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ ఆధారిత నేరాలు, ఉగ్రవాద సంబంధిత నేరాలు, వలసదారుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణాతో సహా అంతర్జాతీయ, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనేందుకు చట్టం అమల్లో ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రులు అంగీకరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన సంబంధిత సంస్థల మధ్య మాదకద్రవ్యాల నిరోధక సహకారం, చట్ట అమలు సహకారంపై ఏర్పాట్లను త్వరితగతిన అధికారికంగా ఖరారు చేసేలా కలసి పని చేయడానికి వారు అంగీకరించారు.
వాణిజ్యం, ఆర్థిక సహకారం
వాణిజ్య, ఆర్థిక సంబంధాల్లో సాధించిన పురోగతిని ప్రధానమంత్రులు స్వాగతించారు. అయితే ఇంకా గణనీయమైన స్థాయిలో వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉందని కూడా గుర్తించారు. 2030 నాటికి వస్తు సేవల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ల న్యూజిలాండ్ డాలర్లు లేదా సుమారుగా రూ.35,000 కోట్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యం దిశగా పని చేయడానికి వారు అంగీకరించారు. సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, అవకాశాలను అన్వేషించాలని, రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర అనుకూలతలను ఉపయోగించుకోవాలని వ్యాపార వర్గాలను వారు ప్రోత్సహించారు.
సమతౌల్యమైన, సమగ్రమైన, పరస్పర ప్రయోజనకరమైన భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారు కావడాన్ని, సంతకాలు చేయడాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు. ఇది వీలైనంత త్వరగా అమల్లోకి రావడానికి, సమర్థంగా అమలు చేయడానికి కలసి పనిచేసేందుకు వారు అంగీకరించారు.
వాణిజ్యానికి ఉన్న అవరోధాలను తొలగించడం, సహకారాన్ని విస్తరించడం, భారతదేశంలో న్యూజిలాండ్ పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాల ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎఫ్‌టీఏ పోషించే కీలక పాత్రను ప్రధానమంత్రులు గుర్తించారు. వాణిజ్యం, వ్యవసాయం, నైపుణ్యాలు, ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, క్రీడలు, ఇతర రంగాల్లో సహకారం ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే వికసిత్ భారత్ లక్ష్యానికి న్యూజిలాండ్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రులు గుర్తించారు.
ఆర్థిక వృద్ధిని, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలో పర్యాటక రంగం పోషించే సానుకూల పాత్రను గుర్తిస్తూ... పర్యాటక అవగాహన పత్రంపై సంతకాలు పూర్తి కావడాన్ని వారు స్వాగతించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య నేరుగా నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించాలని విమానయాన సంస్థలకు వారు మరోసారి సూచించారు.
ఉద్యాన, అటవీ, పశు పోషణ, పాడిపరిశ్రమతో సహా ప్రాథమిక పరిశ్రమల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య విస్తరిస్తున్న భాగస్వామ్యాన్ని ప్రధానులు స్వాగతించారు. ఉత్పాదకత, ఆహార భద్రత, సుస్థిరత, పంటకోత అనంతర వ్యవస్థలు, విలువ ఆధారిత అభివృద్ధి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన న్యూజిలాండ్ నైపుణ్యాన్ని ఈ సహకారం ఉపయోగించుకుంటుందని వారు తెలిపారు. అలాగే సుస్థిర వ్యవసాయ వృద్ధి కోసం భారతదేశం నిర్దేశించుకున్న ప్రాధాన్యాలకు కూడా ఈ సహకారం మద్దతు ఇస్తుందని వారు తెలియజేశారు.
కివీ, యాపిల్ దిగుబడిని, తేనె ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా... భారత్‌తో కలిసి న్యూజిలాండ్ రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికలతో సహా క్షేత్ర స్థాయి సహకారానికి ముఖ్యమైన వేదికగా నిలుస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలోని వ్యవసాయ ఉత్పాదకత భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు. భారతదేశంలో కివీ పండ్ల సాగుకు సంబంధించిన ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాటుకు న్యూజిలాండ్ అందిస్తున్న మద్దతును వారు ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల మధ్య బలమైన సంబంధాలకు తోడ్పడే విద్యా, సంస్థాగత సహకారాలను కూడా స్వాగతించారు. వీటితో పాటు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ రంగాల సహకార ఒప్పందం ఖరారు కావడంపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
నావికుల సామర్థ్య ధృవీకరణ పత్రాల గుర్తింపును బలోపేతం చేసే దిశగా భారత ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌కు, మారీటైమ్ న్యూజిలాండ్ మధ్య కొనసాగుతున్న చర్చలను ప్రధానమంత్రులు స్వాగతించారు. ఈ నావికా ధృవీకరణ పత్రాల గుర్తింపును మరింత పెంపొందించడం ద్వారా... నావికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఇరుదేశాల నౌకా రవాణా సంస్థల మధ్య సహకారం బలపడుతుందని వారు గుర్తించారు. అంతేకాకుండా ఇది రెండు దేశాల నౌకావాణిజ్య రంగాల సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని పెంచేందుకు గణనీయంగా తోడ్పడుతుందని వారు స్పష్టం చేశారు.
ప్రజలు, సంస్కృతి, క్రీడలు
భారత్-న్యూజిలాండ్ ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రధానులు అభినందించారు. న్యూజిలాండ్‌లో ఉన్న వైవిధ్యంతో కూడిన సమాజంలో భారతీయులు ఒక ముఖ్యమైన, విలువైన భాగమని, రెండు దేశాలను కలిపే వారధి లాంటి వారని కొనియాడారు. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ, సమాజం, సంస్కృతి, ప్రజా జీవితం, క్రీడారంగాల్లో భారతీయ సమాజం అందిస్తున్న విశేష తోడ్పాటును వారు అభినందించారు.
2026లో నిర్వహించే క్రీడల ద్వారా ఐక్యత శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రులు స్వాగతించారు. ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఆచరణాత్మక వేదికను అందించే భారత్-న్యూజిలాండ్ ఉమ్మడి క్రీడా కార్యాచరణ ప్రణాళికను కూడా వారు స్వాగతించారు. ఈ ప్రణాళిక ద్వారా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడలు, శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, భాగస్వామ్యం, క్రీడా వ్యాపార రంగాలు, ఇరుదేశాల జాతీయ క్రీడా సంస్థల మధ్య సమన్వయానికి వీలు కలుగుతుంది.
సంప్రదాయ వైద్య రంగంలో సహకారం, సాంస్కృతిక సహకార ఏర్పాట్లు ప్రారంభం కావడం, భారతదేశంలోని లోథాల్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్-న్యూజిలాండ్ మారిటైమ్ మ్యూజియం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో సహా ఇరుదేశాల మధ్య బలోపేతమవుతున్న సాంస్కృతిక సహకారాన్ని ప్రధానులు స్వాగతించారు. ఇవి ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలను, పరస్పర అవగాహనను పెంపొందించడానికి మంచి అవకాశాలను కల్పిస్తాయని వారు చెప్పారు. అలాగే రెండు దేశాల మధ్య సంప్రదాయ సాంస్కృతిక వారసత్వాన్ని, సమకాలీన సృజనాత్మకతను, దీర్ఘకాలంగా కొనసాగుతున్న నౌకాయాన సంబంధాలను చాటి చెప్పేందుకు ఇవి తోడ్పడతాయని పేర్కొన్నారు.
విద్యా, పరిశోధన, శాస్త్ర, సాంకేతికత, విపత్తు నిర్వహణ
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో విద్య, పరిశోధన, శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణలు అత్యంత కీలకమైన అంశాలని ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు. వ్యవసాయం, వాతావరణం, డిజిటల్ పరివర్తన, సైన్స్, ఆవిష్కరణలు, కొత్త సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాలను అన్వేషించి మరింత బలోపేతం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు, సంస్థలు, పరిశ్రమలకు పిలుపునిచ్చారు.
ప్రజల మధ్య సంబంధాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల సమన్వయం, దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతికి విద్యే ప్రధానమని ప్రధానమంత్రులు గుర్తించారు. ఇరు దేశాల విద్యా సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలను స్వాగతిస్తూ.. విద్యార్థుల రాకపోకలు, సంస్థాగత భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, పరస్పర అవగాహనను పెంపొందించేలా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారు. 2025 విద్యా సహకార ఒప్పందం అమలులో సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి ఏర్పడిన పరస్పర కార్యకలాపాలు, కొత్త సంస్థాగత భాగస్వామ్యాలను గుర్తించారు.
వాతావరణ మార్పులు, తక్కువ ఉద్గారాల ఆర్థిక వ్యవస్థల వైపు సాగాల్సిన పరివర్తన, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం వంటి ఉమ్మడి సవాళ్లను ఇరు నేతలు ప్రస్తావించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి ద్వారా సహకారాన్ని మరింత లోతుగా ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించారు. ప్రపంచ బయోఫ్యూయల్స్ కూటమిలో న్యూజిలాండ్ చేరడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.
భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ మధ్య కుదిరిన సహకార ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానులు స్వాగతించారు. విపత్తు ప్రమాదాల తగ్గింపు, సంసిద్ధత, స్పందన, పునరావాసం, ప్రతిఘటన సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం చాలా అవసరమని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల్లోని సమాజాలు, మౌలిక సదుపాయాలు, సంస్థల స్థితిస్థాపకతను మెరుగుపరచడం దీని ముఖ్య ఉద్దేశం.
మరింత స్థిరమైన, ఉత్పాదకత కలిగిన, వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయ, ఆహార వ్యవస్థల కోసం పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ప్రాంతీయ, బహుపాక్షిక సహకారం
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఇరు దేశాల విధానాలపై ప్రధానమంత్రులు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే, నియమ నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను పెంపొందించే స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ చట్టాలకు, ముఖ్యంగా 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందానికి కట్టుబడి నౌకాయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణాల స్వేచ్ఛతో పాటు సముద్రాల ఇతర చట్టబద్ధమైన ఉపయోగాలను కొనసాగించాలన్నారు. వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ముఖ్యంగా యూఎన్‌సీఎల్‌ఓఎస్ నిబంధనల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, శ్రేయస్సు దిశగా కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
తూర్పు ఆసియా సదస్సు, ఆసియాన్ ప్రాంతీయ వేదిక, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం (ఏడీఎంఎం-ప్లస్)తో కూడిన ఆసియాన్ నేతృత్వంలోని ఇతర ప్రాంతీయ వేదికల్లో సహకారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని నేతలు పేర్కొన్నారు. ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండటాన్ని, ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఆసియాన్ దృక్పథాన్ని తాము ఎంతగానో సమర్థిస్తున్నట్లు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థ ప్రాధాన్యతను ఇరు దేశాల ప్రధానమంత్రులు వివరించారు. ఐక్యరాజ్యసమితిలో సాహసోపేతమైన, సమర్థవంతమైన సంస్కరణల అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రతా మండలిలోని శాశ్వత, తాత్కాలిక స్థానాల విస్తరణకు మద్దతు పలికారు. ఈ క్రమంలో, సంస్కరణలతో విస్తరించే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించడాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నట్లు న్యూజిలాండ్ స్పష్టం చేసింది.
ప్రపంచ శాంతి భద్రతలు, సార్వత్రిక, పారదర్శక అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ప్రపంచ అణువ్యాప్తి నిరోధక నిర్మాణాన్ని సమర్థించడానికి తమ బలమైన నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. భారతదేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలు, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక రికార్డును పరిగణనలోకి తీసుకుని.. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో భారత్ చేరడం ఎంతో కీలకమని ప్రధానులు అభిప్రాయపడ్డారు.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇరు దేశాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తలను తగ్గించాలని, పౌరుల రక్షణను నిర్ధారించాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకాయాన స్వేచ్ఛను, ప్రపంచ వాణిజ్య ప్రవాహాన్ని పునరుద్ధరించాలని కోరారు. నౌకాయానంపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని తెలిపారు. వివాదాల శాంతియుత పరిష్కారానికి దౌత్యం, చర్చలు మాత్రమే మార్గాలని స్పష్టం చేశారు.
స్థిరమైన, పారదర్శకమైన, పటిష్టమైన సరఫరా వ్యవస్థ ప్రాముఖ్యత గురించి ప్రధానమంత్రులు చర్చించారు. అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలో, ప్రపంచ ఇంధన వ్యవస్థల్లో పటిష్టతను బలోపేతం చేయడంలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను వారు గుర్తించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సరఫరా మార్గాలకు అంతరాయ కలగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఈ ప్రాంతానికి ప్రపంచ సరఫరా మార్గాల స్థిరత్వం అత్యవసరం పేర్కొన్నారు. పసిఫిక్ ద్వీప దేశాలకు ఇది మరింత తీవ్రంగా ఉందని, అక్కడి ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని, అధిక చమురు ధరలు విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం, రవాణా, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల వ్యయాలను పెంచుతున్నాయని, ఇది సామాజిక శ్రేయస్సు, ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తోందని చెప్పారు.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం వల్ల కలుగుతున్న అపారమైన మానవతా సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల పట్ల ఇరు దేశాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమగ్రమైన, న్యాయబద్ధమైన, దీర్ఘకాలిక శాంతి సాధనకు తాము ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద రూపాలను ఇరు ప్రధానులు ముక్తకంఠంతో ఖండించారు. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 22న భారత్‌లోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని, 2025 నవంబర్ 10న న్యూఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఘటనను అత్యంత తీవ్రంగా నిరసించారు. ఈ దాడులకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై రాజీలేని, స్థిరమైన విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిధుల నిలిపివేత, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే స్థావరాల నిర్మూలన, ఆన్‌లైన్‌తో సహా ఉగ్రవాద మౌలిక సదుపాయాల ధ్వంసం చేయడంతో పాటు నేరస్థులను త్వరగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరారు. ఉగ్రవాదం, తీవ్రవాద హింసను అణచివేయడంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరు నేతలు అంగీకరించారు. ఉగ్రవాద నిరోధంపై సమాచారం, విజ్ఞానాన్ని పంచుకోవడానికి వీలుగా ఉమ్మడి కార్యనిర్వాహక బృందం ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగడాన్ని స్వాగతించారు.
ఐరాసతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) వంటి బహుళపక్ష వేదికల్లో తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఇరు నేతలు ప్రకటించారు. ఐరాస నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులతో పాటు ఐరాస భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ జాబితాలో నమోదైన ఉగ్రవాదులపై తక్షణమే కఠినమైన, నిరంతర, సమన్వయ చర్యలు తీసుకోవాల్సిన అత్యవసర అవసరాన్ని అన్ని దేశాలకు సూచించారు. ఉగ్రవాద సంస్థల అనుబంధ విభాగాలు, ప్రతినిధులు, వారికి ఆర్థిక సహాయం అందించే వారు, వెన్నుదన్నుగా నిలిచే ఉగ్రవాద మద్దతుదారులందరిపై ఉమ్మడిగా ఉక్కుపాదం మోపాలని ఇరు నేతలు స్పష్టం చేశారు.
ముగింపు
‘రోడ్‌మ్యాప్ టు 2030’లో నిర్దేశించుకున్న వివిధ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చూడాలని, అలాగే మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం సన్నిహితంగా పనిచేయాలని ఇరు దేశాల ప్రధానులు ఆదేశించారు. ఈ పురోగతిని క్రమం తప్పకుండా మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షించాలని నిర్ణయించారు.
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, అక్కడి ప్రభుత్వం, ప్రజలు తమకు అందించిన ఘనమైన ఆతిథ్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి ఉన్నత స్థాయి పర్యటనల వేగాన్ని ఇలాగే కొనసాగించాలని ఇరు నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు.
***
(रिलीज़ आईडी: 2283673)
आगंतुक पटल : 4