ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొనడానికి మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 JUL 2026 8:21AM by PIB Hyderabad

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథోనీ అల్బానీజ్, విక్టోరియా ప్రీమియర్ జెసిండా ఎలన్‌తో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి వెళ్లారు. భారత్, ఆస్ట్రేలియా క్రీడా సంబంధాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్శనను ఏర్పాటు చేశారు. శ్రీ స్టీవ్ వా, లిసా స్థలేకర్ సహా ఆస్ట్రేలియాకు చెందిన మేటి క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక మార్పిడులు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు నానాటికీ భారత్, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మూలాధారాలుగా మారుతున్నాయని ఇది నిరూపించింది.
‘భారత్, ఆస్ట్రేలియా క్రీడా సహకార మార్గసూచీ’ని ప్రధానమంత్రులు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. క్రీడలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు, క్రీడలకు సంబంధించిన సైన్సు, టెక్నాలజీలతో పాటు క్రీడా పరిశ్రమ, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని ఈ ప్రణాళిక ప్రోత్సహించనుంది. భారత్, ఆస్ట్రేలియా యువజన క్రీడోత్సవాన్ని నిర్వహించడం కూడా ఈ ప్రణాళిక ధ్యేయాల్లో ఒకటి. క్రీడారంగంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సమన్వయం అంతకంతకూ వృద్ధి చెందుతుండడాన్ని నేతలిద్దరూ స్వాగతించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలను ఏకతాటి మీదకు తీసుకు రావడంలో క్రీడలు అద్వితీయ పాత్రను పోషిస్తున్నాయన్నారు. ఇరు దేశాలూ తమ క్రీడా భాగస్వామ్యంలో వైవిధ్యాన్ని తీసుకురావడానికి ఈ మార్గసూచీ తోడ్పడుతుందన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచినందుకు ఆస్ట్రేలియాకు ఆయన అభినందనలు తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా కలిసి అంతర్జాతీయ క్రీడలలో ఓ కీలక దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాయని ఆయన చెబుతూ, 2030లో కామన్‌వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుండగా, 2032లో బ్రిస్బేన్ ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇవ్వనుందని గుర్తు చేశారు. ఈ పరిణామాలు క్రీడలతో పాటు, క్రీడలతో ముడిపడిన పరిశ్రమల్లోనూ సన్నిహిత ద్వైపాక్షిక సహకారానికి అవకాశాలను అందిస్తాయని ఆయన అన్నారు.
నేతలు ఇరువురూ తమ సందర్శనలో భాగంగా కబడ్డీ, ఆస్ట్రేలియా ఫుట్‌బాల్, క్రికెట్ ఎగ్జిబిషన్ గేమ్స్‌లో పాలుపంచుకుంటున్న యువ క్రీడాకారులతో మాట్లాడారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య హుషారైన క్రీడా సంబంధాలతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలకు ఈ సందర్శన అద్దం పట్టింది.

 

***


(रिलीज़ आईडी: 2283234) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Kannada , Malayalam