సహకార మంత్రిత్వ శాఖ
సహకార మంత్రిత్వశాఖ అయిదో వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన సహకార మంత్రిత్వ శాఖ ఐదేళ్లుగా సహకార రంగంలోని 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో నవ్యోత్తేజం నింపింది”
“సహకార రంగంలో కీలక సమస్యల గుర్తింపు ద్వారా ఆ సంస్థల అభివృద్ధి.. పరిష్కారం దిశగా ఓ భవిష్య ప్రణాళికను మంత్రిత్వశాఖ సిద్ధం చేయడంతోపాటు ఈ రంగాన్ని ఆధునిక.. పారదర్శక.. సాంకేతికాధారిత పోటీతత్వ వ్యవస్థగా మార్చింది”
“దేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి సుసంపన్న భారత్‌కు సహకారోద్యమం బలమైన పునాదిగా నిలుస్తుంది”
“వ్యవసాయం.. పాడి.. బ్యాంకింగ్.. లాజిస్టిక్స్.. రవాణా తదితర రంగాల ఏకీకరణకు దేశవ్యాప్త సహకార సంస్థల నెట్‌వర్క్ ఏర్పాటు సహా 32 కోట్ల మందికి పైగా సభ్యులతో డిజిటల్ సహకార సమాచార నిధిని రూపొందించింది”
“దేశంలో 9 జాతీయ సహకార సంఘాల ఏర్పాటుతో ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఏకీకృత చట్రంలోకి తెచ్చి గ్రామ స్థాయికి దాని పరిధిని విస్తరించిన నేపథ్యంలో మరో దశాబ్దానికల్లా ఈ సంస్థలు ప్రపంచంలో అతిపెద్ద సంఘాలుగా రూపొందడం తథ్యం”
“సహకార నమూనా ద్వారా ప్రపంచ మార్కెట్లతో రైతు ఉత్పత్తుల సంధానించడం సహా విత్తనోత్పత్తిలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం”
“భారత్ బీజ్ సహకారి సమితి లిమిటెడ్’ (బీబీఎస్‌ఎస్‌ఎల్) మరో మూడేళ్లలో దేశంలోనే అతిపెద్ద విత్తనోత్పత్తి సంస్థగా ఆవిర్భవిస్తుంది... తద్వారా ప్రతి రాష్ట్రంలో కొత్త యూనిట్ల ఏర్పాటుతో రైతులకు నాణ్యమైన.. మెరుగైన విత్తనాలు లభిస్తాయి”
“గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వేగిరపరచేలా సేంద్రియ వ్యవసాయం.. వర్తుల ఆర్థిక వ్యవస్థ.. పశువ్యర్థాల నిర్వహణ.. సేంద్రియ ఎరువులు.. విద్యుదుత్పత్తి తదితరాలను సహకార నమూనాతో అనుసంధానిస్తున్నాం”
“సహకార రంగంలో ప్రతి విభాగం కోసం త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం నిపుణులను తీర్చిదిద్ది ‘పీఏసీఎస్’ల స్థాయి నుంచి వృత్తి నైపుణ్యాన్ని అలవరుస్తుంది”
प्रविष्टि तिथि:
06 JUL 2026 6:48PM by PIB Hyderabad
సహకార శాఖ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ కృష్ణ పాల్ గుర్జర్, శ్రీ మురళీధర్ మోహోల్, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీ ఆశిష్ కుమార్ భూటాని, వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అతిష్ చంద్ర, పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీ నరేష్ పాల్ గంగ్వార్ సహా పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా జాతీయ సహకార సంస్థలు, సమాఖ్యలు, బ్యాంకులు, పాడి సంఘాలు, భారత్ టాక్సీ, ప్యాక్స్ (పీఏసీఎస్)లు సహా సహకార రంగంలోని ఇతర భాగస్వాములు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ- ఇది మనందరికీ అత్యంత శుభప్రదమైన రోజని చెప్పారు. దేశంలో సహకార రంగంతో ముడిపడిన 32 కోట్ల మంది సభ్యులు, 8.50 లక్షలకు పైగా సహకార సంస్థల 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ సరిగ్గా ఐదేళ్ల కిందట ముగిసింది. సరిగ్గా ఇదే రోజున కేంద్రంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు 75 ఏళ్లపాటు నిర్లక్ష్యానికి, ద్వితీయ శ్రేణి పక్షపాత ధోరణికి గురైన దేశ సహకార ఉద్యమాన్ని ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సమున్నత శిఖరాలకు చేర్చిందని ఆయన పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో శ్రీ మోదీ సహకార రంగానికి నవ్యోత్తేజమిచ్చారని తెలిపారు.
తమ పార్టీ లేదా కూటమికి పాలన బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి సంబంధించిన రంగాలన్నిటికీ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చామని శ్రీ అమిత్ షా తెలిపారు. అటల్ జీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన వ్యవహారాల శాఖను ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. అటుపైన 2019లో జల నిర్వహణ సమగ్రత రీత్యా శ్రీ మోదీ ‘జలశక్తి’ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. అదే ఏడాదిలో మత్స్య శాఖను సృష్టించడంతోపాటు పశుసంవర్ధక-పాడి పరిశ్రమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. అలాగే 2021లో సహకార శాఖ సృష్టి ద్వారా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగంలో శ్రీ మోదీ విప్లవాత్మక చర్య తీసుకున్నారని తెలిపారు.
ఐదేళ్ల కిందట సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన వేళ భారత రాజ్యాంగంలో ‘సహకారం’ రాష్ట్రాల పరిధిలోని అంశమని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. అయితే, సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల పనితీరులో కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరిగిపోతుందనే అపోహలు పెద్ద ఎత్తున వినవచ్చాయని పేర్కొన్నారు. కానీ, గడచిన ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలోగల రాష్ట్రాలు కూడా కేంద్ర సహకార శాఖపై ఎన్నడూ ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడమే తమకు లభించిన అతిపెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. సహకార వ్యవస్థపై అవగాహన ఉన్నవారికి ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యానికి తావుండదనే వాస్తవం తెలుసునని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అందరితో సమష్టిగా, సహకార ధోరణితో ముందడుగు వేయడం, అందరి శక్తులను నిరంతరం ఏకీకృతం చేయడమే సహకార వ్యవస్థ అసలు స్వభావమని ఆయన వివరించారుఏ. రాష్ట్రాల పనితీరులో జోక్యం చేసుకోవడం కాకుండా, వాటికి చేయూతనిస్తూ విధాన రూపకల్పనలో సహకరించడం, వాటి ప్రగతికి తోడ్పడటమే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు ఉద్దేశమని గత ఐదేళ్లలో నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మేరకు ప్రతికూల దృక్పథం గల వారి అంచనాలను వమ్ము చేస్తూ సహకార మంత్రిత్వశాఖ అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఈ ఐదేళ్లలో సహకార రంగంలోని అనేక సమస్యలను గుర్తించి, వాటికి అవకాశాలను పెంచామని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఆ విధంగా రాష్ట్రాలకు భవిష్యత్తు ఆధారిత విధానాలను నిర్దేశించామన్నారు. ఈ ఐదేళ్ల కాలం తమ శాఖకు ఓ స్వర్ణయుగమని, భారత సహకారోద్యమ చరిత్ర రాసేటపుడు ఈ కాలం కచ్చితంగా స్వర్ణాక్షరాలతో లిఖితమవుతుందని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నుంచి అత్యున్నత స్థాయి సంస్థల దాకా.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లా స్థాయి సహకార సమాఖ్యల వరకూ... ప్రతి స్థాయిలోనూ విస్తృత సంప్రదింపులతో చేపట్టిన కార్యక్రమాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చామని ఆయన వివరించారు.
లోగడ ఏకంగా 62 ఏళ్లపాటు సహకార రంగ సంబంధిత కార్యకలాపాలన్నీ కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని సంయుక్త కార్యదర్శి స్థాయిలోనే సాగాయని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. అయితే, ఇవాళ పూర్తి స్వతంత్ర సహకార శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలను, 8.30 లక్షల సహకార సంఘాలను ఏకతాటిపై నడిపిస్తూ ముందడుగు వేస్తున్నదని ఆయన అన్నారు. గడచిన ఐదేళ్లలో అనేక విజయాలను సాధించడమేగాక సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శక, సాంకేతికాధారిత, పోటీతత్వ వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అవిరళ కృషి చేశామని చెప్పారు. ఇంతకుముందు సహకార వ్యవస్థ ప్రధానంగా ప్రాథమిక రంగాలకే పరిమితం కాగా, తమ హయాంలో వ్యవసాయ రుణాలు, పాడి పరిశ్రమ, ఎరువుల పంపిణీ, గ్రామీణ సేవలను కూడా ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయితో అనుసంధానించామని ఆయన గుర్తుచేశారు. దీంతోపాటు సహకార విధానంతో ద్వితీయ, తృతీయ రంగాల అనుసంధానానికి చర్యలు కూడా చేపట్టామన్నారు. నిల్వ, ఉత్పత్తి, ఎగుమతులు, సేంద్రియ సాగు, సంప్రదాయ విత్తనాల ఉత్పత్తి, అధిక దిగుబడినిచ్చే విత్తనాల రూపకల్పన, డిజిటల్ సేవలు, బ్యాంకింగ్, రవాణా, లాజిస్టిక్స్, కాలుష్య రహిత ఇంధనం వంటి రంగాలన్నింటినీ ఐదేళ్లలో పరస్పరం అనుసంధానించామని ఆయన వివరించారు. సహకార శాఖ చొరవ ఫలితంగా అనేక ఏళ్ల తర్వాత మొత్తం 9 జాతీయ స్థాయి సహకార సంఘాలు (వీటిలో మూడు కొత్తవి) ఏర్పడ్డాయని తెలిపారు. వీటి ద్వారా తొమ్మిది వేర్వేరు రంగాల్లో జాతీయ స్థాయి నుంచి గ్రామం దాకా సహకార వ్యవస్థ అనుసంధానమైందని చెప్పారు. ‘ఇఫ్కో, క్రిభ్‌కో, అమూల్, ఎన్‌డీడీబీ’ వంటి సంస్థలు సహకారోద్యమానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవి దేశానికి ఎంత గౌరవం సంపాదించి పెట్టిన తీరులోనే ఈ 9 జాతీయ సహకార సంస్థలు కూడా భవిష్యత్తులో భారీ అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా ఎదుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సహకార మంత్రిత్వ శాఖ ఐదేళ్ల పాలనలో 5 ప్రధాన మూలస్తంభాల కింద కార్యక్రమాలు చేపట్టామని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ మేరకు మొదట- సంస్థాగత సంస్కరణలు, సుపరిపాలన, పారదర్శకతను బలోపేతం చేశాం. ఈ దిశగా సహకార రంగం కోసం సమీకృత సమాచార నిధిని సిద్ధం చేశాం. తద్వారా ఇవాళ ప్రతి రాష్ట్రంలోని సహకార రిజిస్ట్రార్ వద్ద ఏ గ్రామంలో పీఏసీఎస్ లేదు.. ఎక్కడ పాడి సహకార సంఘం లేదు.. ఎక్కడ పట్టణ గృహ నిర్మాణ సంఘం లేదు.. వంటి సమాచారం అందుబాటులో ఉంది. ఈ లోపాలన్నింటినీ ఇప్పుడు గుర్తించి, వాటి ప్రాతిపదికన సహకార రంగం ముందుకెళ్తోంది. దీంతో 30 రంగాల్లోని 8,58,000 సహకార సంఘాలు, 32 కోట్ల మంది సభ్యులు ఇప్పుడు ఒకే డేటాబేస్‌లో అందుబాటులో ఉన్నారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అన్ని సహకార సంఘాల ఆడిట్ స్థితి, టర్నోవర్, ఏబీసీ గ్రేడింగ్ వగైరాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర సహకార రిజిస్ట్రార్లు ఈ సమాచార నిధి ద్వారా గ్రామీణ స్థాయిలోని డెయిరీలు, ‘పీఏసీఎస్’లు సహా సొసైటీలు, జిల్లా సహకార బ్యాంకులు, రాష్ట్ర డెయిరీలను ఉన్నతీకరించే వీలుందన్నారు. అలాగే, ప్రస్తుత లోపాలను సరిచేసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ ఏడాది సహకార సంస్థల కోసం ఒక ర్యాంకింగ్ చట్రాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. దీనిద్వారా ప్రతి రంగంలో అద్భుతంగా పనిచేస్తున్న తొలి 5 సహకార సంఘాలను గుర్తించి ర్యాంకులివ్వడం ద్వారా ఇతర సంస్థలకు స్ఫూర్తినిచ్చేలా వాటి ఆదర్శప్రాయ పనితీరును అందరూ ప్రముఖంగా ప్రస్తావిస్తారని, వాటికి మరింత ప్రోత్సాహం కూడా లభిస్తుందని ఆయన తెలిపారు.
దేశంలో సహకార వ్యవస్థ మొత్తాన్నీ మరింత పారదర్శకం, ప్రజాస్వామ్యయుతంగా మార్చే దిశగా బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం-2002కు 50 దాకా కీలక సవరణలు చేశామని కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వెల్లడించారు. ఈ సంస్థలపై అధ్యయనం సందర్భంగా- వాటి నాయకత్వం సహకార రంగంతో ముడిపడిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నప్పటికీ వాటి పరిపాలన, లావాదేవీలు వృత్తిగత నైపుణ్యంతో సాగుతున్నట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. ఈ విజయవంతమైన నమూనాను అనుసరించడంలో భాగంగానే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారు. సహకార రంగంలో నాయకత్వం, సంస్థాగత స్థిరత్వమే సదా ప్రశ్నార్థకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. అందుకే, ఇఫ్కో, క్రిభ్‌కో, అమూల్ వంటి విజయవంతమైన సహకార నమూనాలపై లోతైన అధ్యయనం నిర్వహించామని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని పాడి సహకార సంఘాలు విజయం సాధిచిన తీరుతోపాటు జాతీయ పాడి అభివృద్ధి మండలి ఇంత అద్భుతంగా పని చేయడంలోని వాస్తవాలను ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, పాడి, మార్కెటింగ్, వ్యవసాయం, ఎరువులు, ఇతర సహకార రంగాల కోసం సుశిక్షిత నిపుణులను త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం తయారు చేస్తుందన్నారు. వీరిని యోగ్యతల ఆధారంగా నియమించడం ద్వారా ప్రాథమిక సహకార సంఘాల నుంచి అత్యున్నత సంస్థల దాకా దశలవారీగా వృత్తిపరమైన నిర్వహణను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. తద్వారా నియామకాలలో పారదర్శకత పెరిగి, సామర్థ్యం మెరుగుపడటంతోపాటు నియామకాల్లో అవినీతికి సమర్థంగా అడ్డుకట్ట వేయగలమని వివరించారు. నియామకాలలో అవినీతిని రూపుమాపితే సహకార రంగంపై ప్రజల విశ్వాసం ఇనుమడిస్తుందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
పీఏసీఎస్‌ల బలోపేతం తాము తీసుకున్న రెండో చర్య అని శ్రీ అమిత్ షా అన్నారు. ‘‘ఒకప్పుడు పీఏసీఎస్‌లు అనేక రకాల కార్యకలాపాలు నిర్వహించేవి. క్రమంగా అవి స్థిర వడ్డీ రేట్లకు డబ్బును అప్పుగా ఇవ్వడం, వసూలు చేయడానికే పరిమితమయ్యాయి. దీనివల్ల వాటి లాభాలు తగ్గిపోయాయి. మేం పీఏసీఎస్‌ల కోసం నమూనా ఉప-నిబంధనలను రూపొందించాం. బెంగాల్ సహా యావత్ దేశం ఈ నమూనా ఉప-నిబంధనలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్‌లు ఇప్పుడు ఒకే నమూనా ఉప-నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఈ రోజు, 55,000 పీఏసీఎస్‌లు సీఎస్‌సీల ద్వారా గ్రామస్తులకు 300కు పైగా సేవలను అందిస్తున్నాయి. రైల్వే టిక్కెట్లు బుక్ చేయడం, జనన-మరణ నమోదులు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు దాఖలు చేయడం, చెల్లింపులు స్వీకరించడం వీటి ద్వారానే జరుగుతోంది. ఈ విధంగా, మేం 55,000 పీఏసీఎస్‌ల ద్వారా 300 విభిన్న కార్యకలాపాలతో సీఎస్‌సీ సేవలను అందిస్తున్నాం. 39,000 పీఏసీఎస్‌లు కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారాయి. 600కు పైగా పీఏసీఎస్‌లు జన ఔషధి కేంద్రాలుగా మారాయి. 75 పీఏసీఎస్‌లు పెట్రోల్, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. 118 పీఏసీఎస్‌లు నీటి సరఫరా పథకాలను నిర్వహిస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి వివరించారు. పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించడానికి భారత ప్రభుత్వం రూ. 3,000 కోట్లు ఖర్చు చేసిందని శ్రీ షా తెలిపారు. ఈ రోజు 50,000 పీఏసీఎస్‌లను ఇ-పీఏసీఎస్‌లుగా ప్రకటించడం, వాటి మొత్తం కార్యకలాపాలను ఎలక్ట్రానిక్ విధానంలో నిర్వహించడం గొప్ప విజయమని ఆయన అన్నారు. ఇ-పీఏసీఎస్‌ల ఆవిర్భావంతో, ఇ-ఆడిట్ భావన అమలు జరిగింది. జారీ చేసిన అలర్ట్‌లను పీఏసీఎస్ సమావేశాల్లో ఉంచడం ద్వారా పీఏసీఎస్‌ల మొత్తం పనితీరు పారదర్శకంగా మారుతుంది.
సహకార రంగంలో రుణ ప్రవాహాన్ని పెంచడం తాము చేపట్టిన మూడో ప్రధాన కార్యక్రమమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. సహకార బ్యాంకులను ఆధునిక బ్యాంకింగ్ సేవలతో అనుసంధానించాం. డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టాం. సైబర్ భద్రతనూ కల్పించాం. ఇ-కేవైసీని ప్రారంభించాం. డిజిటల్ రుణాల వంటి వ్యవస్థలతో మన పట్టణ సహకార బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు క్రమంగా ముందుకు సాగుతున్నాయి. గతంలో రూ. 19.6 లక్షల కోట్లుగా ఉన్న జిల్లా సహకార బ్యాంకుల మొత్తం వ్యాపార విలువ ప్రస్తుతం రూ. 25 లక్షల కోట్ల మార్కును దాటింది. ఇది ఒక ప్రధాన విజయం. గుజరాత్‌లో చేపట్టిన ‘సహకార సంఘాల మధ్య సహకారం’ ప్రయోగం కింద, ప్రతి సహకార సంఘం ఒక సహకార బ్యాంకులో ఖాతాను తెరిచిందని కేంద్ర మంత్రి వివరించారు.
గుజరాత్‌లో డెయిరీలు, ఏపీఎంసీలు, పీఏసీఎస్‌లు, అన్ని రకాల సహకార సంఘాలు సహకార బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం వల్ల జిల్లా సహకార బ్యాంకుల డిపాజిట్లూ పెరిగాయని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ ప్రయత్నాల వల్ల అనేక జిల్లా సహకార బ్యాంకులు లాభదాయకంగా మారాయి. పట్టణ సహకార బ్యాంకుల నికర లాభం దాదాపు రెట్టింపు అయింది. గత అయిదేళ్లలో, మేం ఈ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులను (స్థూల ఎన్‌పీఏ) 12.8 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించాం. నికర ఎన్‌పీఏను 5.1 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించడంలోనూ మేం విజయం సాధించాం. దీనివల్ల ప్రజల విశ్వాసం పెరిగింది. ఈ కార్యకలాపాలన్నింటినీ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకెళ్లడం ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. ఎన్‌సీడీసీ నికర ఎన్‌పీఏ నామమాత్రంగా మారింది. ప్రజలు ఏకమైనప్పుడు చాలా పెద్ద విజయాలు సాధించగలరనేది దేశ ప్రజలకు స్పష్టమైంది. సహకారాన్ని విమర్శించే వారికీ ఇది ఒక స్పష్టమైన సమాధానం. 2047 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు, మన సహకార ఉద్యమం సుసంపన్న భారత్ కోసం బలమైన పునాదిగా నిలుస్తుందని శ్రీ షా అన్నారు.
సహకార రంగానికి మార్కెట్ అనుసంధానాలనూ తాము బలోపేతం చేశామని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. ఎగుమతులు, సేంద్రీయ ఉత్పత్తుల కోసం మూడు కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేశాం. పాడి పరిశ్రమకు సంబంధించి క్షేత్రస్థాయిలో 100 శాతం సర్క్యులర్ ఎకానమీ అమలు కోసం మరో మూడు సహకార సంఘాలనూ ఏర్పాటు చేశాం. మేం ఉప్పు రంగంలోకీ ప్రవేశించాం. గతంలో రైతు పండించిన పంటలు గ్రామం నుంచి స్థానిక మండీ వరకు ప్రయాణించేవి. ఇప్పుడు, సహకారం ద్వారా రైతు పంటలు ప్రపంచం మొత్తానికీ చేరుతున్నాయి. విత్తనోత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘం మూడేళ్ల తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర విత్తనోత్పత్తి సంస్థగా మారుతుందని ఆయన అన్నారు. దీని ద్వారా రైతులకు స్వచ్ఛమైన, కల్తీలేని విత్తనాలు లభిస్తాయి. ఇది అధిక ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ విధాన ప్రణాళికలో భాగంగానే భారతీయ విత్తనాల పరిరక్షణకూ మేం ఏర్పాట్లు చేశాం. అరటి, బంగాళాదుంప రైతులకు సాంకేతికంగా అభివృద్ధి చెందిన విత్తనాలను అందించడానికి, మా సహకార సంఘాలు ప్రతి రాష్ట్రంలో కొత్త యూనిట్లను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా టిష్యూ కల్చర్ మొక్కలు, అధిక దిగుబడినిచ్చే, ఒకే పరిమాణంలో ఉండే బంగాళాదుంపలనందించే వంగడాలు రైతులకు చేరుతాయి. ప్రపంచ చిప్స్ వ్యాపారాన్ని భారత్‌కు తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ దిశగా గుజరాత్‌లోని బనాస్ డెయిరీ శుభారంభం చేసింది. మేం ఇదే నమూనాను ప్రతి రాష్ట్రానికీ తీసుకువెళ్లి, టిష్యూ కల్చర్, నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు అరటి, బొప్పాయి, బంగాళాదుంప విత్తనాలను అందించడానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు.
సేంద్రీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. మన 140 కోట్ల మంది పౌరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నాం. అందుకే, భారత రైతులు సేంద్రీయ ఉత్పత్తిని పెంచాలి. రసాయన ఎరువుల వాడకాన్ని ఆపివేస్తే ఉత్పత్తి తగ్గుతుందనే నమ్మకం ఒక అపోహ మాత్రమే. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం వల్ల ఉత్పత్తి తగ్గదనీ, పైగా ఉత్పత్తి పెరగడంతో పాటు నేలకూ రక్షణ లభిస్తుందని గత అయిదేళ్ల కాలంలో నిరూపితమైందన్నారు. మేం చక్కెర, పాడి రంగాల్లో 100 శాతం సర్క్యులర్ ఎకానమీని సాధిస్తున్నాం. దీని ద్వారా, డీఏపీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఎరువునూ ఉత్పత్తి చేయవచ్చు. ఈ దేశీయ ఎరువు డీఏపీ కంటే చవకగా, నాణ్యతలో మెరుగ్గా ఉండి, పొలాలకు ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో డీఏపీని వదిలి, ఈ కొత్త ఎరువును స్వీకరించి, అందరూ దీనిని వినియోగించాలని శ్రీ అమిత్ షా దేశ రైతులకు విజ్ఞప్తి చేశారు. సేంద్రీయ ఉత్పత్తుల కోసం ప్రపంచ మార్కెట్‌ను అన్వేషించడానికి మేం జాతీయ స్థాయి సహకార సంఘాన్ని ఏర్పాటు చేశాం. సహకార మార్కెట్ అనుసంధానాలను ప్రతి గ్రామానికీ తీసుకువెళ్ళడానికి, అన్ని రాష్ట్రాల్లో మార్కెటింగ్ సమాఖ్యలను బలోపేతం చేయడానికి మేం ప్రణాళికను సిద్ధం చేశామని శ్రీ షా వివరించారు. మేం చేపట్టిన అయిదో కార్యక్రమం... సుస్థిరమైన, సమర్థమైన వనరులు గల, నూతన సర్క్యులర్ ఎకానమీకి సంబంధించినది. మేం సహకారంలోని ప్రతి రంగంలోనూ సర్క్యులర్ ఎకానమీని అమలు చేయాలనుకుంటున్నాం. మేం పాడి పరిశ్రమతో దీనిని ప్రారంభించాం అని కేంద్ర హోంమంత్రి తెలిపారు.
‘అన్నదాత’ను ‘శక్తిప్రదాత’గా మార్చాలన్న మోదీజీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ రోజు ప్రారంభించిన గోమయ సహకార సంఘం లిమిటెడ్... పశువుల మేత, పశు ఆరోగ్యం, కృత్రిమ గర్భధారణ, పేడ నిర్వహణ, సేంద్రీయ ఎరువులు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా పాడి రంగంలో సంపూర్ణ సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తుందని తెలిపారు. శ్వేత విప్లవం 2.0 ద్వారా... సహకార పాడి పరిశ్రమల బలమైన నెట్‌వర్క్‌ను సృష్టించాలని మేం కోరుకుంటున్నాం. రాబోయే రెండేళ్లలో పాలు ఉత్పత్తి చేసే రైతుల సంఖ్యను కనీసం 35 శాతం పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నేను అన్ని రాష్ట్రాల పాడి సమాఖ్యలను కోరుతున్నాను. మరో 35 శాతం గ్రామాల్లో కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాడి సొసైటీలను స్థాపించాలి. పాల సరఫరా కోసం గ్రామంలోని ఏ రైతూ పాడి నెట్‌వర్క్‌కు వెలుపల ఉండకూడదని శ్రీ షా పేర్కొన్నారు. సహకార చక్కెర రంగంలో... మేం బెల్లం నుంచి చక్కెర, ఇథనాల్, బగాసే, ఇంధనం, ప్రెస్‌మడ్, సేంద్రీయ ఎరువు, సల్ఫర్ ఉత్పత్తి వరకు పూర్తి వ్యవస్థనూ అమలు చేశాం. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా సహకార సంఘాలనూ ఏర్పాటు చేశాం. క్లస్టర్ ఆధారిత సహకార సంఘాల ద్వారా, ప్రతి డెయిరీ సొంతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థ చెరకు తుది వినియోగం వరకు మొత్తం ప్రక్రియనూ చూసుకుంటుంది. చక్కెర మిల్లులకు లాభాలనూ అందిస్తుంది.
అధిక చెరకు ధరల చెల్లింపులపై పన్ను ఉపశమనం కల్పించి, పాత పన్ను వివాదాలను పరిష్కరించామని కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఒక్క చెరకు రంగంలోనే... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులకు రూ. 46,000 కోట్ల ఆదాయపు పన్నును మాఫీ చేశారన్నారు. యంత్రాల ఉత్పత్తి కోసం, జాతీయ భారీ ఇంజనీరింగ్ సహకార సంఘ పునరుద్ధరణ ప్రక్రియనూ ప్రారంభించామని శ్రీ షా తెలిపారు. ఈ సహకార సంఘం పాడి యంత్రాలు, ప్రాథమిక పాడి పరిశ్రమల యంత్రాలు, గ్యాస్ ఉత్పత్తి యంత్రాలు, ఎరువుల ఉత్పత్తి యంత్రాలను తయారు చేస్తూ ముందుకు సాగుతోంది. భారత్ టాక్సీ కార్యక్రమం చాలా బలంగా ముందుకు సాగుతోంది. రాబోయే రెండేళ్లలో, భారత్ టాక్సీ దేశంలోని 500కు పైగా నగరాలు సహా ప్రతి రాష్ట్రంలోనూ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ప్రజలను అనవసర దోపిడీ నుంచి విముక్తి చేస్తుందని శ్రీ షా తెలిపారు.
దాదాపు 20 శాతం వ్యవసాయ రుణం, 35 శాతం ఎరువుల పంపిణీ, 31 శాతం చక్కెర ఉత్పత్తి సహకార సంఘాల ద్వారానే జరుగుతున్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. భారత్ టాక్సీ తరహాలో, రాబోయే రోజుల్లో యుటిలిటీ అగ్రిగేటర్ కోఆపరేటివ్‌ను మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం. ఇఫ్కో-టోకియోతో కలిసి రెండు రకాల బీమా పథకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా, ఒక సహకార జీవిత బీమా కంపెనీని ఏర్పాటు చేయబోతున్నాం. ఇది బీమా రంగంలోనూ సహకారాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తుంది. గడిచిన అయిదేళ్లుగా ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి నెలా, ప్రతి ఏడాదీ సహకార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికే మేం అంకితమయ్యాం. మా మంత్రిత్వ శాఖ ఈ దిశగా అందరినీ కలుపుకొని అవిశ్రాంతంగా కృషిచేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో... సహకార రంగాన్ని ద్వితీయ శ్రేణిగా చూడటం ఇకపై ఆమోదయోగ్యం కాదని శ్రీ అమిత్ షా అన్నారు. దేశాన్ని సుసంపన్నం చేసే ఈ గొప్ప ప్రణాళికలో మేమంతా అందరితో సమానంగా భుజం భుజం కలిపి నిలబడతాం. మేం ఈ ప్రణాళికలో పూర్తిస్థాయిలో పాల్గొంటాం. ఈ రంగం ద్వారా పూర్తి లాభాన్ని, దానిపై న్యాయబద్ధమైన హక్కునూ రైతులు, పశుసంవర్ధక కార్మికులకు గౌరవప్రదంగా చేరేలా చూడటమే మా ప్రయత్నమని కేంద్ర మంత్రి తెలిపారు.
కార్యక్రమ ప్రారంభంలో... భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా హోం మంత్రి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తనలాంటి కోట్లాది మంది కార్యకర్తల జీవితాల్లో భారతీయత విలువలను, భరతమాత పట్ల గౌరవాన్నీ, భారతీయ సంస్కృతి ప్రాముఖ్యతనూ నెలకొల్పారని ఆయన అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకపోయి ఉంటే, ఈ రోజు కాశ్మీర్ భారత్‌లో భాగంగా ఉండేది కాదని ఆయన అన్నారు. ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు అధిపతులు, రెండు జెండాలు ఉండకూడదని చెప్పింది డాక్టర్ ముఖర్జీయే. ఆయన ఈ ఆశయం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా, దాని కోసం తన ప్రాణాలనూ త్యాగం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న డాక్టర్ ముఖర్జీ కలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెరవేర్చారని శ్రీ షా అన్నారు. ఒకవేళ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు లేకపోయి ఉంటే... అస్సాం పాకిస్తాన్‌లో భాగమై ఉండేదనీ, పశ్చిమ బెంగాల్‌లోని చాలా భాగం పాకిస్తాన్‌కు వెళ్లిపోయి ఉండేదని ఆయన పేర్కొన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఉద్యమం వల్లే నేడు అస్సాం, బెంగాల్ రాష్ట్రాలూ భారత్‌లో వైభవోపోతమైన ప్రాంతాలుగా నిలిచాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో... డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాలను గ్రామాల నుంచి ప్రతి పట్టణం, నగరం వరకూ అత్యంత వైభవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 135 ఆహార ధాన్యాల నిల్వ గోదాముల బదిలీ... 85 గోదాములను జాతికి అంకితం చేయడం... 47 గోదాములకు శంకుస్థాపన... అమూల్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా సహకార్ వన్‌కు భూమి పూజ... ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి, మహారాష్ట్రలోని జల్గావ్‌లో బీబీఎస్ఎస్ఎల్ టిష్యూ కల్చర్ కేంద్రాలకు భూమి పూజ... ఎన్‌సీడీ 3.0, జియో-ట్యాగ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం... ఎన్‌డీడీబీ పాల సరఫరా సమీక్ష డాష్‌బోర్డ్ పోర్టల్ ప్రారంభం... కోఆపరేటివ్ ఇన్‌పుట్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ మల్టీ-స్టేట్ లిమిటెడ్ కింద పాడి పశువుల ఉత్పాదకతకు సంబంధించిన కార్యక్రమాల ప్రారంభం వంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటిలో భాగంగా ఉన్నాయి. కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ మల్టీ-స్టేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం... గోమయ కోఆపరేటివ్ సొసైటీ మల్టీ-స్టేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం... ఎన్‌యూసీఎఫ్‌డీసీ రెండు ప్రధాన కార్యక్రమాలైన — కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ సహకార్ సీబీఎస్, పట్టణ సహకార బ్యాంకుల కోసం సంభాషణాత్మక ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫామ్ అయిన సహకార్ సహయోగి ఆవిష్కరణలూ జరిగాయి. ఈ కార్యక్రమంలో 50,000 పీఏసీఎస్‌లను ఇ-పీఏసీఎస్‌లుగా మార్చిన మైలురాయినీ గుర్తించారు. దీని ద్వారా క్షేత్రస్థాయి సహకార సంస్థల డిజిటల్ సాధికారత దిశగా కీలక ముందడుగు పడింది. విత్తన వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా, పాడి సహకార సంఘాల కోసం నమూనా ఉప-నియమాలను, గత అయిదేళ్లలో సహకార మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను గురించిన ఒక పుస్తకాన్నీ శ్రీ అమిత్ షా విడుదల చేశారు.
***
(रिलीज़ आईडी: 2281854)
आगंतुक पटल : 9