ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పీఎం అధ్యక్షతన 52వ ప్రగతి సమావేశం


నాలుగు రాష్ట్రాల్లోని రహదారులు, విద్యుత్, పారిశ్రామిక కారిడార్, మెట్రో రైలు రంగాలకు చెందిన సుమారు రూ.30,000 కోట్ల విలువైన నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన పీఎం

సమర్థవంతమైన ప్రణాళిక కోసం పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్‌ ప్లాన్‌ను వాడుకోవాలని.. ప్రాజెక్టులు, వినియోగ సేవలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్న పీఎం

పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, వాటి పురోగతిని పర్యవేక్షించాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన పీఎం

టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ను సమీక్షించిన పీఎం.. క్షయ నిర్మూలనకు ఏఐ సహా అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలను వినియోగించుకోవాలని పిలుపు

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులకు సంబంధించిన ఫిర్యాదులను సమీక్షించిన పీఎం.. సకాలంలో చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో స్పందించాలని, ఇ-జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు విధానాన్ని బలోపేతం చేయాలని స్పష్టం

నాడు పోస్టు చేయడమైనది: 24 JUN 2026 9:04PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్‌లో ఇవాళ 52వ ప్రగతి సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పాలనను వేగవంతం చేయటానికి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఐసీటీ సాంకేతికతతో ఏర్పాటు చేసిన బహుముఖ వేదికే ప్రగతి.

ఈ సమావేశంలో భాగంగా రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక కారిడార్, మెట్రో రైలు రంగాలకు చెందిన నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి సమీక్షించారు. నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.30,000 కోట్లు. ఆర్థికవృద్ధి, ప్రాంతీయ అనుసంధానత, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టులను.. కాలపరిమితి, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, సమస్యల పరిష్కారం, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయటం వంటి ప్రధాన అంశాలపై చర్చించారు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం వల్ల కేవలం నిర్మాణ వ్యయం పెరగటమే కాక.. ప్రజలు, పరిశ్రమలు సకాలంలో పొందాల్సిన ప్రయోజనాలకు దూరమవుతారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ఉన్నతాధికారుల స్థాయిలో ప్రాజెక్టుల పురోగతిని నిశితంగా పర్యవేక్షించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థవంతమైన ప్రణాళికతో, సకాలంలో పూర్తి చేసేందుకు పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను వినియోగించుకోవాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వివరాలు, వినియోగ సేవలు, మౌలిక సదుపాయాల వ్యవస్థలు, అనుమతులు, క్షేత్రస్థాయిలోని సమాచారాన్ని పోర్టల్‌లో క్రమం తప్పకుండా, సకాలంలో అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా ఈ వేదిక ఉండాలని, రాబోయే అడ్డంకులను ముందుగానే గుర్తించి, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచవచ్చని.. విశ్వసనీయ, తాజా సమాచారం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రధానమంత్రి వివరించారు.

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ పురోగతిని సమీక్షించిన ప్రధానమంత్రి.. క్షయ వ్యాధి నిర్మూలనకు ఏఐ సహా అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచటం, రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించటం, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఎన్‌సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లతో బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులకు సంబంధించిన ఫిర్యాదులను కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. డిజిటల్ వేదికల దుర్వినియోగం ద్వారా మోసాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో సంబంధిత దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో, వేగంగా, నిర్ణీత కాలపరిమితిలో స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధిత పౌరులను ఒక శాఖ నుంచి మరో శాఖకు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు తిప్పకూడదని ఆయన స్పష్టం చేశారు. ఏ సమస్యకు ఏ శాఖ బాధ్యత వహించాలనే దానిపై స్పష్టత ఉండాలని, వేగంగా స్పందించాలని చెప్పారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ వేదికల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.

సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవటం కీలకమని ప్రధానమంత్రి అన్నారు. నేరాల నివారణ, రిపోర్టింగ్, దర్యాప్తు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు. సైబర్ మోసాల కేసుల్లో వేగంగా నమోదు, తక్షణ స్పందన కోసం ఇ-జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు కృషి చేయాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2281450) సందర్శకుల సూచీ సంఖ్య : : 27