హోం మంత్రిత్వ శాఖ
బొగ్గు అక్రమ తవ్వకాలు, దొంగతనాలపై కేంద్ర మంత్రుల సమీక్ష
సమీక్ష నిర్వహించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా... బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
ధన్‌బాద్, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న బొగ్గు అక్రమ తవ్వకాలు, దొంగతనాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన హోంమంత్రి
ఇప్పటివరకు బొగ్గు మంత్రిత్వ శాఖ, సీఐఎస్ఎఫ్ తీసుకున్న చర్యలను అభినందించిన శ్రీ అమిత్ షా
అక్రమ మైనింగ్ ముప్పును అరికట్టడానికి ఇంకా చాలా చేయవలసి ఉందని వ్యాఖ్య
బొగ్గు అక్రమ తవ్వకాలు, అనధికార రవాణా అరికట్టేందుకు సమగ్రమైన, కాలపరిమితితో కూడిన ప్రతిస్పందన కోసం “జీరో కోల్ లీకేజ్ ప్లాన్” అమలు చేయాలని నిర్ణయం
సీఐఎస్ఎఫ్ మోహరింపు ప్రాధాన్య జాబితాలో బొగ్గు రంగాన్నీ చేర్చాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశం
సీఐఎస్ఎఫ్ సత్వర ప్రతిస్పందన బృందాల ఏర్పాటు సహా ప్రమాదకర ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లూ చేయాలని సూచన
సాంకేతికతను మరింత సమర్థంగా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన హోంమంత్రి
అక్రమ మైనింగ్‌కు పాల్పడే ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించడం కోసం సమీకృత కమాండ్-కంట్రోల్ కేంద్రాల్లో ఏర్పాటు చేసే హైరెజల్యూషన్ కెమెరాలను ఉపయోగించాలని సూచన
ప్రజా వనరులను, శాంతిభద్రతలను, చట్టబద్ధమైన బొగ్గు తవ్వకం కార్యకలాపాల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి
प्रविष्टि तिथि:
05 JUL 2026 7:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో బొగ్గు అక్రమ తవ్వకాలు, దొంగతనాల పరిస్థితిని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా... బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి సహా బొగ్గు మంత్రిత్వ శాఖ, సీఐఎస్ఎఫ్, కోల్ ఇండియా లిమిటెడ్, బీసీసీఎల్‌లకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ధన్‌బాద్, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న బొగ్గు అక్రమ తవ్వకాలు, దొంగతనాల పట్ల కేంద్ర హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2025 మొదటి వారంలో జరిగిన సమీక్ష తర్వాత అనేక పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు హోంమంత్రికి తెలియజేశారు. గనులు, ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957 కింద చర్యలు తీసుకునేందుకు సీఐఎస్ఎఫ్, కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులకు పూర్తి అధికారం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ అధికారం ద్వారా వారు కోర్టులో కేసులు దాఖలు చేయడం, అక్రమ బొగ్గు నిల్వ ఉన్నట్లు అనుమానించే ప్రాంగణాల్లోకి ప్రవేశించడం, సోదాలతో పాటు స్వాధీన కార్యకలాపాలూ నిర్వహించడం, అక్రమంగా తవ్విన ఖనిజాలు సహా అటువంటి అనధికార కార్యకలాపాల్లో ఉపయోగించే పనిముట్లు, పరికరాలు, వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటివి చట్టబద్ధంగా చేయగలరు. డిసెంబర్ 2025లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బొగ్గు రంగ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ, సీఐఎస్ఎఫ్ ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు. అక్రమ మైనింగ్ ముప్పును అరికట్టడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందనీ ఆయన స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్, బొగ్గు అనధికార రవాణాకు సమగ్రమైన, కాలపరిమితితో కూడిన ప్రతిస్పందన కోసం "జీరో కోల్ లీకేజ్ ప్లాన్"ను అమలు చేయడంతో పాటుగా, పలు కీలక ఆదేశాలను హోంమంత్రి జారీ చేశారు. ఎంఎండీఆర్ చట్టం కింద సీఐఎస్ఎఫ్, కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులకు సంపూర్ణ అధికారాలు కల్పించినప్పటికీ... ఆమోదించిన ప్రామాణిక కార్యాచరణ విధానానికి అనుగుణంగా ఈ అధికారాలను కఠినంగా, సమన్వయంతో అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని శ్రీ అమిత్ షా బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించారు. చట్టబద్ధంగా తవ్విన బొగ్గును మాత్రమే వినియోగదారులు ఉపయోగించేలా చూడటానికి, బొగ్గు అక్రమ రవాణాను నిరోధించడానికి జీఎస్టీ అధికారులనూ ఇందులో భాగస్వాములను చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రవాణా అవుతున్న మొత్తం బొగ్గుకు సంబంధించిన ఈ-వే బిల్లులను ధ్రువీకరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ అమిత్ షా సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో సిబ్బందిని తక్షణం మోహరించేందుకు వీలుగా, బొగ్గు రంగాన్ని సీఐఎస్ఎఫ్ మోహరింపు ప్రాధాన్య జాబితాలో చేర్చాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే అక్రమ గనుల తవ్వకందారులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా... ప్రమాదకర ప్రాంతాల్లో సత్వర ప్రతిస్పందన బృందాల ఏర్పాటు సహా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లూ చేయాలని ఆయన సీఐఎస్ఎఫ్‌ను ఆదేశించారు.
సాంకేతికతను మరింత సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్-కంట్రోల్ కేంద్రాల్లో ఏర్పాటు చేసే హై-రెజల్యూషన్ కెమెరాలను ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. ప్రజా వనరులను, శాంతిభద్రతలను, చట్టబద్ధమైన బొగ్గు గనుల తవ్వకం కార్యకలాపాల ప్రయోజనాలనూ పరిరక్షించడం కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2281444)
आगंतुक पटल : 7