వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉల్లి కొనుగోలు ధరను 13 శాతం పెంచి క్వింటాల్‌కు రూ. 2,125 చేసిన కేంద్రం... రైతులకు మెరుగైన లాభాలు, బఫర్ నిల్వలను బలోపేతం చేయడమే లక్ష్యం
प्रविष्टि तिथि:
04 JUL 2026 12:47PM by PIB Hyderabad
ధరల స్థిరీకరణ, బఫర్ నిల్వల కోసం సేకరించే ఉల్లిపాయల కొనుగోలు ధరను కేంద్ర ప్రభుత్వం 13 శాతం పెంచింది. దీని ప్రకారం గతంలో ఉన్న క్వింటాల్ ధర రూ. 1,875 నుంచి ఇప్పుడు రూ. 2,125కు పెరిగింది. ఈ సవరించిన కొత్త కొనుగోలు ధర 2026 జూలై 4 (నేటి) నుంచి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నాఫెడ్ (ఎన్‌ఏఎఫ్‌ఈడీ), ఎన్‌సీసీఎఫ్ సంస్థల ద్వారా ప్రభుత్వ బఫర్ నిల్వల కోసం ఉల్లి కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ ధరల పెంపు నిర్ణయం వల్ల ఉల్లి రైతులకు వారి పంటపై మెరుగైన లాభాలు అందడమే కాకుండా, ప్రభుత్వ బఫర్ నిల్వల సేకరణ ప్రయత్నాలకు మరింత ఊతం లభిస్తుంది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సరపు రెండో ముందస్తు అంచనాల ప్రకారం... దేశంలో ఉల్లి ఉత్పత్తి దాదాపు 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. ఇది గత ఏడాది (2024-25) నమోదైన 307.67 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో సమానంగా ఉంది. ఈ ఉత్పత్తి అంచనాల ప్రకారం ప్రస్తుత దశలో దేశంలో ఉల్లిపాయల లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే సాధారణ సీజన్ల వారీగా జరిగే మార్పుల మార్కెట్ ధోరణికి అనుగుణంగా ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశంలో ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో నిల్వలు సరిపడినంతగా ఉన్నాయి. నిల్వ ఉంచిన ఉల్లిపాయలకు ఎలాంటి కొరత లేదు.
దేశవ్యాప్తంగా రోజువారీ మార్కెట్లకు ఉల్లి రాక 50,000 మెట్రిక్ టన్నులకు పైగా బలంగా సాగుతోంది. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 30,000 మెట్రిక్ టన్నుల ఉల్లి మార్కెట్లకు వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో సగటు మోడల్ ధర కేజీకి సుమారుగా రూ. 18 రూపాయలుగా ఉంది. మెరుగైన నాణ్యత కలిగిన ఉల్లి నిల్వలు ఇంకా నిల్వ కేంద్రాలలోనే భద్రంగా ఉన్నాయి. వీటిని డిమాండు ఎక్కువగా ఉండే, సరఫరా తక్కువగా ఉండే కాలంలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటు రీటెయిల్ ధర కిలోకు రూ.31గా కొనసాగుతోంది.
కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల రాక ఆలస్యం కావడం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కొంతమంది వ్యాపారులు ముందస్తు అంచనాలతో కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రధాన వినియోగ కేంద్రాల్లో ప్రస్తుత ధరల వద్ద పెద్దగా డిమాండు ఏమీ కనిపించడం లేదు. వినియోగదారుల మార్కెట్లలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. నాసిక్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ఉత్పత్తి కేంద్రాలలో భవిష్యత్తులో మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాలతోనే ఈ విధమైన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో బలమైన డిమాండ్ వల్ల మాత్రం కాదు.
దేశం నుంచి ఉల్లి ఎగుమతులు ప్రస్తుతం సాధారణంగానే సాగుతున్నాయి. 2026 జూన్ నెలలో దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి ఎగుమతి అయింది. గల్ఫ్ దేశాలు, శ్రీలంక, సుదూర తూర్పు ఆసియా దేశాలు వంటి ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలలో పాకిస్తాన్, చైనా దేశాల నుంచి కొత్త పంట పోటీ ధరలకే లభిస్తుండటం వల్ల.. రాబోయే కొద్దిరోజుల పాటు భారత్ నుంచి ఉల్లి ఎగుమతుల వేగం స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్ ఉల్లి సాగు దాదాపు 15 రోజులు ఆలస్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోని చిత్రదుర్గ, చల్లకేరే ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు ఇప్పటివరకు సాధారణ విస్తీర్ణంలో సుమారు 60 శాతానికి చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2281250)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam