ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన
प्रविष्टि तिथि:
03 JUL 2026 8:42PM by PIB Hyderabad
ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, గౌరవ ఆంథోనీ అల్బనీస్ ఎంపీ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి 2026 జూలై 8-10 తేదీల్లో మెల్‌బోర్న్‌లో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి ప్రధానమంత్రి నేరుగా మెల్‌బోర్న్ చేరుకుని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్, గౌరవ సామ్ మోస్టిన్ ఏసీతో ప్రధానమంత్రి సమావేశమవుతారు. భారత్-ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులోనూ ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార నాయకుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలకు మూలస్తంభంగా నిలుస్తున్న ప్రవాస భారతీయుల భారీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు, భారత ప్రధానమంత్రి 2026 జూలై 10-11 తేదీల్లో న్యూజిలాండ్‌లో పర్యటిస్తారు. గత నాలుగు దశాబ్దాల్లో న్యూజిలాండ్‌లో భారత ప్రధానమంత్రి తొలి అధికారిక పర్యటన ఇదే కానుంది. మెల్‌బోర్న్ నుంచి ప్రధానమంత్రి నేరుగా ఆక్లాండ్ చేరుకుంటారు. ఆక్లాండ్‌లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. గత రెండేళ్లలో వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో గణనీయ పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అంశాలను సమీక్షిస్తారు. ఆక్లాండ్ పర్యటనలో భాగంగా, ప్రముఖ వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులతోనూ ప్రధానమంత్రి సమావేశమవుతారు. భారత్-న్యూజిలాండ్ ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనంగా, అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
***
(रिलीज़ आईडी: 2280962)
आगंतुक पटल : 13