వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఐకార్, సీషెల్స్ వ్యవసాయ శాఖ మధ్య కుదిరిన ఎంఓయూ
పర్యావరణ అనుకూల వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవనాలు, పశుసంవర్ధకం, కోత అనంతర నిర్వహణ, ఆహార భద్రతపై దృష్టి సారించనున్న ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక (2026-2031)
प्रविष्टि तिथि:
01 JUL 2026 5:02PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ (ఐకార్), సీషెల్స్ ప్రభుత్వానికి చెందిన ‘మత్స్య, వ్యవసాయం, నీలి ఆర్థిక వ్యవస్థ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ విభాగం’ పరస్పర ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఒక అవగాహన ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సీషెల్స్ దేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో ఉంది.
రెండు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధన, విద్య, సామర్థ్య పెంపు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థుల పరస్పర మార్పిడికి.. అధునాతన వ్యవసాయ సాంకేతికతలతో పాటు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఇది ఒక కార్యాచరణ చట్రాన్ని అందిస్తుంది.
ఈ ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికపై (2026-2031) కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రధానంగా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనాలు, కోత అనంతర నిర్వహణ, పశుసంవర్ధక అభివృద్ధి, సుస్థిర ఆహారం, పోషకాహార భద్రత వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది.
రెండు దేశాల మధ్య సంస్థాగత సంబంధాలను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడం, వాతావరణ మార్పులు- ఆహార భద్రత వంటి నూతన సవాళ్లను ఎదుర్కొంటూ సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటునందించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ భాగస్వామ్య సంస్థలతో 100 కంటే ఎక్కువ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన ఐకార్.. అంతర్జాతీయంగా భారతదేశ వ్యవసాయ భాగస్వామ్యాలను నిరంతరం విస్తరిస్తోంది. సీషెల్స్‌తో కుదిరిన ఈ ఒప్పందం గ్లోబల్ సౌత్‌తో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ సహకారం ద్వారా సుస్థిర వ్యవసాయం, ఆవిష్కరణలు, ప్రపంచ ఆహార- పోషకాహార భద్రతను పెంపొందించడంలో భారత నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2280139)
आगंतुक पटल : 12