గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 జులై 1 నుంచి అమలులోకి రానున్న వీబీ- జీ రామ్ జీ చట్టం; అర్హులైన గ్రామీణ కార్మికులెవ్వరూ ఒక్క రోజు కూడా పని దొరకకుండా ఉండకూడదు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడానికి కచ్చితంగా 125 రోజుల వేతన ఉపాధి: శివరాజ్ సింగ్ చౌహాన్

దేశవ్యాప్తంగా అంతరాయం లేని అమలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం

వీబీ- జీ రామ్ జీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలికంగా రూ. 95,692.31 కోట్ల నిధుల కేటాయింపు

प्रविष्टि तिथि: 30 JUN 2026 5:45PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జూలై 1, 2026 నుంచి ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) (వీబీ- జీ రామ్ జీ) చట్టం, 2025’ అమల్లోకి రానుంది. ఈ చట్టం గ్రామీణ ఉపాధి, జీవనోపాధి భద్రత, సుస్థిర గ్రామీణాభివృద్ధికి మరింత బలమైన చట్టబద్ధ వ్యవస్థను తీసుకురానుంది. దీని ద్వారా  అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రస్తుతం ఉన్న 100 రోజుల హామీ వేతన ఉపాధిని 125 రోజులకు పెంచుతూ చట్టబద్ధ హామీ కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యం ఇస్తూనే, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.

 

పథకం దేశవ్యాప్త అమలు సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అర్హులైన గ్రామీణ కార్మికులెవ్వరికీ ఒక్క రోజు కూడా పని దొరకకుండా ఉండకూడదని పేర్కొన్నారు. కొత్త వ్యవస్థ వైపు ఎటువంటి అంతరాయం లేకుండా మారడానికి వీలుగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అత్యంత సమన్వయంతో భారత ప్రభుత్వం అన్ని పరిపాలనా, ఆర్థిక, సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు.

"అర్హులైన గ్రామీణ కార్మికులందరికీ ఒక్క రోజు కూడా పని దొరకకుండా చూడటమే మా ప్రాధాన్యత. వీబీ- జీ రామ్ జీ చట్టం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తగిన ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచాం. అమలు వ్యవస్థలను పూర్తిగా సిద్ధం చేశాం. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి. 125 రోజుల ఉపాధి హామీ గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తుంది. శాశ్వత ప్రాతిపదికన సామాజిక ఆస్తులను సృష్టిస్తుంది, వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది" అని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.

పథకం దేశవ్యాప్త అమలును సులభతరం చేయడానికి, మొదటి రోజు నుండే ఎటువంటి అంతరాయం లేని నిర్వహణ, సకాలంలో వేతనాల చెల్లింపులు, కొత్త వ్యవస్థ వైపు సాఫీగా మార్పును నిర్ధారించేందుకు ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రస్తుతానికి రూ. 95,692.31 కోట్ల నిధులను కేటాయించింది. కొత్త నిబంధనల అమలులో ఏ రాష్ట్రం కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ నిధుల కేటాయింపు నిదర్శనం. 

కొత్త వ్యవస్థ వైపు సాఫీగా మారేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి. అలాగే కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డుల జారీ వరకు ప్రస్తుత ఈ-కేవైసీ ధృవీకృత జాబ్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయి. ఇది నిరంతర ఉపాధిని, సకాలంలో వేతనాల చెల్లింపులకు దోహదపడుతుంది. 

ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల మార్పు దిశలో గ్రామ పంచాయతీలను కేంద్రబిందువుగా ఉంచుతుంది. శాశ్వత ఆస్తుల సృష్టి, సహజ వనరుల నిర్వహణ, నీటి సంరక్షణ, వ్యవసాయం - అనుబంధ రంగాల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ద్వారా మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రధాన పథకాలతో సమన్వయం, సాంకేతికత ఆధారిత పారదర్శక పాలనకు ఇందులో అధిక ప్రాధాన్యం కల్పించారు. భాగస్వామ్య ప్రణాళిక, సమర్థవంతమైన అమలు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ భారత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

వీబీ- జీ రామ్ జీ చట్టం చట్టం అమలు భారత గ్రామీణాభివృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పునాదిగా స్వయంసమృద్ధ, సుస్థిర, సంపన్న గ్రామీణ సమాజాల నిర్మాణం పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

వీబీ- జీ రామ్ జీ చట్టం సమర్థవంతమైన అమలుకు రాష్ట్రాల నిబద్ధతను పునరుద్ఘాటించిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం

ఇటీవల ముగిసిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో, జులై 1 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్రాల సన్నద్ధతను అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి వివరించారు. ఇప్పటికే 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బడ్జెట్ కేటాయింపులు చేయగా, 24 రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులు  వీబీ- జీ రామ్ జీ రాష్ట్ర పథకాన్ని నోటిఫై చేశాయి.

జాతీయ స్థాయిలో జులై 2న ఆంధ్రప్రదేశ్‌లో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం 2025 ప్రారంభోత్సవం

వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం 2025 జాతీయ ప్రారంభోత్సవం 2026 జులై 2న ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లె మండలం లోని ముక్కవారిపల్లి గ్రామంలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మిషన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, శ్రీ కమలేష్ పాశ్వాన్‌లతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

ఈ కార్యక్రమం సందర్భంగా, లబ్ధిదారులైన కుటుంబాలకు గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులను అందచేస్తారు.  వీబీ- జీ రామ్ జీ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించడంతో పాటు ఈ మిషన్‌పై ఒక అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తారు.ఈ మిషన్‌కు సంబంధించిన సంపాదకీయ వ్యాసాల సంకలనాన్ని కూడా విడుదల చేయనున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2279618) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Tamil , Kannada , Malayalam