ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పదకొండేళ్లకు చేరువైన డిజిటల్ ఇండియా: కృత్రిమ మేధ.. సెమీకండక్టర్ తయారీ.. సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు.. చౌక డిజిటల్ అనుసంధానం ద్వారా భారత భవిష్యత్ సాంకేతికత ఆధారిత వృద్ధికి సారథ్యం
దేశవ్యాప్తంగా 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులలో ₹1.64 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. దేశంలో 3వ అతిపెద్ద ఎగుమతిదారుగా ఎలక్ట్రానిక్స్ రంగం
దేశ కృత్రిమ మేధ వ్యవస్థను 45,000కు పైగా ‘జీపీయూ’లతో బలోపేతం చేస్తున్న ఉమ్మడి కంప్యూటింగ్ సదుపాయం
సురక్షిత.. సార్వజనీన.. విశ్వసనీయ ‘ఏఐ’కి పాలనకు మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహం
సమర్థ డిజిటల్ ఇండియా ద్వారా అత్యంత బలమైన సంవత్సరాన్ని నమోదు చేసిన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ
అంకుర రంగంలో 23.36 లక్షలకు చేరిన ఉద్యోగాల సంఖ్య.. దాదాపు 50 శాతం సంస్థలలో కనీసం ఒక మహిళా
డైరెక్టర్ లేదా భాగస్వామి
प्रविष्टि तिथि:
27 JUN 2026 6:24PM by PIB Hyderabad
దేశాన్ని డిజిటల్ సాధికార సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే సంకల్పంతో 2015 జూలై 1న ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 సంవత్సరాల ప్రస్థానాన్ని త్వరలో పూర్తిచేసుకోనుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పరిణామాత్మక మార్పులు జనజీవనంలోని ప్రతి స్థాయిలో ప్రస్ఫుటమవుతోంది. ఈ మేరకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానిత పంచాయతీలలో, క్షణాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీల పొందుతున్న రైతులలో, స్మార్ట్‌ఫోన్లలో నాణ్యమైన విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే ఇంటర్నెట్ కనెక్షన్లు సుమారు 4 రెట్లు పెరిగాయి.. మొబైల్ డేటా ధర జీబీకి ₹269 నుంచి ₹8–10 స్థాయికి దిగివచ్చింది. దీంతో భారత్‌లో డిజిటల్ సౌలభ్యం ప్రపంచంలోనే అత్యంత చౌకైనదిగా రూపొందింది.
పదకొండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో డిజిటల్ ఇండియా నేడొక కీలక మలుపులో నిలిచింది. తొలి దశాబ్ద కాలంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్థిక సార్వజనీనత, పౌర సేవల ప్రదానానికి ఈ కార్యక్రమం పునాదులు వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సరికొత్త కృత్రిమ మేధ, సెమీకండక్టర్ తయారీ రంగాల్లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ‘వికసిత భారత్-2047’ స్వప్న సాకారం దిశగా భారత సాంకేతిక భవిష్యత్తును నిర్వచించడంలో ఈ రెండూ మూలాధారం కాబోతున్నాయి.
ఇండియాఏఐ మిషన్: స్వదేశీ కృత్రిమ మేధ వ్యవస్థకు రూపం
ఇండియాఏఐ మిషన్ ₹10,372 కోట్లకు పైగా వ్యయంతో ఆమోదం పొందిన నేపథ్యంలో గడచిన ఏడాదిలో గణనీయ ప్రగతి సాధించింది. ఈ క్రమంలో 45,000కు పైగా జీపీయూలతో ఒక ఉమ్మడి కంప్యూటింగ్ సదుపాయాన్ని ఏర్పరచడం ద్వారా దీనికి పునాది వేసింది. ఇది జాతీయ స్థాయిలో ఏఐ పరిశోధన-విస్తరణకు తగిన గణనాత్మక వెన్నెముకగా నిలుస్తుంది.
ఏఐ ఫౌండేషన్ మోడల్ విభాగం కింద స్పీచ్, టెక్స్ట్, విజన్ పద్ధతులలో 15 లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు, స్మాల్ లాంగ్వేజ్ మోడళ్లకు మద్దతు లభిస్తుంది. ఏఐ కోష్ వేదికలో ప్రస్తుతం 12,519కు పైగా డేటాసెట్లు, 307 ఏఐ మోడళ్లు, 20 టూల్‌కిట్లు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా గల పరిశోధకులకు, అంకురాలకు, ఇతరత్రా సంస్థలకు ఏఐ అభివృద్ధి వనరులను సార్వత్రికంగా అందుబాటులోకి తెస్తోంది. ఛాలెంజ్‌లు, హ్యాకథాన్‌లు, ఇన్-హౌస్ డెవలప్‌మెంట్ వగైరాల ద్వారా 12 రంగాల్లో 20 ఏఐ పరిష్కారాలు అమలులో ఉన్నాయి.
ఏఐ సామర్థ్యం మహానగర కేంద్రాలకు ఆవలిదాకా విస్తరించే వీలు కల్పిస్తూ 2, 3 అంచెల నగరాల్లో 27 డేటా-ఏఐ లేబొరేటరీలు ఏర్పాటయ్యాయి. విద్యార్థులకు 684 ఫెలోషిప్‌లు ప్రదానం చేయగా, యువ ఏఐ (YUVA AI) కోర్సు ద్వారా 84 లక్షల మంది అభ్యాసకులకు మద్దతు లభించింది. దేశవ్యాప్తంగా 18 ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటయ్యాయి. సామర్థ్య వికాసం దిశగా 20 భారత ఏఐ అంకుర సంస్థలకు చేయూత లభించింది. ఈ నేపథ్యంలో సురక్షిత, సార్వజనీన, విశ్వసనీయ ఏఐ రూపకల్పనలో ప్రభుత్వ నిబద్ధతను 2025 నవంబరు నాటి ఏఐ పాలన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
న్యూఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 ప్రపంచ ఏఐ రంగంలో భారత్‌ను విశిష్ట స్థానానికి చేర్చిన కీలక ఘట్టంగా నిలిచింది. ఈ సదస్సు 100కుపైగా దేశాలు, 20 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధి బృందాలను ఒకే వేదికపైకి తెచ్చింది. ప్రత్యక్ష-ఆన్‌లైన భాగస్వామ్యం ద్వారా దాదాపు 15 లక్షల మంది ఇందులో పాల్గొన్నారు. విశ్వసనీయ, అభివృద్ధి-ఆధారిత ఏఐపై భారత దార్శనికతకు విస్తృత అంతర్జాతీయ మద్దతును ప్రతిబింబిస్తూ- 92 దేశాలు, సంస్థలు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ కార్యక్రమం ఏఐ-సంబంధిత పెట్టుబడుల హామీలను 200 బిలియన్ డాలర్లకు పైగా స్థాయికి వేగంగా చేర్చింది. ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ గూడ్స్ కోసం విశ్వసనీయ ప్రపంచ సమన్వయకర్తగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసింది.
సెమీకండక్టర్ మిషన్: విధానం నుంచి ఉత్పత్తి స్థాయికి ప్రస్థానం
భారత సెమీకండక్టర్ వ్యవస్థ నేడు విధాన స్థాయి నుంచి నిర్ణయాత్మకం ఉత్పత్తి దశకు పురోగమించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద దాదాపు ₹1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో 12 తయారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. వీటిలో ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్, 2 కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, 9 ప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నాయి. సెమీకండక్టర్ పరికరాలు, ముడి పదార్థాలు, స్వదేశీ మేధో సంపత్తి సహా పటిష్ట సరఫరా వ్యవస్థలపై దృష్టి సారిస్తూ, 2026-27 కేంద్ర బడ్జెట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రకటించింది. చిప్ తయారీలో జాతీయ నిబద్ధత మరింత బలపడటాన్ని ఇది స్పష్టం చేసింది.
డిజైన్ రంగానికి సంబంధించి... డిజైన్ సంధానిత ప్రోత్సాహక పథకం కింద 24 ప్రాజెక్టులకు మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా 105 కంపెనీలు అధునాతన చిప్ డిజైన్ ఉపకరణాలతో సాయం పొందాయి. మరోవైపు ఆధునిక నోడ్‌లు సహా వివిధ ఫౌండ్రీలలో 23 డిజైన్ టేప్‌అవుట్‌లు పూర్తయ్యాయి. సెమీకండక్టర్ డిజైన్‌లో ఇనుమడిస్తున్న భారత్ పరిజ్ఞానాన్ని ఈ పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయి.
ఇక 48 దేశాలు, ప్రాంతాల నుంచి 350కి పైగా ప్రదర్శన కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చిన సెమికాన్ ఇండియా 2025లో, ప్రపంచ సెమీకండక్టర్ గమ్యంగా భారత్ ఆవిర్భవించడం బలమైన అంతర్జాతీయ ధ్రువీకరణకు నిదర్శనంగా నిలిచింది. ఈ మేరకు ప్రముఖ ప్రపంచ సెమీకండక్టర్ సీఈఓల భాగస్వామ్యం, భారత విధాన చట్రం, దీర్ఘకాలిక సెమీకండక్టర్ దార్శనికతపై పెరుగుతున్న అంతర్జాతీయ విశ్వాసాన్ని 13 అవగాహన ఒప్పందాలు చాటిచెప్పాయి.
ఎలక్ట్రానిక్స్ తయారీ: అంతర్జాతీయ స్థాయికి ఎదుగుదల
కృత్రిమ మేధ, సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడుల సమ్మేళనం భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం స్వరూపాన్ని ఇప్పటికే రూపాంతరీకరించింది. దీంతో ₹13 లక్షల కోట్ల విలువైన పరిశ్రమగా ఎలక్ట్రానిక్స్ రంగం ఎదగడంతోపాటు భారత మూడో అతిపెద్ద ఎగుమతి విభాగంగానూ ఆవిర్భవించింది. ఓ దశాబ్దం కిందట ఇలాంటి కీలక ఘట్టం ఒకటి ఆవిష్కృతం కాగలదన్న అంశం ఊహకూ అందనిదేనంటే అతిశయోక్తి లేదు. ఇక భారత్ ఇవాళ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఉంది. ఏఐ-సమర్థ డేటా సెంటర్ విడిభాగాలు, 5జీ పరికరాలు, అత్యాధునిక నెట్‌వర్కింగ్ పరికరాల సహిత అధునాతన తయారీ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. భారత్‌ను ప్రపంచ సాంకేతిక సరఫరా వ్యవస్థలతో అనుసంధానిస్తూ, దేశీయంగా భారీ ఉపాధిని ఇది సృష్టిస్తోంది.
‘యూపీఐ’కి దశాబ్దం పూర్తి: ప్రపంచ చెల్లింపుల రంగంలో భారత్ అగ్రస్థానం
భారత ఆర్థిక రంగం రూపురేఖలను ఆసాంతం మార్చేసిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)కు ఈ ఏడాది ఏప్రిల్‌తో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ వేదికపై 2025-26లో 24,162 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్‌లో 81 శాతం డిజిటల్ చెల్లింపులకు కీలకంగా మారిన ‘యూపీఐ’కి, నేడు ప్రపంచవ్యాప్త ప్రత్యక్ష లావాదేవీలలో దాదాపు 49 శాతం వాటా ఉంది. తద్వారా ప్రత్యక్ష చెల్లింపులలో భారత్‌ను తిరుగులేని రీతిలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టింది. ‘యూపీఐ’ నేడు అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. అలాగే భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం 23 దేశాలు సహకార ఒప్పందాల ద్వారా అధికారిక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు
గడచిన ఏడాది కాలంలో భారత్ డిజిటల్ వెన్నెముక మరింత బలపడింది. ఈ మేరకు 2026 మార్చి నాటికి బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య 106.58 కోట్లకు చేరింది. భారత్‌నెట్ 2.18 లక్షల పంచాయతీలను హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించింది. తద్వారా గ్రామీణ భారతంలోని చివరి అంచెదాకా డిజిటల్ సదుపాయాన్ని విస్తరిపంజేసింది. భారత 5జి నెట్‌వర్క్ ఇప్పుడు 99.9 శాతం జిల్లాలకు చేరగా, ఇప్పటికే 4.74 లక్షల టవర్లు ఏర్పాటయ్యాయి. ఇక 2026 ఫిబ్రవరిలో ఈశాన్య ప్రాంతం కోసం జాతీయ డేటా సెంటర్ గువహటిలో ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు చేరువ కావడం సహా డేటా స్వేచ్ఛను బలోపేతం చేసింది.
డిజిటల్ పాలన చట్రం బలోపేతం
భారత డిజిటల్ పాలన స్వరూపంలో గత సంవత్పరం నిర్ణయాత్మక ప్రగతి నమోదైంది. ఈ క్రమంలో 2025 జనవరి నాటి ముసాయిదా ద్వారా డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు, డేటా ఉల్లంఘనను నివేదించే యంత్రాంగాలు, డేటా పరిరక్షణ బోర్డు ఏర్పాటు సహా సమ్మతి ఆధారిత డేటా నిర్వహణ దిశగా పటిష్ట చట్రం ఏర్పాటైంది. అటుపైన 2025 ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహక-నియంత్రణ చట్టం 2026 మే 1న అమల్లోకి వచ్చింది. ఇక 2026 ఏప్రిల్‌లో ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఏర్పాటైంది. దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న డిజిటల్ రంగాలలో ఒకదానికి ఇది నిర్మాణాత్మక, సమతుల నియంత్రణ చట్రాన్ని సమకూర్చింది.
ఆవిష్కరణ - అంకురావరణ వ్యవస్థ
భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ మునుపెన్నడూలేని రీతిలో అత్యంత బలమైన సంవత్సరాన్ని నమోదు చేసింది. ఈ మేరకు పరిశ్రమల ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక్క 2025-26లోనే 55,200కు పైగా సంస్థలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం మొదలయ్యాక ఒకే ఏడాదిలో అత్యధిక సంఖ్యలో సంస్థలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా గుర్తింపు పొందిన అంకురాల ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 23.36 లక్షలకు చేరాయి. ఉద్యోగ కల్పనలో 36.1 శాతం వార్షిక పెరుగుదలను ఇది ప్రతిబింబిస్తుంది. గుర్తింపు పొందిన అన్ని సంస్థలకుగాను దాదాపు 48 శాతం అంకుర సంస్థలలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉన్నారు. భారత ఆవిష్కరణల రంగం వృద్ధిలో సార్వజనీన స్వభావాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
డిజిటల్ ఇండియా పదకొండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమం విస్తరణ- సరికొత్త ఆవిష్కరణల సమ్మేళనకు మరింతగా దోహదం చేస్తోంది. కోట్లాది పౌరులకు సేవా ప్రదానమే కాకుండా భవిష్యత్తరం ఏఐ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ సామర్థ్యం, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ వ్యవస్థకు రూపమిస్తోంది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ ర్యాంకింగ్ 2015లో భారత్ 81వ స్థానంలో ఉండగా, 2025లో 38వ స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 2,23,000 గుర్తింపు పొందిన అంకుర సంస్థలు ఆవిష్కరణాధారిత వృద్ధికి సారథ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11వ వార్షికోత్సవం ఓ కీలక ఘట్టంగానే కాకుండా రాబోయే దశాబ్దంలో ప్రపంచ సాంకేతిక నాయకత్వానికి భారత్ పునాదిగా మారనుంది.
***
(रिलीज़ आईडी: 2278573)
आगंतुक पटल : 6