వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందమిచ్చిన ఉత్తేజాన్ని సుస్థిర వ్యాపార సంబంధాలతో ముమ్మరం చేయాలి
పారిశ్రామికవేత్తలకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
భారత్-యూకే ఆర్థిక భాగస్వామ్యంపై 4 విజ్ఞాన నివేదికలను ఆవిష్కరించిన మంత్రి
प्रविष्टि तिथि:
27 JUN 2026 6:16PM by PIB Hyderabad
‘భారత్-యూకే: ప్రగతి భాగస్వాములు’ పేరిట లండన్‌లో నిర్వహించిన వాణిజ్య సదస్సుకు భారత వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ- భారత్-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం (సెటా) ద్వారా లభించే అవకాశాలను వాణిజ్య వృద్ధిని ముమ్మరం చేయడానికి ఉపకరణాలుగా మలచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత కంపెనీలు తమ యూకే భాగస్వాములతో నిరంతర సంబంధాలు నెరపాలని సూచించారు.
ఈ సదస్సులో రెండు దేశాల నుంచి ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం దిశగా ‘సెటా’ ఒక వినూత్న చట్రమని అని వారు హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, పటిష్ట సరఫరా వ్యవస్థలకు ఈ ఒప్పందం ఉత్తేజమిస్తుందని వారు పేర్కొన్నారు. అలాగే, భారత్-యూకే మధ్య ఆర్థిక సహకార విస్తృతికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేస్తుందని చర్చల సందర్భంగా అభిప్రాయపడ్డారు.
సదస్సులో ప్రధానంగా ‘సెటా’ సమర్థ అమలుపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి. ఈ ఒప్పందంపై ముఖ్యంగా ‘ఎంఎస్‌ఎంఈ’లలో మరింత అవగాహన కల్పించాలని ప్రతినిధులు చెప్పారు. అలాగే, నియంత్రణ విధానాలతోపాటు ధ్రువీకరణ అవసరాల సరళీకరణ, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాల బలోపేతం, ఒప్పందం ద్వారా ఒనగూడే అవకాశాలను వ్యాపారాలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రతిభావంతుల బదిలీ సౌలభ్యం తదితరాల ఆవశ్యకతను పరిశ్రమల ప్రతినిధులు ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పీయూష్ గోయల్ 4 విజ్ఞాన నివేదికలను ఆవిష్కరించారు. వీటిలో ఫిక్కి ప్రచురించిన ‘ది ఎవాల్వింగ్ ఇండియా–యూకే పార్టనర్‌షిప్’, సీఐఐ వారి ‘ఇండియన్ రూట్స్-బ్రిటిష్ సాయిల్: చార్టింగ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఫుట్‌ప్రింట్స్ ఇన్ ది యూకే-2026’, యూకేఐబీసీ–హెచ్‌ఎస్‌బీసీ యూకే–ఇండియా సెటా యుటిలైజేషన్ మాన్యువల్’, కేర్‌ఎడ్జ్ వారి ‘సావరిన్ రేటింగ్స్ – ఎ ఫ్రెష్ పర్స్పెక్టివ్’ ఉన్నాయి. ‘సెటా’ కింద అవకాశాలను సమర్థంగా వాడుకోవడానికి, వాణిజ్యరంగానికి అవగాహన-ఆచరణాత్మక మార్గదర్శకత్వం లక్ష్యంగా ఈ నివేదికలు రూపొందాయి.
ఈ సదస్సులో భాగంగా ఆరోగ్య సంరక్షణ, ఆధునిక తయారీ, కాలుష్య రహిత ఇంధనం, సైన్స్-టెక్నాలజీ, సేవలు, వినియోగ వస్తు రంగాల సంబంధిత రౌండ్‌టేబుల్ చర్చల సిఫారసులను పరిశ్రమ ప్రతినిధులు వివరించారు. ఆవిష్కరణ, పెట్టుబడి, బలమైన వ్యాపార భాగస్వామ్యాల ద్వారా ద్వైపాక్షిక సహకార విస్తరణకు గల అవకాశాలను ఈ సిఫారసులు ప్రధానంగా పేర్కొన్నాయి.
సదస్సు ముగిసిన తర్వాత భారత వ్యాపార ప్రతినిధి బృందంతో ఒక సంక్షిప్త పరస్పర గోష్ఠి కార్యక్రమాన్ని శ్రీ పీయూష్ గోయల్ నిర్వహించారు. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో రెండు రోజుల పాటు సాగిన వాణిజ్య సమావేశాలు సమాప్తమయ్యాయి. ప్రతినిధి బృందంలోని సభ్యులు తమతమ సమావేశాల ద్వారా గ్రహించిన కీలకాంశాలతోపాటు భవిష్యత్ భాగస్వాములతో సంభాషణలు. వివిధ రంగాల్లో తాము గుర్తించిన వ్యాపార అవకాశాల గురించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు.
భారత్-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందానికిగల బలమైన సామర్థ్యాన్ని ఈ సమావేశాలు పునరుద్ఘాటించాయి. అలాగే, దీన్ని విస్పష్ట వాణిజ్య, పెట్టుబడి మార్గంగా మలచడంలో రెండు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమల సంయుక్త నిబద్ధతను ప్రకటించాయి.
***
(रिलीज़ आईडी: 2278571)
आगंतुक पटल : 8