వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐస్‌లాండ్‌లో తొలి భారతీయ మామిడి పండ్ల ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన భారత రాయబార కార్యాలయం, ఏపీఈడీఏ


దశేరి, చౌసా, లంగ్రా, కేసర్ రకాలతో భారతీయ మామిడి పండ్ల అద్భుత వైవిధ్యభరిత ప్రదర్శన

प्रविष्टि तिथि: 26 JUN 2026 11:29AM by PIB Hyderabad

ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్‌లోని భారత రాయబార కార్యాలయం భాగస్వామ్యంలో వ్యవసాయం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) ఐస్‌లాండ్‌లో తొలిసారిగా భారతీయ మామిడి పండ్ల ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో భాగంగా 2026 జూన్ 24న రేక్‌జావిక్‌లో, జూన్ 25న ఉత్తర ఐస్‌లాండ్‌లోని అకురేరి నగరంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భారతీయ మామిడి పండ్లలోని అద్భుతమైన వైవిధ్యాన్ని, వాటి ఎగుమతి సామర్థ్యాన్ని ఈ కార్యక్రమాల ద్వారా అక్కడి వారికి చాటిచెప్పారు. ఐస్‌లాండ్ దేశంలో భారతీయ మామిడి పండ్ల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారి.

 

ఈ సందర్భంగా భారత రాయబారి ఆర్‌ రవీంద్ర మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ మామిడి రకాల ప్రత్యేకతలను, వాటి అద్భుతమైన రుచులను వివరించారు. ఐస్‌లాండ్ దేశానికి భారతీయ మామిడి పండ్ల ఎగుమతులను మరింత విస్తరించడానికి ఎంతో అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 

ఐస్‌లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య ఒప్పందాల డైరెక్టర్ శ్రీ స్వీన్ కే ఐనార్సన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌-ఈఎఫ్‌టీఏమధ్య కుదిరిన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా లభించే వ్యాపార అవకాశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌ నుంచి ఐస్‌లాండ్‌కు మరిన్ని మామిడి పండ్లను సులభంగా దిగుమతి చేసుకోవడానికి గొప్ప అవకాశం లభిస్తుందని  పేర్కొన్నారు.

 

ఐస్‌లాండ్ ట్రేడ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ ఓలాఫుర్ స్టీఫెన్సన్ మాట్లాడుతూ... ఐస్‌లాండ్ వ్యాపార వర్గాలలో భారత్‌ పట్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. భారత్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా మామిడి పండ్ల దిగుమతులను పెంచుకోవడానికి ఇరు దేశాల మధ్య అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో భారతదేశ మామిడి ఉత్పత్తిపై భారత రాయబార కార్యాలయ రెండో కార్యదర్శి సుశ్రీ అనీషా తోమర్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యధికంగా మామిడి పండ్లను పండించే దేశంగా భారత్‌ స్థానాన్ని ఆమె ప్రముఖంగా వివరించారు. నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు, ప్రపంచవ్యాప్త ప్రచారం ద్వారా మామిడి ఎగుమతులను పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ఆమె ఈ సందర్భంగా వివరించారు.

 

ఈ ప్రచార కార్యక్రమాలకు అక్కడి ప్రతినిధుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఐస్‌లాండ్‌కు చెందిన దిగుమతిదారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, ఐస్‌లాండ్ వ్యాపార ప్రముఖులు, ఐస్‌లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రదర్శనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఈ ప్రదర్శనకు విచ్చేసిన అతిథులకు భారత్‌కు చెందిన నాలుగు ఉత్తమమైన మామిడి రకాలైన దశేరి, చౌసా, లంగ్రా, కేసర్లను అందించారు. వీటి అద్భుతమైన రుచి, సువాసన, నాణ్యతను అక్కడి వారు ఎంతగానో ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి, భారత్-ఐస్‌లాండ్ మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి ఈ కార్యక్రమాలు ఒక విలువైన వేదికగా నిలిచాయి.

 

ప్రస్తుతం ఐస్‌లాండ్ దేశం తన మామిడి పండ్ల అవసరాల కోసం ప్రధానంగా థాయిలాండ్, బ్రెజిల్, కంబోడియా, ఘనా, పెరూ దేశాలపై ఆధారపడుతోంది. ప్రత్యామ్నాయ సరఫరాదారులు తక్కువగా ఉండటం వల్ల ఇప్పటివరకు ఆయా దేశాల మామిడి పండ్లు ఐస్‌లాండ్ మార్కెట్లో స్థానం సంపాదించాయి. ఐస్‌లాండ్ గత ఏడాది (2025)లో సుమారు 3.3 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మామిడి పండ్లను దిగుమతి చేసుకోగా, అందులో దాదాపు 1 మిలియన్ డాలర్ల విలువైన మామిడిని ఒక్క థాయిలాండ్ నుంచే దిగుమతి చేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా అక్కడి స్థానిక వినియోగదారులతో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు జరిపిన సంభాషణల్లో.. ఐస్‌లాండ్ ప్రజలకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా వాటిని స్మూతీలు, తీపి వంటకాలు (డెజర్ట్‌లు), పండ్ల సలాడ్లలో ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది. ఈ నేపథ్యంలోఅద్భుతమైన రుచి గల భారతీయ మామిడి పండ్లకు ఐస్‌లాండ్ మార్కెట్లో భవిష్యత్తులో చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

***


(रिलीज़ आईडी: 2278181) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam