పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గృహేతర ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాలను సంక్షోభానికి ముందున్న స్థాయికి పెంచటంతో పాటు రంగాల వారీగా విధించిన సరఫరా ఆంక్షల్ని తొలగించిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 25 JUN 2026 6:39PM by PIB Hyderabad

పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తూ గృహేతర ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాపై రంగాల వారీ ఉన్న ఆంక్షలన్నింటినీ ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాలను పునరుద్ధరించింది. సంక్షోభ ప్రారంభంలో నిలిపివేసిన బల్క్ ఎల్‌పీజీ సరఫరాను సంక్షోభానికి ముందు ఉన్న వినియోగంలో 50 శాతానికి పెంచారు. ఇది వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇటీవల ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచడానికి నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పెట్రోకెమికల్, ఇతర దిగువ స్థాయి పరిశ్రమల వినియోగిస్తున్న సీ3, సీ4 గ్యాస్‌ను మళ్లించి దానిని కేవలం ఎల్‌పీజీ ఉత్పత్తి కోసం మాత్రమే ఉపయోగించేలా నిబంధనలను విధించింది.

ప్రస్తుతం దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి పెరగడం, దిగుమతి చేసుకునే ఎల్‌పీజీ కార్గోల లభ్యత మెరుగవటంతో ఎల్‌పీజీ పూల్‌కు సీ3, సీ4 గ్యాస్ మళ్లింపును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎల్‌పీజీయేతర ఇతర అవసరాల కోసం సీ3, సీ4 గ్యాస్ కేటాయింపులను పెంచుతున్నప్పటికీ దేశీయ ఎల్‌పీజీ లభ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశీయంగా మొత్తం ఎల్‌పీజీ ఉత్పత్తి రోజుకు 40 టీఎంటీల కంటే తగ్గకుండా చూస్తూ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.

ఈ విధంగా అందుబాటులోకి వచ్చిన సీ3, సీ4 గ్యాస్‌ను పెట్రోకెమికల్, ఇతర కీలక రంగాలలోని వారికి సంస్థల వారీగా కేటాయించాలని, దీనిపై మంత్రిత్వ శాఖకు క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని మంత్రిత్వ శాఖ పరిధిలోని సీహెచ్‌టీని (సెంటర్ ఆఫ్ హై టెక్నాలజీ) ఆదేశించారు.

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు అంతరాయాలు ఏర్పడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ నిరంతరాయంగా లభించేలా చూడటానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగానే వాణిజ్య ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో విషయంలో సవాళ్లున్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) సమన్వయ ప్రయత్నాల వల్ల సరఫరా స్థిరంగా కొనసాగింది.

సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించడం, సరఫరా నిర్వహణను సులభతరం చేయడం కోసం వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ వినియోగదారుల సమగ్ర డేటాను అన్ని వేళలా నిర్వహించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ, కార్యాచరణ సమన్వయాన్ని బలోపేతం చేయడానికి అన్ని ఓఎంసీలలో ఒకే ఏకీకృత రంగాల వారీ డేటాబేస్ కూడా ఉండబోతుంది.

పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్టివిటీని విస్తరించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే పీఎన్‌జీకి మారిన వాణిజ్య, బల్క్ వినియోగదారులు పీఎన్‌జీనే వినియోగిస్తారు. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన ఎల్‌పీజీ వినియోగదారులు, పీఎన్‌జీకి మారే ప్రక్రియలో ఉన్నవారిని సీజీడీ (సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్) సంస్థల సమన్వయంతో క్రమంగా పీఎన్‌జీ వైపు మళ్లించనున్నారు.

సరఫరా విషయంలో చేసిన ఈ మార్పులను అనుసరించేలా చూడాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

ఈ నిర్ణయం దేశ ఇంధన అవసరాలను సమతుల్యం చేస్తూనే జాతీయ ఇంధన భద్రతను నిర్ధారించడంలో ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాయుతమైన విధానాన్ని తెలియజేస్తోంది. పర్యావరణహితమైన, సురక్షితమైన, మరింత సమర్థవంతమైన ఇంధనాల లభ్యతను విస్తరించాలనే ప్రభుత్వ నిరంతర నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2278173) సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam