ఉప రాష్ట్రపతి సచివాలయం
‘భారత్‌లో వీఐపీ సంస్కృతి: అధికారం, విశేషాధికారాలు, ప్రజాస్వామ్యానికి విఘాతం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
‘‘ప్రతి భారతీయుడూ ప్రత్యేకమే.. ప్రతి భారతీయుడూ వీఐపీనే’’... ప్రజలే కేంద్రంగా పరిపాలనపై ప్రధానమంత్రి ఆలోచన విధానాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి
నీట్ అభ్యర్థులకు అసౌకర్యం కలగొద్దని ప్రధాని వేచి ఉండడం - ‘ప్రజలే ప్రథమం’గా పరిపాలనకు నిదర్శనం: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
24 JUN 2026 5:35PM by PIB Hyderabad
‘భారత్‌లో వీఐపీ సంస్కృతి: అధికారం, విశేషాధికారాలు, ప్రజాస్వామ్యానికి విఘాతం’ అనే పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఈ రోజు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచయిత, అరుణాచల్ ప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ నబమ్ రేబియా, సహ రచయిత శ్రీ సందీప్ కుమార్ ఈ పుస్తకంలో విశ్లేషించిన ఈ అంశం.. భారత్‌లో ప్రజాస్వామ్య పాలన, ప్రజా జీవితాల మౌలిక స్వరూపాన్ని స్పృశించిందని పేర్కొన్నారు.
న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ పునాదులపై నిర్మితమైన సమాజాన్నే భారత రాజ్యాంగం ఆకాంక్షిస్తోందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రజలకూ, ప్రజల తరఫున అధికారాన్ని చేపట్టిన వారికీ మధ్య ఉండే సంబంధంపైనే ప్రజాస్వామ్య విజయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పదవులను ఒక ప్రత్యేక అధికారంగా కాకుండా, ఒక బాధ్యతగా భావించినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు.
మహోన్నత తమిళ కవి, తిరువళ్లువర్ సూక్తులను ఉటంకిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండడం, కరుణ, జవాబుదారీతనం నిజమైన నాయకత్వ లక్షణాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి పట్ల గౌరవభావంతో నడచుకునే నాయకులు.. జనం గుండెల్లో చెరగని స్థానాన్నీ, నిరంతర నమ్మకాన్నీ సంపాదించుకుంటారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పదవులను ఒక ప్రత్యేక అధికారంగా కాకుండా, ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన విధానానికి ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు అద్దం పడుతున్నాయని శ్రీ సి. పి. రాధాకృష్ణన్ అన్నారు. ప్రముఖుల వాహనాలకు ఉండే ఎర్ర బుగ్గలను తొలగిస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్నీ, అలాగే ఇటీవల నీట్ అభ్యర్థులకు ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయన కొద్దిసేపు వేచి ఉన్న విషయాన్నీ ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు ప్రజలే కేంద్రంగా సాగే పాలనకు నిదర్శనాలన్న ఆయన.. ప్రభుత్వ అధికారం ప్రజల సేవ కోసమేనన్న సూత్రాన్ని ఇవి మరింత బలపరుస్తాయన్నారు. ‘‘ప్రతి భారతీయుడూ ప్రత్యేకమైనవారే. ప్రతి భారతీయుడూ వీఐపీనే’’ అన్న ప్రధానమంత్రి మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘సేవే పరమ ధర్మం’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, ఇతర ప్రముఖుల నిరాడంబరతనూ, ప్రజా సేవా దృక్పథాన్నీ ఈ పుస్తకంలో ప్రస్తావించిన తీరును ఉపరాష్ట్రపతి అభినందించారు. ఉపనిషత్తులు, రామచరితమానస్, గౌతమ బుద్ధుడి బోధనలు, పంచతంత్రం వంటి భారత సాంస్కృతిక, మేధోపరమైన సంప్రదాయాలను ప్రస్తావిస్తూ.. రచయితలు తమ విశ్లేషణను మరింత సుసంపన్నం చేశారని ఆయన పేర్కొన్నారు.
భారత గణతంత్రానికి దిక్సూచిగా నిలిచే విలువలకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేననీ, ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడాలనీ స్పష్టం చేశారు. వినమ్రత, బాధ్యతాయుతమైన ప్రజా సేవ అత్యావశ్యకమన్నారు. ప్రజల్లో నమ్మకం, ప్రజాసేవలే నాయకత్వానికి అసలైన కొలమానాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నబామ్ టుకీ, మేఘాలయ మాజీ రాజ్యసభ సభ్యుడు శ్రీ డబ్ల్యూ. ఆర్. ఖార్లుఖి, రచయిత శ్రీ నబామ్ రేబియా, సహ రచయిత శ్రీ సందీప్ కుమార్ పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2277676)
आगंतुक पटल : 8