హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్ కొత్త ప్రధాన కార్యాలయ భవనానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన
సీఐఎస్‌ఎఫ్ కార్యకలాపాలు.. శిక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా ₹136 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దేశానికి అంకితం
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వం... హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది”
“భద్రత సంబంధిత కొత్త రంగాల్లో తన పటిమను సీఐఎస్‌ఎఫ్ ప్రదర్శించింది”
“సీఐఎస్‌ఎఫ్’ కొత్త ప్రధాన కార్యాలయ భవనం వారి పరిపాలన కార్యకలాపాలు.. వ్యూహాత్మక విధులకు కూడలిగా పనిచేస్తుంది”
प्रविष्टि तिथि:
22 JUN 2026 3:52PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని లోధి రోడ్‌లోగల ‘సీజీఓ’ ప్రాంగణంలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్) ప్రధాన కార్యాలయ కొత్త భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ నేడు శంకుస్థాపన చేశారు. అలాగే, ‘సీఐఎస్‌ఎఫ్’ కోసం నిర్మించిన సుమారు ₹136.03 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ తపన్ కుమార్ డేకా, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రవీర్ రంజన్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) సీనియర్ అధికారులు, సీపీడబ్ల్యూడీ, ఎస్‌బీఐ, అధికారులు సహా సీఐఎస్‌ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరళ్లు పాల్గొన్నారు.
సీఐఎస్‌ఎఫ్ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) సుమారు ₹75.78 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంది. ఇది సీఐఎస్‌ఎఫ్ పరిపాలన కార్యకలాపాలు, వ్యూహాత్మక విధుల ప్రధాన కూడలిగా పనిచేస్తుంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ 9 అంతస్తుల భవనంలో డైరెక్టర్ జనరల్ కార్యాలయం, బలగంలోని వివిధ విభాగాల కార్యాలయాలు, కంట్రోల్ రూమ్, సమావేశ గదులు, ఆడిటోరియం, గ్రంథాలయం, జిమ్నాసియం సహా ఇతర సదుపాయాలు ఉంటాయి.

ఈ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పూర్తయిన 3 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. వీటిలో... హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో ₹34.22 కోట్లతో నిర్మించిన సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్ (ఆదిత్య), హైదరాబాద్‌లోని ‘ఎన్‌ఐఎస్‌ఏ’లో ₹20.53 కోట్లతో నిర్మించిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ బిల్డింగ్ (అభ్యాస్), తమిళనాడులోని శివగంగై, అమరావతిపురంలో గల 4వ రిజర్వ్ బెటాలియన్‌లో ₹5.50 కోట్లతో నిర్మించిన సబార్డినేట్ ఆఫీసర్ల క్వార్టర్స్ ఉన్నాయి.
దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద విధి నిర్వహణలో మరణించిన ‘సీఐఎస్‌ఎఫ్’ సిబ్బంది కుటుంబాలకు రూ.1 కోటి ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థ ‘సంరక్షిత’, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త సహకారంతో ప్రత్యేకంగా రూపొందించిన మోటారు వీల్‌చైర్‌లను దళ సిబ్బంది దివ్యాంగ పిల్లలకు బహూకరించారు.
ఈ సందర్భంగా శ్రీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ- ‘సీఏపీఎఫ్’ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన, హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో బలగాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. వాటిలో ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’, ‘సీఏపీఎఫ్‌ఐఎంఎస్’ వంటి పథకాల ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యం, ‘సీఏపీఎఫ్’ ఇ-ఆవాస్ పోర్టల్ ద్వారా పారదర్శక గృహ కేటాయింపు, విధి నిర్వహణలో వైకల్యానికి గురైన సిబ్బంది గౌరవప్రదంగా, వృత్తిగత పురోగతితో, పూర్తి సేవా ప్రయోజనాలతో సేవలు కొనసాగించేలా కారుణ్య వైకల్య విధానం వంటివి ఉన్నాయని ఆయన వివరించారు. మానసిక ఆరోగ్య సహాయం కోసం ప్రాజెక్ట్ ‘మాన్’ వంటి కార్యక్రమాలను, కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భండార్ నెట్‌వర్క్ ద్వారా ఆర్థిక ఉపశమన చర్యలను చేపట్టడాన్ని శ్రీ సంజయ్ కుమార్ ప్రశంసించారు.

అనంతరం ‘సీఐఎస్ఎఫ్’ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రవీర్ రంజన్ ప్రసంగిస్తూ- భద్రత సవాళ్ల స్వరూపం నానాటికీ మారిపోతున్నదని గుర్తుచేశారు. కొత్తగా తలెత్తే ముప్పులను పసిగట్టి, నివారించడంలో దళం సంసిద్ధతను ఆయన వివరించారు. ఆధునిక భద్రత ముప్పులలో సైబర్ దాడులు, డిజిటల్ విధ్వంసం, డ్రోన్లు, ఇతర సాంకేతికత ఆధారిత ప్రమాదాలు వంటి హైబ్రిడ్ ప్రమాదాలు అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల ‘సీఐఎస్ఎఫ్’కు అనేక కొత్త బాధ్యతలు అప్పగించిందని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ నౌకా-ఓడరేవు సౌకర్యాల భద్రత (ఐఎస్‌పీఎస్) కోడ్ కింద సీఐఎస్ఎఫ్ గుర్తింపు పొందిన భద్రత సంస్థ (ఆర్‌ఎస్‌ఓ)గా నియమితమైందని చెప్పారు. ప్రధాన ఓడరేవుల భద్రత తనిఖీ-అంచనాలను చేపట్టడానికి, దేశంలో వర్ధమాన నీలి ఆర్థిక వ్యవస్థ భధ్రతకు ఇది దోహదం చేస్తుందని డైరెక్టర్ జనరల్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని అత్యంత భద్రతగల జైళ్లు, కారాగారాల భద్రత బాధ్యతలను తమ దళం స్వీకరించిందని తెలిపారు. అంతర్గత భద్రత నిర్వహణలో తమ దళం పాత్ర మరింత విస్తరిస్తున్నదని పేర్కొన్నారు.
సాంకేతికత ఆధారిత భద్రత పరిష్కారాలకు ప్రాధాన్యంతో డ్రోన్, యాంటీ-డ్రోన్ టెక్నాలజీ దిశగా ‘ఆర్టీసీ బెహ్రోర్’ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపొందిస్తున్నట్లు శ్రీ ప్రవీర్ రంజన్ తెలిపారు. శత్రు డ్రోన్ ముప్పు నుంచి కీలక మౌలిక సదుపాయాల రక్షణ కోసం ‘సీఐఎస్ఎఫ్’ను నోడల్ ఏజెన్సీగా నియమించారు. దీంతోపాటు ఐఐటీ-మద్రాస్ ప్రవర్తక్, గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, సి-డాక్ వంటి ప్రసిద్ధ సంస్థల సహకారంతో ప్రత్యేక సైబర్ భద్రత బృందాలకు శిక్షణ ఇప్పిస్తున్నారు.

తమ బలగాల్లో మహిళా సాధికారత వైపు కీలక చర్యగా హర్యానాలోని ‘నుహ్’ వద్ద 1,024 మంది సిబ్బందితో తొలి మహిళా సీఐఎస్‌ఎఫ్ రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ ఆమోదించినట్లు డైరెక్టర్ జనరల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దేశం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవానికి చేరువవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ సేవ, భద్రత, పురోగమనంపై బలగాల నిరంతర నిబద్ధతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2276774)
आगंतुक पटल : 12