ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 వేదికగా అలనాటి అద్భుత దృశ్యకావ్యం ‘అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్’: కలల ప్రపంచంలోకి మాయా ప్రయాణం” చిత్ర ప్రదర్శన
ముంబైలో జరుగుతున్న 19వ ‘ఎమ్ఐఎఫ్ఎఫ్ 2026’ వేదికగా అలనాటి అద్భుత దృశ్య కావ్యం, యానిమేటెడ్ చిత్రం ‘అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్’ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇది ఈ కార్యక్రమ వైవిధ్యానికి అద్భుత జ్ఞాపకాలు, సృజనాత్మకత, అద్భుతాలను జోడించింది. ఈ చిత్ర ప్రదర్శనతో ఈ అద్భుత కళాఖండాన్ని పెద్ద తెరపై అనుభూతి చెందే అరుదైన అవకాశం చిత్రోత్సవ ప్రేక్షకులకు లభించింది.
లూయిస్ కారోల్ రచించిన ప్రసిద్ధ నవల 'అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్‌ల్యాండ్' ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి దార్శనిక దర్శక త్రయం విల్‌ఫ్రెడ్ జాక్సన్, క్లైడ్ గెరోనిమి, హామిల్టన్ లస్కేలు దర్శకత్వం వహించారు. యానిమేషన్ పరంగా అలనాటి అద్భుత చిత్రాల్లో ఒకటిగా పరిగణించే ఈ చిత్రం... మంచి సాహిత్యాన్ని ఒక ఉత్సాహభరితమైన, వినోదాత్మక సినిమా అనుభవంగా ఎలా మార్చవచ్చో చూపిస్తుంది.
ప్రకాశవంతమైన, సంగీతమయమైన రంగుల కలల ప్రపంచం
లూయిస్ కారోల్ వాస్తవ రచన దాని చమత్కారమైన పద ప్రయోగాలు, విచిత్రమైన పాత్రలు, తాత్విక అంతరార్థాలతో ప్రసిద్ధి చెందినప్పటికీ... యానిమేషన్ ద్వారా రూపొందించిన రంగురంగుల దృశ్యాలు, ఉత్సాహభరితమైన కథనం, మదిలో నిలిచిపోయే మంచి సంగీతంతో వండర్‌ల్యాండ్ అద్భుత దృశ్య కావ్యంగా జీవం పోసుకుంది.
మాట్లాడే పువ్వులు, అల్లరి చేసే చెషైర్ పిల్లి, ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే తెల్ల కుందేలు, శక్తిమంతమైన క్వీన్ ఆఫ్ హార్ట్స్ నివసించే ఒక అద్భుత ప్రపంచంలోకి ఉత్సాహవంతురాలైన యువతి అలైస్ చేసే అసాధారణ సాహసయాత్రను ఈ చిత్రం చూపిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె, వాస్తవానికి, ఊహకు మధ్య ఉన్న గీతను చెరిపివేసే అనేక మరపురాని పాత్రలను, అనుభవాలను ఎదుర్కొంటుంది.
ఈ చిత్రంలో అత్యంత ప్రశంసలు పొందిన వాటిలో దాని మనోహరమైన సంగీతం ఒకటి. 'ది అన్‌బర్త్‌డే', 'గోల్డెన్ ఆఫ్టర్‌నూన్' వంటి మధురమైన పాటలు కథనంలో సజావుగా ఇమిడిపోయి, ఉల్లాసభరితమైన వండర్‌ల్యాండ్ స్ఫూర్తిని ఒడిసిపట్టి, దాని ఆహ్లాదకరమైన అవ్యక్తతను చిరస్మరణీయ సంగీత క్షణాలుగా మారుస్తాయి.
ఏడు దశాబ్దాల మాయాజాలపు వేడుక
తొలిసారిగా విడుదలై డెబ్బై ఏళ్లు దాటినా, 'అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఊహాశక్తిని, ఉత్సుకతను, కలలు అర్థవంతమైనవి కావడం కోసం తర్కాన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే భావననూ ఇది చాటిచెప్పడమే దీని శాశ్వత ఆకర్షణకు కారణం.
ఊహాశక్తికి రూపమిచ్చిన యానిమేషన్, ఉత్సాహభరితమైన పాత్రలు, వాస్తవమైనవిగా భ్రమింపజేసే దృశ్యాలతో... ఈ చిత్రం పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకునే అద్భుత కళాఖండంగా నిలిచిపోయింది. ఎమ్ఐఎఫ్ఎఫ్-2026లో దీని ప్రదర్శన... యానిమేటెడ్ కథనపు నిగూఢ శక్తిని, వాస్తవికతకు అతీతమైన ప్రపంచాలను అన్వేషించడంలోని ఆనందాన్ని గుర్తుచేసింది.
ఆస్కార్-విజేత లఘు చిత్రాల ప్రదర్శనలు, ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రరూపకర్తల మాస్టర్‌క్లాస్‌లు సహా ఇతర ప్రధాన ఉత్సవ విశేషాల తరువాత నిర్వహించిన 'అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్' ప్రదర్శన... సినిమా మాయాజాలం, సృజనాత్మకత, శాశ్వతమైన ఆకర్షణను చాటిచెబుతూ ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 ఉత్సవాన్ని మరింత సుసంపన్నం చేసింది.
***
रिलीज़ आईडी:
2275778
| Visitor Counter:
6