సాంకేతికత కథకునిగా మారితే: కథనంలో కొత్త మార్గాలను అందించిన ఎంఐఎఫ్ఎఫ్‌లో ఏఐ చిత్రాల ప్రదర్శన
యంత్రాల నుంచి ఊహల వరకు: ఎంఐఎఫ్ఎఫ్‌లో భవిష్యత్తు సినిమాలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన ఏఐ చిత్రాలు
‘‘ది ఏఐ ఫిలిమ్స్’’ విభాగం ద్వారా సినిమా ఆవిష్కరణల స్ఫూర్తిని 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) ప్రదర్శించింది. కథనం, సాంకేతిక పరిజ్ఞానం, ఊహాశక్తిల అద్భుత సమ్మేళనాన్ని ఆవిష్కరించింది. అలాగే శక్తిమంతమైన సృజనాత్మక సాధనంగా కృత్రిమ మేధ ఎలా పనిచేస్తుందో ఈ విభాగంలో పదర్శించిన సినిమాలు తెలియజేశాయి. ఇది చరిత్రను, పురాణాలను, వ్యక్తిగత జ్ఞాపకాలను, సినిమా పరిధిని అధిగమించిన సంక్లిష్టమైన కథలను అన్వేషించే వీలును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిలిం మేకర్లకు అందించింది.
చారిత్రాత్మక పోరాటాల కథలను చూపించినా, ప్రత్యేకమైన యానిమేషన్ శైలులను ఉపయోగించినా లేదా దర్శకుని ఆలోచనలను తరచి చూసినా.. మానవ సృజనాత్మకతను ఏఐ అందుకోలేదని ఈ సినిమాలు నిరూపించాయి. దానికి బదులుగా, సంప్రదాయ విధానాల్లో నిర్మించడానికి కష్టంగా ఉండే కథలను చెప్పేందుకు చిత్ర నిర్మాతలకు శక్తిమంతమైన నూతన సాధనంగా ఏఐ పనిచేస్తుంది.
దీపక్ విజయ్ దర్శకత్వం వహించిన "లెజెండ్స్ – ది ఎటర్నల్ ఫ్లేమ్ ఆఫ్ మేవార్" చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిలో ఆరావళి కొండల్లో ఒంటరిగా సంచరించే జానపద గాయకుడు... బప్పా రావల్ నుంచి మహారాణా ప్రతాప్ వరకు వరుసగా జరిగిన చారిత్రక గాథల గురించి పాడుతూ.. ఆత్మ గౌరవంతో నిర్వచితమైన రాజ్యం గురించి వర్ణిస్తారు.

లారెంట్ క్లిక్వెట్ తెరకెక్కించిన "ది స్క్రీన్‌రైటర్" చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది. రచయితకు ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఒత్తిడిని పరిశోధించే కథ ఇది. సృజనాత్మక ప్రక్రియలో ఎదురయ్యే మానసిక సంఘర్షణలను పరీక్షించడానికి ఒక నిర్దిష్టమైన కోణాన్ని దీనిలో అద్భుతంగా ఆవిష్కరించారు.

మలావీకి యూనిసెఫ్ చేపట్టిన ఓ పర్యటన ఆధారంగా ‘‘ది స్టార్ షెపర్డ్’’ చిత్రాన్ని షువాన్ లీ తెరకెక్కించారు. ఇది స్పర్శానుభూతిని కలిగించే ఫెల్ట్-యానిమేషన్ మ్యూజిక్ వీడియో. అపరిచిత వ్యక్తులను ప్రేమ ఎలా అనుసంధానిస్తుందో ఈ చిత్రం చాలా అందంగా చూపిస్తుంది.

పురాణాలను ఇష్టపడేవారి కోసం "కిష్కింధ: వానర కథ" అనే చిత్రాన్ని అక్షత్ వర్మ రూపొందించారు. వివిధ పురాణాలపై చేసిన పరిశోధనల ఆధారంగా ప్రాచీన వానర రాజ్యంలో జరిగిన ప్రధాన ఘర్షణలను, రాజకీయాలను, విషాదకరమైన ప్రయాణాలను ఈ చిత్రం అద్భుతంగా పునర్నిర్మించింది.
తాల్యా లోటన్ తెరకెక్కించిన ‘‘స్టోన్‌వాల్, ది మేకింగ్ ఆఫ్’’ చిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సివిల్ వార్ జనరల్‌కు సంబంధించిన ఒక అసంపూర్ణంగా మిగిలిపోయిన ఫీచర్ చిత్ర నిర్మాణాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఇంటర్వ్యూలు, సెట్లో చిత్రీకరించిన ఫుటేజీలను దీనిలో అద్భుతంగా మేళవించారు. దీనివల్ల తెర వెనుక రికార్డింగ్‌కు, తెరపై ఆవిష్కరించే చరిత్రకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా తొలగిపోతుంది.
కర్ష్ జవేరి దర్శకత్వం వహించిన "ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ డ్రీమ్స్" అనే లఘు చిత్రాన్ని కూడా ఈ విభాగంలో ప్రదర్శించారు. ఇది ప్రసిద్ధ సంప్రదాయ దర్శకులు.. అభివృద్ధి చెందుతున్న ఏఐ సృష్టికర్తలకు సవాలు విసిరే ఓ అద్భుతమైన పెయింటింగ్ లాంటి ప్రపంచాన్నిచూపించింది. దీని ద్వారా కళాత్మక సంప్రదాయానికి, సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య ఘర్షణను ఈ చిత్రం పరిశోధించింది. జర్మనీకి చెందిన మార్క్ వాక్‌హోల్జ్ దర్శకత్వం వహించిన "ది సినిమా దట్ నెవర్ వాజ్"... కాలగర్భంలో కలసిపోయిన లేదా పాడైపోయిన పాత స్క్రిప్టులు, రీళ్లు, చలనచిత్ర చరిత్ర జ్ఞాపకాలను జెనరేటివ్ ఏఐ విధానాల ద్వారా పునఃసృష్టించింది. రాజేష్ భాటియా, భరత్ అరోరా సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘‘ద ఎకో మోనాస్ట్రీ’’. లదాఖ్‌కు చెందిన మహిళ దుఃఖంతో నిండిన తన జ్ఞాపకాలను, శూన్యతను ఎదుర్కొనేందుకు పర్వత లోయల్లోకి సాగించిన ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. సమరేష్ శ్రీవాస్తవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం "ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా". ఏఐ సహాయంతో రూపొందించిన ఈ జీవిత చరిత్ర.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక ఉల్గులన్ తిరుగుబాటును పునరావిష్కరించింది. అలాగే స్థానిక గిరిజనుల పట్టుదలకు, పోరాట పటిమకు నివాళి అర్పించింది.
మొత్తంగా చూస్తే, ఈ చిత్రాలన్నీ ఎంఐఎఫ్ఎఫ్‌లో పాల్గొన్న చలనచిత్ర ప్రేమికులకు అంతర్జాతీయ సినిమా భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తెలియజేశాయి. సినిమాల్లో అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతిక పరిజ్ఞానం.. మానవీయ కథలకు జీవం పోస్తుందని నిరూపించాయి.
***
रिलीज़ आईडी:
2275712
| Visitor Counter:
5