MIFF banner

భారతీయ ఫోటోగ్రఫీ, శాస్త్రీయ సంగీత దిగ్గజాలకు డాక్యుమెంటరీల ప్రదర్శనలతో నివాళులర్పించిన ప్రదర్శించిన ఎంఐఎఫ్ఎఫ్ 2026

నివాళి విభాగంలో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ రఘు రాయ్, మృదంగ విద్వాంసుడు పాలఘాట్ రఘుపై చిత్రాల ప్రదర్శన

ముంబైలో జరుగుతున్న 19వ ‘ఎంఐఎఫ్ఎఫ్ 2026’లో నేడు హోమేజ్ (నివాళి) విభాగంలో భాగంగా ‘రఘు రాయ్:హియరింగ్ త్రూ ది ఐస్’. ‘తాళ అండ్ రిథమ్-మృదంగం ప్లేయ్డ్ బై పాలఘాట్ రఘు’ అనే రెండు ప్రశంసలు పొందిన డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించారు. ఫోటోగ్రఫీ, సినిమా, భారతీయ శాస్త్రీయ సంగీత రంగాలలో విశేష కృషి చేసిన దిగ్గజాలకు నివాళిగా ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

 

సువేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ‘రఘు రాయ్: హియరింగ్ త్రూ ది ఐస్’ డాక్యుమెంటరీ.. ప్రఖ్యాత భారతీయ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ జీవితం, ఆయన చేసిన కృషిపై ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించింది. ఆయన తీసిన అరుదైన ఫోటోలు, వ్యక్తిగత ఆలోచనల ద్వారా ఆయన సృజనాత్మక ప్రయాణాన్ని, ఆయన ఆలోచనా దృక్పథాన్ని మలచిన అనుభవాలను ఈ డాక్యుమెంటరీ చక్కగా ఆవిష్కరించింది. 1977లో ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్-బ్రెస్సన్.. రఘురాయ్ పేరును ప్రతిష్టాత్మక మాగ్నమ్ ఫోటోస్ సంస్థకు నామినేట్ చేయడం ఇక్కడ విశేషం.

 

ఫోటోగ్రఫీ రంగంలో రఘురాయ్ అవలంబించిన దర్శన్ అనే వినూత్న భావనను ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా ఆవిష్కరించింది. ఆయన ఉద్దేశంలో దర్శన్ అంటే మనం ఫోటో తీసే వ్యక్తి లేదా వస్తువుతో ఏర్పడే ఒక మానసిక, ఆధ్యాత్మిక బంధం. ఫోటోగ్రఫీ అంటే కేవలం చిత్రాలను కెమెరాలో బంధించడం మాత్రమే కాదు, మనుషులను, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడమేనని ఆయన వివరిస్తారు.

 

రఘురాయ్ తన కెరీర్‌లో డాక్యుమెంట్ చేసిన పలు ప్రధాన చారిత్రక సంఘటనలను ఈ చిత్రం మనకు గుర్తుచేస్తుంది. మదర్ థెరిసా వంటి గొప్ప వ్యక్తుల ఐకానిక్ ఫోటోలతో పాటు, దేశ సంస్కృతి, వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబించే వినాయక నిమజ్జనం, తాజ్ మహల్, నాగ సాధువుల అరుదైన చిత్రాలను ఈ డాక్యుమెంటరీలో ప్రదర్శించారు. ఇవి సామాన్య జనజీవన చిత్రణను కళ్ళకు కడతాయి.

 

ఈ చిత్రంలో రఘురాయ్ కుమార్తె, చలనచిత్ర దర్శకురాలు అవని రాయ్ కూడా కనిపిస్తారు. ఆమె కోణం ద్వారా కెమెరా వెనుక ఉన్న ఒక సాధారణ తండ్రి లేదా వ్యక్తి ఎలాంటివాడో ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇది రెండు వేర్వేరు తరాలకు చెందిన చిత్ర నిర్మాతల మధ్య ఆసక్తికరణమైన ఆసక్తికరమైన సంభాషణలా సాగింది.

 

సృజనాత్మకత గురించి రఘురాయ్ మాట్లాడుతూ.. కళాత్మక వ్యక్తీకరణలన్నింటినీ అనుసంధానించే ముఖ్యమైన సూత్రం ప్రేమేనని మాత్రమేనని పేర్కొన్నారు. ఒక ఫోటో దానంతట అదే మాట్లాడాలని ఆయన బలంగా నమ్ముతారు. ఒక అర్థవంతమైన క్షణంలో మనిషి  అంతర్గత, బాహ్య ప్రపంచాలు రెండు ఒకచోట కలవడమే ఒక పరిపూర్ణమైన చిత్రమని ఆయన అభివర్ణించారు. అలాగే యువ ఫోటోగ్రాఫర్లు ఎవరిని అనుకరించకుండా ఈ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక శైలిని, స్వంత గొంతుకను వెతుక్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

నేడు ప్రదర్శించిన రెండో చిత్రం ‘తాళ అండ్ రిథమ్-మృదంగం ప్లేయ్డ్ బై పాలఘాట్ రఘు’. ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా నిర్మించిన ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. కర్ణాటక సంగీతంలో అత్యంత పురాతనమైన, అతి ముఖ్యమైన తాళ వాయిద్యాలలో ఒకటైన మృదంగం ప్రాధాన్యతను, విశేషాలను ఈ డాక్యుమెంటరీ అన్వేషిస్తుంది.

 

ప్రముఖ మృదంగ వాయిద్య విద్వాంసులు పాలఘాట్ రఘు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. భారతీయ శాస్త్రీయ సంగీతంలోని తాళం, రిథం (లయ) ప్రాథమిక భావనలను చక్కగా వివరించింది. వివిధ ప్రదర్శనలు, ప్రాక్టికల్ డెమోల ద్వారా మన సంగీత సంప్రదాయానికి పునాదిగా నిలిచే తాళాలు, లయ చక్రాలు, స్వేచ్ఛా స్వరకల్పనల నిర్మాణాన్ని  ఈ చిత్రం ప్రేక్షకులకు పరిచయం చేసింది.

 

మృదంగం వాయించడంలో ఉండే రకరకాల సాంకేతిక మెళకువలను ఈ డాక్యుమెంటరీ అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా వేళ్ల కదలికలు, స్వర వైవిధ్యాలు, లయ నమూనాలను ఎలా ఉంటాయో వివరించింది. మృదంగ వాయిద్యంలో నైపుణ్యం సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, సృజనాత్మకత ఎంత అవసరమో ఈ చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది.

 

సంగీత సిద్ధాంతాల అన్వేషణతో పాటు గురువు నుంచి శిష్యునికి జ్ఞానం ఎలా బదిలీ అవుతుందో తెలిపే మన దేశపు గొప్ప మౌఖిక సంప్రదాయాన్ని ఈ చిత్రం ప్రత్యేకంగా చూపించింది. తరతరాలుగా భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన గురు-శిష్య బంధం  విశిష్టతను ఇది ప్రతిబింబించింది.

 

హోమేజ్(నివాళి) విభాగంలో ప్రదర్శించిన ఈ రెండు డాక్యుమెంటరీలు ప్రేక్షకులకు తమ తమ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహనీయుల జీవితాలు, కృషిని తెలుసుకునే అవకాశాన్ని కల్పించాయి. భారతీయ కళాత్మక, సాంస్కృతిక వారసత్వంపై మరింత లోతైన అవగాహనతో పాటు గౌరవాన్ని మరింత పెంపొందించాయి.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275427   |   Visitor Counter: 8