గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వీబీ-జీ రామ్ జీ పథకం అమలుకు మద్దతుగా 100 మందికి పైగా ప్రాంతీయ అధికారుల నియామకం
రాష్ట్రాలు, యూటీలకు సహాయం, సామర్థ్య పెంపుదల, కార్యలాపాలు సజావుగా సాగేందుకు చర్యలు
వీబీ-జీ రామ్ జీ అమలుకు ముమ్మర ఏర్పాట్లు, బడ్జెట్ నిధులు కేటాయించిన 27 రాష్ట్రాలు, యూటీలు.. రూ.95,692 కోట్లు కేటాయించిన కేంద్రం
प्रविष्टि तिथि:
19 JUN 2026 10:40AM by PIB Hyderabad
జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) చట్టం-2025కు మద్దతుగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాంతీయ అధికారులను నియమించింది. పథకం అమలు సులభతమయ్యేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహకరించేందుకు ఈ కీలక చర్యను చేపట్టింది.
అమలు ప్రక్రియను సులభతరం చేసేలా, సలహాదారులుగా ప్రాంతీయ అధికారులు సేవలందిస్తారు. స్థానిక సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు, అమలుకు మద్దతిచ్చేందుకు, జ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి, కార్యాచరణ సవాళ్ల పరిష్కారానికి, ఉత్తమ పద్ధతుల అవలంబన ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా విభాగంతో కలిసి వీరు పనిచేస్తారు.
ఇందుకోసం అధికారులను సన్నద్ధం చేయటానికి గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టానికి సంబంధించిన కీలక అంశాలు, అమలు విధానం, సంస్థాగత ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉన్న సహాయక వ్యవస్థల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన, జాయింట్ సెక్రటరీ శ్రీమతి రోహిణి ఆర్. భాజిభాకరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన చట్టం అమలుకు అవసరమైన అంశాలను అర్థం చేసుకునేందుకు, పరస్పర అనుభవాలు, ఉత్తమ విధానాలను పంచుకోవటాన్ని ప్రోత్సహించేందుకు, సామర్థ్య పెంపుదల ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు, కార్యాచరణకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా వ్యవస్థ, క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రాంతీయ అధికారులు సంప్రదింపులు జరుపుతారు. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు, సమర్థవంతమైన అమలుకు మద్దతిచ్చేందుకు ఈ అధికారులు సహకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని సజావుగా అమలు చేసేందుకు, సంస్థాగత సహాయాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
రాష్ట్రాలు, యూటీల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేసే సమయంలో సమన్వయాన్ని పెంపొందించటం, క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవటం, నిరంతరం సంస్థాగత మద్దతును అందించటం ద్వారా ప్రాంతీయ అధికారి కీలక పాత్ర పోషిస్తారు. ఇబ్బందులు లేకుండా, సజావుగా, సమర్థవంతంగా వీబీ-జీ రామ్ జీ వ్యవస్థ పనిచేయటంలో సహాయపడతారు.
హామీతో కూడిన వేతన ఉపాధిని జీవనోపాధి ప్రోత్సాహం, వాతావరణ స్థిరత్వం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక ఆధారిత పాలనతో అనుసంధానించటం ద్వారా వీబీ-జీ రామ్ జీ-2025 చట్టం.. గ్రామీణ ఉపాధిని స్థిరమైన, సమగ్ర గ్రామీణాభివృద్ధికి ప్రధాన సాధనంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు (వీజీపీపీలు), జీఐఎస్ ఆధారిత ప్రణాళికలు, వివిధ పథకాల సమన్వయం ద్వారా వికసిత్ భారత్-2047 దార్శనికతను ఈ చట్టం ముందుకు తీసుకెళ్తుంది.
దేశవ్యాప్తంగా సన్నద్ధతతో ఉండేలా మంత్రిత్వ శాఖ ఏకకాలంలో విస్తృతమైన ముందస్తు చర్యలను చేపట్టింది. వీటిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.95,692 కోట్ల తాత్కాలిక కేటాయింపుల ఆమోదం, డీబీటీ స్పర్శ్ వేదికలోకి అన్ని రాష్ట్రాలు, యూటీలను చేర్చటం, దాదాపు 93 శాతం క్రియాశీల కార్మికులకు ఈ-కేవైసీ పూర్తి చేయటం, ఫేస్ అథెంటికేషన్ హాజరు విధానాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావటం, ప్రత్యేక డిజిటల్ వేదికల అభివృద్ధి, పెద్దఎత్తున సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలున్నాయి.
ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలియజేస్తూ.. 27 రాష్ట్రాలు, యూటీలు ఈ చట్టం అమలుకు ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు చేశాయి. ఆరు రాష్ట్రాలు, యూటీలు వీబీ-జీ రామ్ జీ కార్యాచరణ ద్వారా రాష్ట్ర పథకాలను అధికారికంగా ప్రకటించాయి. మిగిలిన రాష్ట్రాలు, యూటీలు పథకాలను ఖరారు చేసే దశలో ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 2275210)
आगंतुक पटल : 12