ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాబిల్ సంస్థ అధునాతన తయారీ కేంద్రం, పూణేలో భారీగా ఉపాధి అవకాశాలను కల్పించే ఎగుమతి కేంద్రిత డేటా సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్


ప్రధానమంత్రి మేకిన్ ఇండియా ప్రణాళికతో ప్రధాన వృద్ధి చోదకంగా అవతరిస్తున్న ఏఐ డేటా సెంటర్లు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

प्रविष्टि तिथि: 18 JUN 2026 2:08PM by PIB Hyderabad

పూణే సమీపంలో ఉన్న రంజన్‌గావ్‌లో ప్రముఖ సంస్థ జాబిల్ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక తయారీ కేంద్రాన్ని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ 2026 జూన్ 17 బుధవారం ప్రారంభించారు.

సీనియర్ నేత శ్రీ దిలీప్ వాల్సె పాటిల్, యువనేత శ్రీ ధ్యానేశ్వర్ కాట్కే, జాబిల్ సర్క్యూట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీవోవో శ్రీ యాండీ ప్రీస్ట్లేతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు, కంపెనీ ప్రతినిధులు ఈ విశిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలన్నీ దేశంలోనే ఉండాల్సిన ఆవశ్యకత ఉందని, కృత్రిమ మేధ ప్రపంచ పురోగతికి ప్రధాన చోదక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ఏఐ డేటా కేంద్రాలు ప్రపంచ అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయని, ప్రధానమంత్రి మేకిన్ ఇండియా కార్యక్రమంలో దీనికి ప్రథమ ప్రాధాన్యం ఉందని, ఈ కేంద్రాలకు అవసరమైన ఎలక్ట్రిక్ విడిభాగాలన్నీ దేశీయంగానే తయారు కావాలన్నది దీని వెనుక ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ డేటా కేంద్రాలకు అవసరమైన విడిభాగాలను పూణేలో ఏర్పాటవుతున్న జాబిల్ సంస్థ తన అత్యాధునిక సాంకేతిక తయారీ కేంద్రంలో రూపొందిస్తుంది. తయారీ సామర్థ్యాన్ని క్రమేపీ పెంచుకుంటూ.. ఈ సంస్థ దేశీయ సాంకేతిక అవసరాలను తీరుస్తూనే, మరోవైపు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులకు కూడా శ్రీకారం చుడుతుంది.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్ తయారీని మూలాధారంగా మార్చాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని శ్రీ అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. నిర్దిష్ట లక్ష్యం దిశగా అమలు చేస్తున్న వివిధ పథకాల వల్ల.. భారత్ ఎగుమతుల్లో మూడో అతిపెద్ద రంగంగా ఎలక్ట్రానిక్స్ రంగం అవతరించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో కూడిన ఈ కొత్త వ్యవస్థతో.. స్థానిక సరఫరా వ్యవస్థలు సామాజికంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయి.

జాబిల్ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాలు

జాబిల్ కేంద్రం అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు దీని ప్రత్యేకత. సంక్లిష్టమైన కృత్రిమ మేధ వ్యవస్థలను (ఏఐ ఆధారిత డేటా సెంటర్ గియర్స్), 5జీ సాంకేతికత, అధిక సామర్థ్యం కలిగిన నెట్వర్కింగ్ గియర్లు, ఇండస్ట్రియల్ స్థాయి విద్యుత్ ఉపకరణాలు, వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పన సామర్థ్యం దీనికి ఉంది.

దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు దోహదపడేలా.. కొత్తగా ప్రారంభించిన ఈ అత్యాధునిక కేంద్రాన్ని విస్తృత స్థాయి తయారీ వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఒక వైపు విధానపరంగా ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటూ... ఈ సంస్థ 11వేల మంది స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంతోపాటు స్థానిక సరఫరా వ్యవస్థలు, ఎంఎస్ఎంఈలతో పూర్తిగా అనుసంధానించి దీనిని ఒక అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుతారు.

దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం – ముఖ్యాంశాలు:

గతాన్ని గుర్తుచేస్తూ.. ఎలక్ట్రానిక్స్ పరికరాలను తయారు చేయడం, ఎగుమతి చేయడం వంటి అంశాల్లో భారత్‌కు సామర్థ్యముందన్నది ఒకప్పుడు ఊహకు కూడా అందని విషయమని, తయారీ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా దేశం మారిందంటే అది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత  వల్లేనని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.

  • ఎలక్ట్రానిక్స్ రంగం విలువ: దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 13 లక్షల కోట్లకు పెరిగింది.
  • ఎగుమతుల్లో పెరుగుదల: పది అగ్రశ్రేణి ఎగుమతి రంగాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యం మొదట్లో ఉండేది. కాగా, ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగం క్రమంగా 9వ స్థానం నుంచి 7వ, 5వ, 4వ స్థానాలకు భారత్ ఎగబాకింది.
  • అగ్రశ్రేణి ఎగుమతి రంగం స్థాయి: గతేడాది (2025) దేశంలో మూడో అతిపెద్ద ఎగుమతి రంగంగా అధికారికంగా ఎలక్ట్రానిక్స్ నిలిచింది.
  • తదుపరి లక్ష్యం: ప్రక్రియలో నాణ్యతపై ప్రధానంగా దృష్టి సారిస్తూ దేశంలో రెండో అతిపెద్ద ఎగుమతి రంగంగా ఎలక్ట్రానిక్స్‌ను తీర్చిదిద్దే దిశగా.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామిక భాగస్వాములు, పెట్టుబడిదారులు, యువత తప్పక సమన్వయంతో కృషి చేయాలి.

ప్రతిభావంతులను ప్రోత్సహించడం, శిక్షణనైపుణ్యాల కల్పన, అధిక కచ్చితత్వం కలిగిన యాంత్రిక భాగాల తయారీకి అవసరమైన వ్యవస్థల కోసం పూర్తి ప్రభుత్వ పెట్టుబడిని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక సరఫరా వ్యవస్థలను భారీగా స్థానికీకరించడం కోసం.. లైటెన్ వంటి అధిక కచ్చితత్వం గల యాంత్రిక పరికరాల రూపకర్తలతో భాగస్వామ్యాలపై పరిశీలించాలని కూడా ఆయన సూచించారు.  

***


(रिलीज़ आईडी: 2274933) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada