ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 17 JUN 2026 6:07PM by PIB Hyderabad

అధ్యక్షులు మాక్రాన్‌ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!

జి7 కూటమికి అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా సార్వజనీన, సుస్థిర వృద్ధికి ఫ్రాన్స్‌ ప్రత్యేక ప్రాధాన్యమివ్వడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ప్రపంచం అనేక సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఈ వేదిక నుంచి వినిపించే సందేశం సమస్త మానవాళి సౌభాగ్యానికి, భవిష్యత్తుకు ఎంతో కీలకం.

మిత్రులారా!

వృద్ధికి సంబంధించిన ప్రశ్నలు నేడు జీడీపీ లేదా వాణిజ్య గణాంకాల పరిమితం కాదు...  ఈ వృద్ధి ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది... దీనివల్ల లబ్ధి పొందే వారెవరు.. భాగస్వాములు ఎవరు? అనేవే ఇక్కడ ప్రశ్నలు.

మిత్రులారా!

సమష్టి వృద్ధిని ఆకాంక్ష నుంచి వాస్తవ రూపంలోకి మార్చవచ్చని భారత ప్రగతి ప్రస్థాన  అనుభవం స్పష్టం చేస్తోంది. భారత్‌ పురోగమనమంటే మానవాళిలో ఆరో వంతు ఏకకాలంలో ముందడుగు వేయడమే. అందువల్ల, భారత వృద్ధి పయనం ఆర్థిక ప్రగతికి పరిమితమైనది కాదు... ఇది సార్వజనీనం, విస్తృతం, సమష్టి ప్రజాస్వామ్య సాధికారత  సంబంధిత విజయగాథ.

గత పన్నెండేళ్లుగా భారత్‌ “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” మార్గదర్శక సూత్రం ఆధారంగా పురోగమించింది. మన ప్రపంచ భాగస్వామ్యానికీ ఇదే తారకమంత్రం కాగలదు.

భారత్‌ జి20కి అధ్యక్షత వహించిన సమయంలో “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” సందేశాన్ని మనమంతా ప్రపంచంతో పంచుకున్నాం. ఇది కేవలం ఒక నినాదం కాదు... యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించే మా నాగరికతా స్ఫూర్తికి ఇదొక నిదర్శనం.

ఈ స్ఫూర్తితోనే మేం చారిత్రక ‘భారత్‌–పశ్చిమాసియా–ఐరోపా ఎకనమిక్ కారిడార్’కు శ్రీకారం చుట్టాం. ఇది ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాలను అనుసంధానిస్తుంది. అలాగే, భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేస్తూ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా పెట్టుబడి, ఉపాధి, ఆవిష్కరణలకు అపార అవకాశాలను సృష్టిస్తుంది. స్థానిక యాజమాన్యం, పారదర్శక ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక సుస్థిరత కోసం విస్పష్ట దార్శనికత వంటి అంశాలతో కూడిన ఇలాంటి కార్యక్రమాలను నేడు మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

మిత్రులారా!

పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా వ్యవస్థలకు కలిగిన అంతరాయాలు వర్ధమాన దేశాలపై మరికొంత కాలం గణనీయ ప్రభావం చూపుతూనే ఉంటాయి. అంతర్జాతీయ ఐక్యత బలోపేతానికి మనం నిజంగా కట్టుబడి ఉంటే, ఈ సంక్షోభ భారాన్ని అత్యంత బలహీన దేశాలపై పడకుండా చూడటం అవసరం.

మన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇలాంటి ఒడుదొడుకులను తట్టుకుని, ఆర్థిక పునరుత్థాన సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడానికి సాయపడగల యంత్రాంగాలను రూపొందించాలి.

మిత్రులారా!

ఈ నేపథ్యంలో ‘ఐఎంఈసీ’ దృక్కోణం నుంచి స్ఫూర్తితో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప ప్రాంత దేశాలతో అనుసంధాన ప్రాజెక్టులపై మనం సమష్టిగా కృషి చేయవచ్చు.

జి7 దేశాల మూలధనాన్ని, భారత ప్రతిభను, వర్ధమాన దేశాల నిర్వహణ సామర్థ్యాన్ని ఒకే వేదికపైకి చేర్చడం ద్వారా, మనం అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని వేగిరపరచవచ్చు. సమీకృత అంతర్జాతీయ భాగస్వామ్యం దిశగా పరిశీలన చేపట్టవచ్చు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం సహా అవకాశాలను ఏకీకృతం చేసే కారిడార్ల సృష్టి దీని లక్ష్యం కావాలి.

మిత్రులారా!

అభివృద్ధి చెందిన దేశాలు నేడు వృద్ధాప్య సమూహాల సవాలును ఎదుర్కొంటుండగా, భారత్‌ సహా వర్ధమాన దేశాల్లో యువ ప్రతిభ, వ్యవస్థాపన, నైపుణ్యాల పరంగా అపార  సామర్థ్యం తొణికిసలాడుతున్నాయి.

ఈ సహజ పరస్పర పూరక సానుకూలత సద్వినియోగం దిశగా మనం అంతర్జాతీయ నైపుణ్య భాగస్వామ్యాల ఏర్పాటుపై పరిశీలన చేపట్టవచ్చు. ఈ చట్రం కింద నైపుణ్యాల గుర్తింపు, విశ్వసనీయ నైపుణ్య ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడంపై సమష్టిగా కృషి చేయవచ్చు.

మిత్రులారా!

మానవాళి సమష్టి సౌభాగ్యంపై భారత్‌ నిబద్ధత మాటలకు పరిమితం కాదు.. అది మన చేతలలోనూ ప్రతిబింబించాలి. కొన్నేళ్లుగా ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా దేశాలతో భారత్‌ ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.

భారత్‌ విచ్ఛిన్నతను విశ్వసించదు... ఏకీకరణను ఆకాంక్షిస్తుంది. సంరక్షణవాదంపై కాదు.. భాగస్వామ్యంపై నమ్మకం ఉంచుతుంది. అనిశ్చితిని కాదు... సమష్టి సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తుంది. సర్వదేశాల శ్రేయస్సుపై భారత్‌ ఆశాభావాన్ని ఇవన్నీ ప్రతిబింబిస్తాయి.

భవిష్యత్తులో మన సమష్టి ఆర్థిక పునరుత్థాన సామర్థ్య బలోపేతానికి, మరింత సుస్థిర, విశ్వసనీయ, సుసంపన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో అన్ని దేశాలతో భుజం కలిపి పనిచేయడానికి భారత్‌ సదా సిద్ధంగా ఉంటుంది.

అనేకానేక ధన్యవాదాలు...

 

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే

***


(रिलीज़ आईडी: 2274511) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Manipuri , Urdu , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam