లడఖ్ నుంచి ప్రపంచ వేదికపైకి: ఎంఐఎఫ్ఎఫ్ 2026లో సమ్మిళిత సినిమా శక్తిని చాటిచెప్పిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు
ప్రతి చిన్నారి స్వరంగా సినిమా నిలవాలి: శ్వేతా పరాఖ్, జితేంద్ర మిశ్రా
పత్రికా సమాచార కార్యాలయం (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ),19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 2026 సందర్భంగా ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అవగాహనను పెంపొందించడానికి, వైవిధ్యాన్ని గౌరవించటానికి, ఇప్పటివరకు సమాజంలో వినపడని గొంతుకలను ప్రపంచానికి వినిపించడానికి సినిమాకు ఉన్న శక్తి మరోసారి ప్రధానంగా చర్చకు వచ్చింది.
‘నాయాబ్ - త్రూ ది టీచర్స్ లెన్స్' అనే డాక్యుమెంటరీతో పాటు 'సోనా ఔర్ సోనమ్ కే సప్నే' (లిటిల్ బిగ్ డ్రీమ్స్) అనే లఘు చిత్రానికి చెందిన దర్శకులు, విద్యావేత్తలు, నిర్మాతలు మాట్లాడుతూ, సినిమా ప్రతి బిడ్డను సాధికారత వైపు నడిపించే ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
చలనచిత్ర దర్శకురాలు శ్వేతా పరాఖ్, విద్యావేత్, ప్రాజెక్ట్ మెంటర్ స్వాతి పోపట్ వాట్స్, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, ప్రాజెక్ట్ మెంటర్ పథిక్ వాట్స్, జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత జితేంద్ర మిశ్రా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్యానెలిస్ట్ సభ్యులు ఆయా చిత్రాల నిర్మాణ విశేషాలతో పాటు, పిల్లల్లో సమ్మిళిత తత్వాన్ని, సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కథల ఎంపిక, వాటిని చెప్పే విధానం ఎలాంటి పాత్ర పోషిస్తాయనే విషయాలపై తమ ఆలోచనలను పంచుకున్నారు.
సమస్య మూలాల నుంచి వచ్చే కథల ప్రాముఖ్యత గురించి 'నాయాబ్ - త్రూ ది టీచర్స్ లెన్స్' చిత్ర దర్శకురాలు శ్వేతా పరాఖ్ మాట్లాడుతూ, పిల్లలు తమ చుట్టూ ఉండే వాస్తవ పరిస్థితులను తెరపై చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. స్థానిక సంస్కృతులలో పాతుకుపోయిన కథలు పిల్లలు తమ స్వంత గుర్తింపు, సంప్రదాయాలు, సమాజాలతో మమేకమవడానికి సహాయపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటువంటి కథలు పిల్లలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, పరస్పర సంభాషణలు జరపడానికి అర్థవంతమైన వేదికలను కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు.
సమ్మిళితతత్వం ప్రాముఖ్యతను స్వాతి పోపట్ వాట్స్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సమాజం ముద్రలు వేసే స్థాయిని దాటి పిల్లలందరిలో ఉండే ఉమ్మడి ఆకాంక్షలను, భావోద్వేగాలను, వారిలోని ప్రతిభను గుర్తించాలని అన్నారు. 'సోనా ఔర్ సోనమ్ కే సప్నే' (లిటిల్ బిగ్ డ్రీమ్స్) చిత్రంలోని ప్రధాన పాత్రను గుర్తు చేసుకుంటూ, ఆ బాలిక కేవలం విద్యను లేదా స్వేచ్ఛను మాత్రమే కోరుకోలేదని, నిజానికి తను "జీవితాన్ని వేటాడుతోంది" అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పదం ఆ చిత్రం అందించే లోతైన మానవీయ, ఆశాజనకమైన సందేశాన్ని అద్భుతంగా చూపుతుందని ఆమె పేర్కొన్నారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డు గ్రహీత, చలనచిత్ర దర్శకుడు పథిక్ వాట్స్ మాట్లాడుతూ, సినిమా ఒక శక్తివంతమైన విద్యా సాధనంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో స్పష్టం చేశారు. సినిమాలు కేవలం వినోదాన్ని పంచడానికే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. సినిమాను ఒక రకమైన ఆచరణాత్మక అభ్యాసంగా అభివర్ణిస్తూ, ఇది ప్రజల్లో సానుభూతిని పెంపొందించడానికి, వారి దృక్పథాలను విస్తృతం చేయడానికి, సామాజిక వైఖరులను తీర్చిదిద్దడానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు.
జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత జితేంద్ర మిశ్రా తన ‘సోనా ఔర్ సోనమ్ కే సప్నే' (లిటిల్ బిగ్ డ్రీమ్స్) చిత్రం ప్రయాణాన్ని పంచుకుంటూ, స్థానిక కథలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ చలనచిత్ర నిర్మాణ ప్రయాణంలో పిల్లలు స్వయంగా ఎంతో చురుగ్గా పాల్గొన్నారని ఆయన తెలిపారు. వారు కేవలం నటీనటులుగానే కాకుండా, కథకులుగా, సృష్టికర్తలుగా కూడా తమ వంతు సహకారాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు.
స్థానిక సంస్కృతులలో ముడిపడి ఉన్న కథనాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సైతం అలరించే, వారి హృదయాలను కదిలించే శక్తి ఉంటుందని మిశ్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన తర్వాత, ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల నుంచి నుండి ఆహ్వానాలను అందుకుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే నెలల్లో ఈ చిత్రాన్ని మరికొన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి షెడ్యూల్ ఖరారైందని ఆయన తెలియజేశారు.
ఈ చర్చ రెండు చిత్రాలలోనూ ప్రతిబింబించే ఒక ఉమ్మడి అంశాన్ని ఆవిష్కరించింది. అది దృష్టిని లోపాలు లేదా పరిమితుల నుంచి మళ్లించి, వారిలోని అవకాశాలు, సామర్ధ్యాలపై కేంద్రీకరించడం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను కేవలం కొన్ని ముద్రలు, లేదా పరిమితులతో చూడకూడదని ప్యానెలిస్ట్ సభ్యులు స్పష్టం చేశారు. వారిని వారి సామర్థ్యాలు, ప్రతిభ, వారు తమ కుటుంబాలకు, తరగతి గదులకు, అలాగే సమాజానికి అందించే సహకారాన్ని బట్టి గుర్తించాలని వారు చెప్పారు.
పిల్లల సినిమాలు కేవలం సంప్రదాయ వినోదానికే పరిమితం కాకుండా సమాజంలో సమ్మిళితతత్వాన్నీ, పరస్పర అవగాహననూ, సామాజిక మార్పునూ తీసుకువచ్చే ఒక ప్రేరకంగా మారాలని ప్యానెలిస్ట్ సభ్యులు ఆకాంక్షించారు.
***
रिलीज़ आईडी:
2274316
| Visitor Counter:
5