ప్రేక్షకులను ఒక మాయా ప్రపంచంలో విహరింపజేసే కళే సినిమాటోగ్రఫీ: 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సినిమాటోగ్రాఫర్ మధుర పాలిత్
లైటింగ్ నుంచి లెన్స్ వరకు: ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సినిమాటోగ్రఫీ మూలాలను విశ్లేషించిన మధుర పాలిత్
‘19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’లో (ఎంఐఎఫ్ఎఫ్) భాగంగా 'కోర్ క్రాఫ్ట్, విజువల్ లాంగ్వేజ్: ది సోల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ' అనే అంశంపై ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మక 'పియరీ ఆంజెనియక్స్ ఎక్సెల్‌లెన్స్' అవార్డును అందుకున్న తొలి భారతీయ మహిళా సినిమాటోగ్రాఫర్, దర్శకురాలు మధుర పాలిత్ ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చలనచిత్ర నిర్మాతలు, విద్యార్థులు, సినీ ప్రియులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. సినిమాటోగ్రఫీ అంటే కేవలం కెమెరాతో దృశ్యాలను రికార్డ్ చేయడం మాత్రమే కాదని ప్రేక్షకులు ఆ కథా ప్రపంచాన్ని నిజమని నమ్మేలా చేసే ఒక అద్భుతమైన కళ అని అభివర్ణించారు. కథా గమనానికి బలాన్ని చేకూర్చడానికి, ప్రేక్షకులలో భావోద్వేగాలను పండించడానికి కెమెరా కదలికలు, లైటింగ్, ఫ్రేమింగ్, కంపోజిషన్‌లను ఉపయోగించుకోవాల్సిన తీరును ఆమె వివరించారు.
ఒక సినిమాటోగ్రాఫర్ పాత్రను వివరిస్తూ... దర్శకుడి ఆలోచనలను దృశ్య రూపంలోకి మార్చేది సినిమాటోగ్రాఫరేనని మధుర పాలిత్ పేర్కొన్నారు. కెమెరా కదలికల నుంచి లెన్స్‌ల ఎంపిక వరకు తీసుకునే ప్రతి సృజనాత్మక నిర్ణయం.. ప్రేక్షకులు కథను అనుభూతి చెందే విధానం, పాత్రలతో వారు లీనమయ్యే తీరును ప్రభావితం చేస్తుందని చెప్పారు.
దృశ్యాలు (విజువల్ ఎలిమెంట్స్) ప్రేక్షకుల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని ఈ వర్క్‌షాప్‌లో లోతుగా చర్చించారు. వేర్వేరు కెమెరా కదలికలు విభిన్న భావోద్వేగాలను ఎలా పండిస్తాయో ఆమె ఉదాహరణలతో సహా వివరించారు. ఫ్రేమింగ్, కంపోజిషన్, స్పేస్‌ను ఉపయోగించుకునే విధానం ద్వారా పాత్రల మధ్య బంధాలను, వారి ఒంటరితనాన్ని లేదా వారిలోని ఆందోళనను సున్నితంగా వ్యక్తపరిచే తీరును మధుర పాలిత్ తెలియజేశారు. సినిమా మూడ్‌ను మార్చడంలో, ఒక పాత్ర అంతర్గత మానసిక స్థితిని ఆవిష్కరించడంలో లైటింగ్‌కు ఉన్న కీలక పాత్రను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.
సినిమాటోగ్రఫీ అనేది సాంకేతికత ఆధారంగా కాకుండా కళాత్మక ఆలోచనల ద్వారానే సాధ్యమవుతుందని మధుర పాలిత్ స్పష్టం చేశారు. కెమెరాలు, ఇతర పరికరాలు అనేవి కేవలం ఉపకరణాలు మాత్రమేనని... సృజనాత్మకత, నిశిత పరిశీలనలనేవి దృశ్య రూపంలో కథను చెప్పడానికి నిజమైన గుండెకాయ లాంటివని ఆమె పేర్కొన్నారు.
సినిమా నిర్మాణంలో ఎదురయ్యే క్షేత్రస్థాయి సవాళ్లు, షెడ్యూల్స్ నిర్వహణ, ఎక్విప్‌మెంట్, వాతావరణ పరిస్థితులు, ప్రొడక్షన్ ఇబ్బందుల గురించి కూడా ఆమె మాట్లాడారు. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం, ప్రతి ప్రాంతానికి ఉండే ప్రత్యేకమైన విజువల్ క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడం సినిమాటోగ్రాఫర్‌కు ఎంత ముఖ్యమో ఆమె చెప్పారు.
ఆ తర్వాత జరిగిన చర్చాపూర్వక ప్రశ్నోత్తరాల సెషన్‌లో... హ్యాండ్‌హెల్డ్ సినిమాటోగ్రఫీ, దర్శకులతో కలిసి పనిచేసే విధానం, సినిమా నిర్మాణంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాల వాడకం పెరగడం వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించారు. సాంకేతికతపై అడిగిన ఒక ప్రశ్నకు మధుర పాలిత్ సమాధానమిస్తూ.. స్మార్ట్‌ఫోన్‌లు సినిమా నిర్మాణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే అయినప్పటికీ సినిమాటోగ్రఫీ అనేది ఇప్పటికీ ఒక స్పష్టమైన ఉద్దేశం, అర్థం, కథనం ఆధారంగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు.
అర్థవంతమైన సినిమాను తీసేందుకు సృజనాత్మకత, పరిశీలన, భావోద్వేగ అవగాహనను కలగలిపే ఒక గొప్ప నైపుణ్యంగా సినిమాటోగ్రఫీని చూడాలని భావి చలనచిత్ర నిర్మాతలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తిదాయక సందేశంతో ఈ వర్క్‌షాప్ ముగిసింది.
***
रिलीज़ आईडी:
2274314
| Visitor Counter:
5