మాటలు మీ మనసును మలిస్తే.. జీవితం నటనను సృష్టిస్తుంది:
ఎంఐఎఫ్ఎఫ్ మాస్టర్‌క్లాసులో స్టానిస్లావ్‌స్కీ సత్య నాటక రంగాన్ని విశ్లేషించిన ఫాబ్రిస్ కాలీ
అద్భుతంగా నటించాలంటే జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం: పరిశీలన స్థాయి నుంచి అద్భుత నటన వరకు సాగే ప్రయాణాన్ని వివరించిన ఫాబ్రిస్ కాలీ
ఫ్రెంచ్ నాటకరంగ నిపుణుడు ఫాబ్రిస్ కాలీ ఒక వినూత్న మాస్టర్‌క్లాస్ ని అందించారు. ఇందులో భాగంగా నాటకరంగ దిగ్గజం కాన్‌స్టాంటిన్ స్టానిస్లావ్‌స్కీ సిద్ధాంతాల ఆధారంగా జీవితానికి, మాటలకు, నటనకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ఆయన విశ్లేషించారు. జీవితంలోని పూర్తి వైభవాన్ని తెరపై లేదా వేదికపై తిరిగి సృష్టించే ఒక ప్రయత్నమే నటన అని పేర్కొన్నారు. మానవ అనుభవాల్లోని వివిధ దశల ద్వారా ప్రయాణించినప్పుడే భావోద్వేగాలు ఎంతో సహజంగా పుట్టుకొస్తాయని ఫాబ్రిస్ కాలీ తెలిపారు.
’’అద్భుతంగా నటించాలంటే ముందు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి’’ అని ఫాబ్రిస్ కాలీ పేర్కొన్నారు. స్టానిస్లావ్‌స్కీ అవలంబించిన విధానం మొత్తం మానవ ప్రవర్తనను అతి దగ్గరగా పరిశీలించడం, విశ్లేషించడం, లోతుగా అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.
స్టానిస్లావ్‌స్కీ కళా నైపుణ్యం గురించి కాలీ మాట్లాడుతూ.. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా చాలా చిన్న అంశాలుగా విభజించి విశ్లేషించడం ద్వారా వేదికపై అత్యంత సహజమైన దృశ్యాలను సృష్టించేవారని చెప్పారు.
స్టానిస్లావ్‌స్కీకి ప్రముఖ రచయిత ఆంటోన్ చెకోవ్ రూపంలో ఒక అద్భుతమైన నాటకరంగ భాగస్వామి దొరికారని కాలీ పేర్కొన్నారు. చెకోవ్ రచనలన్నీ నిత్య జీవితంలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు, జీవితం తనను తాను అత్యంత సూక్ష్మంగా ఆవిష్కరించుకునే విధానాలకు అద్దం పట్టేలా ఉండేవని చెప్పారు.
వేదికపై ఒక నిజమైన, సహజమైన సన్నివేశాన్ని సృష్టించాలంటే నటీనటులకు విస్తృత పదజాలం ఉండటం ఎంతో అవసరమని కాలీ తెలిపారు. మనం వాడే పదాలే మన ఆలోచనా విధానాన్ని, అవగాహనను మలుస్తాయని చెప్పారు. దీనికి ఉదాహరణగా గ్రీన్‌లాండ్ దేశంలో మంచు' అనే పదాన్ని సూచించడానికి అనేక రకాల పదాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ ప్రపంచాన్ని మన మనస్సు అర్థం చేసుకునే పరిధిని భాష మరింత విస్తృతం చేస్తుందని వివరిస్తూ.. ‘‘మాటలే మీ మనసును మలుస్తాయి’’ అని సదస్సుకు హాజరైన ప్రేక్షకులతో పేర్కొన్నారు.
నటన అనేది కేవలం సంభాషణలు చెప్పడంపైనే ఆధారపడి ఉండదని కాలీ స్పష్టం చేశారు. ఒక నటుడి ఉనికి, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడం, ఎదుటివారి నటనకు స్పందించడం, ఆ సన్నివేశంలో పూర్తిగా లీనమవడం ద్వారానే నిజమైన నటన పుడుతుందని చెప్పారు. నట ప్రక్రియకు మరింత లోతును, సూక్ష్మ వివరాలను జోడించడం ద్వారా స్టానిస్లావ్‌స్కీ నాటకరంగానికి సరికొత్త నిర్వచనాన్ని అందించారని ప్రస్తావించారు.
సదస్సులో ఒక ఆసక్తికరమైన ప్రదర్శన ద్వారా.. నటనలో ‘చురుగ్గా గమనించడం’, ’చురుకైన భాగస్వామ్యం’ ఎంత ముఖ్యమో కాలీ వివరించారు. నటనకు కావలసిన పునాదులన్నీ సహజంగానే మన నిత్య జీవితంలోనే దాగి ఉన్నాయని చెబుతూ...‘‘నిజ జీవితంలో మనమందరం అద్భుతమైన నటులమే’’నని తన ప్రసంగాన్ని ముగించారు.
ఫాబ్రిస్ కాలీ ప్రముఖ స్టానిస్లావ్‌స్కీ విధానం ఆధారంగా నడిచే ఫ్రాంకో-బెలారసియన్ సోవియట్ థియేటర్ స్కూల్ ‘డెమైన్ లె ప్రింటెంప్స్’కు ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. బెలారస్‌లోని ఇంటర్నేషనల్ పబ్లిక్ అసోసియేషన్ ‘టియాట్రో’ కు కూడా ఆయనే ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన నాటకరంగ ప్రయాణం, పనులన్నీ రష్యన్ నాటకరంగ సంప్రదాయాలతో పాటు కాన్‌స్టాంటిన్ స్టానిస్లావ్‌స్కీ వారసత్వంతో లోతుగా ముడిపడి ఉన్నాయి. 20వ శతాబ్దపు నాటకరంగ ప్రదర్శనల్లో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన రష్యన్ థియేటర్ దిగ్గజం కాన్‌స్టాంటిన్ స్టానిస్లావ్‌స్కీ. నటీనటుల శిక్షణ, వారు పాత్రకు సిద్ధమయ్యే విధానం, రిహార్సల్స్ ప్రక్రియ కోసం ఆయన రూపకల్పన చేసిన అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ప్రపంచవ్యాప్తంగా స్టానిస్లావ్‌స్కీ వ్యవస్థగా గుర్తింపు పొందింది. 1898లో స్థాపించిన చారిత్రాత్మక మాస్కో ఆర్ట్ థియేటర్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. నటనలో భావోద్వేగాల నిజాయితీ, మానసిక వాస్తవికత, అనుభవపూర్వక సన్నాహాలపై ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలే నేటి ఆధునిక నటన పద్ధతులకు, ప్రసిద్ధ మెథడ్ యాక్టింగ్ విధానానికి బలమైన పునాదిగా నిలిచాయి.
ఎంఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యక్రమాల పత్రికా ప్రకటనలు, ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
रिलीज़ आईडी:
2274140
| Visitor Counter:
8