MIFF banner

“మైక్రో డ్రామా అనేది కథాకథనంలో వచ్చిన ఒక పరిణామం. సినిమాకు ఇది 'ఫాస్ట్ ఫ్యాషన్' కాదు”: 19వ ఎంఐఎఫ్ఎఫ్‌లో సినీ ప్రముఖులు


మొబైల్ స్క్రీన్‌ల నుంచి ప్రధాన స్రవంతి కథాకథనం వరకు‌ మైక్రో డ్రామా ట్రెండ్‌ను విశ్లేషించిన ఎంఐఎఫ్ఎఫ్

ప్రేక్షకుల అలవాట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా కథనం (స్టోరీ టెల్లింగ్) మారుతున్న నేపథ్యంలో 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) 'ఫాస్ట్ ఫిల్మ్: మైక్రో డ్రామా అనేది సినిమా రంగంలో ఫాస్ట్ ఫ్యాషన్ లాంటిదా?' అనే అంశంపై ఆలోచనాత్మకమైన ప్యానల్ చర్చను నిర్వహించింది. నటి షీనా చౌహాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మైక్రో డ్రామాల ఆవిర్భావం, సమకాలీన కథాకథనంపై పెరుగుతున్న వాటి ప్రభావం గురించి చలన చిత్ర దర్శకుడు, నిర్మాత సమీర్ మోడీ.. నటి అర్చన కవి, నటుడు ఉజ్వల్ కుమార్, చలనచిత్ర దర్శకుడు రాఫెల్ స్టెంప్లెవ్‌స్కీలు చర్చించారు. 

సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులను, ప్రేక్షకులను ఆహ్వానించిన ఎంఐఎఫ్ఎఫ్ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్ వక్తలను సత్కరించారు. వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత మీడియా రంగంలో సరికొత్తగా రూపాంతరం చెందుతున్న కథాకథన విధానాలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 

మారుతున్న ప్రేక్షకుల అలవాట్లు, మొబైల్ పరికరాల వినియోగం పెరగడం వల్లే కథాకథన విధానంలో సహజంగానే ఈ మైక్రో డ్రామా రూపంలో ఒక పరిణామం వచ్చిందని వక్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫార్మాట్ నిడివి పరంగా చిన్నదైనప్పటికీ సంప్రదాయ సినిమాకు అవసరమైన సృజనాత్మక నైపుణ్యాలు, భావోద్వేగ లోతు దీనికి కూడా అంతే స్థాయిలో అవసరమని వారు స్పష్టం చేశారు.

మైక్రో డ్రామాల ఆవిర్భావం గురించి సమీర్ మోడీ మాట్లాడుతూ... కోవిడ్-19 కాలంలో మొబైల్ తెరలపై కంటెంట్ వినియోగం విపరీతంగా పెరగడాన్ని క్రియేటర్లు గమనించినప్పుడే ఈ ఫార్మాట్‌కు ఊపు వచ్చిందని చెప్పారు. మైక్రో డ్రామా అత్యంత కచ్చితత్వం, సృజనాత్మకత అవసరమయ్యే కథాకథన రూపమని... పరిమిత నిడివిలోనే బలమైన రచన, ఆకట్టుకునే నటన, పదునైన ఎడిటింగ్ అన్నీ ఒకచోట కుదరాలని ఆయన వివరించారు. మైక్రో డ్రామాలను తక్కువ స్థాయి సినిమాగా లేదా కేవలం చూసి వదిలేసే వినోదంగా భావించకూడదని.. వీటికింటూ ఒక ప్రత్యేకత ఉందని, ఇది నిరంతరం రూపాంతరం చెందుతున్న ఒక విశిష్ట కథా మాధ్యమమని ఆయన అన్నారు. 

టెలివిజన్ నుంచి డిజిటల్ ప్లాట్‌ఫా‌మ్‌ల వరకు సాంకేతికతలో వచ్చే ప్రతి మార్పు కొత్త రకమైన కంటెంట్ సృష్టికి దారితీసిందని అర్చన కవి పేర్కొన్నారు. మైక్రో డ్రామాలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు.. మొదటి కొన్ని సెకన్లలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సరికొత్త ఫార్మాట్ నటులు, రచయితలు, ఎడిటర్లకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ... కథాకథన విధానం, నటనలో మరింత కచ్చితత్వాన్ని డిమాండ్ చేస్తుందని ఆమె చెప్పారు.

కథా నిడివితో సంబంధం లేకుండా ఏ రకమైన కథాకథనానికైనా భావోద్వేగ బంధమే పునాది అని ఉజ్వల్ కుమార్ అన్నారు. తక్కువ సమయంలోనే ప్రేక్షకులతో మమేకం అవ్వడానికి నటులు ఇలాంటి సరికొత్త ఫార్మాట్లకు అనుగుణంగా మారాలని, తమ నటనను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ఆయన అన్నారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరగడం వల్ల మైక్రో డ్రామాలు భారీ సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ కావడానికి గొప్ప అవకాశాలు లభించాయని ఆయన గుర్తుచేశారు.

మైక్రో డ్రామా.. చిత్ర రూపకర్తలకు ఒక సవాలుతో కూడిన సముచిత అవకాశమని రాఫెల్ స్టెంప్లెవ్‌స్కీ అన్నారు. తెర పరిమాణంతో సంబంధం లేకుండా బలమైన కథాకథనం, సహజమైన మానవ భావోద్వేగాలే ఎప్పుడైనా సినిమాకు ప్రధాన కేంద్రబిందువులని ఆయన పేర్కొన్నారు. చలనచిత్ర భాష నిరంతరం రూపాంతరం చెందుతున్న పరిణామ క్రమంలో మైక్రో డ్రామా మరొక సరికొత్త దశ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

మైక్రో డ్రామా సినిమా రంగంలో కేవలం ఒక 'ఫాస్ట్ ఫ్యాషన్' కాదని... మారుతున్న ప్రేక్షకుల ఇష్టాఇష్టాలు, వారి వీక్షణ అలవాట్లకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ సంప్రదాయ చలనచిత్ర రంగానికి ఊతమిచ్చే ఒక సరికొత్త కథా రూపమన్న ఏకాభిప్రాయంతో ఈ చర్చ ముగిసింది.

ప్యానల్ చర్చ ముగిసిన అనంతరం ప్రేక్షకులతో ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ఈ సందర్భంగా మైక్రో డ్రామాలు అందిస్తున్న అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై వక్తలు విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. మారుతున్న ప్రేక్షకుల వీక్షణ అలవాట్లు సరికొత్త కథాకథనాలకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ.. సినిమాకు ఉండాల్సిన ప్రాథమిక మూలాలను మాత్రం అలాగే కాపాడుతున్నాయనే ఏకాభిప్రాయాన్ని ఈ కార్యక్రమం వ్యక్తం చేసింది. 

19వ ఎంఐఎఫ్ఎఫ్:

19వ ఎంఐఎఫ్ఎఫ్ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన, మమేకమయ్యే, సుసంపన్నమైన సినీ అనుభూతిని అందించనుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలతో పాటు సినీ రంగానికి ఊతమిచ్చే పలు కీలక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

  • ఈ ఏడాది చలనచిత్రోత్సవ పోటీ విభాగం కోసం భారత్‌తో పాటు 47 దేశాల నుంచి 1,459 చిత్రాలు నమోదు చేసుకున్నాయి. 

  • ఈ చలనచిత్రోత్సవం 42కు పైగా భారతీయ భాషలతో పాటు విదేశాలకు చెందిన 30కు పైగా భాషలలో రూపొందిన చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఇది ఈ ఉత్సవానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి, సాంస్కృతిక వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. 

  • ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చలనచిత్ర దర్శకుల అద్భుతమైన డాక్యుమెంటరీలు, తక్కువ నిడివి గల కాల్పనిక చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు, తొలిసారి దర్శకత్వం వహించిన వారి చిత్రాలు, విద్యార్థులు రూపొందించిన సినిమాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. 

  • సినిమా ప్రదర్శనలతో పాటు 2వ విడత 'డాక్ బజార్', ప్రతిభను పెంపొందించే మాస్టర్‌క్లాస్‌లు, ఐడీపీఏ నిర్వహిస్తోన్న 'ఓపెన్ ఫోరం' వంటి కార్యక్రమాలు ఈ ఉత్సవంలో సినీ, సృజనాత్మక ఆలోచనల మార్పిడిని మరింత పెంపొందిస్తాయి.

ఎంఐఎఫ్ఎఫ్ 2026 అనే కథలకు సంబంధించిన సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఇక్కడ చలనచిత్రాలు, సృజనాత్మక ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన గళాలు ఒకచోట చేరి డాక్యుమెంటరీలు, యానిమేషన్, తక్కువ నిడివి గల కాల్పనిక చిత్రాల అద్భుతమైన మహోత్సవానికి వేదిక కానున్నాయి. ఈ మధురమైన సినీ వేడుకలో భాగం అవ్వండి!

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2273762   |   Visitor Counter: 9