లోక్‌సభ సచివాలయం
వికసిత్ భారత్ కల సాకారం కోసం రాజ్యాంగం నుంచి స్ఫూర్తి పొందాలని యువతకు లోక్‌సభ స్పీకర్ పిలుపు
వికసిత్ భారత్-2047 బాధ్యత యువతపైనే
నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవడంలో యూత్ పార్లమెంట్ కీలకం
ఇతర దేశాల వలె కాకుండా భారత్‌లో ఆదినుంచే ఓటు హక్కులో సమానత్వం ఉంది
ప్రజాస్వామ్యం మన ప్రాచీన పని సంస్కృతిలో అంతర్భాగం
సాంకేతికత నుంచి జాతీయ భద్రత దాకా భారత పరివర్తనకు మహిళలే చోదక శక్తి
స్థానిక సంస్థల్లో 50 శాతానికి చేరిన మహిళా ప్రాతినిధ్యం
సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026ని ప్రారంభించిన లోక్‌సభ స్పీకర్
प्रविष्टि तिथि:
16 JUN 2026 4:08PM by PIB Hyderabad
లోక్‌సభ సచివాలయానికి చెందిన పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ (ప్రైడ్) సహకారంతో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026' కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఈ రోజు సంవిధాన్ సదన్‌లోని చరిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి శ్రీ బిర్లా మాట్లాడుతూ... భారత గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ హాల్‌లోనే వారు నిలబడి ఉన్నారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దది అయిన భారత రాజ్యాంగాన్ని పౌరులందరికీ ఒక కచ్చితమైన మార్గదర్శిగా ఆయన అభివర్ణించారు. 'వికసిత్ భారత్' రోడ్‌మ్యాప్ గురించి చర్చిస్తున్న ఈ చరిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు.
భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో భారీ స్థాయిలో యువత పాల్గొంటున్న తీరును ప్రధానంగా ప్రస్తావిస్తూ... ప్రస్తుతం 50 లక్షలకు పైగా యువత యూత్ పార్లమెంట్ కార్యక్రమంతో చురుగ్గా అనుబంధం కలిగి ఉన్నారని శ్రీ బిర్లా పేర్కొన్నారు. రాష్ట్రాలు, భాషలు, సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా ఉన్న ఈ విభిన్న సమూహం... 'వికసిత్ భారత్' దార్శనికతను సాకారం చేసుకోవాలనే ఒకే ఒక్క సంకల్పంతో ఏకమైందని ఆయన స్పష్టం చేశారు. 'వికసిత్ భారత్-2047' కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ, దేశ యువతను నిర్మాణాత్మక జాతి నిర్మాణం దిశగా నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఇది ప్రజాస్వామ్య విలువలు, సంభాషణలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం కోసం కీలక వేదిక అని లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం భారత పని సంస్కృతి, ప్రాచీన సంప్రదాయాల మూలాల్లో లోతుగా పాతుకుపోయిందని లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా సాటిలేనిదని ఆయన పేర్కొన్నారు. భారత సామర్థ్యాలను గురించి మాట్లాడుతూ... అపారమైన వైవిధ్యం ఉన్నప్పటికీ స్వాతంత్య్రానంతరం మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎలా విజయవంతంగా ఆవిర్భవించిందో ఆయన వివరించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు బయటి నుంచి దిగుమతి చేసుకున్న భావనలు కావనీ... ప్రాచీన సభలు, సమితుల ద్వారా అవి ప్రాచీన కాలం నుంచి పరిణామం చెందాయన్నారు. తద్వారా 75 ఏళ్లుగా ప్రజా భాగస్వామ్యం నిరంతరం బలపడటానికి, సంస్థాగత వృద్ధి పటిష్ఠంగా ఉండటానికి అవి మార్గం సుగమం చేశాయని ఆయన పేర్కొన్నారు.
భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటి నుంచే పౌరులందరికీ సమాన హక్కులను కల్పించిన దార్శనికులైన భారత రాజ్యాంగ రూపకర్తలను శ్రీ బిర్లా ప్రశంసించారు. దేశ రాజ్యాంగంలోని మూల సూత్రాల గురించి మాట్లాడుతూ... అది సమాజంలోని ప్రతి వర్గానికి సమానత్వం, న్యాయం, సమాన అవకాశాల సూత్రాలను ప్రత్యేకంగా పొందుపరిచిందని ఆయన స్పష్టం చేశారు. అనేక దేశాల్లో మహిళలకు చాలా ఆలస్యంగా ఓటు హక్కు లభించగా... భారత్ మొదటి నుంచే సంపూర్ణ సమానత్వాన్ని ఎంచుకుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం భారత్ సార్వత్రిక వయోజన ఓటు హక్కును తక్షణమే అమలు చేయడం ఒక చరిత్రాత్మక మైలురాయిగా శ్రీ ఓం బిర్లా పేర్కొన్నారు.
భారత యువతను దేశ ఆవిష్కరణలకు ప్రధాన చోదక శక్తిగా అభివర్ణిస్తూ... దేశాన్ని మార్చడానికి అవసరమైన విశిష్టమైన శక్తి, 'నూతన సంకల్పం' రాబోయే తరానికి ఉన్నాయని శ్రీ బిర్లా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగానూ నాయకత్వ పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం వేగంగా పెరుగుతున్న తీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైన్స్, టెక్నాలజీ నుంచి వ్యవసాయం, జాతీయ భద్రత వరకు మహిళలు సాంప్రదాయిక అడ్డంకులను ఛేదిస్తూ... సామాజిక పరివర్తనను ముందుకు నడిపిస్తున్నారని ఆయన గమనించారు. ప్రజాస్వామ్య, ఆర్థిక భాగస్వామ్యంలో ఈ సమ్మిళిత పెరుగుదల దేశంలో కొనసాగుతున్న జాతి నిర్మాణ ప్రక్రియకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పాలనలో భారత్ సాధిస్తున్న నిశ్శబ్ద విప్లవాన్ని ఆయన ప్రశంసించారు. అనేక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో మహిళల భాగస్వామ్యం చరిత్రాత్మకంగా 50 శాతానికి చేరుకుందని వెల్లడించారు. ఈ విజయాన్ని అత్యున్నత శాసన స్థాయిల్లో ప్రతిబింబించేందుకు చరిత్రాత్మక నారీ శక్తి వందన అధినియమ్ ఒక నిర్ణయాత్మక ముందడుగు అని శ్రీ బిర్లా అభివర్ణించారు. ఈ చట్టం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని శాశ్వతంగా పటిష్ఠం చేస్తుందని, తద్వారా భారత రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
నైతికత, ఆధ్యాత్మికత, ప్రజాస్వామ్య సంభాషణలతో కూడిన భారత విశిష్ట సామాజిక నిర్మాణం... యువతను ప్రజా జీవితానికి సహజంగానే సన్నద్ధం చేస్తుందని శ్రీ బిర్లా పేర్కొన్నారు. దేశాన్ని అత్యున్నత ప్రపంచ శిఖరాలకు నడిపించేందుకు... వారిలోని నూతన ఆవిష్కరణలను, సేవా స్ఫూర్తిని వినియోగించాలని ఆయన కోరారు. తాము ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న పౌరుల పట్ల సానుభూతి, సంపూర్ణ జవాబుదారీతనంలోనే నిజమైన నాయకత్వం ఇమిడి ఉందని ఆయన యువతకు గుర్తు చేశారు. సంవిధాన్ సదన్ పవిత్ర ప్రాంగణంలో యువ నాయకుల ఈ సమావేశం... రాబోయే తరాల హృదయాల్లో ప్రజాస్వామ్య బాధ్యత అనే శక్తిమంతమైన జ్వాలను రగిలిస్తుందని శ్రీ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ... లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పళ్ కుమార్ సింగ్... యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2273756)
आगंतुक पटल : 19