MIFF banner

సృజనాత్మకతకు కృత్రిమ మేధ భవిష్యత్తు కాబోతోందా?: సినిమాల్లో ఏఐ బాధ్యతాయుత వినియోగంపై 19వ ఎంఐఎఫ్ఎఫ్ బహిరంగ చర్చా వేదిక


ఏఐ సృజనాత్మకతను మెరుగుపరిచే సాధనం మాత్రమే.. దాన్ని భర్తీ చేసేది కాదు: 19వ ఎంఐఎఫ్ఎఫ్ చర్చల్లో సినీ రంగ నిపుణులు

ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడీపీఓ),  19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) సందర్భంగా ‘‘సృజనాత్మకతకు కృత్రిమ మేధ భవిష్యత్తు కాబోతోందా?" అంశంపై ఒక ప్రత్యేక బహిరంగ చర్చా వేదికను నిర్వహించింది. సినిమా నిర్మాణ, కంటెంట్ క్రియేషన్‌లో కృత్రిమ మేధ వల్ల వచ్చే అవకాశాలు, సవాళ్లు, దాని ప్రభావాలపై చర్చించడానికి పలువురు ప్రముఖులు ఒకే వేదికపైకి సమావేశమయ్యారు. ఈ చర్చలో ఫైర్‌ఫ్లై క్రియేటివ్ స్టూడియో సహ వ్యవస్థాపకుడు సనాత్ పీసీ, ఎస్ఎమ్‌పీటీఈ చైర్మన్ ఉజ్వల్ నిర్గుడ్కర్, సీనియర్ న్యాయవాది హేతల్ దేశాయ్ సోలియా, ఫ్యాన్‌బాయ్ పిక్చర్స్ డైరెక్టర్, సినీ నిర్మాత సుబోధ్ మీనన్ పాల్గొన్నారు.

 

సృజనాత్మక రంగంలో కృత్రిమ మేధ పాత్ర రోజురోజుకూ ఎలా పెరుగుతోందనే విషయంపై ఈ సదస్సులో లోతైన విశ్లేషణ జరిగింది. కథలు చెప్పే విధానం , సినిమా నిర్మాణ ప్రక్రియలు, చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై ఏఐ చూపబోయే ప్రభావాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. చలనచిత్ర రంగాన్ని పూర్తిగా మార్చేయగల అపారమైన సామర్థ్యం ఏఐ సాంకేతికతకు ఉందని అంగీకరిస్తూనే.. కథను రక్తి కట్టించడంలో లేదా ఒక కళను పండించడంలో మానవ సృజనాత్మకత, భావోద్వేగ మేధస్సు మాత్రమే ఎప్పటికీ అత్యంత కీలకమైనవని నిపుణులు స్పష్టం చేశారు.

 

సినిమా రంగంలో సాంకేతిక పరిణామాల గురించి ఎస్ఎమ్‌పీటీఈ చైర్మన్ ఉజ్వల్ నిర్గుడ్కర్ మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ ప్రక్రియలో కృత్రిమ మేధ అనేది తదుపరి సహజమైన దశ అని  పేర్కొన్నారు. శబ్ద నాణ్యతను పెంచడం, కలర్ కరెక్షన్, విజువల్స్ మెరుగుపరచడం, పాత సినిమాలను పునరుద్ధరించడంతో సహా  సినిమా నిర్మాణానంతర పనులల్లో ఏఐ పాత్ర రోజురోజుకూ పెరుగుతోందని ఆయన ప్రస్తావించారు. ఏఐ సాధనాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చిత్ర పరిశ్రమ వాటిని ఒక ప్రామాణిక పద్ధతిలోకి తెచ్చి, పూర్తిగా అలవర్చుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

 

ఫ్యాన్‌బాయ్ పిక్చర్స్ డైరెక్టర్, సినీ నిర్మాత సుబోధ్ మీనన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ సరికొత్త కంటెంట్‌ను సృష్టించగలదని, సరికొత్త ఆలోచనల కోసం సహాయపడగలదని చెబుతూనే.. కథలు చెప్పే నైపుణ్యం ప్రాథమికంగా మనుషులకే సాధ్యమని స్పష్టం చేశారు. సరికొత్త ఆలోచనలను పుట్టించడానికి, వాటిని సరిచూసుకోవడానికి కృత్రిమ మేధ ఒక విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికత మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నందున, చలనచిత్ర నిర్మాతలకు ఏఐపై సరైన అవగాహన ఉండటం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు

 

ఫైర్‌ఫ్లై క్రియేటివ్ స్టూడియో సహవ్యవస్థాపకుడు సనాత్ సీపీ మాట్లాడుతూ.. చిత్రాల నాణ్యత, శబ్దం, ప్రేక్షకులకు కలిగే అనుభూతిని మెరుగుపరచడం ద్వారా కథా విశ్లేషణను మరింత రక్తి కట్టించడానికి కృత్రిమ మేధ సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలాన్ని ఒక ప్రయోగాత్మక దశగా అభివర్ణించిన ఆయన.. సృష్టికర్తలు ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా.. దానిని కేవలం సహాయక సాధనంగా ఉపయోగిస్తూ సరికొత్త అవకాశాలను అన్వేషించాలని  సూచించారు.

 

కృత్రిమ మేధ ద్వారా సృష్టించే కంటెంట్‌కు సంబంధించిన చట్టపరమైన అంశాలపై లాయర్ హేతల్ దేశాయ్ సోలియా ప్రస్తావించారు. లైసెన్స్ పొందినన డేటాను మాత్రమే ఉపయోగించడం, సృజనాత్మక పనుల్లో మనుషుల భాగస్వామ్యం తగినంతగా ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కాపీరైట్ యాజమాన్యం ఎల్లప్పుడూ మానవ సృష్టికర్తలకే  చెందుతుందని ఆమె స్పష్టం చేశారు. వాస్తవ సమాచారాన్ని పూర్తిగా మార్చేయడానికి కాకుండా, దాని నాణ్యతను పెంచడానికి మాత్రమే కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని ఆమె చలనచిత్ర నిర్మాతలకు సలహా ఇచ్చారు.

 

కృత్రిమ మేధ అనేది మానవ సృజనాత్మకతను భర్తీ చేసేది కాదు.. దానికి మరింత బలాన్నిచ్చే ఒక శక్తిమంతమైన సాధనం మాత్రమేనని చర్చా ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఏఐ సాంకేతికత సినిమా నిర్మాణ ప్రక్రియలను సులభతరం చేసి, సామర్థ్యాన్ని పెంచి, సృజనాత్మక అవకాశాలను విస్తృతం చేయగలదని.. అయితే కథ అసలైన అర్థం మాత్రం ఎప్పటికీ మానవ ఊహాశక్తి, భావోద్వేగాలు, కళాత్మక దృష్టిపైనే ఆధారపడి ఉంటుందని వారు స్పష్టం చేశారు. 

 

ఈ చర్చ అనంతరం ప్రేక్షకులతో ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల సమయం సాగింది. ఇందులో భాగంగా ఏఐ వినియోగం, నైతిక సమస్యలు, కాపీరైట్ రక్షణ, సృజనాత్మక రంగాల భవిష్యత్తుపై  అడిగిన పలు ప్రశ్నలకు నిపుణులు సమాధానాలిచ్చారు. చలనచిత్ర నిర్మాతలు సాంకేతిక మార్పులను ఆహ్వానిస్తూనే, కథలు చెప్పే ప్రక్రియలో మానవ సృజనాత్మకతనే ఎల్లప్పుడూ కేంద్ర బిందువుగా ఉంచాలనే ఉమ్మడి అభిప్రాయంతో ఈ సదస్సు ముగిసింది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2273753   |   Visitor Counter: 16