మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారత్ ఇన్నోవేట్స్ - 2026 రెండో రోజు పెట్టుబడిదారులు- అంకుర సంస్థలపై దృష్టి
10కి పైగా దేశాలకు చెందిన 50 మందికి పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కూడిన బృందాల ముందు ఆవిష్కరణలను ప్రదర్శించిన 80కిపైగా డీప్ టెక్ అంకుర సంస్థలు
40కి పైగా అంకుర సంస్థలకు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల నుంచి కచ్చితమైన హామీ
సదస్సు చివరి రోజున టెక్నాలజీ పార్కులు, యాక్సిలరేటర్లు, వాతావరణ సాంకేతిక పరిజ్ఞానాలు, పారిశ్రామిక కర్బన ఉద్గారాల తగ్గింపు, అంతర్జాతీయ స్థాయి వ్యూహాలు, దీర్ఘకాల సంస్థాగత భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి
प्रविष्टि तिथि:
16 JUN 2026 12:42PM by PIB Hyderabad
భారత్ ఇన్నోవేట్స్-2026 రెండో రోజున (2026 జూన్ 15) అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు, పరిశోధకులు, విధానరూపకర్తలు, అంకురసంస్థలు, విద్యా సంస్థలు మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, సాంకేతిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, డీప్‌టెక్ పరిష్కారాల వాణిజ్యీకరణను ముందుకు తీసుకెళ్లడంపై ఈ చర్చల్లో దృష్టి సారించారు.
భారత ప్రభుత్వం ప్రారంభించిన భారత్ ఇన్నోవేట్స్-2026ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపడుతోంది. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న అంకుర సంస్థలు, ఆవిష్కరణల రంగాన్ని అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు, పరిశోధనా వ్యవస్థలు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే గొప్ప వేదిక ఇది.
బయో టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, అధునాతన తయారీ, ఆరోగ్య సేవలు, ఇంధనం, రవాణా రంగం, అంతరిక్షం, కృత్రిమ మేధ రంగాల్లో భారతీయ అంకుర సంస్థలు, ప్రముఖ విద్యా సంస్థలు అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించే ఇన్నోవేషన్ షోకేస్ తో ఈ రోజు ప్రారంభమైంది.
ఏషియన్ పెయింట్స్ కో ప్రమోటర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన శ్రీ జలజ్ డానీ ముఖ్య వక్తగా ప్రసంగించారు. మార్కెట్ డిమాండు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక సంస్థాగత నిర్మాణంతో శాస్త్రీయ ఆవిష్కరణలను అనుసంధానించడానికున్న ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు.
పారిశ్రామిక, పెట్టుబడులు, పరిశోధనా రంగానికి చెందిన ప్రముఖులు బృంద చర్చల్లో పాల్గొన్నారు. వారిలో పాశ్చర్ సంస్థకు చెందిన ప్రొఫెసర్ చేతన్ చిట్నిస్, సఫ్రాన్ రియోస్క్ సీఈవో అరేలీ గిరో, థేల్స్ అలేనియా స్పేస్ ప్రతినిధి బెర్ట్రాండ్ డెనిస్, జీఐఎఫ్ఏఎస్ సీఈవో ఫ్రెడ్రిక్ పారిసోట్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్ ప్రతినిధి యోకో ఫుకాటా, మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్‌నకు చెందిన సునీల్ భక్షి ఉన్నారు. బయో-ఇన్నోవేషన్, అధునాతన తయారీ, అంతరిక్షం, రక్షణ రంగ సరఫరా వ్యవస్థలు, అంతర్జాతీయ పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై, అంతర్జాతీయ సహ అభివృద్ధిపై, పరిశోధనలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
రెండో రోజు కార్యక్రమంలో అత్యంత కీలకమైన ఇన్వెస్టర్-స్టార్టప్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం జరిగింది. 10కి పైగా దేశాలకు చెందిన 50 మందికి పైగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో కూడిన ప్యానెళ్ల ముందు భారత్ ఇన్నోవేట్స్‌కు చెందిన 80కి పైగా డీప్‌టెక్ అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. దీనికోసం అంశాల వారీగా ఆరు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. అవి అంతరిక్షం-రక్షణ, కృత్రిమ మేధ-సెమీకండక్టర్లు, ఆరోగ్య సేవలు-మెడ్ టెక్, బయోటెక్నాలజీ-అగ్రిటెక్, ఇంధనం-పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానాలు, అధునాతన తయారీ. వీటి ద్వారా అంతర్జాతీయ వెంచర్ ఫండ్స్, కార్పొరేట్ పెట్టుబడిదారులతో నేరుగా చర్చించే అవకాశం అంకుర సంస్థలకు లభించింది. వీటిలో 40కి పైగా అంకుర సంస్థలు, పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులకు హామీలను, భారీ స్థాయిలో పెట్టుబడి ఒప్పందాలను సొంతం చేసుకున్నాయి
మొదటి రోజున ప్రకటించిన సుమారు 30 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి కార్యకలాపాల గురించి కూడా ఈ సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించారు.
రెండో రోజు ముగిసే సమయానికి భారత్ ఇన్నోవేట్స్-2026 చేపట్టిన కార్యక్రమాలు:
-
భారత్ ఇన్నోవేట్స్ ఆవిష్కర్తలతో 1,350కి పైగా బీ2బీ సమావేశాలు
-
50కి పైగా భాగస్వామ్య ఒప్పందాలు
-
10కి పైగా దేశాలకు చెందిన 50కి పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారుల ముందు 80కి పైగా అంకుర సంస్థలు చేపట్టిన ఆవిష్కరణల ప్రదర్శన
-
40కి పైగా అంకుర సంస్థల్లో పెట్టుబడులకు కచ్చితమైన హామీ
-
భారత్ ఇన్నోవేట్స్ ఆవిష్కర్తలకు సంబంధించి దాదాపు 254.5 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడుల హామీలు, తుది దశకు చేరిన పెట్టుబడుల వివరాల ప్రకటన
పెట్టుబడిదారుల భాగస్వామ్యం, సాంకేతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ సహకార వేదికలపై దృష్టి సారించడం ద్వారా డీప్‌టెక్ ఆవిష్కరణల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశ స్థానాన్ని భారత్ ఇన్నోవేట్స్ 2026 మరింత బలోపేతం చేసింది. అదే సమయంలో భారత్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల మధ్య సరికొత్త భాగస్వామ్యాలకు మార్గాన్ని సుగమం చేసింది.
అంతర్జాతీయ సాంకేతిక భాగస్వామ్యాలకూ, డీప్‌టెక్ పెట్టుబడులకూ, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధికీ ఉత్ప్రేరకంగా భారత్ ఇన్నోవేట్స్-2026 పనిచేస్తుందని రెండో రోజు నిర్వహించిన చర్చల స్థాయి, వాటి ప్రాధాన్యం స్పష్టం చేస్తున్నాయి.
సదస్సు చివరి రోజున ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసుకున్న ఆవిష్కరణల ఒప్పందాలను భవిష్యత్తులోనూ కొనసాగించడమే లక్ష్యంగా.. టెక్నాలజీ పార్కులు, యాక్సిలరేటర్లు, పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానాలు, పారిశ్రామిక కర్భన ఉద్గారాల తగ్గింపు, అంతర్జాతీయ స్థాయి వ్యూహాలు, దీర్ఘకాలిక సంస్థాగత భాగస్వామ్యాలపై కూడా చర్చిస్తారు.
భారత్ ఇన్నోవేట్స్-2026 గురించి, దీనిలో పాల్గొన్న ఆవిష్కర్తల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.bharatinnovates.in సందర్శించండి.
***
(रिलीज़ आईडी: 2273649)
आगंतुक पटल : 17