ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా భారత్‌ను నిలపాలనే పిలుపుతో ప్రారంభమైన 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మీడియా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచస్థాయి కథన సామర్థ్యం, సృష్టికర్తల-ఆధారిత భవిష్యత్తును ప్రముఖంగా ప్రస్తావించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
డాక్యుమెంటరీ, కాల్పనిక కథల లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాల కోసం భారత ప్రధాన ఉత్సవమైన ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్) 19వ ఎడిషన్... సినీ రంగంలోని శ్రేష్ఠత, సాంస్కృతిక వైవిధ్యం, సృజనాత్మక ఆవిష్కరణల ఘనమైన వేడుకల మధ్య సోమవారం సాయంత్రం ముంబయిలోని దాదర్‌లో గల రవీంద్ర నాట్య మందిరం వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది.
కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించి, వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేస్తూ కీలక ప్రసంగం చేశారు. కథలు వినూత్నంగా చెప్పడం, కంటెంట్ సృష్టించడం, సృజనాత్మక వాణిజ్యంతో భారత్ ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక కేంద్రంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
సభనుద్దేశించి మాట్లాడుతూ... గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత మీడియా, వినోద రంగం సాధించిన అభివృద్ధి గురించి డాక్టర్ మురుగన్ ప్రధానంగా ప్రస్తావించారు. "నేడు భారత్ ప్రపంచస్థాయిలో సృజనాత్మకతకు కేంద్రంగా, కంటెంట్ సృష్టిలో విశ్వసనీయ భాగస్వామిగా గుర్తింపు పొందింది. మన కథలు ఖండాల వ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మన సృజనాత్మక ప్రతిభావంతుల సమూహం... విస్తృతమైన దాని స్థాయి, సామర్థ్యంతో సాటిలేనిదిగా ఉంది" అని ఆయన అన్నారు.
"వేగవంతమైన డిజిటల్ పరివర్తన, నానాటికీ విస్తరిస్తున్న కంటెంట్ వినియోగం కారణంగా భారత మీడియా, వినోద పరిశ్రమ 2025 నాటికి 9 శాతం వృద్ధితో రూ. 2.78 లక్షల కోట్ల మైలురాయిని చేరుకుంది. డిజిటల్ మీడియా ఈ పరిశ్రమలో అతి పెద్ద విభాగంగా అవతరించి, తొలిసారిగా రూ.1 లక్ష కోట్ల ఆదాయపు మైలురాయిని దాటింది" అని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రంగం 2028 నాటికి 7 శాతానికి పైగా సీఏజీఆర్ వృద్ధితో రూ. 3.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2025లోనే దేశంలో 1,900కు పైగా చిత్రాలు విడుదలయ్యాయనీ, ఇవి థియేట్రికల్ ఆదాయాల్లో 16 శాతం పెరుగుదలకు దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ముంబయిని భారత సృజనాత్మక రాజధానిగా అభివర్ణిస్తూ... 2025లో ఈ నగరంలో నిర్వహించిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) సాధించిన ఘన విజయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోనే అగ్రగామి సృష్టికర్తల కేంద్రంగా మారాలన్న భారత్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్ఐఎఫ్ఎఫ్ వంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ మురుగన్ అన్నారు.
డాక్యుమెంటరీ చిత్రాల రూపకర్తలను నిర్మాతలు, పంపిణీదారులు, పరిశ్రమ నిపుణులు, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో అనుసంధానించే ఒక ప్రధాన వేదికగా మరింత మెరుగవుతున్న వేవ్స్ డాక్ బజార్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ... ఈ కార్యక్రమం వర్ధమాన ప్రతిభకు, నిష్ణాతులైన నిపుణులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతోందనీ, ప్రభావవంతమైన డాక్యుమెంటరీల సృష్టికి, వాటి అంతర్జాతీయ పంపిణీకి ఇది వీలు కల్పిస్తోందని డాక్టర్ మురుగన్ వ్యాఖ్యానించారు.
సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) సహా ఈ ఉత్సవంతో సంబంధం ఉన్న ఇతర భాగస్వాములందరినీ కేంద్ర మంత్రి అభినందించారు. ఆవిష్కరణ, సృజనాత్మకత, సహకారం ద్వారా మీడియా, వినోద రంగాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 గణనీయ తోడ్పాటునందిస్తుందని డాక్టర్ మురుగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ ఆశిష్ షెలార్... ప్రపంచవ్యాప్త ప్రతినిధులందరినీ ముంబయికి స్వాగతించారు. సృజనాత్మక పరిశ్రమలకు మద్దతునివ్వడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబయిలో మొట్టమొదటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ ఆశిష్ షెలార్... కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో ఒక మీడియా హబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందని తెలిపారు. 2025లో ముంబయి వేదికగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ షెలార్ ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు, సభికులకు స్వాగతం పలుకుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్... ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోవడం, సృజనాత్మక వ్యక్తీకరణల పట్ల భారత శాశ్వత నాగరికతా విశ్వాసాన్ని ప్రతిబింబించే వేడుకగా ఎంఐఎఫ్ఎఫ్‌ను అభివర్ణించారు. రుగ్వేదంలోని ప్రసిద్ధిగాంచిన "మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి మనకు అందాలి" అనే సూక్తిని ఉటంకిస్తూ... ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రాలను, ఆలోచనలను, సృష్టికర్తలను ఒకచోట చేర్చుతోందని అన్నారు. వాస్తవాలను లోతుగా అన్వేషించి, వాటిని ఆకట్టుకునే సినిమా కథనాల ద్వారా ప్రదర్శించడానికి సాహసించే చిత్రరూపకర్తలకు ఒక కీలక వేదికను అందించడం ద్వారా ఈ ఎంఐఎఫ్ఎఫ్... గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'క్రియేట్ ఇన్ ఇండియా' దార్శనికతనూ ప్రతిబింబిస్తోందని కార్యదర్శి అన్నారు.
భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ జైదీప్ అహ్లావత్‌కు సత్కారం
భారతీయ సినిమాకు చేసిన విశేష సేవలకు గానూ ప్రఖ్యాత నటుడు జైదీప్ అహ్లావత్‌ను సత్కరించడం ఈ సాయంత్రం జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి. ఇతర ప్రముఖుల సమక్షంలో డాక్టర్ ఎల్. మురుగన్ ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ సత్కారాన్ని అందుకున్న అహ్లావత్ మాట్లాడుతూ... అర్థవంతమైన కథనాల కోసం ప్రపంచస్థాయి వేదికను కల్పించడంలోనూ, ప్రధాన స్రవంతి కథనాలకు అతీతంగా సినీ గళాన్ని ప్రోత్సహించడంలోనూ ఎంఐఎఫ్ఎఫ్ వంటి ఉత్సవాల ప్రాముఖ్యతను అంగీకరిస్తూ, ఈ కార్యక్రమ నిర్వహణ కోసం తన కృతజ్ఞతలు తెలిపారు.
తెరంగేట్ర చిత్రాల తారాగణం, సాంకేతిక బృందానికి సన్మానం
ఈ వేడుకలో, ఉత్సవ ప్రారంభ చిత్రాల వెనక ఉన్న సృజనాత్మక బృందాలనూ ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ‘అగాపిటో’ లఘుచిత్రం, ‘టైమ్ అండ్ వాటర్’ డాక్యుమెంటరీ రూపకర్తలను ఈ వేదికపై సన్మానించారు.
‘అగాపిటో’ చిత్ర నటుడు ఆంటోన్ నోలాస్కో, కాస్టింగ్ డైరెక్టర్ క్రిస్టినా సైమన్‌లను సత్కరించారు. ప్రపంచంలోని ఆసక్తికరమైన కథలను ప్రేక్షకులకు అందించినందుకు ‘టైమ్ అండ్ వాటర్’తో అనుబంధం ఉన్న నేషనల్ జియోగ్రఫిక్, జియోస్టార్ బృందాల సభ్యులనూ ఘనంగా సత్కరించారు.
జ్యూరీ సభ్యులకు సత్కారం
ప్రారంభోత్సవంలోని మరో విభాగంలో... అంతర్జాతీయ పోటీ జ్యూరీ, జాతీయ పోటీ జ్యూరీ, ఎఫ్ఐపీఆర్ఈఎస్‌సీఐ జ్యూరీల సభ్యులకు ఉత్సవ నిర్వాహకులు సాదర స్వాగతం పలికి, సత్కరించారు.
ఈ ఉత్సవంలోని విభిన్నమైన డాక్యుమెంటరీలు, కల్పనాత్మక కథల లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలను పరిశీలించి, వాటి నుంచి అత్యుత్తమైన వాటిని ఎంపిక చేసే బాధ్యతను... భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన చిత్రరూపకర్తలు, విమర్శకులు, పండితులు, ప్రోగ్రామర్లు, మీడియా నిపుణులతో కూడిన జ్యూరీ ప్యానెల్‌లకు అప్పగించారు.
ప్రారంభోత్సవ వేడుకలో భారత కళా వారసత్వాన్ని ప్రదర్శించే ఒక ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చిత్రనిర్మాత-ఐఎఫ్ఎఫ్ఐ 2026 ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్, ప్రసార భారతి ఛైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి, ఎన్ఎఫ్‌డీసీ ఛైర్మన్ శ్రీ కృష్ణకుమార్ జి, ఎమ్ఐఎఫ్ఎఫ్ ఫెస్టివల్ డైరెక్టర్-ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్, ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐడీపీఏ) అధ్యక్షులు శ్రీ సంస్కార్ దేశాయ్, సినీ పరిశ్రమ ప్రముఖులు, చిత్రనిర్మాతలు, జ్యూరీ సభ్యులు, దేశవిదేశాలకు చెందిన విశిష్ట అతిథులు హాజరయ్యారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే... ఎన్ఎఫ్‌డీసీ అమలు చేసే ఈ ఏడు రోజుల ఉత్సవం... చిత్రరూపకర్తలు, పరిశ్రమ నిపుణులు, సినీ ప్రియులందరికీ ఒక సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ సినిమా గొప్పతనాన్ని ప్రదర్శించడం, భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పడం లక్ష్యంగా... ఈ సంవత్సరం ఉత్సవంలో "మరాఠీ చిత్రాలు", "ఎకోస్ ఫ్రమ్ నార్త్-ఈస్ట్" అనే రెండు కొత్త విభాగాలనూ ప్రవేశపెట్టారు.
ఎమ్ఐఎఫ్ఎఫ్ వేదికగా ఒకచోట చేరుతున్న భారత-ప్రపంచవ్యాప్త అసాధారణ చిత్రాలు, విభిన్న ప్రాంతాల గళాలు, దృక్కోణాల ప్యాకేజీ గురించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
19వ ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 గురించి
ప్రత్యేకించి నాన్-ఫీచర్ సినిమాల కోసం దక్షిణాసియాలోనే అతి పురాతన, అతిపెద్ద చలనచిత్రోత్సవంగా గుర్తింపు పొందిన ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్)... డాక్యుమెంటరీ, కాల్పనిక కథల లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి ఎప్పటినుంచో ఒక ఉత్సాహభరితమైన వేడుకగా నిలుస్తోంది. 1990లో స్థాపించి, భారత ప్రభుత్వ సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎమ్ఐఎఫ్ఎఫ్... ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రరూపకర్తలు, కళాకారులు, సినీ ప్రియులను ఆకర్షించే ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికగా ఎదిగింది.
ఎమ్ఐఎఫ్ఎఫ్ 19వ ఎడిషన్... పరిశ్రమపై ప్రధానంగా దృష్టి సారించిన ఉత్తేజకరమైన కార్యక్రమాలతో పాటు, ఆలోచనాత్మకంగా ఎంపిక చేసిన, ప్రశంసలు పొందిన అంతర్జాతీయ చిత్రాల శ్రేణితో మైమరపించే, సుసంపన్నమైన సినిమా అనుభవాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది.
· ఈ సంవత్సరం, ఈ ఉత్సవంలోని పోటీ విభాగానికి భారత్ సహా 46 దేశాల నుంచి 1,459 చిత్రాల ఎంట్రీలు అందాయి.
· ఈ ఉత్సవం తన ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రాబల్యాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ... 42కు పైగా భారతీయ భాషలు, 30కి పైగా ఇతర భారత భాషల చిత్రాలను ప్రదర్శిస్తుంది.
· ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత చిత్రనిర్మాతల చిత్రాలను ప్రదర్శిస్తూ, ఈ ఉత్సవం కొన్ని అత్యుత్తమ డాక్యుమెంటరీలు, కల్పనాత్మక కథల లఘు చిత్రాలు, యానిమేషన్‌లు, ఆరంగేట్ర దర్శకుల చిత్రాలు, విద్యార్థులు రూపొందించిన చిత్రాలనూ ప్రదర్శిస్తుంది.
· స్క్రీనింగ్‌లతో పాటు, డాక్ బజార్ 2వ ఎడిషన్, విజ్ఞానాన్ని పెంచే మాస్టర్‌క్లాస్‌లు, ఐడీపీఏ వారి ఓపెన్ ఫోరమ్ వంటి కార్యక్రమాలు ఈ చిత్రోత్సవంలో సినిమా, సృజనాత్మకతల గురించిన విజ్ఞాన వినిమయాన్ని మరింతగా పెంపొందిస్తాయి.
ఎమ్ఐఎఫ్ఎఫ్-2026లో పాల్గొనడం ద్వారా కథలను వైవిధ్యంతో చెప్పే ఉత్సాహభరితమైన ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఇక్కడ శక్తిమంతమైన సినిమా, సృజనాత్మక మేధస్సు, స్ఫూర్తిదాయకమైన అనుభవాలు కలిసి డాక్యుమెంటరీ, యానిమేషన్, కాల్పనిక కథల లఘు చిత్రాలతో మరపురాని వేడుకను సృష్టిస్తాయి.
***
रिलीज़ आईडी:
2273326
| Visitor Counter:
13