మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నైస్‌ నగరంలో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’ ప్రారంభంతో భారత్-ఐరోపా సరికొత్త డీప్‌-టెక్‌ భాగస్వామ్యాలకు పునాది


ఈ కార్యక్రమం ద్వారా ఒకే వేదికపైకి వచ్చిన ప్రపంచ పెట్టుబడిదారులు.. ఆవిష్కర్తలు.. విద్యావేత్తలు.

ఆవిష్కరణ ప్రధానమైనవి సహా 30కి పైగా సంయుక్త భాగస్వామ్యాల సంబంధిత అవగాహన ఒప్పందాలపై సంతకాలు

విలువ పాటించే వ్యవస్థాపకులను.. సాంకేతిక అగ్రగాములను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య-పరిశోధన సంస్థలదే కీలక పాత్ర: శ్రీ ఎన్.ఆర్.నారాయణ మూర్తి

प्रविष्टि तिथि: 15 JUN 2026 4:45PM by PIB Hyderabad

   ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ఎగ్జిబిషన్‌ కేంద్రం ‘పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌ డి నైస్‌’లో “భారత్ ఇన్నొవేట్స్-2026” తొలి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిన్న సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌లోని డీప్ టెక్ ఆవిష్కర్తలు, ప్రపంచ భాగస్వాముల మధ్య ఆవిష్కరణాధారిత భాగస్వామ్యాల దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ అత్యంత ప్రభావశీల కార్యక్రమం ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతోంది.

భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న దేశీయ ఆవిష్కరణల రంగాన్ని ‘భారత్ ఇన్నొవేట్స్-2026’  కార్యక్రమం ప్రపంచం ముందు ప్రదర్శిస్తోంది. మొత్తం 120కి పైగా వినూత్న ఆవిష్కరణల అంకుర సంస్థలు, 15కు పైగా ఉన్నత విద్యా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి వెంచర్ కేపిటల్ సంస్థల ప్రతినిధులు సహా 500 మందికి పైగా అంతర్జాతీయ భాగస్వాములను ఇది ఒకే వేదికపైకి తెచ్చింది. తద్వారా అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, జీవ సాంకేతికత, ఇంధనం,  ఆరోగ్య సంరక్షణ, తయారీ తదితర 13 కీలక రంగాల్లో సాధించిన సరికొత్త ప్రగతిని, ఆవిష్కరణలను ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రత్యేకంగా ప్రదర్శిస్తోంది.

ఈ కార్యక్రమం తొలిరోజున అంతర్జాతీయ ఆవిష్కరణల కారిడార్లు, డీప్-టెక్ భాగస్వామ్యాల బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలువురు నిపుణుల కీలక ప్రసంగాలు, వ్యూహాత్మక చర్చలు, అంతర్జాతీయ పారిశ్రామిక చర్చాగోష్ఠులు నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం నిర్వహించిన ఓ సదస్సులో ‘ఇన్ఫోసిస్’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.ఆర్.నారాయణమూర్తి ప్రధాన ప్రసంగం చేశారు. అంతర్జాతీయంగా పోటీపడగల సాంకేతిక సంస్థలను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్యాసంస్థల పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకనాడు కేవలం 250 అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఓ చిన్న ఆలోచనగా అంకురించి, నేడు ప్రపంచమంతటా మహా వృక్షంలా ఊడలు దించిన ఐటీ దిగ్గజంగా ‘ఇన్ఫోసిస్’ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. అనుబంధ ప్రతిభ, ఉమ్మడి విలువలు, క్రమశిక్షణ సహిత ఆవిష్కరణలు, పారదర్శక పాలన, నమ్మకం నిండుగా, మెండుగా ఉంటేనే చిరస్థాయిగా నిలిచిపోయే సంస్థల రూపకల్పన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విలువలు పాటించే వ్యవస్థాపకులను, సాంకేతిక అగ్రగాములను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య-పరిశోధన సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. తద్వారా వారు జ్ఞానాన్ని ఆవిష్కరణగా... ఆవిష్కరణను వ్యాపార సంస్థగా రూపుదిద్దుతూ సమాజంపై దీర్ఘకాలిక ప్రభావం చూపగలరని శ్రీ నారాయణమూర్తి విశదీకరించారు.

అంతర్జాతీయ ఆవిష్కరణల రంగాన్ని అనుసంధానించే లక్ష్యంతో ఆవిష్కరణ ప్రధానమైనవి సహా 30కి పైగా సంయుక్త భాగస్వామ్యాల సంబంధిత కొత్త అవగాహన ఒప్పందాలు కుదరడం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్యాంశంగా నిలిచింది. ఆవిష్కరణలు, వ్యవస్థాపన, పరిశోధన రంగాల్లో పరస్పర సహకార విస్తృతి, అంకుర సంస్థలకు తగిన చేయూత దిశగా భారతీయ ఉన్నత విద్యా సంస్థలు/సంపోషక సంస్థలు, ఫ్రాన్స్ తదితర దేశాల అంతర్జాతీయ సంపోషకుల మధ్య 12 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అలాగే, నవ్య సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి, వాణిజ్యీకరణ, అంతర్జాతీయ విపణిలో భారతీయ ఆవిష్కర్తలకు అవకాశాల సౌలభ్యం దిశగా ప్రపంచ స్థాయి అగ్రగామి కార్పొరేట్ సంస్థలతో మరో 16 కీలక ఒప్పందాలు కుదిరాయి.

వీటికి తోడు విద్యార్థుల ఆదానప్రదానం, సంయుక్త పరిశోధనలు-ఆవిష్కరణలకు తోడ్పాటు, విద్యాసంబంధ సహకారం-నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకార విస్తృతిపై ఫ్రాన్స్‌లోని 13 విశ్వవిద్యాలయాలు, భారత్‌లోని ‘ఐఐఎస్‌సీ’, ‘ఐఐటీ’లు సహా 11 సాంకేతిక-విజ్ఞాన సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అలాగే, నీతి ఆయోగ్ పరిధిలోని అటల్ ఇన్నొవేషన్ మిషన్, ఫ్రాన్స్‌లోని ‘లా ఫౌండేషన్ దస్సాల్ట్ సిస్టమ్స్’ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్’ ద్వారా భారత ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ చట్రాన్ని ఫ్రాన్స్‌కు విస్తరిస్తారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌లో తొలి ‘పాఠశాల స్థాయి ఆవిష్కరణ ప్రయోగశాల ఏర్పాటు సహా రెండు దేశాల యువ ఆవిష్కర్తల మధ్య పరస్పర సహకారానికి బాటలు వేస్తారు.

తొలిరోజు కార్యక్రమాల్లో భాగంగా “ప్రపంచ శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ: విశ్వసనీయ.. సమగ్ర.. విస్తరణీయ ఏఐ కారిడార్ నిర్మాణం” ఇతివృత్తంతో నిర్వహించిన బృంద గోష్ఠిలో పారిశ్రామిక, పెట్టుబడి, పరిశోధన సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమై కృత్రిమ మేధ, స్వయంసమృద్ధ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి దిశా పరస్పర సహకార విధానాలపై వారు కూలంకషంగా చర్చించారు.

అనంతరం “భారత్‌-ఐరోపా: ఆకాశమే హద్దుగా డీప్ టెక్”, “గ్లోబల్‌ డీప్‌ టెక్‌ కేపిటల్‌ కారిడార్స్‌” ఇతివృత్తాలతో రెండు చర్చాగోష్ఠులు నిర్వహించారు. విస్తృత అవకాశాలుగల ఆవిష్కరణల రంగాలు, వెంచర్ ఫైనాన్సింగ్, వాణిజ్యీకరణ మార్గాలు, సరికొత్త సాంకేతికతలకు అంతర్జాతీయ విపణిలో అవకాశాల కల్పన తదితర అంశాలపై వీటిలో ప్రధానంగా దృష్టి సారించారు.

అంతర్జాతీయంగా విశ్వసనీయ-సమగ్ర-విస్తరణీయ ఏఐ కారిడార్‌ను రూపొందించాలని ‘భారత్ ఇన్నోవేట్స్-2026’ విస్తృత సదస్సు వేదికగా భారత్, ఫ్రాన్స్ దేశాల పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పిలుపునిచ్చారు. స్వల్ప వ్యయంతో, స్థానిక అవసరానుగుణ ఏఐ పరిష్కారాల్లో భారత్‌ బలాన్ని, స్వయంసమృద్ధ ఏఐ సామర్థ్యాలకు   పెరుగుతున్న ప్రాధాన్యంతోపాటు సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి బదులు సార్వత్రిక మూలాల సహకారం ఆవశ్యకతను ఈ చర్చ ప్రముఖంగా ప్రస్తావించింది. అంతర్జాతీయ పోటీతత్వంతో, పునరుత్థాన సామర్థ్యంగల కృత్రిమ మేద వ్యవస్థ రూపకల్పనలో సంయుక్త పరిశోధనలు, పెట్టుబడి భాగస్వామ్యాలు, విస్తృత అంతర్జాతీయ కూటమి అవసరాన్ని వక్తలు స్పష్టం చేశారు.

ఉన్నత స్థాయి భాగస్వామ్యం, వ్యూహాత్మక చర్చలు, సరికొత్త సహకార మార్గాన్వేషణతో సాగిన ‘భారత్ ఇన్నొవేట్స్-2026’ కార్యక్రమం తొలిరోజున ఆవిష్కరణల రంగంలో మరింత లోతైన అంతర్జాతీయ అనుసంధానానికి బలమైన పునాది వేసింది.

ఈ కార్యక్రమం, ఇందులో పాల్గొంటున్న అంకుర సంస్థలు తదితరాలపై మరింత సమాచారం కోసం www.bharatinnovates.inను సందర్శించండి.

***


(रिलीज़ आईडी: 2273202) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam