వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యయాన్ని లిఖించిన ఇండోర్ డిక్లరేషన్... బ్రిక్స్ అజెండాలో రైతులకు ప్రాధాన్యత

రైతులే కేంద్రంగా వృద్ధి, సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు బ్రిక్స్ దేశాల కృషి

భారత్ నాయకత్వంలో వ్యవసాయ భవిష్యత్తుపై ఏకాభిప్రాయం... చరిత్రాత్మక ఇండోర్ డిక్లరేషన్‌ను ఆమోదించిన బ్రిక్స్

ఇండోర్‌లో కీలక బ్రిక్స్ సమావేశం ముగింపు సందర్భంగా నాలుగు ప్రధాన అంతర్జాతీయ వ్యవసాయ వేదికల ప్రకటన

వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ ఆవిష్కరణలు, రైతు సంక్షేమమే లక్ష్యంగా బ్రిక్స్ వ్యవసాయ ఒప్పందం

ఇండోర్ డిక్లరేషన్‌తో ప్రపంచ వ్యవసాయ దౌత్యానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఇండోర్

ఇండోర్ డిక్లరేషన్ ద్వారా వ్యవసాయ సహకారంలో నూతన శకానికి శ్రీకారం చుట్టిన బ్రిక్స్ దేశాలు

'జ్ఞానం నుంచి ఆచరణలోకి’: వ్యవసాయ పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక బదిలీని బలోపేతం చేస్తున్న బ్రిక్స్

प्रविष्टि तिथि: 13 JUN 2026 5:43PM by PIB Hyderabad

ఇండోర్‌లో జరిగిన బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం శుక్రవారం నాడు ముగిసింది. 'ఇండోర్ డిక్లరేషన్‌'ను ఏకగ్రీవంగా ఆమోదించటంతో ప్రపంచ వ్యవసాయ సహకారంలో కీలక ఘట్టంగా ఈ సమావేశం నిలిచింది. ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, డిజిటల్ వ్యవసాయాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ ప్రకటన పలు కీలక నిర్ణయాలను వివరిస్తుంది. విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అనిశ్చితులు నెలకొన్న సమయంలో బ్రిక్స్ సమావేశం ప్రపంచానికి ఆశ, విశ్వాసం, ఉమ్మడి బాధ్యత సందేశాన్ని పంపిందని అన్నారు.

సమావేశ విస్తృతి, శక్తి, ప్రాధాన్యత

కేంద్రమంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ మీడియాతో మాట్లాడుతూ... బ్రిక్స్ వ్యవసాయ కార్యవర్గానికి సంబంధించిన ఉన్నతాధికారుల సమావేశం, మంత్రుల స్థాయి సమావేశం విజయవంతంగా ముగిసినట్లు తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి సుమారు 60 మంది విదేశీ ప్రతినిధులతో సహా దాదాపు 100 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయం, ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను బ్రిక్స్ దేశాలు ఎంత బాధ్యతగా, తీవ్రంగా పరిగణిస్తున్నాయో ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాల వాటా దాదాపు సగం ఉందని, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూమిలో సుమారు 42 శాతం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దాదాపు 42 శాతం వాటాను ఇవి అందిస్తున్నాయని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఫలితంగా ప్రపంచ వేదికపై బ్రిక్స్ సమష్టి స్వరం అద్భుతమైన శక్తిగా ఆవిర్భవించింది. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టటం పట్ల, ఇండోర్‌లో అధికారిక స్థాయి, మంత్రిత్వ స్థాయి వ్యవసాయ సమావేశాలు నిర్వహించటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

నాలుగు ప్రధాన ప్రాధాన్యతలపై చర్చ నాలుగు కీలక ప్రాధాన్యతలపై విస్తృత చర్చలు జరిగినట్లు కేంద్రమంత్రి తెలిపారు:

బ్రిక్స్ దేశాలు, ప్రపంచానికి ఆహార భద్రత, పోషకాహార భద్రత. బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్యం, సహకారాన్ని పెంపొందించటం. వాతావరణ మార్పులకు అనుగుణంగా పునరుత్పాదక, వాతావరణ మార్పులను తట్టుకోగల, సుస్థిర వ్యవసాయ పద్ధతులు. ఆహార వ్యవస్థలు, వ్యవసాయ రంగాల్లో ఆవిష్కరణలు, సాంకేతికత, భాగస్వామ్యాలను బలోపేతం చేయటం.

సమృద్ధిగా ఆహార లభ్యత ఉండేలా చూడటం, పోషకాహార ఫలితాలను మెరుగుపరచటం, ప్రపంచానికి అన్నం పెట్టే రైతుల జీవనోపాధిని సురక్షితం చేయటం వంటివి చర్చల ప్రధానాంశాలని ఆయన స్పష్టం చేశారు. పలు దేశాల్లో కుటుంబ రైతులుగా పిలవబడే చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి సవాళ్లు, వ్యవసాయ ఉత్పాదకాల లభ్యత, రుణ లభ్యత, లాభదాయకమైన ధరలు, మార్కెట్ అనుసంధానాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు.

ఇండోర్ ప్రకటన: రైతు-కేంద్రంగా ప్రపంచ నిబద్ధత

విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ ఉమ్మడి ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించామని, ఇకపై దీన్ని "ఇండోర్ డిక్లరేషన్"గా పిలుస్తారని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైతులే కేంద్రంగా ఈ ప్రకటన ఉందని... ఆహార భద్రత, పోషణ, జీవనోపాధి, వ్యవసాయ వాణిజ్యం, ఆవిష్కరణలు, పెట్టుబడులు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, సుస్థిర వ్యవసాయాభివృద్ధి వంటి రంగాల్లో పురోగతికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. "వ్యవసాయం ద్వారా సురక్షితమైన, మరింత సుసంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించాలనే బ్రిక్స్ దేశాల సమష్టి సంకల్పానికి, ఉమ్మడి బాధ్యతకు, నిబద్ధతకు ఈ ప్రకటన ప్రతీక" అని ఆయన అన్నారు. ఈ ప్రకటనలో పేర్కొన్న కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా, రైతులకు, గ్రామీణ సమాజాలకు, ఆహార వ్యవస్థలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరేలా సభ్య దేశాలు సమష్టిగా, నిరంతరం పనిచేయటానికి అంగీకరించినట్లు తెలిపారు.

ప్రకటించిన నాలుగు నూతన సంస్థాగత కార్యక్రమాలు

1. వ్యవసాయ-పర్యావరణ శాస్త్రం, పునరుత్పాదక వ్యవసాయంపై బ్రిక్స్ ప్రతిభా కేంద్రాల వ్యవస్థ

వ్యవసాయ-పర్యావరణ శాస్త్రం, పునరుత్పాదక వ్యవసాయంపై బ్రిక్స్ ప్రతిభా కేంద్రాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. సహజ, సేంద్రియ, పునరుత్పాదక వ్యవసాయ రంగాల్లో ఉమ్మడి పరిశోధన, జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. సభ్య దేశాలు ఒకరి ఉత్తమ పద్ధతుల నుంచి మరొకరు నేర్చుకోవటానికి, వాతావరణ మార్పులను తట్టుకోగల, సుస్థిరమైన వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించటానికి ఇది వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, రసాయన ఎరువుల సమతుల్య వినియోగానికి భారత్ దీర్ఘకాలంగా ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ... బ్రిక్స్ దేశాలు సమష్టిగా ఈ విధానాల ప్రాముఖ్యతను గుర్తించాయని శ్రీ శివరాజ్ చౌహాన్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా భారతదేశ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మోదీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ కీలక పాత్ర పోషిస్తుందని.. ఉమ్మడి పరిశోధనలు, జ్ఞాన భాగస్వామ్యం, శిక్షణకు సహకారాన్ని అందిస్తుందని వెల్లడించారు.

2. డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ వ్యవస్థ

ప్రకటించిన రెండో ప్రధాన కార్యక్రమం... డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ వ్యవస్థ. కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా ఆధారిత వ్యవసాయ పరిష్కారాల్లో సహకారాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వ్యవసాయ ఆవిష్కరణల మధ్య వారధిగా పనిచేస్తుందని, తద్వారా సాంకేతిక పురోగతి నేరుగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఈ వ్యవస్థను ఐఐటీ ఢిల్లీ సమన్వయం చేస్తుండగా డిజిటల్ వ్యవసాయంలో ఉమ్మడి పురోగతిని సాధించేందుకు సభ్య దేశాలన్నీ ఆవిష్కరణలు, అనుభవాలు, విధానపరమైన నిర్ణయాలను పంచుకోవటం ద్వారా సహకారాన్ని అందిస్తాయి.

3. విత్తన వ్యవస్థల్లో రైతుల హక్కులపై ప్రపంచ వేదిక

మూడో ప్రధాన ప్రకటనగా విత్తన వ్యవస్థల్లో రైతుల హక్కులపై ప్రపంచ వేదిక ఏర్పాటును కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ వెల్లడించారు. విత్తనాలకు సంబంధించి రైతుల హక్కులను రక్షించడం, స్థానిక (దేశవాళీ) విత్తన వైవిధ్యాన్ని కాపాడటం, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను పరిరక్షించడంపై ఈ వేదిక ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ వంటి దేశాలకు వందలాది, వేలాది సంవత్సరాల వ్యవసాయ సంప్రదాయాలు ఉన్నాయని, అయితే జీవవైవిధ్యం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచే అనేక సాంప్రదాయ విత్తన రకాలు ప్రస్తుతం అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కొత్త, హైబ్రిడ్ వంగడాలు ఎంత అవసరమో, దేశవాళీ విత్తనాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం’’ అని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, ఆహార భద్రత నేపథ్యంలో సాంప్రదాయ విత్తనాల ప్రాధాన్యతను గుర్తిస్తూ... వాటి పరిరక్షణ, నిరంతర లభ్యతను నిర్ధారించడానికి, రైతుల సంప్రదాయ జ్ఞానాన్ని కాపాడటానికి ఈ వేదిక కృషి చేస్తుందని తెలిపారు.

4. బ్రిక్స్ అగ్రిన్-వ్యవసాయ ఉత్పాదకాలు, జన్యు వనరులు, సమాచార వ్యవస్థ

నాల్గవ కార్యక్రమంగా బ్రిక్స్ అగ్రిన్ ఏర్పాటును ప్రకటించారు. (వ్యవసాయ ఉత్పాదకాలు, జన్యువనరులు, సమాచార వ్యవస్థలు). వ్యవసాయ ఉత్పాదకాలు, విత్తనాలు, జన్యు వనరుల్లో సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ఈ వేదిక ముఖ్య ఉద్దేశ్యం. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉత్తమ వంగడాలు, జన్యు వనరులు, మేలైన పద్ధతులను మరింత సమర్థవంతంగా పంచుకునేందుకు వీలుగా సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం, సామర్థ్య పెంపొందింపు, భాగస్వామ్యాలను ఈ వ్యవస్థ సులభతరం చేస్తుందని శ్రీ చౌహాన్ చెప్పారు. ఇటువంటి వనరులు, సమాచారం అందుబాటులో లేని దేశాలకు, రైతులకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత వేదికల బలోపేతం

ప్రస్తుతం ఉన్న బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన వేదికను మరింత బలోపేతం చేసి, దానిని ఒక శక్తిమంతమైన ‘నాలెడ్జ్-టు-యాక్షన్ హబ్’ (పరిజ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చే కేంద్రం)గా అభివృద్ధి చేయడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించాయని కేంద్ర మంత్రి తెలిపారు. పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా, త్వరితగతిన రైతుల పొలాల్లోకి చేరాలని ఆయన చెప్పారు. ‘‘పరిమిత వర్గాలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలను విస్తరించడం, కొత్త సాంకేతికతలు, పరిష్కారాలు ఎక్కువ సంఖ్యలో దేశాలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చూడటమే మా లక్ష్యం. ఇదే ‘ల్యాబ్ టు ల్యాండ్‌’ (ప్రయోగశాల నుంచి పొలానికి) విధానం నిజమైన స్ఫూర్తి’’ అని ఆయన అన్నారు.

వ్యవసాయ వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి

న్యాయమైన, సమానమైన, సమగ్రమైన, పారదర్శకమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించినట్లు శ్రీ చౌహాన్ తెలిపారు. భారత్‌ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమం ద్వారా బ్రిక్స్ ధాన్యం మార్పిడి వంటి ప్రతిపాదనలపై చర్చలు పుంజుకున్నాయని ఆయన చెప్పారు. సభ్య దేశాల మధ్య జరిగిన పలు ద్వైపాక్షిక సమావేశాలలో వ్యవసాయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం, కస్టమ్స్, ఇతర అడ్డంకులను తగ్గించడం, పరిశోధన సహకారాన్ని పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. 

వాతావరణ మార్పులు, ఎల్ నినో, కార్బన్ క్రెడిట్స్, ఆహార నష్టం

వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ముప్పును ప్రస్తావిస్తూ... భూమి కేవలం ప్రస్తుత తరానికే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా చెందుతుందని, అందుకే పునరుత్పాదక, వాతావరణ మార్పులను తట్టుకునే, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాల్సిన ఉమ్మడి బాధ్యత అందరిపై ఉందని శ్రీ చౌహాన్ అన్నారు. ఎల్ నినో ప్రభావంపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. దీని ప్రభావం భారత్‌తో పాటు పలు ఆసియా-పసిఫిక్ దేశాలపై పడే అవకాశం ఉందన్నారు. అయితే దేశాలన్నీ దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయని, ఇటువంటి సవాళ్లను అధిగమించడానికి ఉమ్మడి వ్యూహాలు, సమాచార మార్పిడి యంత్రాంగాలపై చర్చలు జరిగాయని చెప్పారు. కార్బన్ క్రెడిట్ల గురించి మాట్లాడుతూ... దీని కోసం ఇప్పటికే ఒక వ్యవస్థ అందుబాటులో ఉందని, నిర్దేశిత విధానాలను అనుసరించే రైతులు కార్బన్ క్రెడిట్ వ్యవస్థల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. వాతావరణాన్ని రక్షించే విధానాలు, పునరుత్పాదక వ్యవసాయం ఈ దిశగా ఆచరణాత్మక మార్గాలను చూపుతాయన్నారు. ఆహార నష్టంపై జరిగిన సాంకేతిక చర్చలను ప్రస్తావిస్తూ... పంట కోతల తర్వాతి నష్టాలను తగ్గించడం, కర్బన్ ఉద్గారాలకు కారణమవుతున్న ఆహార వృథాను అరికట్టే మార్గాలను సభ్య దేశాలు పరిశీలించాయని శ్రీ చౌహాన్ వివరించారు.

నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సాంకేతికతను అలవర్చుకోవడంలో యువత అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారని, బ్రిక్స్ దేశాలు తమ అనుభవాలు, విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఈ ధోరణిని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యవసాయ దౌత్యానికి కొత్త కేంద్రంగా అవతరించిన ఇండోర్ 

ఇండోర్ నగరం అందించిన ఆతిథ్యాన్ని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రశంసించారు. మాల్వా ప్రాంతం చూపిన ఆదరణ, సాంప్రదాయ ఆతిథ్యానికి విదేశీ ప్రతినిధులు ఎంతగానో ముగ్ధులయ్యారని పేర్కొన్నారు. ఇండోర్‌లోని ఛప్పన్ దుకాన్, రాజ్వాడ, మాండూ ప్రాంతాల సందర్శన విదేశీ ప్రతినిధులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ప్రచారంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇండోర్‌లోని మేఘదూత్ గార్డెన్‌లో మొక్కలు నాటి, అక్కడ ‘బ్రిక్స్ వాటిక’ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో గ్లోబల్ పార్క్, యూరో-రష్యన్ పార్కులను కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వారి బృందంతో పాటు... కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ, విదేశాంగ, పశుసంవర్ధక, మత్స్య శాఖ, వాణిజ్య, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ అందించిన సహకారాన్ని శ్రీ చౌహాన్ అభినందించారు. ఇండోర్‌లో బ్రిక్స్ సమావేశాలను ఇంత ఘనంగా నిర్వహించడం అనేది ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసికట్టుగా పనిచేసే ‘ప్రభుత్వ సమగ్ర విధానం’, ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని, ఈ కార్యక్రమం నిజంగా అపూర్వమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు.

***


(रिलीज़ आईडी: 2272566) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Gujarati , Tamil , Kannada , Malayalam