ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన
प्रविष्टि तिथि:
13 JUN 2026 10:05AM by PIB Hyderabad
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించనున్నాను.
భారత వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఫ్రాన్స్ స్థానం ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆ దేశ అధ్యక్షులు శ్రీ మాక్రాన్ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల సంబంధాన్ని ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి మనం ఉన్నతీకరించాం. నేను నైస్‌లో ఆ దేశ అధ్యక్షులు శ్రీ మాక్రాన్‌ను కలిసినప్పుడు... ఫిబ్రవరి నుంచి సాధించిన పురోగతిని సమీక్షించి, ఇరు దేశాల పరస్పర సహకారం విషయంలో భవిష్యత్ చర్యలను రూపొందిస్తాం. పరస్పర ప్రయోజనకరమైన అత్యవసర ప్రాపంచిక సమస్యలపైనా చర్చించడానికి నేను ఎదురుచూస్తున్నాను.
నైస్‌లో, ఈ నెల 14న ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీ మాక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’ను ప్రారంభించడానికి నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సర నేపథ్యంలో జరుగుతున్న ఈ చరిత్రాత్మక కార్యక్రమం... భారత్‌లోని అత్యంత ఆశాజనకమైన అంకురసంస్థలను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానించడంతో పాటు, భారత ఉన్నత విద్యా వ్యవస్థ నుంచి రూపుదిద్దుకునే ఆవిష్కరణలకు ఒక ప్రధాన చోదకంగానూ పనిచేస్తుంది.
నేను ఈ నెల 14-15 తేదీల్లో నైస్ నుంచి స్లోవాక్ రిపబ్లిక్‌లో అధికారిక పర్యటనకు వెళ్తాను. 1993లో స్లోవేకియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధానమంత్రి ఆ దేశంలో చేస్తున్న తొలి పర్యటన ఇది. ఈ చరిత్రాత్మక పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఉన్న బలమైన పురోగతిని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. బ్రాటిస్లావాలో అధ్యక్షులు శ్రీ పెల్లెగ్రీ, ప్రధానమంత్రి శ్రీ ఫికోలతో చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. స్లోవాక్ వ్యాపార రంగ ప్రముఖులతో సంభాషించే అవకాశం నాకు లభిస్తోంది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన ఊపును కొనసాగిస్తూ, ఈ పర్యటన యూరోపియన్ యూనియన్‌తో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉత్తేజపరుస్తుంది. స్లోవేకియా దేశం యూరోపియన్ యూనియన్‌లో ఒక ముఖ్యమైన, విలువైన సభ్య దేశంగా కొనసాగుతోంది.
స్లోవేకియా నుంచి నేను ఎవియాన్‌కు వెళ్తాను. అక్కడ ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటాను. జీ7లో భారత్ పాల్గొనడం మన భాగస్వాములు మనపై ఉంచిన నమ్మకాన్ని, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మన దేశ ప్రాబల్యాన్ని ప్రతిబింబిస్తుంది. వరుసగా భారత్‌ను ఆహ్వానిస్తున్న 8వ జీ7 శిఖరాగ్ర సమావేశం ఇది. జీ7 వేదికగా, భారత్ తన అభిప్రాయాలను మాత్రమే కాకుండా, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలనూ స్పష్టంగా ప్రస్తావిస్తుంది.
ఈ నెల 18న పారిస్‌లో నా ఫ్రాన్స్ పర్యటన ముగిస్తుంది. అక్కడ నేను అధ్యక్షులు శ్రీ మాక్రాన్‌తో కలిసి వివాటెక్- 2026 సదస్సులో పాల్గొంటాను. ఇది యూరప్‌లో సాంకేతికత, ఆవిష్కరణలకు సంబంధించిన అత్యున్నత సదస్సు. ఈ సదస్సులో భారత్ అతిపెద్ద జాతీయ పెవిలియన్‌నూ ఏర్పాటు చేయనుంది. ఇది భారత్-యూరోపియన్ ఆవిష్కరణల వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఉన్న అపారమైన సామర్థ్యానికి ఒక సముచితమైన చిహ్నం. ఇరు దేశాల మధ్య చైతన్యవంతమైన వారధిగా ఉన్న పారిస్‌లోని ప్రవాస భారతీయులను కలవడానికీ నేను ఎదురుచూస్తున్నాను.
ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో నా పర్యటనలు ఐరోపా, జీ7 దేశాలతో భారత్ కలిగి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయనీ... ఈ ఖండంతో, అంతకు మించి మన భాగస్వామ్యాల పరిధిని విస్తరించడం పట్ల మన దృఢ నిబద్ధతను ప్రదర్శిస్తాయనీ నేను విశ్వసిస్తున్నాను.
****
(रिलीज़ आईडी: 2272452)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada