నౌకారవాణా మంత్రిత్వ శాఖ
గల్ఫ్ ప్రాంత సముద్ర భద్రత పరిస్థితుల మార్పు నేపథ్యంలో భారత నావికుల రక్షణపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తం
ప్రతి నావికుడి భద్రత.. రక్షణ.. సంక్షేమంపై సంపూర్ణ నిబద్ధత: సర్బానంద సోనోవాల్
प्रविष्टि तिथि:
11 JUN 2026 9:27PM by PIB Hyderabad
గల్ఫ్ ప్రాంతం సహా పరిసర ప్రాంతాల్లో సముద్ర భద్రత పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారత నావికుల రక్షణ, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా సంబంధిత యంత్రాంగాల కార్యకలాపాలపై పర్యవేక్షణతోపాటు సమగ్ర సమన్వయానికి ప్రాధాన్యమిస్తోందని ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) ద్వారా హోర్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ సహా వాటి పరిసర సముద్ర జలాల్లో పరిణామాలపై నిరంతర నిఘాను కొనసాగిస్తోంది.
ముఖ్యంగా భారత నావికులకు సకాలంలో మద్దతు, సహాయం అందించడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖతోపాటు భారత నావికా దళం, భారత దౌత్య కార్యాలయాలు, మిత్ర దేశాల సముద్ర పాలన యంత్రాంగాలు, నౌకా రవాణా కంపెనీలు, నావికా సంక్షేమ సంస్థలు సహా సంబంధిత ఇతర భాగస్వాములతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానానికి ఎదురైన ఇటీవలి సంఘటనలు, ముప్పులు వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనకు దారితీశాయి. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు దిశగా అంతర్జాతీయ నౌకాయాన మార్గాల వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తదనుగుణంగా భారత నావికులు లేదా సముద్ర ప్రయోజనాలపై అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక పరిస్థితులలో తక్షణ ప్రతిస్పందనకు సిద్ధం కావాలని సంబంధిత యంత్రాంగాలన్నింటినీ ఆదేశించింది.
సంఘర్షణ ప్రభావిత సముద్ర మార్గాల మీదుగా ప్రయాణించే భారత, విదేశీ పతాకాలు గల నౌకలలోని భారతీయ నావికులందరూ అత్యంత అప్రమత్తత వహించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ‘డీజీఎస్’ సూచించింది. నౌకా నిర్వాహణ సంస్థలు, నౌకాయాన పర్యవేక్షకులు, రవాణా కంపెనీలు కూడా ప్రస్తుత సముద్ర భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులపై అవగాహనను మెరుగుపరచుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహా సంబంధిత అంతర్జాతీయ అధీకృత సంస్థలు జారీచేసే సలహాలను తూచా తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేసింది.
భారతీయ నావికులకు సంబంధించిన ప్రతి సంఘటనపైనా ‘డీజీఎస్’కు తక్షణ సమాచారం ఇవ్వాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. తద్వారా తక్షణ జోక్యం, సమన్వయానికి వీలుంటుందని తెలిపింది. భారతీయ నావికులకు, వారి కుటుంబాలకు అవసరమైన చేయూత కోసం ప్రత్యేక సమాచార వ్యవస్థలు, అత్యవసర స్పందన యంత్రాంగాలు అహర్నిశలూ కృషి చేస్తున్నాయని తెలిపింది.
ఈ పరిణామాలపై కేంద్ర ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ- “గల్ఫ్ ప్రాంతంలో అనుక్షణం మారిపోతున్న పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ప్రతి భారతీయ నావికుడి భద్రత, సంక్షేమంపై సంపూర్ణ నిబద్ధతతో, అవసరమైన ప్రతి సందర్భంలో సత్వర మద్దతు, సహాయంపై సన్నద్ధంగా ఉంది. తదనుగుణంగా సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయి” అని వివరించారు.
‘ఎంటీ సెట్టబెల్లో’ నౌకపై దాడి... భారతీయ నావికులకు సహాయం
ఈ ప్రాంతంలో పలావూ ద్వీప దేశ పతాకంతో ప్రయాణిస్తున్న మీడియం రేంజ్ ట్యాంకర్ నౌక ‘ఎంటీ సెట్టబెల్లో’ (ఐఎంఓ 9162916) ఈ నెల 10వ తేదీన దాడికి గురైంది. ఇందులో 24 మంది భారత నావికులు సహా 28 మంది సిబ్బంది ఉన్నారు. ఒమన్ దేశంలోని సోహార్‌కు ఈశాన్యంగా సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా ఈ నౌక క్షిపణి దాడి బారినపడింది.
ఒమన్ సముద్ర భద్రత కేంద్రం నుంచి అందిన సమాచారం, నౌకా నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం- ఈ సంఘటనలో దురదృష్టవశాత్తూ ముగ్గురు భారత నావికులు మరణించారు. ఈ వర్తమానం అందగానే ఆ నౌకలోని వారికి అవసరమైన సహాయం దిశగా కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు, నౌక యజమానులు సహా రిక్రూటింగ్ సంస్థలతో సమన్వయం ద్వారా తక్షణ చర్యలు చేపట్టింది. ముగ్గురు భారత నావికుల మృతదేహాలను సత్వరం గుర్తించడంతోపాటు మిగిలిన సిబ్బందినీ సురక్షితంగా తీసుకొచ్చింది. వీరందర్నీ స్వదేశం తరలించడం సహా ముగ్గురి మృతదేహాలను వారి కుటుంబాలకు గౌరవప్రదంగా అప్పగించేందుకు వేగంగా చర్యలు తీసుకుంది.
ఈ దుర్ఘటనలో మరణించిన ముగ్గురు నావికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది. విధి నిర్వహణలో ఉండగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశానికి ఎంతో బాధాకరమని పేర్కొంది.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందిస్తూ- “పలావు ద్వీపదేశ పతాకంతో ప్రయాణిస్తున్న నౌక క్షిపణి దాడికి గురికావడం, భారతీయ నావికుల మృతి ఎంతో విషాదకరం. ఈ ఉదంతంలో తొలుత ముగ్గురు భారతీయ నావికులు గల్లంతైనట్లు భావించినా, మృతదేహాల వెలికితీతతో వారి మరణం నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భారత పౌరుల భద్రత, సముద్ర రంగంలో భారత ప్రయోజనాల పరిరక్షణ, చట్టబద్ధ సరకు రవాణాకు అంతరాయం లేకుండా చూడటానికి మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని పరిణామాలనూ నిశితంగా గమనిస్తోంది. భారత నావికుల ప్రాణరక్షణ, దేశ ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలన్నీ తీసుకుంటుంది” అని ప్రకటించారు.
ఈ మేరకు భారత నావికుల భద్రత, సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ‘డీజీఎస్’ పరిధిలోని ‘సీఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ’ ద్వారా ప్రభావిత నావికులు, వారి కుటుంబాలకు అవసరమైన సంక్షేమ ప్రయోజనాలు, ఆర్థిక సహాయం, ఇతరత్రా చేయూతనిచ్చేందుకు సంసిద్ధత తెలిపింది. నిబంధనల ప్రకారం- మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కోసం ప్రస్తుతం సొసైటీ ద్వారా రూ.10 లక్షలు విడుదల చేస్తోందని మంత్రి తెలిపారు.
దీనిపై మాట్లాడుతూ- “ఇది మన సముద్ర నావికా కుటుంబాలకు వ్యథాభరిత సమయం. మోదీ ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు బంధువులకు పూర్తి మద్దతిస్తుంది. దాడికి గురైన నౌక నుంచి రక్షించిన సిబ్బందిని తక్షణం స్వదేశానికి తరలించేందుకు, మృతుల భౌతికకాయాలను వారి కుటుంబాలకు సగౌరవంగా అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను” అని ఆయన వెల్లడించారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా ‘డీజీఎస్’ సహా సంబంధిత నావికా నియామక సంస్థల ద్వారా ప్రభావిత నావికుల కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రక్షిత సిబ్బందిని స్వదేశానికి రప్పించడం, మృతదేహాల తరలింపు సహా వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాల దిశగా ప్రభుత్వం సంబంధిత అధికారులతో చురుగ్గా సమన్వయం చేసుకుంటోంది.
ఇందులో భాగంగా ప్రభుత్వం జారీ చేసే సూచనలు, ఆదేశాల అమలులో సంబంధిత వర్గాలన్నీ నిరంతరం జాగరూకత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం పౌరులు ‘ఎంఎండీఏసీ’ (డీజీ కమ్యూనికేషన్ సెంటర్)ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు dgcommcentre-dgs[at]nic[dot]inకు ఈమెయిల్ ద్వారా లేదా +91 8657549760 నంబరుకు వాట్సాప్/కాల్ ద్వారా సంప్రదించవచ్చునని పేర్కొంది. అలాగే ఇతర నంబర్లు: +91 2222613606, +91 8657549752; లేదా 24×7 ఫిర్యాదు పరిష్కార మార్గాలైన టోల్-ఫ్రీ నంబర్ (దేశీయ): 1800-889-7768, అంతర్జాతీయ టోల్-ఫ్రీ: +1-888-988-0256, వాట్సాప్: +91 8655856830 సహా enavik.24x7[at]gov[dot]inకు ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చునని వివరించింది.
భారత నావికులకు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. భౌగోళిక-రాజకీయ అనిశ్చితి తీవ్రత నేపథ్యంలో వారి సంక్షేమం, భద్రత, శ్రేయస్సు దిశగా అవసరమైన చర్యలన్నిటినీ చేపడతామని భరోసా ఇచ్చింది.
***
(रिलीज़ आईडी: 2271954)
आगंतुक पटल : 6