ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార వ్యవస్థల్లో మార్పుచేర్పుల ద్వారా లక్షల మందికి ఉద్యోగాలతో పాటు వందల కోట్ల రూపాయల పెట్టుబడి అవకాశాలను


దక్షిణాసియా సృష్టించగలుగుతుంది... శాప్లింగ్ ఉన్నత స్థాయి విధాన చర్చ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ గ్రూపు వెల్లడి

प्रविष्टि तिथि: 10 JUN 2026 10:33AM by PIB Hyderabad

దక్షిణాసియా తన అభివృద్ధి మార్గంలో ఒక ముఖ్య మలుపులో ఉంది. పనిచేయదగిన వయోవర్గంలోకి  ఏటా లక్షలాది యువత వచ్చి చేరుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి కల్పన దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత కీలకాంశంగా మారింది. వ్యవసాయ రంగానికి ఆవల ఆహార శుద్ధి వ్యవస్థల్లో మార్పుచేర్పులను చేయడం ద్వారా ఉపాధికల్పన, పెట్టుబడి, ఆర్థికాభివృద్ధితో పాటు పేదరికం నిర్మూలనలో అనేక ప్రధాన అవకాశాలు అందిరాగలవని ప్రపంచ బ్యాంక్ గ్రూపు ముఖ్యంగా ప్రస్తావించింది.
దక్షిణాసియా ప్రాంతంలో వ్యవసాయ రంగానికి 700 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వార్షిక విలువ ఉంది. ఇది దాదాపు 43 శాతం మంది కార్మికులకు ఉపాధిని అందిస్తోంది. ఇంతటి విస్తృతిని కలిగి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం ఈ ప్రాంతంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 16 శాతాన్నే సమకూరుస్తోంది. దక్షిణాసియాలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 30 శాతం కన్నా ఎక్కువ వాటా ప్రతి ఏటా వృథా పోతోంది. ఇది సుమారు 30 కోట్ల మందికి ఆకలి బాధను తీర్చడానికి సరిపోతుందని చెప్పవచ్చు.
వ్యవసాయ రంగ రూపురేఖలలో మార్పునకు సంబంధించిన తదుపరి దశ ఒక్క ఉత్పత్తిని పెంచడంలో మాత్రమే కాకుండా, ఆహార శుద్ధి, నిల్వ, ఆధునిక రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), మార్కెటింగ్, విలువ జోడింపుల పరిధిని విస్తరించడంతో కూడా ముడిపడి ఉందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ కార్యకలాపాలతో ఆహార వ్యర్థాలను తగ్గించడం సాధ్యపడుతుందని, రైతుల ఆదాయం పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుందని, వీటితో పాటే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించవచ్చని వారు అంటున్నారు.
భారత్‌లో, ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950-51లో 51 మిలియన్ టన్నుల స్థాయి నుంచి పెరిగి ప్రస్తుతం 330 మిలియన్ టన్నులకు చేరుకొంది. కిందటి దశాబ్దంలో శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతుల విలువ రెండింతలు వృద్ధి చెంది దాదాపు 4.9 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు పైబడింది. ప్రస్తుతం తయారీ సంబంధిత విలువ జోడింపులో దాదాపు 9 శాతం వాటాతో పాటు, భారత ఎగుమతుల్లో సుమారు 13 శాతం వాటాను కూడా అందిస్తున్న రంగం ఆహార శుద్ధి రంగమే.  
విధానాల రూపంలో చేపట్టే వ్యూహాత్మక చర్యలు వ్యావసాయిక వేల్యూ చైన్లను ఏ విధంగా మార్చివేయగలవో భారత్ అనుభవం తెలియజెబుతోంది. ‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన’, ‘ప్రధానమంత్రి ఫార్మలేజేషన్ ఆఫ్ మైక్రో ఫూడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎమ్ఎఫ్ఎమ్ఈ) పథకం’, ‘ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్తించే ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహక  (పీఎల్ఐ) పథకం’ వంటి ప్రధాన కార్యక్రమాలు మౌలిక స్వరూపాన్ని పటిష్ఠపరిచి, వాణిజ్య సంస్థలను ఆధునికీకరించి, పెట్టుబడులను ఆకర్షించాయి. పోటీతత్వాన్ని మెరుగుపరిచాయి కూడా.
ఈ ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ, ముఖ్య అవకాశాలు మరెన్నో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ఉపాధికల్పనలో ఆహార శుద్ధి వాటా చిన్నదే. వ్యవసాయ ఉత్పాదనలకు దక్కాల్సిన ఒక పెద్ద వాటా ఇంకా మిగిలే ఉంది. ఉష్ణోగ్రతను నియంత్రించే ఏర్పాట్లున్న సరఫరా వ్యవస్థలు (కోల్డ్‌ చైన్లు), నిల్వ కేంద్రాలు, లాజిస్టిక్స్ నెట్‌వర్కులు, మార్కెట్ లింకేజులను బలోపేతం చేస్తే ఈ రంగంలో విలువను సృష్టించడంలో చెప్పుకోదగ్గ వృద్ధికి ఆస్కారం ఉంది.
ఆహార వ్యవస్థల రంగంలో ప్రపంచంలోనే నాయకత్వ స్థానాన్ని చేజిక్కించుకొనేందుకు దక్షిణాసియాలో అనేక అవకాశాలు ఉన్నాయి. శీఘ్రగతిన పట్టణీకరణ, బలాన్ని పుంజుకుంటున్న మధ్యతరగతి ప్రజానీకం, సుసంపన్న వ్యావసాయిక జీవ వైవిధ్యం, సురక్షితమైన, అధిక నాణ్యతతో కూడిన శుద్ధి చేసిన ఆహార పదార్థాలకు రోజు రోజుకూ పెరుగుతున్న గిరాకీ.. ఇవన్నీ పెట్టుబడికి, నూతన ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.
ఈ పరివర్తనకు వేగాన్ని జతచేయడానికి ‘అగ్రికనెక్ట్’తో పాటు ‘శాప్లింగ్’ (SAPLING)ల సంయుక్త విధానాన్ని  ప్రపంచ బ్యాంక్ గ్రూపు ప్రోత్సహిస్తోంది.
‘అగ్రికనెక్ట్’ ఒక అంతర్జాతీయ వేదిక. మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన సంస్కరణలు, ప్రయివేటు పెట్టుబడి సమీకరణతో 2030 కల్లా 3 కోట్ల మంది రైతులను మార్కెట్లతో అనుసంధానించవలసి ఉంది. ఈ కార్యక్రమం ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలు సహా అనేక దేశాల్లో ప్రాజెక్టులతో పాటు సంస్కరణలకు సహాయం చేస్తోంది.
‘శాప్లింగ్’ (ఇది సౌత్ ఏషియన్ పాలసీ లీడర్‌షిప్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ గ్రోత్‌.. ఎస్ఏపీఎల్ఐఎన్‌జీ.. కి సంకేత నామం) ఒక ప్రాంతీయ వేదికగా పనిచేస్తోంది. ఇది విధానపరమైన సంస్కరణలను ప్రోత్సహించడానికి, పెట్టుబడి అవకాశాలను పెంపొందింపచేయడానికి, ఫలప్రద పరిష్కారాలను దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించడానికి ప్రభుత్వాలను, అభివృద్ధి భాగస్వాములను, నూతన ఆవిష్కర్తలను ఏకతాటి మీదకు తీసుకువస్తోంది.
ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, పెట్టుబడిదారులతో పాటు అభివృద్ధి సంస్థలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ చేపట్టడం ప్రధానమని శాప్లింగ్ ఉన్నత స్థాయి విధాన చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు ముఖ్యంగా ప్రస్తావించారు.
కోల్డ్ చైన్లు, గిడ్డంగులు, ఆధునిక రవాణా వ్యవస్థకు సంబంధించిన కూడళ్లు (లాజిస్టిక్స్ హబ్స్), ప్రాసెసింగ్ క్లస్టర్లు, వ్యాసాయిక-పారిశ్రామిక పార్కులు, సరికొత్తగా తెర మీదకు వస్తున్న వ్యవసాయ సంబంధిత వాణిజ్య వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పెట్టుబడిదారు సంస్థలను ప్రోత్సహించారు. ఏకీకృత వేల్యూ చైన్లను ఏర్పాటు చేయాల్సిందిగాను, ట్రేసబులిటీతో పాటు నాణ్యతపరమైన హామీని అందించడానికి డిజిటల్ సాంకేతికతలను అనుసరించాల్సిందిగాను, కార్మిక శక్తిలో నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంపొందించడంలో పెట్టుబడి పెట్టాల్సిందిగాను కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.
విధాన రూపకర్తలు ఆహార శుద్ధి మండలాలను ప్రోత్సహించి, ఆధునిక రవాణా వ్యవస్థతో ముడిపడి ఉండే మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపరిచి, ఆహార భద్రత, ప్రమాణీకరణ వ్యవస్థలను సులభతరం చేసి, ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యాలను పటిష్ఠపరచడంతో పాటు మరింత ఎక్కువ పెట్టుబడికి అనువుగా ఉండే వాణిజ్య వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా ప్రగతిని వేగవంతం చేయవచ్చన్నవి కార్యక్రమంలో వ్యక్తమైన సూచనల్లో ముఖ్యమైనవి.
మిశ్రిత ఆర్థిక సహాయ యంత్రాంగాలను విస్తరించి, పెట్టుబడి అవకాశాలతో ముడిపడిన విధానపరమైన సంస్కరణలకు దన్నుగా నిలవడంతో పాటు ఆహార వ్యవస్థల్లో ప్రయివేటు రంగ పెట్టుబడికి సంబంధించిన నష్టభయాలను (రిస్క్‌స్) తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థలు ఉత్ప్రేరకంలా పనిచేయవచ్చని కూడా సూచించారు.
దక్షిణాసియా ఆహార ప్రధాన ఆర్థిక వ్యవస్థ భవిత ఒక్క ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడి లేదని ఈ చర్చాకార్యక్రమంలో స్పష్టం చేశారు. వ్యవసాయం మొదలుకొని మార్కెట్టు వరకూ ఆహార వ్యవస్థల రూపురేఖలలో మార్పులను చేసి, ఈ రంగం లక్షల కొద్దీ ఉద్యోగాలను అందించగలుగుతుందని, ఆహార వ్యర్ధాలను తగ్గించగలుగుతుందని, పోషణలో మెరుగుదలను తీసుకురాగలుగుతుందని, పెట్టుబడిని ఆకట్టుకోగలుగుతుందని, ఎగుమతులను విస్తరించగలుగుతుందని, రాబోయే దశాబ్దాల్లో సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి వేగాన్ని జతపరచగలుగుతుందని వివరించారు.
ప్రపంచ బ్యాంకు గ్రూపు నాయకత్వంలోని ‘శాప్లింగ్’ కార్యక్రమం సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎఫ్‌పీఐ) 2026 జూన్ 9న గుజరాత్‌.. అహమదాబాద్‌లో ప్రాంతీయ ఉన్నత స్థాయి విధాన చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ‘‘విలువను రాబట్టడం: దక్షిణాసియాలో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఆహార శుద్ధిని ముందుకు తీసుకుపోవడం’’ అంశాన్ని శీర్షికగా నిర్దేశించారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రాంతీయ చర్చా కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. వారిలో విధాన రూపకర్తలు, పరిశ్రమ ప్రముఖులు, అభివృద్ధి భాగస్వాములు, నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, దక్షిణాసియా దేశాల ప్రతినిధులు ఉన్నారు. వీరు దక్షిణాసియా ప్రాంతంలో ఆహార శుద్ధి విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దృఢతర, సమ్మిళిత, దీర్ఘకాల ప్రాతిపదిక కలిగిన ఆహార వ్యవస్థలను తీర్చిదిద్దే పద్ధతులపై చర్చించారు.

***


(रिलीज़ आईडी: 2271044) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil