రక్షణ మంత్రిత్వ శాఖ
సురక్షితంగా బయటపడ్డ 24 మంది భారతీయ నావికులు... ఒమన్ సమీపంలో వాణిజ్య నౌకపై దాడి అనంతరం భారత తీరరక్షక దళం - ఒమన్ అధికారుల సమన్వయ చర్యలు
प्रविष्टि तिथि:
09 JUN 2026 4:16PM by PIB Hyderabad
పలావు పతాకంతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ మారివెక్స్’ అనే ట్యాంకరుపై జరిగిన క్షిపణి దాడికి సంబంధించి భారత తీర రక్షక దళానికి చెందిన నౌకావాణిజ్య సమన్వయ కేంద్రం (ఎంఆర్‌సీసీ)- ముంబయికి సమాచారం అందింది. ఒమన్‌లోని మసిరా వద్ద లంగరు వేసి ఉన్న ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. 2026 జూన్ 8న దాదాపు 1420 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే.. ఒమన్ మేరిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ (ఓఎంఎస్సీ)తో ముంబయి ఎంఆర్‌సీసీ విభాగం సంప్రదింపులు చేపట్టింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతోపాటు, సిబ్బంది భద్రత కోసం ఓఎంఎస్సీ, సంబంధిత ఇతర వర్గాలతో నిరంతర సమన్వయాన్ని కొనసాగించింది. అనంతరం సుమారు 1700 గంటల సమయంలో... నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ నావికాదళ హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా రక్షించినట్లు ఒమన్ ఓఎంఎస్సీ ధ్రువీకరించింది. రక్షించిన సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ కాలేదని తెలిపింది. ప్రస్తుతం ఆ నౌక ఒమన్‌లోని మసిరా వద్దే ఉంది.
అంతర్జాతీయ నౌకావాణిజ్య సహకారంలో భారత్ సమర్థతకు ఈ విజయవంతమైన రక్షణ ఆపరేషన్ నిదర్శనం. అలాగే ఈ ప్రాంతంలోని సముద్ర రక్షణ సంస్థల మధ్య పటిష్టమైన సమన్వయ యంత్రాంగాన్ని మరోసారి స్పష్టం చేసింది. సముద్రయాన సమయాల్లో... అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సాయాన్ని అందించడంతోపాటు, భారతీయ నావికుల రక్షణకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటామన్న భారత తీరరక్షక దళ నిబద్ధతను ఇది చాటుతోంది.
***
(रिलीज़ आईडी: 2270969)
आगंतुक पटल : 12