వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'భవ్య' పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్
రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల పోటీతత్వ వృద్ధిని ప్రోత్సహించడమే 'భవ్య' పథక లక్ష్యం: శ్రీ పీయూష్ గోయల్
మౌలిక సదుపాయాలు, సంస్కరణలు, డిజిటల్ అనుసంధానతపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధే దేశ ఆర్థిక వృద్ధికి బలమైన పునాది: శ్రీ గోయల్
'భవ్య' పార్కులలో అంకురాలు, డీప్-టెక్, ఆర్-డీ, ఆవిష్కరణల ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక స్థలం: శ్రీ పీయూష్ గోయల్
బీఐఎస్, ఈఐఏ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భాగస్వామ్యంతో 'భవ్య' పార్కులలో అత్యాధునిక టెస్టింగ్ సౌకర్యాల అభివృద్ధి: శ్రీ పీయూష్ గోయల్
ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 'భవ్య' అమలు, పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టనున్న ఎన్‌ఐసీడీసీ
प्रविष्टि तिथि:
08 JUN 2026 6:07PM by PIB Hyderabad
'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్యా) అమలు దిశగా ఒక కీలక ఘట్టం నమోదైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు ఢిల్లీలో అధికారికంగా 'భవ్య' పోర్టల్‌ను ప్రారంభించారు. దేశంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సరికొత్త పోర్టల్ ఎంతో దోహదపడనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. 'భవ్య' పథకం పూర్తిగా ఒక పోటీ నమూనా ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాలు పారిశ్రామిక సామర్థ్యాలు, భూమి లభ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి, ఆయా రంగాల అభివృద్ధి అవకాశాలను వివరిస్తూ సమగ్ర ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రసాయనాలు, తయారీ రంగం, డేటా సెంటర్లు లేదా ఇతర పరిశ్రమలకు సంబంధించి ప్రతి ప్రాంతానికి అత్యంత అనుకూలమైన రంగాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించడానికి ప్రభుత్వం పరిశ్రమల ప్రతినిధులతో కలిసి పని చేస్తుందని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులు పెట్టుబడి నిర్ణయాలను సులభంగా తీసుకోవడానికి వీలుగా పారిశ్రామిక పార్కులలోని భూమి లభ్యత, అనుసంధానత, చుట్టుపక్కల ఉన్న మౌలిక సదుపాయాల గురించిన పూర్తి వివరాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. విభిన్న రంగాలు, పెట్టుబడిదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగానే ఈ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఆయన.. తద్వారా ఇవి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా మారుతాయని స్పష్టం చేశారు.
గత దశాబ్ద కాలంలో జాతీయ రహదారులు, రైల్వేలు, మెట్రోలు, విమానాశ్రయాలు, ఓడరేవుల అభివృద్ధి, విద్యుత్ మౌలిక సదుపాయాలు, నీటి లభ్యత, డిజిటల్ అనుసంధానత రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి, సామాజిక సంక్షేమానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని మరింత ప్రోత్సహించడానికి వీలుగా జీఎస్టీ, దివాలా కోడ్ (ఐబీసీ), కార్మిక సంస్కరణలు, 5జీ అనుసంధానతను విస్తరించటం, అంకురాలను ప్రోత్సహించటం, పెట్టుబడులకు మద్దతు, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక వ్యవస్థలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వంటి కీలక సంస్కరణలను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు.
దేశానికి ఉన్న విస్తృతి, పెరుగుతున్న డిమాండ్, నైపుణ్యం గల యువత, ఉరకలెత్తే యువ శక్తి కారణంగా అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా, అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తోందని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వ్యాపారాలు, పరిశ్రమలు, రైతులు, మత్స్యకారులు, అంకురాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు సరికొత్త అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
'భవ్య' పథకం గురించి వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి.. భారీ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆయా ప్రాంతాల అవసరాలు, రాష్ట్రాల నిబద్ధత ఆధారంగా ఈ పార్కులను వేర్వేరు పరిమాణాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొండ ప్రాంతాలు, చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో 25 ఎకరాల విస్తీర్ణంలో.. మధ్యస్థ పరిమాణంలో ఉండే రాష్ట్రాలు, ప్రాంతాలలో 100 నుంచి 500 ఎకరాల విస్తీర్ణంలో.. నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి 1,000 ఎకరాల వరకు ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన భూమిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయని కేంద్ర మంత్రి చెప్పారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన పూర్తి మద్దతును అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 51:49 భాగస్వామ్య నమూనాలో కలిసి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమలు అత్యంత అనుకూలమో గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తక్షణమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించుకునేందుకు వీలుగా ఉండే 'ప్లగ్ అండ్ ప్లే' పారిశ్రామిక పార్కులను సృష్టించడమే ఈ పథకం ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ పారిశ్రామిక పార్కులలో నిరంతర నీరు- విద్యుత్ సరఫరా, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు, స్పష్టమైన భూ యాజమాన్య హక్కులు, డిజిటల్ ఏక గవాక్ష అనుమతులు, వీలున్న చోట్ల విమానయాన అనుసంధానత వంటి అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీనితో పాటు అంకురాలు, డీప్-టెక్ పరిశ్రమలు, సాంకేతికత ఆధారిత వ్యాపారాలు, పరిశోధన- అభివృద్ధి (ఆర్-డీ) కార్యకలాపాలు, సరికొత్త ఆవిష్కరణలతో నడిచే సంస్థల కోసం ప్రత్యేక ప్రాంతాలను కేటాయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు.
పెట్టుబడిదారులకు పారిశ్రామిక పార్కులలోనే అధునాతన టెస్టింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బీఐఎస్, ఎక్స్పోర్ట్ ఇన్‌స్పెక్షన్ ఏజెన్సీ (ఈఐఏ), ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో అత్యాధునిక నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు.
భూసేకరణ, ప్రభుత్వ అనుమతుల కోసం పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా పెట్టుబడిదారులు తమ వ్యాపార కార్యకలాపాలను అత్యంత వేగంగా ప్రారంభించేలా ఈ పథకం సహాయపడనుందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు, ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నిబంధనలను సంబంధిత అధికారులతో సంప్రదించి ఆయా ప్రాంతాల అనుకూలతను బట్టి ముందే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేస్తామని చెప్పారు.
పారిశ్రామిక పార్కులలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, కార్మికుల వసతి గృహాలు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి, భారత్‌లో పనిచేసే విదేశీ నిపుణులకు వారికి అలవాటైన అనుకూల వాతావరణాన్ని అందించడానికి జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల భాగస్వామ్యంతో ప్రత్యేక 'అంతర్జాతీయ ఎన్క్లేవ్లను' ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు పారిశ్రామికవేత్తగా తనకున్న వ్యక్తిగత అనుభవాన్ని శ్రీ పీయూష్ గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని పొందడం, ప్రభుత్వ అనుమతులు తెచ్చుకోవడం వ్యాపారవేత్తలకు ఒక పెద్ద సవాలుగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. 'భవ్య' పథకం పారదర్శకమైన విధానాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనితో పాటు పారిశ్రామిక పార్కులను డిజిటల్, ఉపగ్రహ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మ్యాపింగ్ చేయడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. దీనివల్ల పెట్టుబడిదారులు తాము ఉన్న చోటు నుంచే భూమి లభ్యత, రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 34,000 కోట్లు భారత్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్ప్రేరకంగా దోహదపడతాయనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తంచేశారు. ఈ నిధుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కేంద్ర-రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలోనే ఈ 'భవ్య' పథకం ప్రారంభం కావడం విశేషమని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ దశాబ్ద కాలంపైగా సాగిన పాలన.. వ్యవస్థాగత సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ అనుసంధానత, సులభతర వ్యాపార విధానాలు, 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబెట్టే లక్ష్య సాధనతో ముందుకు సాగిందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
జూన్ 1 నుంచి జూలై 31 మధ్య వచ్చే దరఖాస్తులను మొదటి దశలో భాగంగా 20 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 30 వరకు వచ్చే దరఖాస్తుల ఆధారంగా రెండో దశలో మరో 30 పార్కులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొదటి రెండు దశల్లో సాధించిన అనుభవాలు, పాఠాల ఆధారంగా తదుపరి దశల అమలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశమంతటా పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా 'వికసిత్ భారత్ 2047' సాధించాలనే ఆశయానికి మద్దతుగా నిలవడమే 'భవ్య' పథకం ఉద్దేశమని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సరికొత్త పథకం దేశంలో పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపార వృద్ధిలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందనే గట్టి నమ్మకాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
ఆరు సంవత్సరాల కాలపరిమితిలో 100 అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'భవ్య' పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకు రూ. 33,660 కోట్ల బడ్జెట్ కేటాయింపులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బహుళ నమూనా అనుసంధానత, నమ్మకమైన ప్రాథమిక వసతులు, డిజిటల్ పరిపాలన వ్యవస్థలు, కార్మికులకు అవసరమైన సహాయక వసతులు, పర్యావరణ హితమైన సుస్థిరాభివృద్ధి వంటి అన్ని హంగులతో కూడిన సమగ్ర పారిశ్రామిక వ్యవస్థను సృష్టించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
'భవ్య' పథకానికి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ).. ఈ పథకం పూర్తిస్థాయి అమలు, పర్యవేక్షణ బాధ్యతలను చూసుకోనుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్లు, సమగ్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో తనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించి ఈ పథకం కింద ప్రాజెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని దశలకు అవసరమైన సేవలను ఒకే చోట అందించేలా ఎన్ఐసీడీసీ 'భవ్యా పోర్టల్' అనే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది.
'భవ్య' పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) 2026 మే నెలలో విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించడం.. కేవలం విధానాల రూపకల్పనకే పరిమితం కాకుండా ఆ పథకాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి తీసుకున్న తదుపరి కీలక చర్యగా నిలిచింది.
ఈ పథకం సంపూర్ణ (ఎండ్-టు-ఎండ్) అమలుకు ఈ పోర్టల్ ఏకైక డిజిటల్ వేదికగా సేవలు అందిస్తుంది. ఇది సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ప్రతిపాదనల సమర్పణ, ప్రాజెక్టుల అంచనా, ఎవాల్యూయేషన్లతో పాటు క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాన్ని సులభతరం చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అమలు సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలను అంచనా వేయడానికి ఒక నిర్మాణాత్మకమైన, పారదర్శకమైన విధానాన్ని అందించడం ద్వారా 'భవ్య' పథకం కింద ఉన్న 'ఛాలెంజ్-ఆధారిత పోటీ ఎంపిక విధానానికి' ఈ పోర్టల్ ఎంతగానో తోడ్పడుతుంది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు భాగస్వాములందరి మధ్య సమర్థవంతమైన సమన్వయానికి ఇది దారి తీస్తుంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియా, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) సీఈఓ- ఎండీ శ్రీ రజత్ కుమార్ సైనీలతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మాస్టర్ డెవలపర్లు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడానికి, కీలక నిర్ణయాలను సకాలంలో తీసుకోవడానికి బలమైన డిజిటల్ వ్యవస్థలు ఎంతో అవసరమని డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియా అన్నారు. ప్రాజెక్ట్ సమర్పణ, ఎవాల్యూయేషన్, పర్యవేక్షణ, నివేదికల రూపకల్పన వంటి అన్ని దశలలోనూ ఈ 'భవ్య' పోర్టల్ ఏకైక డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది పథకం అమలు ప్రక్రియను గణనీయంగా బలోపేతం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు మరింత వేగంగా అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.
'భవ్య' పథకం కింద చేపట్టే ప్రాజెక్టుల ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని దశలకు పూర్తి మద్దతు ఇచ్చేలా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు ఎన్‌ఐసీడీసీ సీఈఓ - ఎండీ శ్రీ రజత్ కుమార్ సైనీ స్పష్టం చేశారు. ఈ పోర్టల్ ద్వారా ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వివిధ భాగస్వాముల మధ్య సమర్థవంతమైన సమన్వయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూసే వీలు కలుగుతుందని.. ఇది పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన వివరించారు.
'భవ్య' పోర్టల్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, వివిధ పారిశ్రామిక రంగాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా భారత్‌లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల తదుపరి దశ అభివృద్ధి, పెట్టుబడుల సరళీకరణ, సులభతర వ్యాపార నిర్వహణ, రవాణా రంగం సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ సరఫరా గొలుసు వ్యవస్థతో భారత్‌ను అనుసంధానించడంలో ఇటువంటి సమగ్ర పారిశ్రామిక పార్కులు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయనే అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు.
కేంద్ర క్యాబినెట్ ఆమోదం, ఆ వెంటనే కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేయడం, వివిధ రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమబద్ధమైన సంప్రదింపులు జరపడం వంటి కీలక ప్రక్రియలు ముగిసిన వెంటనే త్వరితగతిన 'భవ్య' పోర్టల్ ప్రారంభమవటం విశేషం. భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్యక్రమాలలో ఒకటైన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతటి వేగం, అంకితభావంతో ముందుకు తీసుకెళ్తుందనే దానికి ఈ పరిణామాలు ఒక స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తాయని.. పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న అంచనా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత పోటీతత్వం కలిగిన ఉత్పాదక కేంద్రంగా భారతదేశం ఎదుగుతుందనే నమ్మకాన్ని ఈ ప్రాజెక్ట్ బలంగా కలిగిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2270604)
आगंतुक पटल : 57