యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అండర్-18 హాకీ ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన
భారత పురుషుల, మహిళల జట్లను సత్కరించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
प्रविष्टि तिथि:
08 JUN 2026 8:13PM by PIB Hyderabad
గత వారం జపాన్‌లో ముగిసిన అండర్ - 18 హాకీ ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
కెప్టెన్ కేతన్ కుష్వాహా నేతృత్వంలోని భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు శుక్రవారం కాకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను 4-1 తేడాతో ఓడించి అండర్-18 ఆసియా కప్ 2026 ఛాంపియన్స్‌గా నిలిచింది.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి పురుషుల జట్టుకు రూ. 61.5 లక్షల నగదు బహుమతి చెక్కును అందజేశారు.
కెప్టెన్ స్వీటీ కుజూర్ నేతృత్వంలోని భారత అండర్-18 మహిళల హాకీ జట్టు కాంస్య పతక పోరులో కొరియాపై 3-0 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి అండర్-18 ఆసియా కప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయ మహిళల జట్టుకు ప్రోత్సాహకంగా రూ. 21 లక్షల నగదు బహుమతి చెక్కును అందజేశారు.
డాక్టర్ మాండవీయ పురుషుల, మహిళల జట్లను ఉద్దేశించి ఉత్సాహపరిచే మాటలను పంచుకుంటూ, "దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడానికి కష్టపడి పనిచేసిన రెండు జట్లకు నా అభినందనలు. మీ అందరిని చూసి దేశం మొత్తం గర్విస్తోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. ఒక టోర్నమెంట్‌లో 13 గోల్స్ చేసిన ఆటగాడు తదుపరిసారి 15 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేయడంపై దృష్టి పెట్టాలి. అలాగే 10 గోల్స్ కాపాడిన గోల్‌కీపర్, ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇచ్చే అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో ముందుకు సాగాలి. మీరు చదువుకున్నా లేదా క్రీడల్లో రాణించినా దానిపై పూర్తి అంకితభావం ఉండాలి. మీ సామర్థ్యాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ, మీ తల్లిదండ్రులను, మీ శ్రేయోభిలాషులను సంతోషపెట్టడమే మీ నిరంతర లక్ష్యంగా ఉండాలి" అని పేర్కొన్నారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్నట్టుగా భారత్ ను క్రీడా రంగంలో ప్రపంచ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల జట్లలో అత్యధిక గోల్స్ చేసిన ఉత్తమ స్కోరర్లు ఆశిష్ తని పుర్తి, నౌషీన్ నాజ్‌లతో పాటు, టోర్నమెంట్‌లో 10 గోల్స్ కాపాడిన ఉత్తమ గోల్‌కీపర్ ఆయుష్ రజక్‌ను కూడా కేంద్ర మంత్రి సత్కరించారు.
అండర్-18 ఆసియా కప్‌లో భారత మహిళల, పురుషుల జట్లకు కోచ్‌లుగా వ్యవహరించిన భారత హాకీ మాజీ కెప్టెన్లు రాణి రాంపాల్, సర్దార్ సింగ్‌లను కూడా క్రీడల శాఖ మంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.
***
(रिलीज़ आईडी: 2270603)
आगंतुक पटल : 25