పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘ఎన్‌జడ్‌పీ సాథీ యాప్’’ని, నేషనల్ జూలాజికల్ పార్కులో సెల్ఫ్-టికెటింగ్ కియోస్కులను ప్రారంభించిన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి


సందర్శకులకు మరింత సౌకర్యవంతంగా నిలిచేలా నూతన స్మార్ట్ నావిగేషన్, సులభతర టికెట్ బుకింగ్‌
డిజిటల్ సేవలు

प्रविष्टि तिथि: 07 JUN 2026 7:04PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (ఎన్‌జడ్‌పీ)లో ‘‘ఎన్‌జడ్‌పీ సాథీ యాప్’’ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ఈ రోజు ప్రవేశపెట్టారు. సెల్ఫ్-టికెటింగ్ కియోస్కులను కూడా ఆయన ప్రారంభించారు. స్మార్ట్ నావిగేషన్‌తో సందర్శకులకు మెరుగైన అనుభూతులను పంచడమే కాకుండా, ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగును సరళతరం చేయాలనేదే ఈ నూతన సేవల లక్ష్యం.
ఇటీవల ముగిసిన ఎండాకాలం సెలవుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన సృజనాత్మక కళాకృతులతో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేయగా, ఆ ప్రదర్శనను  మంత్రి   చూశారు. యువ ప్రతిభావంతుల సృజనను ఆయన ప్రశంసించారు. వన్యప్రాణి సంరక్షణ పట్ల విద్యార్థుల్లో అవగాహనను పెంచే దిశగా విద్యా, చైతన్య ప్రధాన కార్యక్రమాల్ని నిర్వహించినందుకు జంతు ప్రదర్శనశాల అధికారులను మంత్రి అభినందించారు.


మంత్రి ‘‘ఎన్‌జడ్‌పీ సాథీ యాప్’’ను లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టారు. సెల్ఫ్-టికెటింగ్ కియోస్కులను కూడా ఆయన ప్రారంభించారు. ఇవి నేషనల్ జూలాజికల్ పార్కులో సందర్శకులకు సౌకర్యాలను కల్పించడంతో పాటు డిజిటల్ పరివర్తన దిశగా చేపట్టిన ఒక ముఖ్య చర్యకు సూచికగా నిలిచాయి.
‘‘ఎన్‌జడ్‌పీ సాథీ యాప్’’ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారాల్లో అందుబాటులోకి వచ్చింది. దీనిలో ఒక ఇంటరాక్టివ్ డిజిటల్ మ్యాపుతో పాటు స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఇవి సందర్శకులకు జంతువుల నిలయాలు, వాష్‌రూములు, బగ్గీ పాయింట్లు, నిష్క్రమణ తదితర సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని అందిస్తాయి. ఈ యాప్.. ఎక్స్‌ప్రెస్ టూర్, ఫ్యామిలీ టూర్, గ్రాండ్ జూ టూర్‌లతో పాటు వ్యక్తిగతమైన అనుభూతినిచ్చే ‘‘మై టూర్’’ ఐచ్ఛికాలను కూడా అందిస్తుంది.

సెల్ఫ్-టికెటింగ్ కియోస్క్ యూపీఐ ఆధారంగా పనిచేస్తుంది. డిజిటల్ చెల్లింపు మాధ్యమం ద్వారా ఆన్‌లైన్ టికెట్ బుకింగు సౌకర్యాన్నీ అందిస్తుంది. అప్పటికప్పుడు టికెటును బుక్ చేసుకోవడానికి అనువుగా ఉచిత వై-ఫై సంధాన సదుపాయాన్ని దీనిలో ఉంచారు.

అధికారులతోనూ, సెక్షన్ ఇంచార్జులతోనూ మంత్రి ఒక సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, నేషనల్ జూలాజికల్ పార్కులో సమగ్ర సంస్కరణలు, ఆధునికీకరణ ప్రధాన కార్యక్రమాలు, సమర్థ నిర్వహణకు అవలంబించాల్సిన వ్యూహాలను చర్చించారు.

 


పక్షుల ఆవాసాలను మంత్రి పరిశీలించారు. వేసవిలో పక్షుల సంరక్షణకు ఏయే ఏర్పాట్లను చేసిందీ అడిగి తెలుసుకున్నారు. కంచెల స్థితి ఎలా ఉందీ గమనించారు. జంతు సంక్షేమం, ఆవాసాల నిర్వహణ అంశాలలో మరింత మెరుగుదల దిశగా కొన్ని సూచనలను చేశారు.
పశువుల చికిత్సకు ఏర్పాటు చేసిన వైద్యశాలను మంత్రి సందర్శించారు. జబ్బుపడిన పశువులను సంరక్షించే దిశగా అక్కడ చేపడుతున్న చర్యలపై, ఆసుపత్రి నిర్వహణ తీరుతెన్నులపై పశు ఆరోగ్య సిబ్బందితో మంత్రి విస్తృతంగా చర్చించారు.
ఆ తరువాత, సింహాల ఎన్‌క్లోజరును  మంత్రి సందర్శించారు. ఏషియాటిక్ పులులు ‘కార్తీక్’, ‘కరణీ’లను ఆయన చూశారు. వాటి సంరక్షణ, ఎన్‌క్లోజర్ సమగ్ర నిర్వహణ విధానాన్ని గురించి సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకొని, సంతృప్తిని వ్యక్తం చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ, సంక్షేమం, సందర్శకులకు తెలియజేయాల్సిన అంశాల్లో నేషనల్ జూలాజికల్ పార్కు సిబ్బంది, అధికారులు కనబరుస్తున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, నిరంతర ప్రయత్నాల్ని మంత్రి ప్రశంసించారు.
నేషనల్ జూలాజికల్ పార్కు యంత్రాంగం సంరక్షణకు సంబంధించిన విద్యను పటిష్ఠ పరచడానికి, సాంకేతికతను ఉపయోగించుకుంటూ సందర్శకుల సేవలను మెరుగుపరచడానికి, పశు సంరక్షణ, నిర్వహణలలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికి కట్టుబడి ఉంది.

***


(रिलीज़ आईडी: 2270278) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil