వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జార్ఖండ్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు తొలిసారి తాజా మామిడి ఎగుమతి సౌలభ్యం కల్పించిన ‘అపెడా’
రాష్ట్రంలోని మహిళా సారథ్య రైతు ఉత్పత్తిదారు సంస్థ ద్వారా 1.5 టన్నుల మేర ‘ఆమ్రపాలి’ రకం మామిడి పండ్ల ఎగుమతి
प्रविष्टि तिथि:
07 JUN 2026 11:31AM by PIB Hyderabad
జార్ఖండ్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు తాజా మామిడి పండ్ల తొలి వాణిజ్య ఎగుమతి ప్రారంభమైంది. ఈ నెల 4వ తేదీన కోల్‌కతాలో మొదలైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నుంచి వ్యవసాయ ఎగుమతులలో ఓ కీలక పరిణామంగా పరిగణించవచ్చు. కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘వ్యవసాయ-ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (అపెడా) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఎగుమతి అయిన ఈ సరకులో జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లా, బానో సమితి పరిధిలో పూర్తిగా మహిళల సారథ్యంలోగల రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీసీ) ‘బేయురా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ 1.5 టన్నుల తాజా ‘ఆమ్రపాలి’ రకం మామిడి పండ్లు కూడా ఉన్నాయి. ఈ సరకును ‘మెస్సర్స్ జేజీబీ ఆగ్రోఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్’ లండన్‌కు ఎగుమతి చేసింది.
సిమ్డేగా జిల్లాలోగల రైతు ఉత్పత్తిదారు కంపెనీలు (ఎఫ్‌పీసీ), రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీఓ), ప్రగతిశీల రైతుల కోసం ‘అపెడా’ 2026 మే 5న నిర్వహించిన ఎగుమతి-ఆధారిత సామర్థ్య వికాస కార్యక్రమానిక అనుగుణంగా ఈ ఎగుమతి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎగుమతి అవసరాలు, నాణ్యత ప్రమాణాలు, మార్కెట్ అవకాశాలపై అపెడా దృష్టి సారించింది.
అనంతరం జిల్లా నుంచి ఎగుమతి నాణ్యతతో కూడిన మామిడి పండ్ల సేకరణ కోసం ‘బేయురా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’, ‘మెస్సర్స్ జేజీబీ ఆగ్రోఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్’ మధ్య అనుసంధానానికి ‘అపెడా’ సౌలభ్యం కల్పించింది. ప్రస్తుత సరకు రవాణా లావాదేవీ ఈ సంధానం ఫలితమే.
ఎగుమతి విలువ వ్యవస్థలో ‘ఎఫ్‌పీసీ’ ప్రత్యక్ష పాత్రకు ఈ అనుసంధానం వీలు కల్పించింది. దీంతోపాటు తన సభ్యులైన రైతులకు మార్కెట్ లభ్యత కూడా ఏర్పరచింది. తద్వారా ఈ ‘ఎఫ్‌పీసీ’తో ముడిపడిన రైతులు ప్రస్తుత దేశీయ మార్కెట్ ధరతో పోలిస్తే తమ ఉత్పత్తులకు అధిక ధర పొందగలిగారు.
ఈ ప్రాంతంలోని రైతులు నాణ్యమైన ఉత్పత్తి పద్ధతులను అనుసరించేలా చేయడంతోపాటు పంట కోత అనంతర నిర్వహణ మెరుగుదల, అంతర్జాతీయ ప్రమాణాల పాటింపు దిశగా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులున్నాయి. అందువల్ల ఇక్కడ సాగుచేసే ‘ఆమ్రపాలి’ రకం మామిడికి మార్కెట్‌లో విశేష గిరాకీతోపాటు నాణ్యత లక్షణాల పరంగానూ ప్రాచుర్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత లావాదేవీ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు తాజా పండ్లను ఎగుమతి చేసే రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్ కూడా స్థానం సంపాదించింది.
మార్కెట్ అభివృద్ధి, సామర్థ్య వికాసం కార్యక్రమాలతోపాటు నాణ్యత మెరుగుదల చర్యలు, భౌగోళిక నిర్ధారణ వ్యవస్థలు, ఎగుమతి ప్రోత్సాహక కార్యకలాపాల ద్వారా వ్యవసాయ-ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ‘అపెడా’ అన్ని విధాలుగా సౌలభ్యం కల్పిస్తోంది. ఈ దిశగా మహిళల సారథ్యంలోని సంస్థలు, గిరిజన ఉత్పత్తిదారు సంస్థలు సహా రైతు సంఘాల భాగస్వామ్యానికీ మద్దతిస్తోంది.
ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రైతు ఉత్పత్తిదారు సంస్థలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే దిశగా రాష్ట్రం నుంచి తాజా మామిడి పండ్ల తొలి వాణిజ్య ఎగుమతిని ఓ కీలక మలుపుగా పరిగణించవచ్చునని ‘అపెడా’ పేర్కొంది.
***
(रिलीज़ आईडी: 2270177)
आगंतुक पटल : 6