వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులను మోసగించే డార్క్ ప్యాటర్న్స్ విధానాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కఠిన చర్యలు


వినియోగదారులు సరైన సమాచారంతో, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గానూ ఫిజిక్స్ వాలా సంస్థకు రూ.5 లక్షలు, మెకాఫీ సంస్థకు లక్ష రూపాయల జరిమానా

వినియోగదారులు పూర్తి అవగాహనతో ఇచ్చే సమ్మతిని దెబ్బతీసేలా సాగుతున్న ఇటువంటి పద్ధతులను తక్షణమే నిలిపివేయాలని ఆయా సంస్థలకు ఆదేశం

प्रविष्टि तिथि: 03 JUN 2026 2:06PM by PIB Hyderabad

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ, వారి ఎంపికలను ప్రభావితం చేసే 'డార్క్ ప్యాటర్న్' విధానాలను అవలంబించినందుకుగానూ ఫిజిక్స్ వాలా,   మెకాఫీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్  సంస్థలకు చీఫ్ కమిషనర్ శ్రీమతి నిధి ఖరే,  కమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రాల నేతృత్వంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జరిమానాలు విధించింది

ఫిజిక్స్ వాలా సంస్థకు రూ. 5 లక్షలు, మెకాఫీ సంస్థకు  లక్ష రూపాయల  జరిమానా విధించారు. ఈ రెండు కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఇటువంటి మోసపూరిత పద్ధతులను తక్షణమే తొలగించాలని, ఎలాంటి ఒత్తిడి లేదా తారుమారు లేకుండా వినియోగదారులు పూర్తి అవగాహనతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు.

వినియోగదారుల రక్షణ చట్టం, 2019 వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు 2020, డార్క్ ప్యాటర్న్స్ నివారణ,  నియంత్రణ మార్గదర్శకాలు, 2023 కింద ఈ చర్యలు తీసుకున్నారు. 

ఫిజిక్స్ వాలా లిమిటెడ్: ముందుగానే విరాళాల సేకరణ, తప్పుదోవ పట్టించే ఉచిత కోర్సులు

ఫిజిక్స్ వాలా ప్లాట్‌ఫారమ్‌పై సాగుతున్న కొన్ని పద్ధతులను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తనకు తానుగా (సుమోటో) విచారణకు స్వీకరించింది. వినియోగదారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా, పూర్తి అవగాహనతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీసేలా అక్కడి ఇంటర్‌ఫేస్ డిజైన్‌లు ఉన్నాయని, వాటి ద్వారా వినియోగదారులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నారని సీసీపీఏ గుర్తించింది.

సీసీపీఏ కనుగొన్న మోసపూరిత అంశాలు

*వినియోగదారుల చెల్లింపు ప్రక్రియ (చకౌట్) సమయంలో, వారి ముందస్తు అనుమతి లేదా స్పష్టమైన సమ్మతి లేకుండానే పీడబ్ల్యూ ఫౌండేషన్ కు రూ. 10 విరాళం మొత్తాన్ని సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేసి, మొత్తం చెల్లించాల్సిన బిల్లుకు జోడించింది.

*పిల్లల విద్య, వైద్యం, వివాహాలకు సంబంధించిన భావోద్వేగపూరిత సందేశాలను వినియోగదారులకు చూపిస్తూ వారు ఆ విరాళం ఎంపికను అలాగే ఉంచేలా (తొలగించకుండా ఉండేలా) చేశారు. 

*ఉచితం అని ప్రచారం చేసిన కోర్సులను యాక్సెస్ చేయాలంటే, వినియోగదారులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని  తప్పనిసరిగా పంచుకోవాల్సిందే అనే నిబంధనను పెట్టారు.

*యూజర్ అకౌంట్ల మధ్య అందించే కంటెంట్‌లో ఎలాంటి తేడా లేదని సిసిపిఎ పరిశీలనలో తేలింది. అందువల్ల కోర్సులను యాక్సెస్ చేయడానికి తప్పనిసరిగా డేటా సేకరణ అవసరం లేదని స్పష్టమైంది.

గుర్తించిన మోసాలు (డార్క్ ప్యాటర్న్స్)

బాస్కెట్ స్నీకింగ్:  చెల్లింపు ప్రక్రియ సమయంలో, వినియోగదారుల ప్రమేయం లేకుండానే బిల్లు మొత్తానికి ఆటోమేటిక్‌గా విరాళాన్ని జోడించడం.

కన్ఫర్మ్ షేమింగ్: ఆ విరాళం ఎంపికను వినియోగదారులు తొలగించకుండా నిరుత్సాహపరిచేలా భావోద్వేగపూరిత సందేశాలను ఉపయోగించడం.

ఫోర్స్డ్ యాక్షన్ :ఉచితం అని ప్రచారం చేసిన కోర్సులను యాక్సెస్ చేయడానికి ముందే, వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా పంచుకోవాలని నిర్బంధించడం.

సీసీపీఏ నిర్ధారణ

*వినియోగదారుల ఆమోదాన్ని ముందుగానే ఎంపిక చేసిన ఆప్షన్ల  ద్వారా ఊహించకూడడు. అంగీకారం అనేది తప్పనిసరిగా వినియోగదారు స్వయంగా స్పష్టంగా, సానుకూలంగా  ఇవ్వాలి.

*నిర్బంధ రిజిస్ట్రేషన్, సమాచారాన్ని పంచుకోవడం నిబంధనల గురించి వినియోగదారులకు ముందుగా స్పష్టంగా తెలియజేయకుండా కోర్సులను ‘ఉచితం‘ అని ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అవుతుంది.

*ఈ తరహా విధానాలు పూర్తిగా అక్రమ వ్యాపార వాణిజ్య పద్ధతుల  కిందికే వస్తాయని, ఇవి వినియోగదారులు పూర్తి అవగాహనతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని సీసీపీఏ పేర్కొంది.

*ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే వారిలో అత్యధిక శాతం మంది విద్యార్థులు, అందులోనూ ముఖ్యంగా మైనర్లు ఉన్నందున.. ఇటువంటి మోసపూరిత విధానాలు వినియోగదారుల రక్షణ పరంగా తీవ్రమైన ఆందోళనలకు దారితీశాయని సీసీపీఏ అభిప్రాయపడింది.

ఉల్లంఘించిన నిబంధనలు – ఫిజిక్స్ వాలా

వరస నెం. 

నిబంధన 

ఉల్లంఘన స్వభావం 

  1.  

సెక్షన్ 2(9), వినియోగదారుల రక్షణ చట్టం,2019

వినియోగదారుల హక్కుల ఉల్లంఘన - స్వేచ్ఛగా, పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయడం

  1.  

సెక్షన్ 2(28), వినియోగదారుల రక్షణ చట్టం, 2019

తప్పుడు వ్యాపార ప్రకటన - నిర్బంధ రిజిస్ట్రేషన్ నిబంధనలను ముందుగా వెల్లడించకుండా, కోర్సులను "ఉచితం" అని ప్రచారం చేయడం.

  1.  

సెక్షన్ 2(47), వినియోగదారుల రక్షణ చట్టం, 2019

అక్రమ వ్యాపార పద్ధతి  - బాస్కెట్ స్నీకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్

  1.  

.వినియోగదారుల రక్షణ (ఈ కామర్స్) నిబంధనలు, 2020

రూల్ 4(9): ముందుగానే టిక్ చేసిన చెక్‌బాక్స్  ద్వారా వినియోగదారుల అంగీకారాన్ని ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయడం; రూల్ 4(3): అక్రమ వాణిజ్య పద్ధతి.

  1.  

డార్క్ ప్యాటరన్స్ మార్గదర్శకాలు, 2023

కార్ట్‌లో వినియోగదారుడికి తెలియకుండా అదనపు వస్తువులు రహస్యంగా జోడించడం, ఎంపికలో వినియోగదారుడిని ఒప్పించేందుకు ప్రయత్నించడం,
సేవను కొనసాగించేందుకు లేదా ముందుకు వెళ్లేందుకు వినియోగదారుడిని బలవంతంగా ఒప్పించడం. 

 

డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లలో ఎలాంటి మోసపూరిత పద్ధతులను (డార్క్ ప్యాటర్న్స్‌) ను ఉపయోగించకూడదని, అలాగే రూ. 5,00,000 జరిమానా చెల్లించాలని ఫిజిక్స్ వాలా సంస్థను ఆదేశించారు. 

మెకాఫీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: సబ్‌స్క్రిప్షన్ పునరుద్ధరణ (రెన్యూవల్) ఇంటర్‌ఫేస్ తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లు నిర్ధారణ

మెకాఫీ సబ్‌స్క్రిప్షన్ పునరుద్ధరణ (రెన్యూవల్) ప్రక్రియను కూడా సీసీపీఏ పరిశీలించింది. సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే సమయంలో వినియోగదారులకు ఎటువైపు మొగ్గుచూపని ఒక తటస్థ ప్రత్యామ్నాయాన్ని అందించడం లేదని కనుగొంది.

వినియోగదారులకు ప్రధానంగా "ఇప్పుడే పునరుద్ధరించుకోండి", "రిస్క్‌ను అంగీకరించండి"  అనే రెండు ఆప్షన్లు మాత్రమే ప్రముఖంగా చూపించారు. ఈ విధంగా సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించుకోకపోవడాన్ని ఒక ప్రమాదకరమైన నిర్ణయంగా చిత్రించారు.

సీసీపీఏ కనుగొన్న మోసపూరిత అంశాలు 

“రిస్క్‌ను అంగీకరించండి" (ఆక్సెప్ట్ రిస్క్ ) అనే పదం ద్వారా వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించుకోకపోతే సైబర్ సెక్యూరిటీ ముప్పులకు గురవుతారనే భావన కలిగించేలా ప్రవర్తించారు.

ఈ విధమైన క్లెయిమ్ ను కంపెనీ సమర్థించలేకపోయింది లేదా హామీ ఇవ్వలేకపోయింది.

ఇంటర్‌ఫేస్ డిజైన్ వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌లను కొనసాగించాల్సిందే అనే ఒత్తిడిని కలిగించింది.

గుర్తించిన మోస పద్ధతులు 

కన్ఫర్మ్ షేమింగ్ - సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించుకోకపోవడం అనేది వినియోగదారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లే అనే భావనను వారిలో కలిగించడం.

ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్ - సబ్‌స్క్రిప్షన్ పునరుద్ధరణ (రెన్యూవల్) ఆప్షన్‌కు మిగిలిన వాటికంటే ఎక్కువ దృశ్య ప్రాధాన్యతను కల్పించడం.

ట్రిక్ క్వశ్చన్ -  ‘తటస్థత‘ ఆప్షన్‌ను ఇవ్వడానికి బదులుగా, వినియోగదారులను కంగారు పెట్టే,  భావోద్వేగాలను రేకెత్తించే భాషను ఉపయోగించడం.

ఫోర్స్డ్ యాక్షన్ - స్పష్టంగా కనిపించే, ఎటువైపు మొగ్గుచూపని తటస్థ నిరాకరణ ఆప్షన్‌ను అందించకపోవడం.

సీసీపీఏ నిర్ధారణ

వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ నిర్ణయాలను భయం కలిగించే సందేశాలు లేదా తప్పుదారి పట్టించే డిజైన్ అంశాలు లేకుండా స్వేచ్ఛగా తీసుకునే అవకాశం ఉండాలి. రెన్యూవల్ ఇంటర్‌ఫేస్‌లో వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే మోసపూరిత పద్ధతులు ఉన్నాయి. ఇవి అక్రమ వ్యాపార విధానాల  కిందకు రావచ్చు.

ఉల్లంఘించిన నిబంధనలు - మెకాఫీ 

వరస నెం. 

నిబంధన 

ఉల్లంఘన స్వభావం

  1.  

సెక్షన్ 2(28), వినియోగదారుల రక్షణ చట్టం, 2019

తప్పుదోవ పట్టించే ప్రకటన: సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించుకోకపోవడం వల్ల కలిగే పరిణామాలు, దాని ఆవశ్యకతను భయాన్ని కలిగించేలా చిత్రీకరించడం

  1.  

సెక్షన్ 2(47), వినియోగదారుల రక్షణ చట్టం, 2019

అక్రమ వ్యాపార పద్ధతి: సబ్‌స్క్రిప్షన్ పునరుద్ధరణలను (రెన్యూవల్స్) ప్రోత్సహించేలా మోసపూరితంగా,  వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేయడం.

  1.  

వినియోగదారుల రక్షణ (ఈ కామర్స్) నిబంధనలు, 2020 

రూల్ 4(3): అక్రమ వ్యాపార పద్ధతి. రూల్ 4(3) ప్రకారం వినియోగదారుడిని తప్పుదారి పట్టించే, ఒత్తిడికి గురిచేసే లేదా మోసపూరిత డిజైన్/సందేశాల ద్వారా నిర్ణయాలను ప్రభావితం చేసే పద్ధతులు అక్రమ వ్యాపార పద్ధతుల కిందకు వస్తాయి.

  1.  

మోస రక్షణ మార్గదర్శకాలు, 2023

వినియోగదారుడిని అవమానంగా/గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసి ఒక ఎంపికను తిరస్కరించకుండా ఒప్పించటం ,  ఒక ఎంపికను హైలైట్ చేసి, ఇతర ఎంపికలను దాచడం లేదా కష్టంగా కనిపించేలా చేసి వినియోగదారుడి నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, గందరగోళంగా లేదా ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా రూపొందించిన ప్రశ్నలు, తద్వారా తప్పుగా ఎంపిక చేసేలా వినియోగదారులను  తప్పుదోవ పట్టించడం.

 

మెకాఫీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన ప్లాట్‌ఫారమ్, వెబ్‌సైట్, అప్లికేషన్ లేదా మరే ఇతర డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లోనూ ఎలాంటి మోస పూరిత విధానాలను ఉపయోగించకూడదని, అలాగే రూ. 1,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. 

మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా సీసీపీఏ నిరంతర చర్యలు

భాగస్వాములతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాత, 2023 నవంబర్ 30న డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు, 2023  ను సీసీపీఏ నోటిఫై చేసింది. ఈ మార్గదర్శకాలు బాస్కెట్ స్నీకింగ్, కన్‌ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్ , ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్,  ట్రిక్ క్వశ్చన్స్ వంటి అక్రమ వ్యాపార పద్ధతులుగా పరిగణించే 13 రకాల డార్క్ ప్యాటర్న్స్‌ను గుర్తించాయి.

నిబంధనల అమలును మరింత బలోపేతం చేయడానికి, 2025 జూన్ 5న ఒక అడ్వైజరీని కూడా సీసీపీఏ జారీ చేసింది. దీని ద్వారా ఈ-కామర్స్ సంస్థలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ఇంటర్‌ఫేస్‌లపై స్వీయ తనిఖీ నిర్వహించుకోవాలని, అలాగే తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మోసపూరిత అంశాలను (డార్క్ ప్యాటర్న్స్‌) ను తొలగించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు.. న్యాయబద్ధమైన, పారదర్శకమైన,  వినియోగదారులకు అనుకూలమైన డిజిటల్ మార్కెట్‌ దిశగా  సీసీపీఏ నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారుడి అంగీకారం ఎల్లప్పుడూ స్పష్టంగా, పూర్తి అవగాహనతో కూడుకున్నదిగా,  ఎలాంటి తారుమారు చేసే  డిజైన్ పద్ధతులు లేనిదిగా ఉండాలని సీసీపీఏ స్పష్టం చేసింది.

తుది ఉత్తర్వులను bhttps://jagograhakjago.gov.in/CCPA_Orders/index.html లో పొందవచ్చు. 

***


(रिलीज़ आईडी: 2268666) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada