రాష్ట్రపతి సచివాలయం
ఏకీకృత గిరిజన అభివృద్ధి సంస్థలతో పాటు ఏకీకృత గిరిజనాభివృద్ధి ప్రాజెక్టుల బలోపేతానికి ఏర్పాటు చేసిన జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
గిరిజనుల సమగ్ర వికాసం దేశ ప్రగతికి సమ్మిళిత అభివృద్ధి స్వభావాన్ని అందిస్తుంది: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
प्रविष्टि तिथि:
03 JUN 2026 3:10PM by PIB Hyderabad
ఏకీకృత గిరిజన అభివృద్ధి సంస్థలతో పాటు ఏకీకృత గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులను పటిష్టపరచడం అంశంపై న్యూఢిల్లీలో ఈ రోజు (2026 జూన్ 3)న ఏర్పాటు చేసిన జాతీయ సమావేశాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగళూరు ఇండియన్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన నానో సైన్స్, ఇంజినీరింగ్ సెంటరుతో పాటు, ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్స్‌ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.
సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఈ సమావేశం గిరిజనుల స్థితిలో మార్పును తీసుకువచ్చే వారి సమావేశమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను గిరిజనులు నివసిస్తున్న పల్లెలకూ, ఇళ్లకూ తీసుకు పోవాల్సిన బాధ్యత ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరిదీనని రాష్ట్రపతి అన్నారు. ఇలా చేస్తే, వారు గిరిజన సోదరీ, సోదరుల జీవితాల్లో పెనుమార్పును తీసుకురాగలుగుతారన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ, ప్రాజెక్టు స్థాయుల్లోనూ పని చేసే వారంతా ఒక ఉమ్మడి ధ్యేయంతో, ఒక పెద్ద లక్ష్యంతో ఏకతాటి మీదకు వచ్చి చర్చిస్తే అప్పుడు అనేక ఫలప్రద పరిష్కారాలు తప్పక లభిస్తాయని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు చోటుచేసుకోనున్నాయన్న సంగతి తెలుసుకొని తాను సంతోషిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. వివిధ ఏజెన్సీలు, ప్రాజెక్టుల్లో పనిచేసే వారు చక్కని ఆలోచనలు చేసి మరీ తీసుకొనే నిర్ణయాల అధారంగా ముందుకు సాగుతారన్న నమ్మకం తనకు ఉందని రాష్ట్రపతి తెలిపారు. దీనితో వేరువేరు పథకాల ప్రయోజనాలు గిరిజనుల్లో ప్రతి ఒక్క వ్యక్తి చెంతకు చేరుతాయన్నారు.
ఏ ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రం అయినా, దస్తావేజు అయినా వాటి పరమార్థం మనుషులకు సాయపడటమేననే వాస్తవంపై దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఆసక్తిదారులందరికీ రాష్ట్రపతి సలహాను ఇచ్చారు. ఈ ప్రాజెక్టులతో సంబంధమున్న వ్యక్తులూ, ఏజెన్సీలూ ప్రతి గర్భవతికీ చాలినంత పోషణ, గిరిజన బాల బాలికలకు ఒక మంచి బళ్లో చదువుకునే అవకాశం, గిరిజన యువతకు ఆత్మగౌరవంతో కూడిన జీవనోపాధి.. వీటితో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికీ అందించడంపై శ్రద్ధ వహించాలని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈ ప్రాజెక్టుతో ముడిపడిన అన్ని ఏజెన్సీలూ, సిబ్బందీ తప్పక ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆమె కోరారు.
ఆధునిక అభివృద్ధి యత్నాలతో పాటే గిరిజనుల సంస్కృతి, జ్ఞాన సంప్రదాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పట్ల రాష్ట్రపతి హర్షాన్ని వ్యక్తం చేశారు.
వ్యక్తులతో పాటు సమాజ పురోగతిలో విద్య ప్రధాన పాత్రను పోషిస్తుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. గిరిజన బాలల, యువత విద్యావంతులయ్యేలా, నైపుణ్యాలను సాధించుకొనేలా మనస్ఫూర్తిగా తోడ్పడాల్సిందిగా ఆసక్తిదారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. దేశమంతటా దాదాపు 500 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలను ఇప్పటికే ఏర్పాటు చేశారని తెలుసుకొని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పౌరులంతా 2047 కల్లా వికసిత్ భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నారని రాష్ట్రపతి అన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి ఈ లక్ష్యంలో ఒక అంతర్భాగమని ఆమె తెలిపారు. ఇది దేశ ప్రగతికి సమ్మిళిత స్వభావాన్ని జతచేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో లభించే సూచనలు, తీర్మానాలు, మార్గసూచీతో గిరిజనుల సర్వతోముఖ అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకుపోయేందుకు ఒక కార్యాచరణను ఖరారు చేయవచ్చన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు-
Please click here to see the President's Speech-
***
(रिलीज़ आईडी: 2268471)
आगंतुक पटल : 11