ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బహుభాషా కృత్రిమ మేధ పరిష్కారాల అభివృద్ధికి సంయుక్తంగా వ్యోమా ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన డిజిటల్ ఇండియా భాషిణి విభాగం, కరెంట్ ఏఐ, కల్పా ఇంపాక్ట్

प्रविष्टि तिथि: 02 JUN 2026 7:34PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ కరెంట్ ఏఐ,   కల్ప ఇంపాక్ట్ తో కలసి వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం  ఆఫ్‌లైన్‌, తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా పనిచేయగల ఓపెన్ - సోర్స్, బహుభాషా, వాయిస్ - ఫస్ట్ కృత్రిమ మేధ పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో భాషిణి, కరెంట్ ఏఐ సంయుక్తంగా ఆవిష్కరించిన 'సున్నో సూత్ర' ఆధారంగా ఈ ఛాలెంజ్‌ను రూపొందించారు. బహుభాషా, వాయిస్ - ఫస్ట్, ఓపెన్ - సోర్స్ హ్యాండ్‌హెల్డ్ ఏఐ రిఫరెన్స్ పరికరంగా 'సునో సూత్ర' ను రూపొందించారు. ప్రాథమిక నమూనాగా రూపొందించిన ఈ పరికరం బహుభాషా సాంకేతికతలను ఆన్ డివైజ్ ఏఐ సామర్థ్యాలతో అనుసంధానిస్తుంది. ఇది క్లౌడ్ మౌలిక వసతులపై ఆధారపడకుండా వివిధ భారతీయ భాషల్లో సంభాషణాత్మక ఏఐ అనుభవాలను అందిస్తుంది.

డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ నాగ్ మాట్లాడుతూ, “బహుభాషా ఏఐ  కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు. భారతదేశంలో ప్రజల ప్రయోజనాలపై ప్రభావం చూపే కీలక మౌలిక సదుపాయం. ఇది జనాభా స్థాయిలో వివిధ భాషల్లో సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతీయ భాషల కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా, తక్కువ  స్వీయ నిర్వహణ పరికరాల వాతావరణాల్లో పనిచేసే ‘సునో సూత్ర’ వంటి పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా భాషిణి ఈ మార్పునకు ఊతమిస్తొంది. తద్వారా దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రతి భాష మాట్లాడే చివరి మైలు పౌరునికి సైతం వాయిస్ ఆధారిత మేధోసంపన్న సేవలను చేరవేస్తోంది. 

భాషా లభ్యత,  డిజిటల్ అక్షరాస్యత కనెక్టివిటీకి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేలా ఆచరణాత్మక ఏఐ పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం భాషిణి బహుభాషా ఏఐ మౌలిక వసతులను,  ఓపెన్ - సోర్స్ సాంకేతికతలలో కరెంట్ ఏఐకి ఉన్న నైపుణ్యాన్ని వ్యోమ  ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఒకచోటకు చేరుస్తుంది.

కొత్త వినియోగ విధానాలు,  హార్డ్‌వేర్ మెరుగుదల, మోడల్ ఆప్టిమైజేషన్, తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉండే అప్లికేషన్ల ద్వారా సునో సూత్ర వేదికను మరింత అభివృద్ధి చేయడానికి పునర్నిర్మించడానికి స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యార్థులు, విద్యా సంస్థలు, ఎంఎస్ఎంఈలు,  పరిశ్రమల భాగస్వాములు, స్వతంత్ర ఆవిష్కర్తలను ఈ ఛాలెంజ్ ఆహ్వానిస్తోంది. ఈ పరికరాన్ని మరింత చిన్నదిగా, సమర్థవంతంగా, విభిన్న క్షేత్రస్థాయి పరిస్థితులలో ఉపయోగించడానికి మరింత అనువుగా మార్చే మార్గాలను అన్వేషించాల్సిందిగా కూడా భాగస్వాములకు సూచించారు. 

విద్య, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, పరిపాలన, ప్రజా సేవల పంపిణీ వంటి రంగాలలో దీనిని ఉపయోగించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలోని భాషా,భౌగోళిక వైవిధ్యాలన్నింటికీ ఏఐ సాంకేతికతలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించారు. 

ఓపెన్ అప్లికేషన్ ప్రక్రియతో ప్రారంభమై ఈ ఛాలెంజ్ పలు దశల్లో కొనసాగుతుంది. ఎంపిక చేసిన 20 బృందాలకు తమ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి,  పరీక్షించడానికి డెవలపర్ కిట్లు, సునో సూత్ర ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు వారికి భాషిణి,  కరెంట్ ఏఐ సంస్థలకు చెందిన నిపుణుల నుంచి నుండి సాంకేతిక మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది.

ఫైనలిస్ట్‌లు తమ నమూనాలను నిపుణులైన జ్యూరీ ముందు ప్రదర్శిస్తారు. విజేతలుగా నిలిచిన బృందాలు రూ. 80 లక్షల వరకు విలువైన బహుమతులను గెలుచుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో తమ సాంకేతికతను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చే అవకాశాలను పొందుతారు.

ఆవిష్కరణల వ్యవస్థలో ఉమ్మడి భాగస్వామ్యాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, ఇంజనీర్లు, పరిశోధకులు, విద్యా సంస్థలను కలిపి పనిచేసే బృందాలను ఇది ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది.

వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గలవారు https://bhashini.gov.in/sahyogi/hackathon/open-handheld-ai ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ గురించి:

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ) కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా డిజిటల్ సమ్మిళితాన్ని, భాషా సాంకేతికతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత జాతీయ కార్యక్రమం. నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ (ఎన్హెచ్ఎల్టీ) ద్వారా పరిపాలన, ప్రభుత్వ వేదికలు, వివిధ సంస్థల కోసం భారతీయ భాషలలో విస్తరించదగిన వాయిస్, టెక్స్ట్ ఆధారిత ఏఐ సేవలను భాషిణి అందుబాటులోకి తెస్తోంది. ఈ వేదిక ప్రస్తుతం 800కు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు సేవలందిస్తోంది. అలాగే రోజుకు 1.5 కోట్లకు పైగా  ఇన్ఫరెన్స్‌లను ప్రాసెస్ చేస్తూ 36 భారతీయ టెక్స్ట్ భాషలు, 23 భారతీయ వాయిస్ భాషలు, 35 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇస్తోంది. ఓపెన్ సోర్స్ ఆవిష్కరణలు, బహుభాషా ఏఐ పరిశోధనలు, డేటాసెట్‌ల రూపకల్పన, స్టార్టప్‌ల ప్రోత్సాహం, విద్యాసంస్థల భాగస్వామ్యాలను కూడా డీఐబీడీ ముమ్మరంగా ముందుకు తీసుకువెడుతూ భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2268250) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam