వ్యవసాయ మంత్రిత్వ శాఖ
‘ఎల్ నినో’ పరిస్థితి ఆందోళనకరమే అయినా.. కేంద్రం అప్రమత్తం
ఏదిఏమైనా రైతు ప్రయోజనాలను పరిరక్షించాలి: ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ఆదుర్దా అవసరం లేదు... సకాలంలో తగు సన్నాహాలు చేసుకోవడమే తక్షణావసరం
తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం గల రాష్ట్రాలు.. జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
విత్తనాలు.. తేమ పరిరక్షణ.. జల నిర్వహణ.. ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది
జలాశయాల్లో నీటిమట్టం ప్రస్తుతం సాధారణ స్థాయికన్నా మెరుగ్గా ఉండటం వల్ల ఖరీఫ్ సాగు సన్నాహాలకు భారీ ఊరట లభిస్తోంది
మొబైల్ ద్వారా రైతులకు సలహాలు.. వ్యాధులు.. తెగుళ్ల సంబంధిత సమాచారం సహా పంటల సాగుపై తగిన సలహాలను నేరుగా అందించాలి
తక్షణ ప్రణాళికలు కాగితాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టంగా అమలు కావాలని ఆదేశం
प्रविष्टि तिथि:
02 JUN 2026 8:46PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ నైరుతి రుతుపవనాల రాక, ఎల్ నినో ప్రభావం, నీటి లభ్యత, విత్తన సరఫరా ఏర్పాట్లు, పంటల ప్రణాళిక, వివిధ రాష్ట్రాల సన్నద్ధత స్థాయి తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వ్యవసాయ-రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో సవివర, సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ కీలక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ- సంబంధిత కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిబద్ధతతో, మెరుగైన సమన్వయంతో, సరైన ప్రణాళికలతో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతులకు సకాలంలో సలహాలు, అనువైన విత్తనాల సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, తేమ పరిరక్షణకు తోడ్పాటు, సముచిత జల నిర్వహణ తదితరాల్లో సహాయం అందేలా చూడటమే లక్ష్యం కావాలని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో, అన్నిరకాల సన్నాహాలు చేస్తోందని తెలిపారు. కాబట్టి, రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. పొలాలు, రైతులపై వాతావరణ సంబంధిత సవాళ్ల ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చూడటం ప్రధానమన్నారు.
ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా రైతు ప్రయోజనాలే అత్యంత ప్రధానంగా పరిగణించాలని చెప్పారు. ఎల్ నినో వల్ల సంభవించే విపరిణామాలను దృష్టిలో ఉంచుకుని, అవసరమైన అన్ని సన్నాహాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. వాతావరణ సూచనలు, నీటి లభ్యత, పంటల ప్రస్తుత పరిస్థితి, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా ఏర్పాట్లు, రాష్ట్రాల సన్నద్ధత, ఇతరత్రా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దిశగా కార్యాచరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణంకన్నా తక్కువగా ఉండవచ్చునని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచించినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కాలానుగుణ వర్షపాతం దీర్ఘకాల సగటులో సుమారు 90 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. రుతుపవన సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని కూడా ఐఎండీ తెలిపిందని వెల్లడించారు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన సన్నాహాలను ముమ్మరం చేసిందని, అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించిందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులు, అధునాతన సాంకేతికత వినియోగం, సాగునీటి సౌకర్యాల విస్తరణ, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతుల అనుసరణ ద్వారా సంభావ్య సవాళ్ల ప్రభావాన్ని చాలావరకూ నియంత్రించవచ్చునని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని జలాశయాలలో నీటి మట్టం ప్రస్తుతానికి సంతృప్తికరంగా ఉన్నదని అధికారులు పేర్కొనడం ఈ సమావేశంలో వెల్లడైన ఓ కీలక, సానుకూలాంశం. మొత్తం మీద నీటి నిల్వల పరిస్థితి సాధారణ స్థాయికన్నా మెరుగ్గా ఉంది. అందుబాటులో గల తాజా అంచనాల ప్రకారం- నిరుడు ఇదే సమయానికి గల సాధారణ నిల్వకన్నా 127.01 శాతం అధికంగా ఉంది. అందువల్ల ఖరీఫ్ సాగులో నీటి అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు గణనీయంగా తోడ్పడటమేగాక పొలాల్లో తేమ కొరత ముప్పును నివారించే వీలుంటుంది.
అధికారులు ఈ వివరాలను వెల్లడించిన అనంతరం శ్రీ శివరాజ్ చౌహాన్ స్పందిస్తూ- ప్రస్తుత సవాలు వర్షపాత అంచనాలకు మాత్రమే సంబంధించినది కాదని, క్షేత్రస్థాయి సన్నాహాలపైనా దృష్టి సారించాలని సూచించారు. తక్కువ వర్షపాతం, సుదీర్ఘ పొడి వాతావరణం లేదా ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం గల రాష్ట్రాలు, జిల్లాల్లో ఎలాంటి జాప్యం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ, నిరంతర సమీక్ష, తక్షణ చర్యలు అవశ్యమని ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయి వరకూ తక్షణ ప్రణాళికలను కాగితాలకు పరిమితం చేయకుండా తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులు, అందుబాటులో గల నీటి వనరులు, ప్రస్తుత పంటల సరళి, విత్తనాల లభ్యత స్థితి, నాట్ల పురోగమనం, వర్షపాత విరామాలు, జిల్లావారీగా తలెత్తే ప్రమాదాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వీటన్నిటి తర్వాతే తగిన ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలని చెప్పారు. రైతుకు ఆచరణాత్మక, సకాల పరిష్కారం చూపడంలో ఈ చర్యలు తోడ్పడతాయని తెలిపారు.
ప్రాంతీయ, పంటల వారీ వ్యూహాల అనుసరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తున్నదని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ పంటలు, ఆలస్యంగా నాట్లు వేసే ప్రణాళిక, కరవును తట్టుకోగల వంగడాల సరఫరా వంటి తక్షణ, సమర్థ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రణాళిక దిశగా రైతులను ప్రోత్సహిస్తూ సకాలంలో సలహాలు, విత్తనాలు, అవసరమైన వనరులు, తగిన అవకాశాలపై సన్నద్ధం చేయాలని ఆయన సూచించారు.
విత్తన లభ్యత గురించి అధికారులు వివరిస్తూ- ఖరీఫ్, రబీ... రెండు సీజన్లకూ అవసరమైన దానికి మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా నిభాయించగలిగేలా జాతీయ విత్తన నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ప్రతికూల వాతావరణ ప్రభావం ఎదురైతే, రైతులకు తక్షణం సముచిత వంగడాలతో ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడమే ఈ సన్నాహాల ముఖ్యోద్దేశమని వారు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ- విత్తన లభ్యతకు మాత్రమే పరిమితం కారాదని, వాటి నాణ్యతపైనా శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా ఆదేశించారు. నాసిరకం లేదా బలహీనంగా ఉండే విత్తనాలతో సాగు చేపడితే తక్కువ వర్షపాతం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం మరింత తీవ్రం కాగలదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ధ్రువీకృత, అనువైన, ఉపయుక్త విత్తనాలు మాత్రమే రైతుకు చేరేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు తిరిగి విత్తుకోవడానికి వీలుగా, స్వల్పకాలిక, తక్కువ నీటి వినియోగంతో ఫలసాయమిచ్చే విత్తనాలను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వ్యవసాయ రంగానికి తోడ్పాటులో గ్రామీణాభివృద్ధి యంత్రాంగం, సంబంధిత సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను శ్రీ చౌహాన్ ప్రముఖంగా ప్రస్తావించారు. పొలాల్లో తేమను నిలపడం, జల సంరక్షణ, నీటి నిల్వ, వ్యవసాయ చెరువుల తవ్వకం, స్థానిక జలసంరక్షణ కట్టడాల బలోపేతం, అందుబాటులో గల అన్ని వనరుల గరిష్ఠ వినియోగం తదితరాలపై తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అంచనాలకన్నా తక్కు వర్షపాతం నమోదైనా తేమ సంరక్షణ, శాస్త్రీయ నీటి నిర్వహణ వంటి సమర్థ చర్యల ద్వారా పంటలను చాలావరకూఆ కాపాడుకోవచ్చునని ఆయన తెలిపారు.
జలాశయాల నీటి వాడకంపై శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ- నీరు అందుబాటులో ఉన్న చోటల్లా శాస్త్రీయంగా, సమతౌల్యంతో, సముచిత ప్రాధాన్యం ప్రాతిపదికగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. కాలువ వ్యవస్థల చివరి అంచెదాకా నీరు వాస్తవంగా చేరుతున్నదీ లేనిదీ తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే, కమాండ్ ఏరియాలలో నీటి వినియోగం తీరు, పరిమిత నీటి లభ్యతతో గరిష్ఠంగా పంటల సాగు, అత్యధిక సంఖ్యలో రైతులకు రక్షణ వంటి అంశాలపై రాష్ట్రాలకు విస్పష్ట సలహాలివ్వాలని ఆయన ఆదేశించారు.
రుతుపనాల సమయంలో రెండు, మూడు లేదా నాలుగు వారాల పాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తదనుగుణంగా అనుసరించగల విస్పష్ట, సంసిద్ధ వ్యూహం ఉండాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితులలో తిరిగి నాట్లు వేయడానికి సంబంధించి ప్రణాళికలు, పంటల రక్షక నీటిపారుదల, స్వల్పకాలిక పంటల సాగు, ప్రత్యామ్నాయ విత్తన వ్యూహాల అమలు సహా జిల్లాలా వారీగా సముచిత సలహాలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పంటలకు చీడపీడల నివారణపై చర్చకు ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. వాతావరణ మార్పులు, తేమలో అసమతౌల్యం లేదా వర్షపాత విరామాల వల్ల ఎలాంటి వ్యాధులు, తెగుళ్లు పంటలను ఆశిస్తాయో ముందే గుర్తించాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. సముచిత పర్యవేక్షణ వ్యవస్థలు, నివారణ సంబంధిత సలహాలను ముందుగానే సిద్ధం చేసి రాష్ట్రాలకు, రైతులకు వేగంగా చేరేలా చూడాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి నేడు విస్తృత సమాచారం, సమర్థ సాంకేతిక వేదికలు-సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల, మొబైల్ సందేశాలు, సలహాలు, హెచ్చరికలు, పంట సంబంధిత సమాచారం నేరుగా రైతులకు అందించే ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి యంత్రాంగాలు, కాల్ సెంటర్లు, స్థానిక అధికారులు, వివిధ డిజిటల్ మాధ్యమాల సముచిత అనుసంధానం ద్వారా సరైన సమయంలో రైతుకు సముచిత సలహాలు లభించేలా పటిష్ట వ్యవస్థను రూపొందించాలని ఆయన సూచించారు.
కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల పరంగానూ సన్నద్ధతను నిరంతరం సమీక్షించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు మెరుగైన సన్నద్ధతతో పురోగమిస్తున్నాయి.. ఏయే రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు మద్దతు, జోక్యం లేదా మార్గదర్శకత్వం అవసరం తదితర అంశాలపై అప్రమత్తత అవసరమని నిర్దేశించారు. స్పందన మందగించిన పక్షంలో లేదా సన్నద్ధత స్థాయి సాపేక్షంగా బలహీనంగా ఉన్న చోట కేంద్ర ప్రభుత్వం చురుకైన సమన్వయం, మద్దతుతో పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేయాలని తెలిపారు.
వ్యవసాయంతో ముడిపడిన వివిధ మంత్రిత్వ శాఖలు వేటికవిగా కాకుండా పనిచేయడం కాకుండా సమాచార ఆదానప్రదానం, సంయుక్త సమీక్ష, సమీకృత వ్యూహంతో కృషి చేయాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశంలో పాల్గొన్న వారందరికీ స్పష్టం చేశారు. వాతావరణం, నీరు, విత్తనాలు, పంటలు, తెగుళ్ల నివారణ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలన్నిటినీ జోడించినపుడే జిల్లా, రాష్ట్ర స్థాయులలో సమర్థ చర్యలు చేపట్టే వీలుంటుందని ఆయన చెప్పారు.
రాబోయే కష్టనష్టాల అంచనా, నివారణ మాత్రమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కాదని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. రైతుల విశ్వాసం సడలకుండా, వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం లేకుండా ఖరీఫ్ పంటల కాలం సజావుగా, విజయవంతంగా ముగిసేలా సకాలంలో అన్నిరకాల చర్యలూ తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మెరుగైన జల నిర్వహణ పద్ధతులు, సాంకేతిక పురోగమనం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సకాలంలో నాణ్యమైన విత్తన లభ్యత, ప్రత్యామ్నాయ వ్యూహాలు, భాగస్వామ్య వ్యవస్థలన్నిటి మధ్య బలమైన సమన్వయం ద్వారా ఎలాంటి సవాళ్ల ప్రభావాన్నైనా గణనీయంగా తగ్గించవచ్చునని స్పష్టం చేశారు. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనచా రైతు ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించగలమని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.




***
(रिलीज़ आईडी: 2268249)
आगंतुक पटल : 18