రాష్ట్రపతి సచివాలయం
మయన్మార్ అధ్యక్షుడికి స్వాగతం పలికిన భారత రాష్ట్రపతి
మయన్మార్ ఆగ్నేయాసియాకు భారతదేశపు ప్రవేశ ద్వారం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2026 7:04PM by PIB Hyderabad
మయన్మార్ యూనియన్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ యు మిన్ ఆంగ్ హలైన్‌కు రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (జూన్ 1, 2026) ఘనస్వాగతం పలికారు.
రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన అధ్యక్షుడు హలైన్ కు స్వాగతం పలుకుతూ.. భారత్, మయన్మార్‌ల మధ్య శతాబ్దాల నాటి లోతైన సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక బంధాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. పరస్పర అవగాహన, స్నేహపూర్వకమైన బలమైన పునాదిపై మన సంబంధాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. భారత్‌తో భూసరిహద్దును పంచుకుంటున్న ఏకైక ఆసియా దేశం మయన్మార్ మాత్రమేనని.. అందుకే ఇది ఆగ్నేయాసియాకు భారతదేశపు ప్రవేశ ద్వారమని ఆమె అభివర్ణించారు. భారతదేశపు ‘‘నైబర్‌హుడ్ ఫస్ట్’’ (పొరుగుదేశాలకే తొలి ప్రాధాన్యం), ‘‘యాక్ట్ ఈస్ట్’’, ‘‘మహాసాగర్’’ విధానాల్లో మయన్మార్ అత్యంత కీలక భాగస్వామి అని చెప్పారు.
మయన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినందుకు అధ్యక్షుడు హలైన్‌కు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త ప్రభుత్వంతో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని ఆమె అన్నారు.
మయన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మయన్మార్‌లో శాంతి, సామరస్యాల స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
భారత్-మయన్మార్ భాగస్వామ్యంలో రవాణా అనుసంధానత ముఖ్యమైన అంశమని... మయన్మార్ ప్రభుత్వ మద్దతుతో ప్రస్తుతం కొనసాగుతున్న అనుసంధాన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పూర్తవుతాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఔషధాలు, యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాల్లో భారత్-మయన్మార్ వాణిజ్య సంబంధాలు విస్తరించడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. అయితే ద్వైపాక్షిక వాణిజ్యం ఇంకా పూర్తి సామర్థ్యానికి చేరుకోలేదని, దీనిని మరింత పెంపొందించడానికి మనం కలిసి పనిచేయాలని ఆమె తెలిపారు.
రాబోయే సంవత్సరాల్లో భారత్-మయన్మార్ మధ్య స్నేహబంధం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని ఇరు దేశాల నాయకులు వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2267901)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23