వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ లోని రైసెన్ నుంచి దేశవ్యాప్త ‘ఖేత్ బచావో అభియాన్’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

రైసెన్ నుంచి దేశానికి: ఆరోగ్యకరమైన నేల, రైతుల సాధికారత, సుసంపన్నమైన భారత్ కోసం కేంద్రమంత్రి పిలుపు

నేలను కాపాడండి, వ్యవసాయాన్ని రక్షించండి, రైతును బ్రతికించండి.. జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

సుస్థిర వ్యవసాయానికి సమతుల్య ఎరువుల వాడకం, భూసార కార్డులు, శాస్త్రీయ వ్యవసాయం కీలకం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

’’భూమి మన తల్లి”: నేలను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రతి గ్రామానికి చేరనున్న శాస్త్రవేత్తలు.. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలతో రైతులకు లబ్ధి

మహిళా సాధికారత, యువజన అభివృద్ధి, వ్యవసాయ మార్పే ‘ఖేత్ బచావో అభియాన్’ ప్రధాన లక్ష్యాలు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 3:38PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా రామసియా గ్రామం నుంచి దేశవ్యాప్త ‘ఖేత్ బచావో అభియాన్’ (పొలాలను రక్షించే ఉద్యమం)ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాత్రి సింగ్ చౌహాన్  ప్రారంభించారు. నేలను కాపాడుకుంటేనే వ్యవసాయం వృద్ధి చెందుతుందని, రైతులు బలోపేతమవుతారని, దేశం సంపన్నంగా మారుతుందని  కేంద్రమంత్రి పేర్కొన్నారు. సమతుల్య ఎరువుల వినియోగం, నేల పరీక్షలు, భూసార కార్డులు, ప్రకృతి వ్యవసాయం, జల సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సాగనున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. భూమి మన తల్లిలాంటిదాని, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత అని శ్రీ చౌహాన్ అన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులను విచక్షణారహితంగా వాడడం మానేసి, శాస్త్రీయ పరీక్షల ఆధారంగా నేల వాస్తవ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఎరువులను వినియోగించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రసాయనాలను మితిమీరి వాడడం వల్ల భూసారం తగ్గిపోవడమే కాకుండా, నేలలో ఉండే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించిపోతాయని, ఇది నేరుగా వ్యవసాయ ఉత్పాదకతను దెబ్బతీసి సాగు ఖర్చులను పెంచుతుందని తెలిపారు.

 

భూమాతను రక్షించుకోవడానికి తీసుకున్న జాతీయ సంకల్పమే ఖేత్ బచావో అభియాన్ అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. ఈ ప్రచారంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నిపుణులు, కృషి విజ్ఞాన కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ బృందాలు, ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలను సందర్శించి రైతుల్లో అవగాహన కల్పిస్తారని చెప్పారు. నేల పరీక్షలు, సమతుల్య పోషకాల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక విత్తన పద్ధతులు, నీటి సంరక్షణ అధునాతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారని వివరించారు.

 

ప్రతి రైతుకు తప్పనిసరిగా భూసార కార్డు ఉండాలని, తద్వారా భూమికి కావాల్సిన వాస్తవ అవసరాల ఆధారంగానే ఎరువులు వేయవచ్చని ఆయన చెప్పారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని, దీర్ఘకాలంలో భూసారాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. రైతులకు రాయితీ ధరలకే ప్రభుత్వం ఎరువులను అందిస్తున్నప్పటికీ, దానిని ఆసరాగా చేసుకుని మితిమీరిన వినియోగాన్ని ప్రోత్సహించకూడదని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. స్థిరమైన, సంప్రదాయ వ్యవసాయం ఎప్పుడూ ఎరువులను వివేకవంతంగా, సమతుల్యంగా వాడటంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

 

వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో సోయాబీన్, వరి, పప్పుధాన్యాల పంటల కోసం ప్రత్యేక క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు. మెరుగైన విత్తనాల వినియోగం, శాస్త్రీయ విత్తన పద్ధతులు, లేజర్ లెవలర్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, నీటిని పొదుపుగా వాడే సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, నిపుణులైన సంస్థల సహకారంతో రైతులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వివరించారు.

 

ఈ ప్రచార కార్యక్రమంతో మహిళా సాధికారతను కూడా కేంద్రమంత్రి అనుసంధానించారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు ఉపాధి, ఆదాయ వనరులు, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం, చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించే అవకాశాలు కల్పిస్తామని... తద్వారా వారు స్వయం సమృద్ధి సాధించి, కుటుంబ ఆదాయాలను పెంచడంలో తోడ్పడగలరని ఆయన తెలిపారు.

 

యువత గురించి శ్రీ చౌహాన్ మాట్లాడుతూ.. వారి కొరకు సరైన మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి,  సన్నద్ధత కోసం మరిన్ని గొప్ప అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి అంటే కేవలం రోడ్లు, గృహనిర్మాణం, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదని.. గ్రామాల్లో ఉపాధి, ఆదాయం, స్వయం సమృద్ధిని పెంపొందించడం కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు.

 

రామసియా గ్రామం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం.. తరువాతి కాలంలో ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతుందని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించాలని, రైతులకు సాంకేతిక సహాయం అందించాలని, వ్యవసాయాన్ని రక్షించాలనే సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం, సమాజం సంయుక్తంగా కృషి చేస్తేనే సంపన్న గ్రామాలు, రైతు సాధికారత, మహిళల స్వయం సమృద్ధి, ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతాయని పేర్కొంటూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో రైతులు, మహిళలు, యువత చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకుడని, ఆయన భవిష్యత్తు తరాల కోసం ప్రణాళికలు రచిస్తారని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ చౌహాన్ అన్నారు. భూమాత కేవలం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా చెందుతుందని  వ్యాఖ్యానించారు. అందుకే భవిష్యత్తు తరాలకు ఆహారాన్ని అందించలేని స్థాయికి భూమి పరిస్థితి ఎన్నడూ క్షీణించిపోకూడదని అన్నారు. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉండేలా చూసేందుకు, భూమి వాస్తవ పోషక అవసరాల ఆధారంగా సమతుల్య ఎరువులను ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు.

 

నకిలీ ఎరువులు, పురుగుమందులపై అవగాహన కల్పించడంపై కూడా ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అత్యంత అనువైన పంటల ఎంపిక, విత్తన రకాలు, సరైన వ్యవసాయ పద్ధతులు, విత్తన శుద్ధి విధానాలు ఇతర శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులకు మార్గదర్శకత్వం వహిస్తామని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపై కూడా ప్రచారం చేస్తామన్నారు. ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల ప్రయోజనాలను చేరవేస్తామని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో  రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులు, ప్రజాప్రతినిధులు, పరిపాలనా అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు పోషకాహార కిట్లను కూడా పంపిణీ చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2267896) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada