ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ చక్రవ్యూహ: కేరళలో మాదకద్రవ్యాల నిరోధక చర్యలను ముమ్మరం చేసిన డీఆర్‌ఐ... 24 కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం.. అయిదుగురు అరెస్టు
प्रविष्टि तिथि:
30 MAY 2026 1:43PM by PIB Hyderabad
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) కొచ్చిన్ యూనిట్ నిర్వహించిన ఆపరేషన్ చక్రవ్యూహ అనే ప్రత్యేక మత్తుపదార్థాల వ్యతిరేక ఆపరేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొచ్చి, మలప్పురం, తిరువనంతపురం ప్రాంతాల్లో అక్రమ రవాణా, పంపిణీ కోసం సిద్ధంగా ఉంచిన మెథాక్వాలోన్, మెథాంఫెటమిన్, హషీష్ ఆయిల్ వంటి మాదకద్రవ్యాలను, సైకోట్రోపిక్ పదార్థాలను భారీ సంఖ్యలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిలో మొత్తం 24 కేజీలకు పైగా మత్తుపదార్థాలు, సైకోట్రోపిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులతో పాటు మొత్తం అయిదుగురు నిందితులను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం (మత్తుపదార్థాలు, మానసిక స్థితిపై ప్రభావం చూపే పదార్థాల నిరోధక చట్టం-ఎన్‌డీపీఎస్) 1985 నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ మత్తుపదార్థాలను విమానాశ్రయంలో ప్రయాణికుల సామాను ద్వారా, కొరియర్ పార్సళ్లలో రహస్యంగా దాచడం, విదేశాలకు ఎగుమతి చేసే సరుకు రావాణా సహా వివిధ మార్గాల్లో అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
ఈ డ్రగ్స్ పట్టివేత అనేది అంతర్జాతీయ, దేశీయ మార్గాల ద్వారా సాగుతున్న వ్యవస్థీకృత మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించడానికి డీఆర్‌ఐ నిరంతర అప్రమత్తను, ప్రత్యేక ప్రయత్నాలను స్పష్టం చేస్తోంది.
గత ఆర్థిక సంవత్సరంలో డీఆర్‌ఐ కొచ్చిన్ జోనల్ యూనిట్ కేరళ వ్యాప్తంగా సుమారు 70.76 కోట్ల రూపాయల విలువైన మత్తుపదార్థాలను, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది. వివిధ ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించి మొత్తం 21 మందిని అరెస్ట్ చేసింది.
మత్తుపదార్థాల ముప్పు నుంచి సమాజాన్ని రక్షించడానికి, భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘నషా ముక్త్ భారత్’ (మత్తుపదార్థాలు లేని భారత్) లక్ష్యాన్ని సాధించడంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడూ అంకితభావంతో, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది.
***
(रिलीज़ आईडी: 2267165)
आगंतुक पटल : 23