ఉప రాష్ట్రపతి సచివాలయం
పనాజీలో జరిగిన గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి
‘‘గుర్తింపు, ప్రగతి రెండూ కలిసి సాగగలవని గోవా నిరూపించింది’’: ఉపరాష్ట్రపతి
గోవా అభివృద్ధికి మనోహర్ పారికర్ చేసిన మరవలేని సేవలను గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి
‘‘ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నాయకత్వంలో గోవా ప్రగతి, శ్రేయస్సు దిశగా సాగుతోంది’’: ఉపరాష్ట్రపతి
‘‘ దేశ ప్రగతికి సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ ముఖ్య ఆధారంగా మారనుంది. ఇందులో గోవా ముందు వరుసలో ఉంటుంది’’: ఉపరాష్ట్రపతి
ఎన్నికల తర్వాత రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేయాలి: ఉపరాష్ట్రపతి
మారియో మిరాండా జీవితం, కృషిని స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
30 MAY 2026 1:18PM by PIB Hyderabad
నేడు పనాజీలో జరిగిన గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. గోవా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పొంది నాలుగు దశాబ్దాలు (40 ఏళ్లు) పూర్తయిన ఈ చారిత్రాత్మక సందర్భంలో గోవా ప్రజలతో కలిసి పాల్గొనడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాను భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గోవా రాష్ట్రంలో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి అని ఆయన గుర్తుచేశారు.
1987 మే 30న గోవా భారతదేశపు 25వ రాష్ట్రంగా ఆవిర్భవించిన చారిత్రక ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఈరోజు గోవా ప్రజల విశిష్ట గుర్తింపు, ఆకాంక్షలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెబుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. గోవా రాష్ట్రం ఒకవైపు సంస్కృతి-ప్రగతికి... మరోవైపు సంప్రదాయం-ఆధునికతకు, ప్రాంతీయ గౌరవం-ప్రపంచ దృక్పథనాకి ఒక అద్భుతమైన కలయిక అని కొనియాడారు.
విద్య పట్ల గోవా ప్రజలకు ఉన్న నిబద్ధతను, వారి పౌర బాధ్యతను, సామాజిక సమ్మిళితత్వాన్ని ఉపరాష్ట్రపతి ఎంతగానో ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల ఆప్యాయత, వారి ఆతిథ్య మర్యాదలు గోవాను నిజంగా ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నిలబెట్టాయని చెప్పారు. అక్షరాస్యత, వైద్య సేవలు, పర్యావరణ అవగాహన, మానవాభివృద్ధి రంగాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పారికర్‌కు ఉపరాష్ట్రపతి ఘన నివాళులు అర్పించారు. ఆయన్ను ఒక దార్శనిక నాయకుడిగా అభివర్ణించారు. పారికర్ గారి నిరాడంబరత, నిజాయితీ, అంకితభావం గోవా ప్రగతిపై చెరగని ముద్ర వేశాయని అన్నారు.
రాష్ట్రాన్ని ప్రగతి, శ్రేయస్సు వైపు నడిపిస్తున్న గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. డాక్టర్ సావంత్ నాయకత్వంలో గోవా తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, గుర్తింపును కాపాడుకుంటూనే మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యాటకం, డిజిటల్ పాలన వంటి రంగాలలో గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన అన్నారు.
దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాల గురించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభిప్రాయ భేదాలు, రాజకీయ పోటీలు సహజమని ఉపరాష్ట్రపతి అన్నారు. అయితే ఎన్నికల తర్వాత దేశాభివృద్ధి కోసం అన్ని వర్గాల వారు రాజకీయ విభేదాలు పక్కనబెట్టి సహకార స్ఫూర్తితో, సామూహిక బాధ్యతతో కలిసి పనిచేయాలని ఆయన చెప్పారు. గోవా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం, బలమైన సామాజిక సంస్థలు... భాగస్వామ్యం, సంభాషణ, గౌరవానికి విలువనిచ్చే సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను ప్రస్తావిస్తూ.. దేశ భవిష్యత్తు వృద్ధిలో గోవా కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. భారత్ పురోగతికి సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ ప్రధాన ఆధారంగా మారనుందని, ఈ రంగంలో గోవా అగ్రగామిగా ఎదుగుతుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చదువుకున్న యువత, వ్యాపార నైపుణ్యం, వ్యూహాత్మక తీరప్రాంతం, అంతర్జాతీయ అనుసంధానత వంటి అనుకూలతల వల్ల దేశ తదుపరి దశ వృద్ధి, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కావడానికి గోవాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.
ఆధునికతను ఆహ్వానిస్తూనే తమ సంప్రదాయాలను ఎలా కాపాడుకోవచ్చో, ప్రపంచ దేశాల ప్రజలను ఆదరిస్తూనే స్థానిక సంస్కృతిని ఎలా రక్షించుకోవచ్చో గోవా ప్రస్థానం నిరూపించిందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. పర్యావరణానికి నష్టం లేని అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ.. స్థిరమైన తీరప్రాంత అభివృద్ధిలో గోవా దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలవగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోవా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. యువతలో ఉన్న సృజనాత్మకత, కొత్త ఆలోచనలను స్వీకరించే తత్వం, ఆత్మవిశ్వాసమే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద బలమని చెప్పారు. వ్యాపార రంగం , శాస్రం, కళలు, క్రీడలు, సరికొత్త ఆవిష్కరణలు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో యువత చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
సంస్కృతిలో చైతన్యవంతంగా, ఆర్థికంగా బలంగా, భవిష్యత్తుపై నమ్మకంతో కూడిన గోవాను నిర్మించడానికి ఐక్యత, శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సామరస్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పౌరులను కోరారు.
ఈ వేడుకల సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ మారియో మిరాండా జీవితం, ఆయన చేసిన కృషిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. మారియో మిరాండా గౌరవార్థం ఒక స్మారక తపాలా బిళ్లను, ప్రత్యేక కవర్‌ను విడుదల చేయడంతో పాటు.. ‘‘గోవా ఇంజనీరింగ్ ది నెక్స్ట్ ఎరా’’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
గోవాకు చెందిన ప్రముఖ బ్రాండ్లకు, విశిష్ట వ్యక్తులకు ఉపరాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. గోపాల్ రత్న అవార్డు పథకం, స్వయంపూర్ణ మిత్రులు, స్వయంపూర్ణ గ్రామాల అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. దీన్ దయాళ్ స్వస్థ్య సేవా యోజన కింద పెంచిన ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకల్లో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్, గోవా అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, రాజ్యసభ సభ్యులు శ్రీ సదానంద్ తానవాడే, గోవా ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2267164)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17